Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
అధికారం - అహంకారం
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
అధికారం అంటే ఎదుటి వ్యక్తి స్వేచ్చకి అంతరాయం కలిగించే శక్తి.
అరాచకం అంటే ఆ అధికారం అదుపు తప్పడం. అనర్ధం అంటే ఈ రెండూ విచ్చలవిడిగా
సాగడం. అహంకారం సాగించుకునే నిష్పత్తి.
నాకు పోలీసు శాఖ అధికారులలో ఎందరో మిత్రులు ఉన్నారు. పోలీసు అకాడమీ
నడిపేవారూ ఉన్నారు. వారితో ఎప్పుడూ చెప్తూంటాను - ప్రజా సంబంధాల గురించి మీ
సిబ్బందితో మాట్లాడే అవకాశం కలిపించమని. అదెప్పుడూ జరగలేదు.
అధికారాన్ని అవకాశంగా భావించడం - వ్యక్తి సంస్కారానికి చిహ్నం. అది ఏ
మహాత్మాగాంధీ అవగాహనలోనో, అన్నా హజారే స్థాయిలోనో సాధ్యమవుతుంది.
అధికారానికి జవాబుదారీతనం పోతున్నకొద్దీ - జవాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి
అధికారి తప్పించుకోవాలని చూస్తాడు. మొదటి వ్యక్తి బలం అవినీతి. రెండో
వ్యక్తి బలహీనత - సామాజిక న్యాయం.
బొత్తిగా ఈ విచక్షణ లేని - లేదా చాలని స్థాయిలో - నేలబారు దశలో 'పోలీసు'కి
ఈ అధికారం ఇవ్వడం - ఒక విధంగా తప్పనిసరి. మరొకవిధంగా దురదృష్టం.
ఏవో కొన్ని మినహాయింపులు తప్ప - ఎంతమంది ఈ అధికారాన్ని దుర్వినియోగం
చేస్తున్నారో, ఎంతమంది చెప్పుకునే అవకాశం, దిద్దుకునే ఆస్కారం లేక - ఈ
అరాచకానికి బలవుతున్నారో మనకందరికీ తెలుసు. మనకి తెలుసునని వాళ్ళకీ తెలుసు.
గ్రామంలో ఓ పసులకాపరి తప్పు చేశాడు. కానిస్టేబులు లెంపకాయ కొట్టాడు. అది
అరాచకం. ఆ హక్కు పోలిసుకి లేదని పసుల కాపరికి తెలీదు. ఇంకా దురదృష్టం
ఏమిటంటే - తమకి లేదని కొందరు కానిస్టేబుళ్ళకే తెలీదు! అతని సీనియర్ చేశాడు.
చెల్లిపోయింది. తనూ చేశాడు. చెల్లిపోతుంది.
తనని కొట్టాడని పసులకాపరి సాక్ష్యాలతో కోర్టులో నిరూపించగలిగితే
కానిస్టేబుల్ బర్తరఫ్ అవుతాడు. పసులకాపరిది అజ్నానం. పోలీసుది చెల్లిపోయే
జులం. పట్నంలో నేలబారు మనిషిది నిస్సహాయత. కోర్టులో ఏ కానిస్టేబుల్ చెయ్యి
దుడుసుదనాన్ని నిరూపించే వ్యవధి, తీరిక, విసులుబాటు ఎవరికి ఉంది. ఇలాంటి
నిస్సహాయతల టోకు విసుగుదల, కోపం, నిర్వీర్యతే - అన్నా హజారే వంటి
ఉద్యమకారుల వెనుక లక్షల మంది నిలబడడానికి కారణం.
అంటే వ్యవస్థ -నిస్సహాయంగా అంగీకరించి, తప్పనిసరయి సరిపెట్టుకున్న 'అవినీతి'
ఇది. లోబడి బతుకుతున్న దయనీయమయిన పరిస్థితి.
కానిస్టేబులు ప్రజాబంధువు కావాలి. ప్రజాహితుడు కావాలి. ఆ దశలో రోడ్డుమీద
మనిషికి ఉపకారి కావాలి. కానిస్టేబులు ప్రజలలో కలిగించాల్సింది భయాన్ని కాదు.
నమ్మకాన్ని విశ్వాసాన్ని అయితే ఇవన్నీ నీతిపాఠాలు.
అమెరికాలో తప్పు చేసిన కారు డ్రైవరునీ 'సార్ ' అనే పలకరిస్తాడు పోలీసు.
తప్పు చేస్తే నిర్దయగా కేసు రాస్తాడు. రాస్తాడని తెలుసు. కానిస్టేబుల్
అరాచకం మనకి వినిపించదక్కడ. క్రూరమయిన విధి నిర్వహణ తెలుస్తుంది. అమెరికాలో
తప్పు చేసిన వాడి నిస్సహాయతా తెలుస్తుంది. తప్పు చేయకూడదనే భయమూ తెలుస్తుంది.
ఆ భయానికి కారణం అతని క్రూరత్వం కాదు. చట్ట బద్దత.
తెల్లవారు ఝామున 3 గంటలకి నిర్మానుష్యమయిన అమెరికా రోడ్డు మీద ట్రాఫిక్ మీద
రూల్స్ కి భంగం కలుగకుండా కారు నడిపిన మిత్రుల్ని నాకు తెలుసు.
"ఇప్పుడెవరు చూస్తారయ్యా?" - నికార్సయిన మన దేశపు నిరసన
"అమ్మో, పోలీసు పట్టుకుంటే లైసెన్స్ పోతుంది" సమాధానం.
మన దేశంలో అయితే మనం ఆఫీసరుగారి బంధువయినా, మంత్రిగారి మేనల్లుడయినా, పెళ్ళాం
తమ్ముడయినా, 20 రూపాయలు ఇచ్చుకున్నా - లైసెన్స్ కీ, మనకీ మన దేశంలో ఏమీ ఢోకా
లేదు. కొండొకచో పోలీసులు ఈ అవినీతి కారణంగా దారుణంగా అలుసయిన సందర్భాలను
నేను కళ్ళారా చూశాను. అత్రి క్రూరంగా, అతి మర్యాదగా, అతి నిర్లక్ష్యంగా
నగరాల్లో పోలీసుల్ని నిలదీసిన వాళ్ళని నాకు తెలుసు.
"ఎవరు నువ్వు? స్టీరింగు ముందు ఎవరున్నారో చూశావా? ఫలానా మనిషి మేనమామ. ఏం?
కళ్ళు కనిపించడం లేదా?" అన్నవాళ్ళనీ, అన్నవాళ్ళకి సెల్యూట్ కొట్టి పక్కకి
తప్పుకు నిలబడిన నిస్సహయాపు పోలీసుల్నీ చూశాను..
ఇది - ఈ దేశంలో వ్యవస్థకి పట్టిన చీడ.
నిన్న బీహర్ లో నలందా జిల్లాలోని నూర్ సరాయ్ పోలీసు స్టేషన్ దగ్గర పోలీసులు
జరిపిన జులం అమానుషం. పాశవికం. ఆ ప్రాంతంలో ఓ 24 ఏళ్ళ స్త్రీ మాయమయింది.
అందుకు ఒక పోలీసు ఆఫీసరు ప్రమేయం ఉన్నదని తెలిసింది. ప్రజలు మందగా వచ్చి
నిలదీశారు. రాళ్ళు రువ్వారు. ఉద్రిక్తులయిన పోలీసులు లాఠీలతో ఆడా మగా బేధం
లేకుండా తరిమి తరిమి చావగొట్టారు. ఆడవాళ్ళు నేలమీద పడి దొర్లినా కొట్టారు.
ఇది ఆటవికం.
పోలీసుల మీద ప్రజల రాళ్ళు వాళ్ళ అవినీతి పట్ల ప్రజల నిరసనకి, ఉదాసీనతకి
నిదర్శనం. ప్రజల మీద పోలీసుల లాఠీల ఝళిపింపు అధికార దుర్వినియోగం. ఒక పక్క
టీవీ కెమెరాలు తిరుగుతున్నాయని తెలిసినా బరితెగించిన వారి అహంకారం - ఈ
వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.
మొన్ననే ఉత్తర ప్రదేశ్ లో అమేతీకి చెందిన సుల్తాన్ పూర్ పోలీసు స్టేషన్ లో
జరిగిన దుర్ఘటన గుర్తుండే ఉంటుంది. ఓ దళిత యువతి భర్త శవం దొరికింది. పోలీసు
స్టేషన్ కి భార్యని పిలిపించాడు స్టేషన్ ఆఫీసర్ కైలాస్ ద్వివేదీ. ఊపిరి
అందక తనని చావగొడుతున్న అతన్ని బతిమాలుకుంది దళిత యువతి. కానీ ద్వివేదీ
ఆగలేదు. ఆమె చేత నేరాన్ని ఒప్పించాలని అతని పట్టుదల. అలా చెప్పిన వాజ్మూలం
చెల్లదని అతనికీ తెలుసు. మరి? ద్వివేదీని ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.
ఆ మధ్య అరేరియా జిల్లాలోని ఫర్ బేస్ గంజ్ పోలీసు లాఠీ దెబ్బలకి పడివున్న
శరీరాన్ని హోం గార్డ్ తొక్కి గంతులేసిన అతి దారుణమయిన దృశ్యాన్ని
మరిచిపోలేదనుకుంటాను. ఇది ఊహకి కూడా అందని పాశవిక ప్రవృత్తి.
విదేశీ దౌర్జన్యకారుల చేతుల్లో అనునిత్యం జరుగుతున్న దౌర్జన్య చర్యలు
గర్హనీయం. కానీ ప్రజలని రక్షించి వారి శ్రేయస్సుని కాపాడవలసిన ఈ పశువుల
నిర్దాక్షిణ్యమైన చర్యలు దౌర్జన్యకారుల చర్యల కంటే దారుణం. ఆ దౌర్జన్యానికి
నిస్సహాయమైన జుగుప్స, ఈసడింపు తప్ప మరో మార్గం లేదు.
అధికారం ఈ దేశంలో అవినీతిగా తర్జుమా కావడం ప్రారంభించి చాలాకాలమయింది. కానీ
పశుత్వంగా, ఆతవికమైన జులుంగా మారడం దురదృష్టం. అమానుషం. ఈఈ శాఖల్లో ఎవరయినా
ఇంకా నీతిపరులూ, సజ్జనులూ ఉంటే దురదృష్టవశాత్తూ వారంతా తాటి చెట్లకింద
పాలుతాగుతున్నవారే.