Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
అన్నా వెనుక మనిషి
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
మా ఇంట్లో ఇద్దరు అవినీతిపరులున్నారు - నేనూ, మా అబ్బాయి. మేమిద్దరం
ఈ దేశంలో సగటు అవినీతికి నమూనాలం కాము. అయినా మాకూ ఈ గుంపులో స్థానం ఉంది.
చాలా ఏళ్ళ కిందట మా పెద్దబ్బాయి మంచి డ్రస్సు వేసుకుని టై కట్టుకుని సిద్ధం
అవుతున్నాడు. ఎక్కడి కన్నాను. కోర్టుకి అన్నాడు. అర్ధంకాలేదు. అయిదారు
రోజుల కిందట రోడ్డు మీద పోలీసు అతన్ని ఆపాడట. ఏదో నేరం చేశాడో, చేశాడని
పోలీసు భావించాడో. (నీతికీ అవినీతికీ అభిప్రాయబేధాలు తప్పవు కదా?) న్యాయంగా
పోలీసు చేతిలో ఆమ్యామ్యా పడితే తేలిపోయే వ్యవహారమది. కానీ కోర్టుకే వచ్చి
తాను రైటని నిరూపిస్తానన్నాడు మా వాడు. పోలీసు తలవూపాడు. సమన్లు వచ్చాయి.
ఇప్పుడు కోర్టుకి వెళుతున్నాడు. యువకుడు, ఉడుకు రక్తం కలవాడు. రోడ్డు మీద
అవినీతిని ఎదుర్కోవాలనే చిత్తశుద్ధి కలవాడు. మంచిదే అన్నాను.
ఆ సాయంకాలం అతి నీరసంగా ఇంటికి వచ్చాడు. రకరకాల అలగా జనంతో కోర్టు వరండాలో
ఆరుగంటలు కూర్చున్నాడట. ఆ జనానికి కోర్టులు పరిపాటి. కేసులు ఉపాధి. అవినీతి
వృత్తి. ఈ యువకుడికి ఛాలెంజ్. మధ్యాహ్నం ఏ రెండు గంటలకో మెజిస్ట్రేట్ పిలుపు
వచ్చింది. బోనులో నిలబడిన ఇరవైయ్యేళ్ళ పవిత్రమైన కుర్రాడిని మెజిస్ట్రేట్
కన్నెత్తయినా చూడలేదు. మాట వినలేదు. పోలీసు ఏదో చెప్పగా "నూరు రూపాయలు"
అన్నాడు. "మిలార్డ్! నేను నిజానికి..." ఏదో చెప్పబోయాడు. మెజిస్ట్రేట్
విసుగ్గా "నూటయాభై" అన్నారు. మళ్ళీ నోరెత్తబోతే బోరవుతున్న గుమాస్తా
చెయ్యిపట్టుకుని అతన్ని బోనులోంచి బయటికి లాగాడు. అదీ కథ.
ఇరవైయ్యేళ్ళ యువకుడి నిజాయితీకి పరిష్కారం - ఆరుగంటల నిరీక్షణ, ఒకరోజు
కోర్టు వరండాలో పడిగాపులు, తన నీతిని చెవినయినా బెట్టని న్యాయమూర్తి,
గుమాస్తాల అలసత్వం - వెరసి 150 రూపాయల జరిమానా. యువకుడికి ఇది మంచి పాఠం.
తర్వాత ఏమయింది? ఈ సమాజానికి ఓ కొత్త అవినీతిపరుడు జమ అయాడు. ఈసారి రోడ్డు
మీద పోలీసు ఆపినప్పుడు 20 రూపాయలు నిశ్చింతగా అతనికి సమర్పించుకున్నాడు.
పోలీసు సెల్యూట్ చేశాడు. అవినీతికి వెసులుభాటు తోడయింది. అలవాటయింది.
పోలీసుకి అవసరమయింది. అరుదుగా ఎదురయ్యే ఓ కుర్రాడి నీతిని రోజూ తనముందు
తారసిల్లే వందలాదిమంది మధ్యనుంచి ఏరే వ్యవధి మేజిస్ర్టేట్ కి లేదు. కాగా ఆ
నీతిని ఆయన గుర్తుపట్టడం మరిచిపోయి చాలా సంవత్సరాలయింది. ఆయనకి తెలియని
విషయం - పోలీసుకీ, యువకుడికీ అర్ధమయిన విషయం ఏమిటంటే ఈ దేశంలో నీతిని
పాటించాలనే పట్టుదలతో ఉన్న ఓ యువకుడు కొత్త 'అవినీతి పరుల జాబితాలో నమోదు
అయిపోయాడు.
ఈ వెసులుబాటు పోలీసుకి ముందే తెలుసు. ఈ యువకుడికి ఇప్పుడు తెలిసింది.
అవినీతితో రాజీకి ఇప్పుడు ఇద్దరూ బంధువులయారు.
