Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 

ఆటలో అరటిపండు
గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

కామన్వెల్తు క్రీడలవల్ల చాలా ఘోరాలూ, అవినీతీ సాగిపోతోందని, కోట్ల కోట్ల డబ్బు కాజేశారని, మన దేశం పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతున్నాయని ఈ మధ్య చాలా ఛానళ్ళూ, పత్రికలూ ఘోషిస్తున్నాయి. కాని వీరికి దృష్టి  లోపం ఉన్నదనీ, అవన్నీ కిట్టని వాళ్ళ మాటలనీ నేను రూఢీగా చెప్పగలను.

ఈ మధ్య ఎక్కడో (ఆంధ్ర దేశంలో) ఎనిమిదివేల రూపాయల లంచం పుచ్చుకున్న ఈవోగారిని అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిందని చెప్పారు. 17 వేల కోట్లు మాయం చేసిన మహామహుల కథలు వింటున్న మనకి ఈ ఈవోగారు అమాయకుడుగా, బొత్తిగా అసమర్ధుడిగా కనిపించేవాడేమో! కాని కామన్వెల్తు  క్రీడల వల్ల మనకి జరిగిన ఉపకారం ఇది. అవినీతిని భూతద్దంలో చూసే అవకాశాన్ని ఈ నాయకులు మనకి కల్పించారు. జరుగుతున్న భాగోతాన్ని చూస్తూ ఏమీ చెయ్యలేకపోతే కోపం వస్తుంది. ఇలా చూడగలిగితే ఔదార్యం పెరిగి వైరాగ్యం వస్తుంది. ఇది కామన్వెల్తు క్రీడల పుణ్యం అంటాను.

ఇన్ని ఛానళ్ళు ఇన్ని రాళ్ళు వేస్తున్నా కల్మాడీగారూ, భానోత్ గారూ, షీలా దీక్షిత్ గారూ - ఏవో కుంటి సాకులు చెప్పి తలలు దించుకోవడం బొత్తిగా 'అనుభవం ' లేమిగా నాకు తోస్తుంది. వీళ్ళందరూ మన పొరుగు దేశంలో పాకిస్తాన్ క్రికెట్ నాయకుల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. పాకిస్థాన్ ఆటగాళ్ళ అవినీతిని కళ్ళముందు చూపించి, బంతిని కొరికి, గిల్లి, కరిచి, నాకి, నేలన వేసి తొక్కిన దృశ్యాల్ని బ్రిటిష్ పేపర్లు చూపించినా పాకిస్తాన్ క్రికెట్ నాయకులు ఏమైనా తొణికారా? పైగా ఇంగ్లండు వారే అవినీతికి దిగారని బుకాయించారు. పైదేశాలు పాకిస్తాన్ కి రుజువులు చూపిస్తాయి. పాకిస్థాన్ నాయకులు మనకి తమ మొహాలనే చూపించి బుకాయిస్త్తారు. ఇది అంతర్జాతీయంగా చెల్లుబాటవుతున్న రాజకీయ సౌకర్యం! మన కామన్వెల్తు నాయకుల్ని గ్రహించమని మనవి.

