గురజాడ పుట్టి మొన్నటికి 150
సంవత్సరాలయింది. వెళ్లిపోయి 97 సంవత్సరాలయింది. అజరామరంగా నిలిచిన 'దేశమును
ప్రేమించుమన్నా' పాట ఆయన కలం నుంచి జాలువారి 102 సంవత్సరాలయింది. ఆ పాట
పాఠకుల చేతుల్లోకి వచ్చి 99 సంవత్సరాలయింది. దానికి ప్రముఖ వాయులీన
విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు బాణీని ఏర్పరిచి 98
సంవత్సరాలయింది. ఆ తర్వాత మరో 26 నెలలకు మహాకవి కన్నుమూశారు. ఆ పాటని 1913
ఆగస్టు 9న కృష్ణాపత్రికలో ముట్నూరి కృష్ణారావుగారు ప్రచురించారు
ఇంత వివరంగా ఈ తేదీలు ఉటంకించడానికి కారణం ఓ మహాకవి ఆయుష్షు పోసిన పాట
జీవలక్షణాన్ని పుణికి పుచ్చుకుని ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో
మారుమ్రోగుతోందని గర్వపడడానికి.
గురజాడ దాదాపు 29 సంవత్సరాలు ఇంగ్లీషులో రచనలు చేశారు 'ది లీజర్ అవర్'లో,
అటు తర్వాత ''రీస్ అండ్ రాయిట్''లో వారి ఆంగ్ల రచనలు ప్రచురితమయాయి. ఆ
పత్రిక సంపాదకులు శంభు చంద్ర ముఖర్జీ వారిని తమ మాతృభాషలో వ్రాయమని
ప్రోత్సహించారు. తరువాత 24 సంవత్సరాలు మాత్రమే తెలుగులో రచనలు చేశారు.
కన్నూమూయడానికి అయిదేళ్ల ముందు ఈ దేశభక్తి పాటని రాశారు.
గురజాడ రాసిన గొప్ప రచనలు ఎన్నో ఉన్నాయి. కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు,
మీపేరేమిటి? మెటిల్డా వంటి కథలు, లవణరాజు కల, దించు లంగరు. ముత్యాల సరాలు,
పుత్తడి బొమ్మ, కన్యక -యిలాగ. ఇవన్నీ రచయిత తన చుట్టూ ఉన్న సమాజం ప్రభావితం
చేయగా, సమాజ సంస్కరణ ఆదర్శంగా రాసినవి. ఒక పక్క గిడుగు వ్యవహారికోద్యమం,
మరొక పక్క వీరేశలింగం గారి సంస్కరణోద్యమం ఊతం చేసుకుని 120 సంవత్సరాలు
తెలుగువారి మనస్సుల్లో నిలిచిన రచనలు చేసిన వైతాళికుడు గురజాడ. అయితే
ప్రాంతీయపు ఎల్లలను దాటి, జాతీయ భావాలను సంతరించుకుని నూరేళ్ల ఆయుష్షు
పోసిన ఒకే ఒక్క రచన 'దేశమును ప్రేమించుమన్నా' పాట. అంతకుముందు కాని, ఆ
తర్వాత కాని ఇంత సమగ్రమైన జాతీయ భావాలను సంతరించుకున్న రచన కనిపించదు.
రాయప్రోలు ''ఏ దేశమేగినా'' వంటి రచనలు బోయభీమన్న ''ఒక్కొక దీపం'' వంటి రచనలు,
'మా తెలుగు తల్లికి' సుందరాచారి రచనా, కృష్ణశాస్త్రి ''జయ జయ జయ ప్రియభారత''
-ఇవన్నీ మనస్సులో ఉంచుకునే ఈ మాట అనుకోవాలి. విశ్వమానవత్వాన్ని
ప్రతిపాదించిన నూరేళ్ల రచన అది. మరొకాయన, మరొక రాష్ట్రంలో ఇలాంటి పనే చేశారు.
ఆయన సుబ్రహ్మణ్య భారతి. వీరంతా భారతమాతను ఆకాశంలో నిలిపిన కవులు. అయితే
గురజాడ విశ్వమానవత్వాన్ని ప్రతిపాదించిన కవి. ఆ పాటలో భారతదేశం ఎక్కడా లేదు.
అన్నిదేశాలూ ఉన్నాయి. అన్ని మతాలూ ఉన్నాయి. మానవ కళ్యాణాన్ని ప్రతిపాదించిన
జీవుని వేదన ఉంది. అందుకే ఆ పాటకి అంత ఆయుష్షు. మరొక సరదా అయిన పోలిక. ఆ
రోజుల్లో ప్రభుత్వ నౌఖరీ చేసేవారంతా తలపాగా చుట్టుకున్నారు. అటు
సుబ్రహ్మణ్య భారతి, ఇటు గురజాడ, ఇంకా గిడుగు రామ్మూర్తి, వీరేశలింగం పంతులు,
మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ సి.పి.రామస్వామి అయ్యర్, సర్వేపల్లి
రాధాకృష్ణన్, పరవస్తు చిన్నయసూరి -యిలాగ. సమకాలీన సంప్రదాయాన్ని పాటించిన
మహాకవి ఆకాశానికి రెక్కలు విప్పడం గుర్తుంచుకోదగ్గ విషయమని ఈ ఉటంకింపు. మరో
గమనిక. గురజాడ ఆ దశలోనే ఇంగ్లీషు సాహిత్యాన్ని ఔపోశన పట్టిన రచయిత. ఆ పరిమళం
ఆయన గిరీశం ఒక్క పాత్ర చెప్పక చెప్తుంది. ముఖ్యంగా గిరీశం ''ది విడో'' మీద
చెప్పిన పద్యం చదివి టెన్నిసన్ గుండె బాదుకున్నాడన్నారు రచయిత. టెన్నిసన్
ప్రభావం గురజాడ మీద ఉంది. ఆయన అభిమాన రచయిత. అసలు ఈ విడో పద్యానికి అతి
దగ్గర మాతృక అప్పటి ప్రఖ్యాత బ్రిటన్ రచయిత్రి ఆన్ టేలర్ 'మై మదర్'.
ఆశ్చర్యం లేదు. స్ఫూర్తి తను బాగా వంటబట్టించుకున్న సాహిత్యం నుంచి దక్కడం
సమంజసం. అలాగే ఆనాటి వాల్ట్ విట్‌మెన్, టెన్నిసన్ ఛాయలు, స్ఫూర్తి ఈ
దేశభక్తి గీతంలోనూ ఉంది. న్యాయం. కాలం సమదర్శి. ఒకసారి బెర్నార్డ్ షా
అన్నాడట. నేను అన్ని నాటకాలూ పాఠకులు అభిమానిస్తున్నారని రాశాను. కాని
నేనభిమానించే నా రచన సెంట్‌జోన్ -అని. ఓ సారి విశ్వనాధ కూడా (రామాయణ
కల్పవృక్షం వ్రాయకముందు) అన్నారట -నా రచనలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా ఒక్క
'ఏకవీర' నిలుస్తుందని. కాలానికి నిష్కర్ష అయిన పదును ఉంది. కాలం ఒరిపిడికి
నిలవని రచనలు జారిపోతాయి. మరికొన్ని ఆ కాలానికి ప్రాతినిధ్యం వహించే రచనలు
గానే మిగులుతాయి. కొన్నిటి జ్ఞాపకాలు కూడా మిగలవు. నూట యాభై సంవత్సరాల
మహాకవి జీవితంలో ఆయన రచనల్లో కాలానికి ఎదురీది నిలిచిన ఒకే ఒక్క రచన 'దేశమును
ప్రేమించుమన్నా' పాట అంటాను. మిగతా రచనలు గొప్పవే. ఒక మేధావి అనూహ్యమైన
సృష్టే. కాని ఇటు అదిలాబాదు నుంచి, అలంపూరు నుంచి, అల్లూరు నుంచి,
శ్రీకాకుళం, కర్నూలు -ఎటు తిరిగినా తెలుగువాడి నోటిలో ఒక్క చరణమయినా నిలిచే
గొప్ప పాట అది. మహాకవి 150 జయంత్యుత్సవాల సందర్భంగా దేశ కాల సమాజ స్థితుల
ప్రమేయం లేని చిరంజీవిగా ఒక పాటకి ప్రాణం పోసిన గురజాడకు కృతజ్ఞతతో నివాళు
లర్పించడం విధాయకం. సెప్టెంబర్
24, 2012