రెండో అవినీతిపరుడిని నేను. నేను కొంచెం ముదిరిన - తెలివైన, కాని
నిస్సహాయమైన అవినీతిపరుడిని. వ్యవస్థ చేతకానితనం, నాయకుల నిస్సత్తువ,
ఉద్యోగుల అవకాశవాదం, అవసరాన్ని గడుపుకోవలసిన గత్యంతరం, వ్యవస్థతో పోరుకి
దిగలేని, దిగే వ్యవధిలేని నిర్వీర్యత - ఇన్ని నా అవినీతికి పెట్టుబడులు.
ఒకానొక ఊరిలో నా గెస్ట్ హౌస్ లో - ఇంకా ఉపయోగించని ఆ బిల్డింగుకి
విద్యుచ్చక్తి ఇవ్వలేదు. మర్నాడు ఉదయమే ఫోన్. ఒక ఇంజనీరుగారు అటునుంచీ
మాట్లాడారు. నా బిల్డింగుకి అక్రమంగా విద్యుచ్చక్తిని తీసుకోవడం వల్ల - ఆయన
నా ఫోటో పేపర్లో వేసి, నా మీద క్రిమినల్ కేసుపెట్టి, నన్ను 24 గంటల్లో
అరెస్టు చేస్తారట. పేరున్న రచయిత ఫోటో కింద "ఫలానా మారుతీరావు అరెస్టు"
అన్న అక్షరాలు నా కళ్ళముందు కదిలాయి. ఇంకా విద్యుచ్చక్తి వాడలేదు కదా? నోనో,
కనెక్షన్ తీసుకోవడమే నేరం. దీని పర్యవసానం - నేను జైల్లో, తర్వాత బెయిల్,
సివిల్ కేసు, నెలల తరబడి కోర్టుల చుట్టూ ఆ ఊరికి తిరగడం, నా పరపతి రోడ్డు
మీద పడడం. నేను ఆఫీసరుగారికి అత్యంత ఒడుపయిన చేప. బంగారు బాతుగుడ్డు. ఈ
వ్యవస్థలో వ్యక్తి ఎంత బలహీనుడో, నాలాంటివాడిని సుళువుగా బజారుకీడ్వడం ఎంత
తేలికో అతనికి తెలుసు. కాగా, అది అతని దైనందిన చర్య. కేసు ముఖ్యం కాదు. కేసు
రూపేణా నేను భయపడడం ముఖ్యం. నా నిస్సహాయత ముఖ్యం. ఫలితం - అక్షరాలా పాతిక
వేలు ఆ ఇంజనీరుగారికి సమర్పించాను. గర్భగుడిలో దేవుడిలాగా చిరునవ్వుతో
అందుకుని, నా సినీమాలు ఎంత బాగా చూస్తాడో వివరించి, పెళ్ళానికి నన్ను పరిచయం
చేసి, గుమ్మం దాకా వచ్చి నన్ను సాగనంపాడు.
రాం లీలా మైదానంలో నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే ప్రతిపాదించిన లోక్
పాల్ బిల్లు గురించి ఈ దేశంలో చాలామందికి తెలియదు. తెలిసినా వాళ్ళకి
లెక్కలేదు. తెల్లారితే రాజాలు, కల్మాడీలు, ముఖ్య మంత్రి కూతుళ్ళు జైళ్ళకి
వెళ్ళడం - వాళ్ళకి కేవలం అవినీతిపరుల పళ్ళూడడంలాంటి మెలోడ్రామా మాత్రమే.
కానీ తెల్లారిలేస్తే - బియ్యం క్యూల దగ్గర్నుంచి, రైల్వే దగ్గర్నించి, ఆఫీసు
గుమాస్తాల చేతుల్లో, డవాలా బంట్రోతుల అహంకారానికి, చిన్న ఉద్యోగుల
నిరంకుశత్వానికి - తప్పనిసరయి, మరో గతిలేక, దమ్ముచాలక ఎదిరించే వ్యవధీ,
స్థోమతూ చాలక నలిగిపోయే మధ్య తరగతి, కింది తరగతి పౌరులు లక్షలాది మంది అన్నా
వెనుక నిలబడ్డారు.
వెనకటికి 'కన్యాశుల్కం'లో గిరీశం బండివాడితో రాజకీయాల గురించి గంట లెక్చరు
ఇస్తే 'మా ఊరు పోలీసుకి ఎప్పుడు బదిలీ అవుతుంద'ని అడిగాడట. సామాన్య మానవుడి
జీవితం - తన స్థాయి అవినీతిలో మురుగుతోంది.
ఆ మురికి కూపంలోంచి విడుదలని కల్పించే పెద్ద ఆశ, కనిపించదా అనే చిన్న కోరికా,
దైనందిన జీవితాన్ని కకావికలు చేసే నేలబారు అవినీతికి చెంపపెట్టు ఏనాటికయినా
సాధ్యం కాదా అన్న ఆక్రోశం - అన్నా వెనక నడిచే లక్షలాది నినాదాలకు పెట్టుబడి.
లోకపాలులూ, పార్లమెంటులూ, ప్రజాస్వామిక సూత్రాలూ, రాజకీయ సిద్దాంతాలూ -
ఇవన్నీ ఆ మనిషికి అర్ధంకాని, అకక్రలేని కకావికలు.
అన్నా ఉద్యమంలో నినాదం చేసే మనిషి - కన్యాశుల్కంలో బండివాడు.
***