నా ఉద్దేశంలో సురేశ్ కల్మాడీగారు - ఇజాజ్ భట్ గారి మార్గంలో ప్రయాణించి - నెహ్రూ క్రీడల విలేజ్లో మంచాలెక్కిన కుక్కలు హిజ్బుల్ ముజాహుద్దిన్ కుట్రగానూ, బాత్ రూముల్లో కిళ్ళీ ఉమ్ములూ, దుమ్ములూ పోసేవారంతా తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ల నుంచి వచ్చిన ఇండియన్ ముజాహుద్దిన్ కుట్రగానూ ప్రకటించాలంటాను. ఇక రుజువులంటారా? మన మమతా బెనర్జీ గారినడగండి. చావులూ, శవాలూ మన కళ్ళముందు కనిపిస్తున్నా తన శత్రువులు తన మీద పన్నిన కుట్రగా కళ్ళురిమి - కేంద్రంలో మంత్రి పదవి కొనసాగిస్తున్న ఆవిడ అడుగుజాడల్ని నడవాలి. పైగా కుక్కలు, ఉమ్ములు వేసేవారూ నోరెత్తరు. అదో సౌకర్యం. అలాగే వంతెనలు కూలడం, సీలింగు పెంకులు రాలడం చిన్న చిన్న పొరపాట్లని షీలా దీక్షిత్ గారూ, జైపాల్ రెడ్డిగారూ తలలు దించుకున్నారు. ఇదంతా కాంగ్రెసు పట్ల ఎల్.కె అద్వానీ ప్రభృతుల, ప్రతిపక్షాల కుట్రగా ఎందుకు చెప్పడం లేదో నా కర్ధం కాదు. తర్ఫీదు కావాలంటారా? మన మయావతిగారిని అడగండి. ఆవిడకి నచ్చనివన్నీ ప్రతిపక్షాల కుట్రగా ఎలా బుకాయించాలో ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య.

కాగా, మరికొంత కొత్త విజ్నానం ఈ క్రీడల వల్ల మనకి లభిస్తోంది. జరుగుతున్న అవకతవకల దృష్ట్యా గూర్నీస్, జెర్సీ వంటి దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనడం లేదని చెపుతున్నారు. అసలు ప్రపంచంలో ఇలాంటి దేశాలు ఉన్నాయన్న విషయం మనకి ఈ క్రీడల వల్ల తెలుస్తోంది. పైగా ఎక్కువ దేశాల క్రీడా కారులు రావడం మానేస్తే, తక్కువ దేశాల్లో నాసిరకం ఆటగాళ్ళ మధ్య భారతదేశం విజయపతాకం ఎగురవేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి బోలెడు బంగారు పతకాలు దక్కుతాయి.'బాచా బూచుల లోపల బాచన్నే పెద్ద బూచి' అన్నాడు ఓ చాటు పద్యకవి.

మరో విషయం - అందరూ గమనిస్తున్నారో లేదో! ఈ క్రీడల ప్రాంభ గీతాన్ని ఇప్పటికే  రెండుసార్లు మార్చారు మన పద్మశ్రీ ఏ.ఆర్.రెహమాన్ గారు. అందులో నాకో రహస్యం అర్ధమౌతోంది. రోజు రోజుకీ ముదిరే ఈ అవినీతి, అక్రమాల దృష్ట్యా - రేపు కొత్త విషయాల్ని, కొత్తగా పాటలో చెప్పవలసి వస్తే ఆయన అందుకు సిద్ధమౌతున్నారని నా ఊహ. ఇప్పుడు కల్మాడీ గారిని పక్కన కూర్చోపెట్టారు. రేపు రెహ్మాన్ గారు పాటకి పల్లవిని మార్చవచ్చు. శ్రీ శ్రీ గారి ధోరణిలో -

పోనీ - పోనీ - పోతే పోనీ-

పతుల్, సుతుల్, మతుల్

పోతే పోనీ - అన్నట్టుగా

'కూలనీ - కూలనీ -

వంతెనల్ కూలనీ, సీనియర్లు మాననీ

కల్మాడీని పిలవండి కలిసి పోరాడడానికి -'

లాంటి పాట క్రీడల హృదయ స్పందిగా ఆయన తయారు చేయవచ్చు.

బాబూ, ఈ దేశానికి పట్టిన చీడ - రెండు రకాలు. మనం మన దేశ గౌరవాన్ని, పొరుగు దేశాల ముందు మనల్ని చూసి మనం గర్వపడడం మరిచిపోయాం. భయంకరమైన అవినీతిలో కూరుకుపోయి రెండు గొప్ప లక్షణాల్ని 'గయ'లో వదిలిపెట్టేశాం - సిగ్గు, లజ్జ. ఇలాంటి స్థాయిలో బయటికొచ్చిన ఇంత విస్తృతమైన అవినీతికి మరొక దేశంలో ఒకరిద్దరయినా ఆత్మహత్యలు చేసుకునేవారు. మన దేశంలో బయట పెట్టినవాడి గొంతు కోయడం రివాజు. ఎన్ని పేర్లయినా ఇందుకు సాక్ష్యంగా దొరుకుతాయి.

