Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
మనకి స్వాతంత్య్రం వచ్చింది!

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com  

  మనకి 65 ఏళ్ల కిందట స్వాతంత్య్రం వచ్చింది.
మనం గర్వపడే అభివృద్ధిని చూసుకుందాం
ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలకి జైలుకి వెళ్లాడు.
అతని మీద క్రిమినల్‌ చర్యని ప్రారంభించవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఓ ముఖ్యమంత్రి కూతురు అవినీతితో కోట్లు దోచుకున్నందుకు జైలులో ఉంది, ఈ దేశం గర్వపడే కామన్వెల్త్‌ క్రీడల వ్యవహారంలో కోట్లు దోచుకున్న నాయకుడు, పార్లమెంటు సభ్యుడు -సురేష్‌ కల్మాడీ జైలుకెళ్లాడు.
లక్షల కోట్ల (5 బిలియన్లు) నల్లధనం విదేశీ జైళ్లలో మగ్గుతోందని బాబాలు, నీతిపరులూ నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ముంబై ఆదర్శ కుంభకోణంలో నేటి ముఖ్యమంత్రులూ, కేబినెట్‌ మంత్రులూ, సైనిక అధికారులూ వాటాలు పంచుకున్నారు.
ధనాన్ని దోచుకున్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి -మధు కోడా -జైలు కెళ్లారు.
రెండుసార్లు క్రిమినల్‌ చార్జీల మీద అరెస్టయిన శిబు శొరేన్‌ కేంద్రంలో కేబినెట్‌ మంత్రి అయారు.
రాజస్థాన్‌ మంత్రి ఓ నర్సుతో ప్రేమ వ్యవహారం నడిపి ఆమె హత్యకి కారణమయ్యాడు. ఇప్పుడిప్పుడే మరో మంత్రిగారు ఎయిర్‌ హోస్టెస్‌తో రంకు నడిపి ఆమె ఆత్మహత్యకి కారణమయి పోలీసులకు లొంగిపోయాడు.
ఓ ముఖ్యమంత్రిగారి కొడుకు తన తండ్రిగారి హయాంలో లక్షల కోట్లు కొల్లగొట్టారని ఈ దేశపు నేరపరిశోధక సంస్థ కేసులు నడుపుతూండగా ఆయన జైలులోంచి ఒక పార్టీని నడుపుతున్నారు.
తేలికగా డజన్ల కొద్దీ ఐయ్యేయస్‌ ఆఫీసర్లు అలవాటుగా జైళ్లల్లో మగ్గుతున్నారు.
కనీసం ఆరుగురు రాష్ట్రమంత్రుల మీద అవినీతి పరిశీలన జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అవినీతి నేరానికి అరెస్టయి ఇప్పటికే ఒక రాష్ట్ర మంత్రి జైలులో ఉన్నారు.
నేరం నిరూపణ అయి శిక్ష పడిన మంత్రి ఇంకా పదవిలో ఉండే హక్కుని సమర్థించుకుంటున్నారు.
నేరం చేశారని సిబిఐ చార్జిషీటు ఫైలు చేసిన మంత్రివర్యులు రాజీనామా చెయ్యనవసరం లేదని ఓ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు భావిస్తున్నారు!
తప్పులు చేసిన నాయకులు -తమ తప్పులో అందరివాటా ఉన్నదని తప్పించుకోవాలని చూస్తున్నారు.
గాంధీ పుట్టిన దేశంలో కల్లు, మందు వ్యాపారాలు చేస్తున్న పెద్దలు నాయకులుగా చెలామణీ అవుతున్నారు.
గడ్డి తిన్న కుంభకోణంలో ఇరుక్కున్న నాయకులు పార్లమెంటులో నీతులు వక్కాణిస్తున్నారు.
నిజాన్ని బయట పెట్టే యువకులు నిర్దాక్షిణ్యంగా హత్యలకు గురవుతున్నారు.
ఏ కారణానికయినా తెలుగుదేశంలోనే తెలుగుదనాన్ని చాటిన మహానుభావుల విగ్రహాలను తెలుగువారే నేలమట్టం చేస్తున్నారు.
గనుల కుంభకోణంలో జైలు పాలయిన కర్ణాటక మంత్రి, తెలుగు రెడ్డిగారు కోట్ల ఖర్చుతో స్వేచ్ఛకి పెట్టుబడి పెట్టారు.
చట్టాన్ని ఖరీదుకి అమ్మే న్యాయమూర్తులు డబ్బుకి గడ్డి కరిచి ప్రస్థుతం జైళ్లలో మ్రగ్గుతున్నారు.
మన దేశంలో అక్రమ సంపదని చూసి సిగ్గుపడాలని ఒక రాజకీయ విశ్లేషకుడు స్వాతంత్య్ర దిన సందేశాన్నిచ్చారు.
రంకుతనానికి అరెస్టయిన యువతి తగిన రక్షణ కల్పిస్తే పెద్దల రంకుని బయటపెడతానని గర్వంగా జైల్లో రొమ్ము చరుస్తోంది.
తల్లీ తండ్రీ తర్వాత దైవంగా భావించే గురువు శిష్యులతో లైంగిక వేధింపులకి పాల్పడినందుకు ఒక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గారు అరెస్టయారు. శిష్యురాండ్రకి సాక్షాత్తూ తల్లి కావలసిన గురుపత్ని భర్తకి సహకరించిన నేరానికి అరెస్టయింది.
ఈ దేశంలోనే -ఈ దేశ ప్రజలకే రక్షణ లేదని ఈ మధ్య అస్సాంలో మత రాజకీయాలు నిరూపించాయి. అస్సాంలో దౌర్జన్యం, మారణకాండ ప్రకంపనలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, పూణ, హైదరాబాద్‌లలో కనిపిస్తున్నాయి.
పార్లమెంటు అనే 'ఆత్మ'ని పవిత్రంగా కాపాడుకోవాలని ఈ దేశం రాష్ట్రపతి వాపోతూ స్వాతంత్య్ర దిన సందేశాన్ని ఇస్తున్నారు.
రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్న ఘనత వహించిన మంత్రిగారు కష్టపడి పనిచేసి -కాస్త దోచుకుంటే తప్పులేదని -ఇప్పటికే దోచుకుంటున్న ఐయ్యేయస్‌లకు హితవు చెప్తున్నారు.
పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగారు తమ నివాసానికి, తమ పార్టీకీ, తమ నాయకులకీ, తమ కులానికీ కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి స్మారక మందిరాలను నిర్మించుకుంటున్నారు.
ప్రజాభిప్రాయం బహిరంగంగా చెప్పిన ప్రొఫెసర్లను ఓ ముఖ్యమంత్రి గారు హుటాహుటిన అరెస్టు చేయిస్తున్నారు.
గుండాయిజం జరిపిన తమ పార్టీవారిని పోలీసులు అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా పోలీసు స్టేషన్‌కి వచ్చి వారిని విడిపించుకుపోయారు.
ఏ కారణానికయినా ఈ దేశపు ప్రధాన సైనికాధికారి ప్రభుత్వం మీద కోర్టుకెక్కారు.
ఏ కారణానికయినా ఈ దేశంలో ఉపాధ్యాయులు విద్యార్థుల్ని కొట్టి చంపుతున్నారు. అమ్మాయిల్ని బట్టలిప్పి పదిమంది ముందూ నిలబెడుతున్నారు.
కాశ్మీరు పండితుల్ని కాశ్మీరులోంచే తగిలేసిన మతం వారు కాశ్మీరు మన దేశంలోనే భాగంగా ఉండరాదంటున్నారు.
కేంద్రం ఆదాయంలో 90 పాళ్లు అవినీతి పరుల ఖాతాల్లోకి పోతోందన్న శుభవార్తని ప్రధానమంత్రిగారు స్వాతంత్య్ర దిన సందేశంగా జాతికి వక్కాణించారు.
మన దేశంలో ప్రధాన న్యాయమూర్తి అక్రమ సంపాదన మీద కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచ అవినీతిలో మన దేశం 87వ స్థానంలోవుంది.
న్యాయమూర్తుల తీర్పుల్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చునని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు.
ఆడపిల్లలు బట్టలు సరిగ్గా వేసుకోని కారణం చేతనే వారిమీద అత్యాచారాలు ప్రబలుతున్నాయని భావించిన ఓ పోలీసు అధికారిమీద మహిళా సంఘాలు కత్తులు దూశాయి.
ఉచిత మొబైళ్లూ, రూపాయి బియ్యాలూ పంచి వోట్లు దండుకోవాలని చూసే రాజకీయ పార్టీలు ప్రజల సామర్థ్యాన్ని పెంచాలన్న విషయాన్ని మరిచిపోయాయి. వారు మరిచిపోయారన్న విషయాన్ని ప్రజలూ మరిచి పబ్బం గడుపుకొంటున్నారు.
ప్రతిరోజూ చేపల్ని పంచి, చేపల్ని పట్టే రహస్యాల్ని గడుసయిన ప్రభుత్వాలు ఇప్పటికీ తమ చేతుల్లోనే ఉంచుకుంటున్నాయి.
తమిళనాడులో బియ్యం నుంచి లాప్‌టాప్‌ దాకా, సైకిళ్ల నుంచి టీవీసెట్ల దాకా, మంగళసూత్రాల దగ్గర్నుంచి మాన మర్యాదలదాకా అన్నీ ఫ్రీ!
దౌర్జన్యకారుల పేరిట నోరులేని గిరిజనులను అధికారం అనునిత్యం చంపుతోంది.
విప్లవం పేరిట ఈ తిరుగుబాటుదారులు పోలీసుల్ని చంపి భుజాలు చరుచుకుంటున్నారు.
జీవితం -కుళ్లిపోయిన పుల్ల విస్తరాకు -బడుగు వర్గాలకి. వడ్డించిన మృష్టాన్న భోజనం కలవారికి.
అవును, మనకి నిజంగానే స్వాతంత్య్రం వచ్చింది!
                                                                           ఆగస్టు  20, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage