|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 'సత్యా' గ్రహం
గొల్లపూడి మారుతీరావు ఈ దేశానికి మహాత్ముడు సత్యాగ్రమనే ఆయుధాన్నిచ్చి నిన్నటికి సరిగ్గా 104 సంవత్సరాలయింది. ఎవరీ మహత్ముడు? ఏమిటీ సత్యాగ్రహం? ఈ దేశంలో పదిమందిని - చాలామంది నాయకులతో సహా - ఈ ప్రశ్న వేస్తే చాలా విచిత్రమైన సమాధానాలొస్తాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అని కొందరు నాయకుల్ని ప్రశ్నలు వేసింది. చాలామంది నాయకులు తెల్లమొహం వేశారు. ఎక్కువ మంది వెర్రితలలు వేశారు. కొందరు నిస్సహాయంగా తలలూపారు. గాంధీజీకి కూడా అలాంటి గతిపట్టే రోజులు దగ్గరికి వచ్చాయేమో! తుపాకీ, హత్య, రేప్, అరెస్ట్, ఆసుపత్రి - వీటి గురించి అడగమనండి. ఒక తప్పు సమాధానం వస్తే చెవి కోయించుకుంటాను. పైగా అరెస్టయాక ఏ ఆసుపత్రిలో ఏ గదికావాలో ముందే నిర్ణయించుకున్న నాయకులున్నారు. కావాలంటే మధుకోడా గారిని అడగండి, అమిత్ షాని అడగండి, అబ్దుల్ మదానీని అడగండి - మీ ఇష్టం. 1931 లో ఉప్పు సత్యాగ్రహం, అందువల్ల రవి అస్తమించని బ్రిటిష్ పాలక వ్యవస్థ పునాదులతో కదలడాన్ని గమనించిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ గాంధీజీకి ఉత్తరం రాశాడు " దౌర్జన్యంతో ప్రమేయం లేకుండా ఆదర్శాన్ని సాధించవచ్చని మీరు నిరూపించారు" అంటూ 'సత్యాగ్రహం శాంతికి సశాస్త్రీయమైన ఆయుధం' అన్నారు. ఇవన్నీ - ఈ తరానికి - చాలా మట్టుకు అర్ధంకాని మాటలు. గాంధీ స్మృతి, దర్శన్ సమితి డైరెక్టర్ సవితా సింగ్ నాకు మూడు పుస్తకాలు పంపారు 'సత్యాగ్రహం ' మీద. అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్ గార్ల సందేశాలతో భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రచురణ అద్భుతం. నేను మహాత్మునికి సరళమైన జీవనం మీద స్ఫూర్తిని కలిగించిన డేవిడ్ ధోరో నివసించిన 'వాల్డెన్'ని అమెరికాలో బోస్టన్లో చూశాను. సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళి పులకించాను. తీస్ జనవరి మార్గ్ (డిల్లీ)లో మహాత్ముడిని గాడ్సే కాల్చిన ప్రార్ధన సమావేశం జరిగిన స్థలాన్ని చూశాను. కాని ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా రాజ్ ఘాట్ ని చూడడం కుదరలేదు. దురదృష్టం. గాంధీజీ ఈ స్పూర్తితో తమ జీవన విధానాన్ని, తమదేశాన్ని, తమ తరాన్ని ప్రభావితం చేసిన నెల్సన్ మండేలా, మార్టిన్ లూధర్ కింగ్ లు రెండు విలక్షణమైన ఉదాహరణలు. 25 సంవత్సరాలు జైలులో శాంతియుతంగా జీవించి - కేవలం తన 'నిశ్శబ్దా'న్ని ఆయుధం చేసుకున్న మండేలా మహాత్ముని ప్రభావానికి అద్భుతమైన ఉదాహరణ. ద్వేషం ద్వేషినీ, ద్వేషించిన వ్యక్తినీ నాశనం చేస్తుందన్న మార్టిన్ లూధర్ కింగ్ మహాత్మునిలాగే తనువు చాలించాడు. మన పొరుగు దేశం మాయన్మార్లో ఆంగ్ శాన్ చూయీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మహాత్ముని స్ఫూర్తితోనే నిశ్శబ్దంగా పోరాటాన్ని సాగిస్తోంది. 