ఒక చిన్న దేశం - మొన్నటికి మొన్న - సియోల్ లో ఒలింపిక్స్ ని ప్రపంచం కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగ జరిపించి చూపింది. 2014 లో గ్లాస్గో లో జరగాల్సిన క్రీడలకి ఇప్పటికే స్టేడియంలు సిద్దంగా ఉన్నాయట. 2003 లో ప్రారంభం కావలసిన ఈ ఏర్పాట్లు క్రీడలకి 24 గంటల ముందుగా కుక్కల పాలు ఎందుకయాయో, 17 వేల కోట్ల లో ఎవరెవరు ఎంతెంత తిన్నారో మనకి అర్ధం కాదు.

భారత దేశం రాబోయే కాలంలో ఆధ్యాత్మిక సంపదకీ, యోగవైభవానికీ బోరవిరుచుకున్నట్టుగా, ఈ ఏడు సంవత్సరాల అవినీతి భాగోతాన్ని సిపాయిల తిరుగుబాటు, ఉప్పు సత్యాగ్రహం స్థాయిలో చారిత్రక సంఘటనగా గుర్థుంచుకోవలసిన నీచమయిన పతనం. వ్యక్తి శీలం, వ్యవస్థ శీలం ఉమ్మడిగా మంటగలిసిన భయంకరమైన క్షణం. ఈ అవినీతి ఈ దేశంలో 'ఎమర్జెన్సీ ' అంత ఘోరమైనది.

నాకు ఇంకా ఒక విషయం అర్ధం కాలేదు. నిన్న కాక మొన్న మన్మోహన్ సింగ్ గారు హఠాత్తుగా కళ్ళు తెరిచ్ఫి (ఏడేళ్ళ తర్వాత!) నోరు చేసుకున్నంత  మా త్రాన క్రీడల పరిపాలనలో విప్లవాత్మకమైన  మార్పులు వచ్చాయని - ఇన్ని రోజులూ కల్మాడీ మీద కత్తులు దూసిన టైంస్ ఛానల్ కితాబులిచ్చింది! కల్మాడీ గారు గద్దె దిగినందుకు చంకలు గుద్దుకోవడానికి ఇది సూచనా, లేక ఏడేళ్ళలో జరగని మార్పులు 24 గంటల్లో జరుగుతాయని ఇంతలోనే ప్లేటు పిరాయించిన ఈ ఛానల్ నిజాయితీ కల్మాడీ స్థాయిలోనే విడ్డూరంగా, హాస్యాస్పదంగా, అవకాశవాదంలాగా ఉంది. స్వల్పకాల లక్ష్యాలతో 'నిజాయితీ ' పేరిట టీవీ కార్యక్రమల్ని అమ్ముకునే వ్యాపారంలో ఇది మరో పార్శ్యంగా నాకు కనిపిస్తుంది.

ఏతావాతా, పాకిస్థాన్ 'జిహాదీ' సైన్యాలు దేవుడిని మెప్పించి వర్షాలు కురిపించి ఈ క్రీడల్ని సర్వనాశన చేయకపోతే, భగవంతుడు మేలు చేస్తే - క్రీడలు విజయవంతంగా ముగిస్తే - రేపు కాంగ్రెసు ప్రభుత్వం సురేశ్ కల్మాడీకి 'పద్మవిభూషణ్' బిరుదుతో సత్కారం చేసినా మనం ఆశ్చర్యపడక్కరలేదూ. All's well that ends well అన్నది ఇంగ్లీషు సామెత.



***
సెప్టెంబర్
27, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage