Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here కాలం వెనక్కి తిరగదు చాలా సంవత్సరాల క్రితం - ఇప్పుడా స్నేహితుడి పేరు కూడా గుర్తు లేదు- మేం తిరుపతి యాత్రకి కారులో వెళ్తున్నాం. పుత్తూరు దాటగానే- మా చుట్టూ వున్న కొండల్ని చూస్తూ "మారుతీరావుగారూ, మీకు తెలుసా? ఈ కొండలు సంవత్సరాల తరబడి సముద్ర గర్భంలో వుండగా ఏర్పడినవి. ఇలాంటి శిలలు సంవత్సరాల నీటి రాపిడితో యిలా నునుపు తేరుతాయి” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. కొండల్ని యిప్పుడు పిండి చేయడం మనకి వెన్నతో పెట్టిన విద్య. ఆ మాటకి వస్తే దేశాల్ని, నగరాల్ని, భవనాల్ని, పార్టీలని, సంస్కృతులని - మీ యిష్టం- దేనినయినా కూలదోయడం కష్టంకాదు. అలనాటి హిరోషిమా, నాగసాకీ దగ్గర్నుంచి, నేటి ఇరాఖ్, ఆఫ్గనిస్థాన్ లు, మొన్నటి న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, ముంబై మారణహోమం- దేన్నయినా, ఎలాగయినా మానవుడు కేవలం తన "దృక్పధం’లో బేధం కారణంగా కూలద్రోయగలడు. కానీ- ప్రకృతి- ఆ మూల పదార్దాలను రూపు దిద్దడానికి- లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఏతావాతా, పుత్త్తూరు, తిరుపతి కొండలు కొన్ని లక్షల సంవత్సరాలు సముద్ర గర్భంలో వున్నాయన్నమాట! సముద్రం యిక్కడికి 60 మైళ్ళ దూరంలో వుంది. కాలగమనంలోఅదేమంత పెద్దదూరం కాదు. వెంటనే నన్ను సమ్మెటతో కొట్టినట్టు రూపు దిద్దుకున్న మరొక ప్రశ్న: "మరి మన వెంకటేశ్వర స్వామి మాటేమిటి?” కొన్ని లక్షల సంవత్సరాలు తిరుపతి కొండలు సముద్రగర్భంలో వున్నాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయటపడ్డాయి. కొన్ని వందల సంవత్సరాలు అక్కడొక దేవుడున్నాడు. కొన్ని తరాల జీవితాలు (ఒక జీవితకాలం- యిప్పటి లెక్కల దృష్ట్యా చూసుకున్నా 60 అనుకుంటే)కొన్ని విశ్వాసాలకు,నమ్మకాలకు ముడివడ్డాయి. అంతవరకు పరవాలేదు. ముడిపడి ఒకరినొకరు నరుక్కుంటున్నారు. వీరశైవమూ, వైష్ణవమూ, శాక్తేయమూ- యిదంతా చరిత్ర. ఇక్కడ కాస్సేపు శాఖా చంక్రమణం- ఆ మధ్య అమెరికా తానా సభలలో నేను దాశరధి గురించి ప్రసంగించాను. మిగతావారు నన్నయ్య, తిక్కన, పోతన- ప్రభృతుల గురించి మాట్లాడారు. నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తూ "దాశరది గురించి యితముత్ధమనే నిర్ణయాలకి రావడానికి కాలం చాలదు. ఆయన చేతన, కవిత, ఆలోచనల స్థాయి- కాలగమనంలో ఫిల్టర్ కావాలి” అన్నాను. దాశరధిగారిని నాకు తెలుసు. వారి రచనలు తెలుసు. వారితో కలిసి తిరిగాను. భోజనం చేశాను. కబుర్లు చెప్పుకున్నాను. ఈ మాట నన్నయ్య గురించి అనలేం. నన్నయ్య రోజూ పెళ్ళాన్ని సాధించేవాడా? భారతం రాస్తున్నప్పుడు పిల్లలు గొడవ చేస్తే విసుక్కుని కసురుకునేవాడా? ఆ కసురు ఉత్ఫలమాలలో వుండేదా? షష్ట్యంతాలలో వుండేదా? పోతన్న గారికి అజీర్ణ వ్యాధి వుండేదా? ఏ వైద్యుడు ఆయన రోగాన్ని కుదిర్చేవాడు? యిలామనం ఆలోచించం. కాలం చాలా వివరాల్ని మన మనస్సుల్లోంచి తొలగించి, ఫిల్టరు చేసి- ఆయన కవితా వ్యక్తిత్వాన్ని మాత్రమే మన మనస్సుల్లో మిగిల్చింది. మరో ఉదాహరణ- సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి పూరితమయిన గీతాలకూ, అద్భుతమైన కవితా పటిమకూ నిదర్శనంగా యిప్పటికీ తమిళులు ఆయన్ని ఆరాధిస్తారు. కాని ఆ రోజుల్లో ఆయన సంప్రదాయ విలువలకి విడాకులిచ్చి- బ్రాహ్మణ్యానికి తప్పనిసరి అయిన పిలకను తీసేసి, తలకి పాగా చుట్టి, మీస కట్టుని వుంచారు. సరే. దాదాపు 90 ఏళ్ళ క్రితం ఆయన మూర్తిని ఈనాటి తరం ఎలా సంస్కరించి గుర్తుంచుకొన్నదో - ఈ రెండు పొటోలే నిదర్శనం. మరో నిజాన్ని గమనించాలి. తన జీవితకాలంలో సుబ్రహ్మణ్య భారతి తన కులాన్ని దూరం చేసుకున్నాడు. ఈ 90 సంవత్సరాలలో సమాజం ఆయన మతాన్ని ఆయన నుదుటినుంచి చెరిపేసింది! చరిత్ర తన కాల గమనంలో తన సవరణల్ని తాను చేసుకుంటుంది. ఈనాటి సమాజానికి ఆయన వైష్ణవంతో పని లేదు.ఒకటి:ఆనాటి నిజ రూపం. మరొకటి సమాజం సంస్కరించుకున్న యిప్పటి రూపం. ఆ రోజుల్లో ఆయన పెళ్ళాం భుజం మీద చెయ్యి వేసి రోడ్డు మీద నడిచేవారట. ఆ కారణంగా వారిని కుల బహిష్కారం చేశారట ఈ కధ యిప్పుడు మనకి విడ్డూరంగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు -ఒక జాతీయ పార్టీలో చిచ్చుపెట్టిన జిన్నా కధ. ఈ తరానికి - కనీసం ఏ కొందరికో- జిన్నా అంటే ముంబై మలబారు హిల్ లో జిన్నా బంగళా, అలనాటి దేశ విభజన కారణంగా 10 లక్షల మంది ఊచకోత, మరో 30 లక్షల మంది నిర్వాసులయి దేశం నుంచి తరిమిగొట్టబడడం, హత్యలు, మానభంగాలు, అటుతర్వాత పాకిస్థాన్ దేశ గవర్నర్ జనరల్ పదవి- యివీ మిగిలాయి. కాని విచిత్రంగా- ఈనాటి 20 ఏళ్ళ యువతరాన్ని పలకరిస్తే- వారిని ఈ మధ్య ఏదో టీవీ ఛానలు ప్రశ్నించింది:జిన్నా, పటేల్ మీకు తెలుసా? అని. నమ్మండి. 99 శాతం వెర్రి మొహం వేశారు. యీ ఆలోచనల్ని, జ్ణాపకాలని దాటి నేటి యువతరం అపుడే ముందుకు సాగిపోయింది! దేశ విభజనకి సంబంధించిన పీడకలకి- తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా -నెహ్రూగారికీ, పటేల్ గారికీ, జిన్నా గారికీ- అందరికీ పాత్రవుంది. అయితే వారి పాత్రలు- కొన్ని తరాలపాటు రెండు మతాల మధ్య వున్న అసహనపు ఛాయలు కారణంగా రూపుదిద్దుకున్నవా? వారి ఆలోచనా సరళి ఆనాటి రాజకీయ ధోరణికీ, ఆవశ్యకతకీ అద్దం పడుతోందా? ఏమో? యింకా కాలం గడవాలి. ఇప్పటికే నేటి తరం వారి జ్ణాపకాలను అటకెక్కించేశారు. రాజకీయ పార్టీలు మాత్రం జుత్తుపీక్కొని కొందరి కెరీర్ లని బలితీసుకుంటున్నాయి. జిజ్ణాసి ఆలోచిస్తాడు. మేదావి విశ్లేషిస్తాడు. చరిత్ర విమర్శిస్తుంది. రాజకీయం దాన్ని వాడుకుంటుంది. కాని కాలం- నిష్కర్షగా, నిర్ధుష్టంగా, క్రూరంగా- అర్ధంలేని, అవసరం లేని నిజాల మీద ముసుగు కప్పి ముందుకు సాగిపోతుంది.
లక్షల సంవత్సరాల
కిందట తిరుమల స్వామే ఈ కాలగమనంలో లేడు! ఇక వ్యక్తుల, నాయకుల, పార్టీల,
ఉద్దేశాల, ఉద్యమాల పర్యవసానం ఎంత హాస్యాస్పదం! |