1923 లో ఫ్రెంచి రచయిత, చరిత్ర కారుడు రొమైన్ రోలాండ్ గాంధీజీ సత్యాగ్రహం ద్వారా ప్రజల నిజమైన బలాన్నీ, అంతర్గతంగా ఉన్న శక్తినీ నిరూపించారు అన్నాడు. బీహార్ లో మావోయిస్టుల హత్యలూ, లాల్ గడ్ దురాగతాలు, రాధోడ్ లూ, నికీ పచాకో (గోవా)లకు అలవాటు పడిపోయిన మనకి గాంధీజీ సందేశం బూతుమాటలాగ వినిపించే అవకాశం ఉంది. గాంధీజీ ఏ నిరాహార దీక్షనీ తన ఆదర్శాన్ని సాధించకుండా విరమించలేదు. ఒక వ్యక్తే తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన పొట్టి శ్రీరాములు. సత్యాగ్రహం ఆత్మకి జరిపే శస్త్ర చికిత్స అన్నారు గాంధీజీ. సాధారణంగా చెప్పుకునే విప్లవానికి ప్రత్యామ్యాయం అన్నారు. ఎవరో మరో గొప్ప మాట అన్నారు: "నిన్నటి సమాజం భారతదేశంలో 'అహింస' అనే విత్తుని నాటింది. దాని ఫలం పేరు - గాంధీజీ" అని. ఏ దేశపు చరిత్రని చూసినా 'హింస'కి శతాబ్దాల చరిత్ర ఉంది. కాని అహింసకి గడచిన ఒక శతాబ్దపు చరిత్రే ఉంది. దానికి అంతర్జాతీయమైన ఖ్యాతిని కలిగించిన శక్తిపేరు - గాంధీజి. ఇప్పుడిప్పుడు సత్యాగ్రహాన్ని 'సత్యం' మీద ఆగ్రహం చేస్తున్న నాయకమ్మణ్యుల తరాన్ని చూస్తున్నాం. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్న తరంతో సహజీవనం చేస్తున్నాం. ఆనాడు దక్షిణాఫ్రికాలో జనరల్ స్మట్స్ దగ్గర్నుంచి, గాంధీజీ అన్నా, ఆయన సిద్దాంతాలన్నా, భారతీయుల సమైక్యత అన్నా, వారి సమిష్టి జీవన శీలమన్ణా బొత్తిగా అతి చులకన భావం ఉన్న చర్చిల్ వంటి నాయకుల తలలు వంచి - కేవలం సత్యమే ఆయుధంగా బ్రిటిష్ పాలకులను రాజీకి తెచ్చిన గాంధీజీ ఇప్పటికి చరిత్ర. మొన్న సవితా సింగ్ పుస్తకాలు పంపారు. నిన్న ఎవరో ముక్కూ మొహం తెలీని వ్యక్తి - ఆనాడు మన దేశం గురించీ, మన గురించీ చర్చిల్ చేసిన నాలుగే నాలుగు వాక్యాల్ని పంపించారు. ఆ వాక్యాలివి: రేపు భారతదేశంలో "దుష్టులూ, వంచకులూ, దగాకోరులు (ఎంత తెలుగులో రాసినా చర్చిల్ దొరగారు ఇంగ్లీషులో చెప్పిన 'రుచి'ని తీసుకురాలేకపోతున్నాను - వారన్నది - రాస్కెల్స్, రోగ్స్, ఫ్రీ బూటర్స్) చేతుల్లోకి అధికారం వెళ్ళిపోతుంది. భారతదేశపు నాయకత్వం చచ్చుగా, గడ్డిపరక కంటే హీనంగా తయారవుతుంది. వాళ్ళ నాలుకల మీద తేనె ఉంటుంది. గుండెల్లో విషముంటుంది. వాళ్ళల్లో వాళ్ళు అధికారం కోసం పోట్లాడుకుంటారు. రాజకీయమైన దుమ్ములాటల్లో కొట్టుకుంటారు. ఇండియాలో పీల్చేగాలికీ, తాగే నీటికీ పన్నులు వేసే రోజులు వస్తాయి". ఆ రోజుల్లో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కీ, జవహర్లాల్ నెహ్రూకీ అభిప్రాయబేధాలున్నాయి. ఇద్దరి దగ్గరా పనిచేసిన హెచ్.వి.ఆర్. అయ్యంగార్ వారిద్దరూ కన్నుమూశాక ఆ విషయం చెప్పేదాకా ఎవరికీ తెలీదు. నెహ్రూకీ, పటేల్ కీ అభిప్రాయబేధాలున్నాయి. కృపాలానీ, నెహ్రూకీ ఉన్నాయి. కాని ఆనాటి చర్చిల్ వ్యాఖ్యలై దేశం కస్సుమంది. ఆవేశంతో ఎదురు తిరిగింది. నెహ్రూ, పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పంత్, అజాద్, టంగుటూరి - ఎవరికి ఈ మాటలు వర్తిస్తాయి? చర్చిల్ వ్యాఖ్యలు ఆనాడు కారుకూతలు. కాని 6 సంవత్సరాల తర్వాత? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్టర్ డామస్ లాగ - చర్చిల్ ఈ దేశపు భవిష్యత్తుని అక్షరాలా చదివారా? ఆయన వాక్యాల్లో ఏదయినా నిజం కాకండా ఉన్నదా? ఈ మధ్య ఉత్తర ప్రదేశ్ శాసన సభ, ఆ మధ్య ఒరిస్సా శాసన సభ, అల్లప్పుడు బీహార్, ఎప్పుడూ లోక్ సభ - అవును. ఓ అద్భుతమైన శాంతియుత విప్లవానికి ప్రపంచంలో గాంధీజీ ముందు నిలిపిన గొప్ప ఆయుధం - సత్యాగ్రహానికి 104 ఏళ్ళు నిండాయి - నిన్ననే. కాని
సత్యానికి
ఇప్పుడిప్పుడే నూరేళ్ళు
నిండాయని
అనిపిస్తుంది. మనల్ని
చూసి
చర్చిల్
ఆత్మ
సమాధిలో
నవ్వుకుంటూంటుంది -
అని
సిగ్గుపడాలనిపిస్తుంది. ************ ************ ************* ************* |