Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 

సహజీవనం
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com
 
 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళని అల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచి బయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకు కారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలం కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత. ఇది పూర్వ కథ.

చచ్చిపోయిన కోకిలావని తండ్రి వీరాస్వామి మనక్కాళ్ జిల్లాలోని మహనూర్ గ్రామంలో బస్సు నడుపుకుంటుంటాడు. మెహనూర్ నుంచి కాటు పుత్తూర్ కి బ్రాయిలర్ చికెన్ చేర్చడం అతని వృత్తి. తన కూతురు కాలి మసి అయిపోయిన రోజు వీరాస్వామి మయిలాదురై గ్రామంలో బస్సులో ఉన్నాడు. రాత్రి ఇంటికి వచ్చేదాకా తన ఒక్కగానొక్క కూతురు కాలి మసి అయిపోయిందన్న విషయం తెలీదు. కాలిపోయిన బిడ్డ శవాన్ని చూసి కుటుంబం భోరుమంది. వీరాస్వామి నిద్రపోలేదు. అతని కిప్పుడు 65 సంవత్సరాలు. వీరాస్వామి తదాదిగా వ్యాపారం మానుకున్నాడు. నేరస్తులకి శిక్షపడేట్టు చూడటమే పనిగా పెట్టుకున్నాడు. అంతేకాదు.   బస్సుని అమ్మాయిల్ని కాలేజీకి తీసుకు వెళ్ళడానికి అదే రూటులో నడుపుతున్నాడు. వీరాస్వామికి సాలీనా 50 వేలు నష్టం వస్తుంది. "అయినా నాది కేవలం రేకు బస్సు కాదు. నా బిడ్డ జ్నాపకాలను ప్రతీక్షణం గుర్తుచే జ్నాపిక" అంటాడు వీరాస్వామి. పదేళ్ళూ చట్టంతో పోరాడి, ఎదురు తిరిగిన సాక్షుల తలవొంచి - అడుగుపెట్టిన ప్రతీ న్యాయస్థానమూ నిర్ద్వంధంగా నేరస్తులకు ఉరిశిక్షలు విధించేటట్టు చూశాడు. "న్యాయం ఆలశ్యంగా జరిగింది. మనస్సు కలుక్కుమంటుంది. అయినా సుప్రీం కోర్టు సరైన న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది" అన్నాడు వీరాస్వామి.

ప్రతీ దినం  తన కూతురు లాంటి పిల్లల్ని కాలేజీకి చేరుస్తూ - దుర్మార్గుల వల్ల కాకపోతే పిల్లలలో తన బిడ్డకూడా ఉండేదనుకుంటూ - సాలీనా 50 వేల నష్టంతో తన బిడ్డని గుండెల్లో బతికించుకున్న మానవతావాది వీరాస్వామి. పదిమంది పిల్లల్లో తన బిడ్డని చూసుకుంటూ గుండె పగిలే వేదనతో 'సహజీవనం' అద్భుతమైన ఉద్యమకారుడు వీరాస్వామి. ప్రపంచంలో భరించలేని దుఃఖానికి కొత్త ఔషధాన్ని కనిపెట్టిన గొప్ప వైద్యుడు వీరాస్వామి. నిశ్శబ్ధంగా ఒక గొప్ప సత్యాన్ని నిరూపిస్తున్న అతి నేలబారు మనిషి.

***

మరో కథ.

మొన్న కృష్ణాష్టమి నాడు దేశమంతటా ఉత్సవాలు జరిగాయి. ప్రతీ సంవత్సరం జరుగుతున్నాయి. ఒక మతం తన దేవుడికి అర్పించే నివాళి అది. లీలల్ని తలుచుకుని, మననం చేసుకుని, తమ పరిసరల్లో వాటిని పునఃప్రతిష్టించుకుని మురిసిపోయే తరుణం. దేవుడిని ఆకాశంలో కాక - తమలో, తమ ఇళ్ళలో, తమ పరిసరాల్లో, తమ బిడ్డల్లో, తమ నైమిత్తిక జీవితంలో, జీవనంలో చూసుకునే    గొప్ప సంప్రదాయపు చిహ్నాలవి. వందలాది హిందూ పండగల్లో - ఒక ఉత్సవం.

అన్ని చోట్లా జరిగినట్టే పాట్నాలోనూ ఒక బడిలో జన్మాష్టమి వేడుకలు జరిగాయి. కాని బడికి సంవత్సరం కొత్త కృష్ణుడు వచ్చాడు. ఒక ముస్లిం తల్లి తన బిడ్డను - అత్యద్భుతంగా శ్రీకృష్ణుడిగా అలంకరించింది. పట్టుపీతాంబరం కట్టి, కిరీటాన్ని పెట్టి, మెడలో ముత్యాల హారం వేసి, శిఖలో నెమలి పింఛం తురిమి శ్రీకృష్ణుడిని ఎత్తుకుని బడికి వచ్చింది. తల్లి "కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం.." చదివిందా? విన్నదా? ఏమో!

ఇది ఇంత అద్భుతమైన సహజీవనం! ఒక మత ఛాందసులు తమ మతం వారినే మారణ హోమం చేస్తూంటే, మె బతుకుతున్న రాష్టంలోనే సిద్దాంతాల పేరిట కొందరు ఉన్మాదులు పోలీసుల ప్రాణాల్ని బలితీసుకుంటూంటే, మతాన్ని పదవులకీ, డబ్బుకీ, అధికారానికీ ఫణంగా పెట్టే ఈనాటి అవ్యవస్థలో - నాలుగేళ్ళ పసిబిడ్డకి ముస్లిం తల్లి తన పొరుగు మతంలో ఔన్నత్యాన్ని బోధిస్తోంది. తాను జీవించే వ్యవస్థలోని 'విశ్వాసం'తో సహజీవనం చేస్తోంది.

వీరాస్వామి గుండె పగిలే దుఃఖంతో సహజీవనం చేస్తున్నాడు. తల్లి సమాజం గర్వపడే విశ్వాసంతో సహజీవనం చేస్తోంది.

సమాజ వృక్షానికి ఛాందసం పేరిట ఆకులు ఎండిపోతున్నాయి. దుఃఖం పేరిట కొమ్మలు మాడిపోతున్నాయి. కుహనా సిద్దాంతాల పేరిట కాండం శిధిలమవుతోంది. కాని వెదికితే, గుర్తుపడితే, మిగుల్చుకోగలిగితే ఇంకా వేళ్ళల్లో 'పచ్చ' అలాగే ఉంది.

మనక్కాళ్ లో వీరాస్వామి, పాట్నాలో శ్రీకృష్ణ ఖాన్ తల్లి - ఇంకా ఇంకా దేశం - మన నాయకమ్మణ్యుల, పార్టీల, దౌర్జన్యకారుల చేతుల్లో పూర్తిగా భ్రష్టు పట్టలేదని నిశ్శబ్ధంగా నిరూపిస్తున్నారు.

***
సెప్టెంబర్ 06, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage