Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here కుర్రాడి పన్నుకధ ఎనిమిదేళ్ళ కుర్రాడు బొత్తిగా ఏమీ తెలీని దశలో మేష్టారిని తిట్టాడు. మేష్టారికి కోపం వచ్చి చెంప మీద కొట్టాడు. కుర్రాడి పన్ను రాలిపోయింది. తిట్టు ఎవరికీ గుర్తు లేదుకాని చేతిలో పన్ను కనిపిస్తోంది. మేష్టారిని అందరూ నిలదీశారు. ఈ కధకి ప్రత్యామ్నాయం కధ- నిన్న మొన్నటి జిన్నా రచయిత జస్వంత్ సింగ్ గారిది. ఆయనికి 70 ఏళ్ళు దాటాయి. ఆల్మైర్స్ వ్యాధి ముసురుకొస్తోంది. పాత విషయాలు మరిచిపోతున్నారు. 42 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటున్నారు. 30 సంవత్సరాలుగా ఒకే సిద్ధాంతానికి కట్టుబడిన ఒకే రాజకీయ పార్టీలో ఉంటున్నారు. బి.జె.పీకీ, ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్.ఎస్.ఎస్.కీ ఉన్న అవినాభావ సంబంధాలు వారికి తెలియవని ఎవరూ నమ్మరు. అంతకంటే ఎందరో ఆర్.ఎస్.ఎస్. స్వయం సేవకులు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఏ సిద్ధాంతాలకు ఛలామణీ ఉన్నదో మనకంటే వారికి ఎక్కువ తెలిసి వుండాలి. అంతకంటే జిన్నా ఆర్.ఎస్.ఎస్.కి బద్ధ శత్రువని వారికి ఏనాడో అర్ధమయి వుండాలి. ఇంకా జిన్నా ఉదంతం ప్రస్ధుత పార్టీ అద్యక్షులను ఒకప్పుడు సంచలనం లేపి గద్దెదించిన విషయం వారికి గుర్తుండే ఉండాలి. ఇవన్నీ తెలిసి జస్వంత్ సింగ్ గారు నిర్ధుష్టంగా, స్పష్టంగా, సహేతుకంగా , నిస్సంకోచంగా జిన్నాపెద్దమనిషి అనీ, మహానుభావుడనీ, పటేల్ లోపభూయిష్టమయిన పనులు చేశాడనీ 750 పేజీల గ్రంధాన్ని రాసి ప్రచురించారు. పటేల్ 1948 లో ఆర్.ఎస్.ఎస్ ని బహిష్కరించినా "ఉక్కుమనిషి”గా ఆయన పరపతి ఇంకా గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఆకాశంలో వున్నదనీ, ప్రస్థుతం గుజరాత్ ను తమ పార్టీయే పాలిస్తోందనీ వారికి గుర్తుండేవుండాలి. కాగా, జిన్నాగారి గురించి గ్రంధ రచన చేస్తున్నట్టు తెలిసినప్పటినుంచీ బీజేపీ భుజాలు తడువుకొంటోందనీ, అసెంబ్లీ ఎన్నికలలో ఒకసారీ, పార్లమెంటు ఎన్నికలలో ఒకసారీ ఆ గ్రంధావిష్కరణని వాయిదా వెయ్యమని రాజ్ నాధ్ సింగ్ గారు తనని కోరినట్టు జస్వంత్ సింగ్ గారే చెప్పారు. ఎంత రవీంద్రనాధ్ ఠాకూర్ గారు "ఎక్కడ ఆలోచనకు స్వేఛ్చ ఉంటుందో, ఎక్కడ శిరస్సు ఎత్తి నిలవగలుగుతామో” అన్నా అవి రాజకీయ పార్టీలలో, తలబొప్పికట్టే సిద్ధాంతాల గుహల్లో చెల్లవని జస్వంత్ గారి మేధా సంపత్తి వారికి తెలియజెప్పి వుండాలి. రాజీ ఏ విధంగానూ అంగీకరించని ఆర్.ఎస్.ఎస్. పంచలో వుంటూ రవీంద్రనాధ్ ఠాకూర్ కలిసి వస్తాడని 750 పేజీల గ్రంధ రచనకి పూనుకొని ఉండరు. జిన్నాని పొగిడి, పటేల్ ని తెగడిన రచనకి తన పార్టీ శ్రేణులు వారికి బ్రహ్మరధం పడతారని ఎదురుచూసి వుండరు. ఉదాహరణకు- కాంగ్రెసులో 30 సంవత్సరాలుగా వుంటున్న, వుండాలనుకుంటున్న ప్రణబ్ ముఖర్జీగారు నెహ్రూగారి అసమర్ధత గురించీ, ఇందిరా గాంధీ అరాచకం గురించీ 700 పేజీల గ్రంధం రాసి, ప్రచురించి పార్టీలో "మెప్పు’ పొందుతారని ఆశించడం అవివేకం. పార్టీ అంటేనే కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన ఒక వర్గం అని అర్ధం. అందులో 30 సంవత్సరాలుగా వున్న 42 ఏళ్ళ అనుభవజ్ణుడికి ఈ విషయం తెలియదనుకోవడం ఆత్మవంచన. నిజంగా "జిన్నా’ గ్రంధంలో తాము పేర్కొన్నవన్నీ చారిత్రక సత్యాలనీ, చరిత్రకు చక్కని సమన్వయమని వారు భావిస్తే- స్వయంగా పార్టీకి రాజీనామా చేసి ఆ గ్రంధాన్ని ప్రచురించాలి. ఇది ఒక పార్శ్యం. జరిగిన అనర్ధం ఏమిటంటే- ఔచిత్యాన్ని పాటించకుండా, అడ్డుగోలగా, అర్ధాంతరంగా ఫోన్ లో జస్వంత్ సింగ్ గారికి ఉద్వాసన చెప్పి బీజేపీ అపప్రధని కొనితెచ్చుకుంది. జస్వంత్ గారి 750 పేజీల విన్యాసం తర్వాత బీజేపీ అంత ముఖం చాటు చేసుకోనవసరం లేదు. ఆలోచించి, సమక్షంలో చెప్పినా జస్వంత్ సింగ్ గారు అర్ధం చేసుకోవలసిన పరిస్థితి. ఇప్పుడు నా మొదటి కధ. న్యాయంగా బూతులు తిట్టిన కుర్రాడికి మేష్టారి చెంప పెట్టు ఆక్షేపణీయం కాదు. కాని ఊడిపోయిన పన్ను విద్యార్ధి పట్ల సానుభూతికీ మేష్టారి పట్ల కోపానికీ కారణమయింది. జస్వంత్ సింగ్ గారు తన ఉద్వాసనని చాలా గంభీరంగా, చాలా వినయంగా, చాలా హుందాగా అంగీకరించడం ద్వారా పదిమంది సానుభూతినీ ఎక్కువగా కొట్టేశారు. వారి తప్పు కంటే పార్టీ అనౌచిత్యం ఎక్కువ అపకీర్తిని పోగుజేసుకుంది. అయితే పోయిన పన్ను కుర్రాడికి మళ్ళీ పుట్టుకొస్తుంది. కాని మేష్టారి పట్ల అతను వాడిన బూతు ఏనాటికీ "శ్రీరామ’ కాదు. కాలేదు.
జిన్నా గారి మీద
జస్వంత్ సింగ్ గారి 750
పేజీల గ్రంధం చాలా
గ్రంధాలయాలలో ఆయన బర్తరఫ్ కి బలమైన మద్దతుని శాశ్వతంగా పలుకుతూనే
వుంటుంది. |