విదేశీయులకు నమ్మే అవకాశం ఎలాగూ లేదుకాని, స్వదేశీయుల్ని కూడా
నమ్మించాల్సిన రోజులొచ్చేశాయి. ఎందుకంటే మన తెలివితేటలు ఎక్కువగా
అక్కడినుంచే దిగుమతి అవుతున్నాయి కనుక. అయితే చూడాలనుకున్నవారికీ,
తెలసుకోదలిచిన వారికీ ఈ వైభవం కనిపించే దాఖలాలు ఈ సంస్కృతిలో ఇంకా ఇంకా
మిగిలే ఉన్నాయి. ఇంతకీ ఏమిటి ఆ వైభవం? ఈ దేశంలో విద్య, విద్వత్తు కేవలం
పరిశ్రమతో మాత్రమే ఒడిసి పట్టుకునే 'సాధన' మాత్రమే కాదు. ఒక అనూహ్యమైన
స్థాయిలో విద్వత్తు, పాండితీ ప్రకర్ష 'దర్శనం'. ఆది శంకరులు తన ఆరవయేట
సాహితీ జగత్తులో మకుటాయమానంగా నిలవగల 'కనకధారా స్తోత్రాన్ని' చెప్పారు. (ఈ
కాలమ్ రాస్తూ ఈ నిజాన్ని మరొక్కసారి రూఢి చేసుకోడానికి సామవేదం
షణ్ముఖశర్మగారికి ఫోన్ చేశాను. ఆయన అనంతపురంలో ఇప్పుడే 'శంకర విజయం'
ప్రవచనం చేసి అనుష్టానానికి కూర్చోబోతున్నారట. మీ ఫోన్ దైవికం అన్నారు).
ఆటవికుడు కాళిదాసుకి అమ్మవారి దర్శనమయాక -అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
అద్భుతంగా నిలిచే 'శ్యామలాదండకం' చెప్పారు. దండకం ఒకే వాక్యంతో సాగుతుంది.
అటువంటి దండకం నభోతో నభవిష్యతి. ఒక పుట్టుమూగ చెవిటి అయిన మూక కవి దేవీకృపతో
నోరిప్పి 500 శ్లోకాలు ఆశువుగా చెప్పి -మళ్లీ మూగకావాలనే వరాన్ని అమ్మ
దగ్గర అనుగ్రహంగా పొందాడు. ఈ మూడు తార్కాణాలూ మన కళ్లముందున్నాయి. అయితే
మనకి విశ్వాసం స్థాయిపోయి, సహేతుకమయిన స్థాయిలోనే ఆలోచనల్ని పరిమితం
చేసుకొనే రోజులొచ్చాయి. ఆశ్చర్యం లేదు. మన ఋషులు ఆచరించి సాధించిన
యోగశాస్త్రాన్ని అమెరికా పేటెంటు చేసింది. పతంజలి అటకెక్కాడు. సరే. ఇలాంటి
వారికి విద్వత్తు ఉపాసనాబలమని మనతరం లోనే రుజువు చేసిన ఇద్దరు మహానుభావులు
పుట్టారు. వారు కొప్పరపు కవులు. పెద్దాయన వేంకట సుబ్బరాయశర్మ. (1885
-1932). చిన్నాయన వేంకట రమణ శర్మ (1887 -1942). చిన్నాయనని చూసిన తరం ఇంకా
మన మధ్య ఉన్నది.ఒక భారతీయ సాహిత్యంలోనే కవిత్వాన్ని వినోదంగా, క్రీడగా
చేసుకునే స్థాయిని సాధించిన ఘనత కనిపిస్తుంది. అది అవధాన ప్రక్రియ. సంస్కృత
సాహిత్యం ఇందుకు మూలం. ఎంతో కొంత కన్నడంలోనూ అవధాన ప్రక్రియ వుంది. అయితే
దీన్ని సొంతం చేసుకొని అనూహ్యమైన పరిణతిని సాధించిన ఘనత తెలుగువారిదే.
ఇప్పటికీ అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలూ చేసే పండితులు -ప్రముఖులు
ఎందరో ఉన్నారు. ఆనాడు కేవలం సభలో కూర్చుని ఆనందించడమే కాక సామాజికులు కూడా
తమదైన ప్రతిభతో అవధానులమీద పద్యాలు చెప్పేవారు. అదొక సమగ్రమైన విందు.
సుబ్బరాయ కవి తన 5వ యేట హనుమత్ కవచ రూప నక్షత్రమాల అనే 27 పద్యాలు
చెప్పారట. కొప్పరపు కవులు తమ ఎనిమిదవ యేటే శతకాలు ఆశువుగా చెప్పారు. తమ 12వ
యేట అష్టావధానాలు చేశారు. 16 వ యేట శతావధానాలు చేశారు. 20వ యేటికి గంటకి
300 పద్యాలు చెప్పే ధారని సాధించారు. తెలిసిన పద్యాలు -300 చదవడమే గగనం.
అలాంటిది ఆశువుగా చెప్పేవారు. 1916 నాటికి అలా మూడు లక్షల పద్యాలు చెప్పారట.
మన దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో రికార్డింగులూ, వీడియోలూ లేకపోవడం. ఆ
వైభవాన్ని ఈ తరం చూసే అదృష్టం లేకపోయింది. తమ జీవితకాలంలో వారు ఎన్నో లక్షల
పద్యాలు చెప్పారు.
ఇదంతా ఒక యెత్తు. ఈ విద్వత్తును మరో అనూహ్యమైన స్థాయికి తీసుకువెళ్లారు.
ఒకసారి మార్టేరు సభలో ఎవరో పందెం వేయగా గంటకు 720 పద్యాలు చొప్పున కేవలం
అరగంటలో 'మనుచరిత్ర'ను ఆశువుగా చెప్పారట. మరొక సంఘటన. ఇది ఇంకా విచిత్రం.
అద్భుతం. ఇది సరిగ్గా వంద సంవత్సరాల క్రితం జరిగింది. గుంటూరులో అప్పటి
ప్రముఖ న్యాయవాది పాటిబండ సూర్యనారాయణ గారు వారిని భోజనానికి ఆహ్వానించారు.
ఇరవై ఆధరువులతో భోజనం వడ్డించి -తృప్తిగా భోజనం చేస్తూనే హనుమంతుని మీద
శతకాన్ని చెప్పమన్నారట. ఏ పదార్థమూ వదిలి పెట్టకూడదన్నది కూడా ఒక నియమం.
వారు నవ్వు కుని పరిషేచన చేసి ఆశువుగా ''నమస్కరింతు హనుమంతా నీ మహా
శక్తికిన్'' అనే మకుటంతో 350 పైగా పద్యాలు చెప్పి ఉత్తరాపోశన చేశారు. ఇంతకూ
వారి సాధన ఎలాంటిది? ప్రముఖ పాత్రికేయులు బూదరాజు రాధాకృష్ణగారి మాతామహులు
పంగులూరి వారింట వారు అతిథులుగా ఉన్నప్పుడు ఆయన గమనించిన విషయమిది. ఈ కవులు
ఉదయమే లేచి సాధనగా మహాభాగవతాన్ని ఆశువుగా చెప్పుకునేవారట! మరొక్కసారి. ఈ
జాతిలో విజ్ఞానం విద్వత్తు -సాధన మాత్రమే కాదు, దర్శనమని నిరూపించిన
ఉపాసకులు వీరు.
సాధారణంగా ఆశువుగా చెప్తున్నప్పుడు ధార సాగుతుంది కాని కవిత్వపు పలుకు
కాస్తంత కొరవడే సందర్భాలుంటాయి. కొండొకచో అది ఆక్షేపణీయమూ కాదు. అయితే వారి
పద్యాలు చదువుతున్నప్పుడు ఆ దోషం వారి పద్యాలకు ఏమాత్రమూ అంటదని మనకు
బోధపడుతుంది. శబ్దగాంభీర్యం, అర్ధ సాంద్రత, ఆశుపటిమా పెనవేసుకొన్న చిక్కదనం
వారి పద్యాలలో ద్యోతకమవుతుంది.
ఒకే ఒక్క ఉదాహరణ. ఒక శతావధానంలో సీతను రాముడు అరణ్యానికి ఎందుకు పంపాడో
సమర్థిస్తూ పద్యం చెప్పమన్నారు. ఈ పద్యం ఆశువుగా చెప్పింది.
అలా లంకాపురి సీత సాధ్వియని వహ్న్యదుల్ దిశాధీశ్వరుల్
తెలుపం జేర్చితి నీయయోధ్య జనసందేహంబుపో దొంటిరీ
తుల దేవావళి తెల్పునంతవఱకిందున్నిల్పగాదంచు శ్రీ
నళినాక్ష్యంశజ సీత గాన కనిచెన్ రాముండు రాజాగ్రణీ!
'నళినాక్ష్యంశజ' అద్భుతమైన ప్రయోగం. ప్రాసస్థానంలో అర్ధగాంభీర్యంతో
కూర్చున్న పదం ఇద్దరు ఉపాసకుల మేధాసంపత్తికి చిహ్నం.
కొప్పరపు కవుల్లో పెద్దవారైన సుబ్బరాయ శర్మగారి దౌహిత్రుడు మారుతీ సుబ్బరామ
శర్మ తమ పితామహుల అవధాన వైభవాన్ని పునరుద్ధరించి గ్రంధస్తం చేసే
కార్యక్రమానికి నడుంకట్టి సరిగ్గా పదిసంవత్సరాల క్రితం కొప్పరపు కవుల
కళాపీఠాన్ని స్థాపించారు. మొదట వారి వైభవాన్ని ఆకళించుకోడానికి సాధికారికంగా
పరిశోధన చేసిన వారిచేత ఆ సంపదను సేకరించి ఇప్పటికి పది గ్రంథాలు
వెలువరించారు. ప్రతీయేటా ఆ ప్రక్రియలోనో, తదనుబంధమైన ప్రక్రియల్లోనో కృషి
చేసిన లబ్దప్రతిష్టులను సత్కరిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే విశాఖ
సముద్ర తీరంలో ఆ కవుల శిలా విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఇది వారు
తీర్చుకుంటున్న పితృరుణం.
మన సాహితీ వైభవాన్ని సుసంపన్నం చేసిన ఇటువంటి మహానుభావుల్ని స్మరించుకుని
నివాళులర్పించడం జాతి తీర్చుకోవలసిన రుషి రుణం.నేడు మన జీవన సరళి -కేవలం
ఉపాధికీ, సంపదకి, పదవులకీ పరిమితమైపోతున్న తరుణంలో వ్యక్తిశీలాన్ని మరింత
ఉద్బుద్ధం చేసే ఇలాంటి వైభవాన్ని కనీసం తలచుకోవడమైనా చేయగలిగితే ఆ మేరకు
జాతికి ఉపకారం జరుగుతుంది.