Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here గ్లామర్ అవినీతి నాకు జర్దా కిళ్ళీ అలవాటు చేసింది మిత్రులు, దర్శకులు కె.విశ్వనాధ్. "చెల్లెలి కాపురం” సినీమాకి కధా చర్చలు జరిపే రోజుల్లో. మంచి ఆలోచన చేసినప్పుడల్లా ఉప్పొంగిపోయి తనూ ఒక కిళ్ళీ కట్టుకుని నాకూ ఒకటి యిచ్చేవారు. మంచి ఆలోచనా, చిన్న మత్తూ- రెండూ ఆనందంగా వుండేవి యిద్దరికీ. క్రమంగా మత్తే ఆలోచనయి, క్రమంగా వ్యసనమయి దాదాపు 20 సంవత్సరాలు స్థిరపడింది. నాకంటె విశ్వనాధ్ ముందు మానేశారు. నా జీవితంలో వ్యసనంగా చెప్పుకోవలసిందీ, మానెయ్యడానికి యాతన పడవలసింది జర్దా కిళ్ళీయే. మానెయ్యడానికి ముఖ్య కారణం -యింకా విచిత్రం. నేను ముమ్మరంగా నటిస్తున్నరోజులు.. నా హవా సాగుతున్న రోజులు. రోజుకి మూడు కంపెనీల షూటింగులు చేసేవాడిని. మా మేకప్ మాన్ మూడు కంపెనీలలోనూ- జర్దా, కిమామ్, వక్క, సున్నం -యిదంతా ఒక పాకేజ్- తీసుకునేవాడు. అతి విరివిగా మేకప్ డిపార్ట్ మెంట్ వారూ, మిగతా విభాగాల వారూ- ఈ సరంజామాని వాడుకునేవారు. కంపెనీ సొమ్మేకదా? మళ్ళీ 4 గంటల తర్వాత మరో కాల్ షీట్ కి వెళితే అక్కడా ఈ సరంజామా అంతా తీసుకునేవాడు మా మేకప్ మాన్. వినియోగం మామూలే.ఇలా రోజుకి మూడు కంపెనీల్లో. పేరు నాది. వాడకం- యూనిట్ వారందరిదీ. నా పేరిట అయే ఖర్చుని ఆపే అవకాశం లేదు. పైగా ప్రొడక్షన్ మేనేజరూ ఈ వ్యసనానికి దాసుడే. ఉల్ఫాగా వచ్చిన సరుకు కదా? ఈ దుర్వినియోగం, exploitation నన్ను భాధపెట్టింది. తర్వాత నా సరంజామాని నేను తెచ్చుకోవడం ప్రారంభించాను. దుర్వినియోగం కాస్త తగ్గినా- వినియోగం జరిగేది. ఈ దశలో అలవాటుని పూర్తిగా అటకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చాను. ఈ కధ నీతి:పరపతి ఉన్న వ్యక్తుల వెనక అవినీతిని పోషించేవారు కోకొల్లలుగా వుంటారు. సమకూర్చి పంచుకునేవారూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే- నీ అవసరం ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు- నీ బలహీనతల్ని ఆనందంగా పోషిస్తాడు. కారణం- "బలహీనత’ నువ్వు గర్వపడేదికాదు. అతను చేసే పనీ గర్వపడేదికాదు. కాగా- నీ తల వొంచేది. ఉదాహరణకి- రోజూ పూజకి పువ్వులు తెచ్చియివ్వడం భక్తి అనిపించుకుంటుంది. రోజూ చీకటిపడే సమయానికి విస్కీ తెచ్చియివ్వడం- నిన్ను లోబరుచుకునే గాలం అనిపించుకుంటుంది. ఇక- రాజకీయాలలో- దేశీయమైన స్థాయిలో- ఈ అవినీతి విశ్వరూపం దాలుస్తుంది. ఇలాంటిదే మొన్న ఓ విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్రంలో కొత్త మంత్రివర్గం పదవుల్లోకి వచ్చాక- గత మూడు నెలలుగా- యిద్దరు మంత్రి పుంగవులు తమ నివాస గృహాలు- వారి వారి అవసరాల మేరకు సిద్ధం అయేవరకూ- ఎక్కడ వుంటున్నారు? విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణగారు మౌర్య షెరాటన్ అనే 8 నక్షత్రాల హొటల్లో ప్రెసిండెంట్ సూట్ లో వుంటున్నారు. దానికి అద్ద్దె రోజుకి లక్ష రూపాయలు. నెలకి 30 లక్షలు. మరో మంత్రిగారున్నారు. వారు దేశ సేవ చెయ్యాలని ఈ మధ్యనే కంకణం కట్టుకుని ఖద్దరు దుస్తులు ధరించి వాడ వాడలా తిరిగి, ఎన్నికయి, మొదటిసారిగా మంత్రి అయారు. వారు శశి తరూర్ గారు. ఆయన తాజ్ హొటల్లో ఒక సూట్ లో నివసిస్తున్నారు. దానికి అద్దె రోజుకి 40,000 రూపాయలు. నెలకి లక్షా యిరవై వేలు. ఆయా మంత్రులు ఉండడానికి ఢిల్లీలో ఆయా రాష్ట్రాల వసతి గృహాలున్నాయి. ఇంకా ఎన్నో కార్పొరేట్, ప్రైవేటు కంపెనెల గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. అయినా ఈ ఘనత వహించిన మంత్రి పుంగవులిద్దరూ ఖరీదయిన హొటళ్ళలో వున్నారు. ఇందుకు వారి సమర్ధన- గవర్నమెంటు సొమ్ముతో కాక- తమ సొమ్ము ఖర్చుచేసుకుని ఉంటున్నామని. తొలిసారి మంత్రి అయిన శశితరూర్ గారి బాధ వినదగ్గది. రాష్ట్ర వసతి గృహాల్లో వారికి రెండు దక్కవట- 1.వ్యాయామం చేసుకునే విసులుబాటు. 2.ఏకాంతం. మనకి అర్ధంకాని విషయం- సమాజానికి సేవ చేస్తానని కంకణం కట్టుకుని, ప్రజల్ని ఒప్పించి, ఎన్నికయి, మంత్రి అయి- యిప్పుడు వ్యాయామం, ఏకాంతం కావాలనే కుర్ర మంత్రి కావాలని ఎవడేడ్చాడు? వారి ఊరిలోనే బస్కీలు, గుంజీలు తీసుకుంటూ పడివుండొచ్చుకదా? ఇక పదవిలేక యింట్లో కూచున్న మనిషిని బూజు దులిపి కాంగ్రెసు అధిష్టానం మంత్రిని చేస్తే లక్ష రూపాయల విడిదిలో బైఠాయించిన వృద్ద్ద నేత ప్రజలకి ఏం సందేశం యిస్తున్నట్టు? విదేశాంగ మంత్రి ఉంటానంటే- రోజుకి పది లక్షలు ఖర్చు చేసే సంస్థలు వందలు ముందు కొస్తాయి. మౌర్యా హొటల్ యాజమాన్యమే ఆ పని చేసివుండొచ్చు. కాని దానికి ప్రతిఫలం-లోపాయకారీగా వారు రాబడతారని కృష్ణగారికి తెలియని అమాయకులు కారు. ఇప్పటికే వారు కోటి రూపాయలు- కేవలం వసతి కోసం ఖర్చు చేశారు. మూడు నెలల తర్వాత ఈ విషయం తెలిసిన ప్రణబ్ ముఖర్జీ గారు వారిని రాష్ట్ర భవనాలకు తరలమని చెప్పాక వారాపని చేశారు. మరి ఇప్పుడు వ్యాయామం ఏమయింది? ఏకాంతం మాటేమిటి? సమాజంలో అవినీతికి అర్ధం కేవలం నిదుల్ని దోచుకోవడం, విధుల్ని మరిచిపోవడమేకాదు. విచక్షణని మరిచి, ప్రజలకు మార్గ దర్శకం కావలసిన- ఎన్నికయిన ప్రజాసేవకుడు- యిలాంటి అనుచితమైన విలాసాలకు లోనుకావడం భయంకరమైన అవినీతి. మన వ్యవస్థలో "అవినీతి’కి 700 పై చిలుకు ఉదాహరణలు దొరికే చోటు ఒకటుంది. అది పార్లమెంటు. తాను వడికిన ఖద్దరు నూలుతో నేసిన బట్టను కట్టుకుని, మేకపాలు తాగి జీవించి, బడుగు మనుషులతో అడుగులు వేసిన ఒక బారిస్టరు- అవును- మహాత్ముడు- యిదే నేలమీద మొన్న మొన్ననే వున్నాడంటే మన పిల్లలు విడ్డూరంగా చూసే రోజులొచ్చాయి. |