Click Play to listen audio of this
column
If you have issues with Voice clarity, upgrade your Flash Player
Version.
Click Here
'రేపు' దోపిడీ
బహుశా ఎవరూ ఈ విషయాన్ని ఆలోచించి ఉండరు.
మనల్ని ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఎవరో ఒకరు దోచుకుంటున్నారు. నమ్మించి
మోసం చేస్తున్నారు. మనల్నికాపాడవలసిన వాళ్ళే మనల్ని కబళిస్తున్నారు.
పోలీసు స్టేషన్లో పోలీసులు మానభంగాలు చేస్తున్నారు. నిన్ననే చెన్నైలో
పోలీసులు ఇన్ కమ్ టాక్స్ అధికారులుగా నటించి ఓ నగల వ్యాపారిని
కొల్లగొట్టారు. రాజకీయ నాయకులు మోసాలు చేసి సమర్థించుకొంటున్నారు,
అధికారులు లంచాలు తీసుకుని సమాజాన్ని గుల్ల చేస్తున్నారు.
కాని మనిషి మనుగడ సజావుగా , ఏ పొరపొచ్చాలూ లేకుండా ,
నమ్మకంగా, తనగురించి ఆలోచించకపోయినా ఎటువంటి మోసమూ, కల్తీ లేకుండా మనకి
సేవ చేసే శక్తి ఒకటి ఉంది. దాని పేరు ప్రకృతి.
ఒక్కసారి ఆలోచించండి., పసిగుడ్డు తల్లి గర్భంలోంచి బయటికి
వచ్చిన కొద్ది క్షణాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు దెబ్బ తింటుంది.. నరాలు
దెబ్బ తింటాయి. స్పాస్టిక్ లక్షణాలు నిలదొక్కుకుంటాయి. మనం ఏనాడూ
ఆలోచించకపోయినా నిముషానికి 54 సార్లుగా - సంవత్సరాలూ, దశాబ్దాలూ,
కొండొకచో శతాబ్దాలూ గాలి మనకి ఆక్సిజన్ ని పంచుతోంది. మన ప్రాణాల్ని
నిలబెట్టుతోంది. చెట్లు నిశ్శబ్దంగా, నమ్మకంగా ఆహారాన్నిస్తున్నాయి.
మృగాలు ఏనాడూ నీతి తప్పదు. ఆకలి వేస్తున్న సింహం జంతువుని వేటాడి
తిన్నాక ఎనిమిది రోజులపాటు తన ఒడిలో మరో జంతువు ఆడుకున్నా ముట్టుకోదు.
కాని ఏ విధంగానూ అనుభవించలేని, ఏ విధంగానూ దాచుకోలేని,
శాశ్వతంగా తానే మిగలడని తెలిసినా మనిషి ఎంత సంపదని, ఎంతగా పొరుగువాడిని
దోచుకుంటున్నాడు..!
ఇది ఒక ఎత్తు. ఈ ప్రకృతికి పట్టినపెద్ద చీడ మనిషి. మనిషికి
దక్కిన పెద్ద ఆయుధం తెలివితేటలు. అంతకు మించి - ’నేటి’ ని సుఖవంతం
చేసుకోవాలనే యావ. అర్హతకు, అవసరానికి మించిన ఆదుర్దా, దోపిడీ.
ప్రస్తుతం కరువు కాటకాలు దేశంలో తాండవం చేస్తున్నాయి. రుతువుల
ప్రకారం వర్షాలు పడడం లేదు. చక్కగా ప్రకృతి యిచ్చే, యివ్వగల అద్భుతమైన
వనర్లు దోపిడీ జరుగుతోంది. ఋషి ఆశ్రమాలకి పూర్వకాలంలో రాజులు వెళితే
అడిగే యోగక్షేమాలలో ముఖ్యమైన ప్రశ్న: నెలకి మూడు వర్షాలు కురుస్తున్నాయా?
అని. మూడు సంవత్సరాలకి ఒకసారీ వర్షం కురిసే అవకాశం లేదిప్పుడు.
అడవిలో ఏనుగుని ఏ జంతువూ చంపలేదు. కేసరి కుంభస్థలాన్ని
బద్దలుకొట్టి తినడం భర్తృహరు ఊహించిన కవి సమయం. ఆఫ్రికాలో నేను స్వయంగా
చూశాను. అడవిలో భయపడే ప్రతీ జంతువూ గౌరవించేది ఒక్క ఏనుగునే. ఏనుగు
ఏదైనా ప్రమాదంలో లేదా వయసు వల్ల మరణించాలి. కాని వేల ఏనుగుల్ని చంపి ,
దంతాలు అమ్ముకుని బ్రతికిన ఓ పెద్ద దోపిడి దొంగ , వీరప్పన్, మొన్ననే
మరణించాడు.
నీటిని కొనుక్కునే దశకి మానవుడు వచ్చాడు. ముందు ముందు యుద్ధాలు
నీటికోసం జరుగుతాయన్నారు. ఇప్పుడే కావేరీ జలాలకోసం రాష్ ట్రాల పోరు
స్థాళీపులాక న్యాయంగా చూస్తున్నాం. ముందు ముందు పీల్చే గాలికి ’రే్షన్’
వస్తుందన్నారు - ఈ మధ్యన తమిళనాడులో ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి
ముఖ్య అతిథిగా వచ్చిన దేశ ప్రఖ్యాత పర్యావరణవేత్త.
ఒక కారు వంద మైళ్ళు నడిస్తే - ఓ మనిషి జీవితానికి సరిపోయే
ఆక్సిజన్ వినియోగమౌతుందట. ఆ లెక్కన ఒక్క చెన్నై అన్నా శాలైలో రోజుకి ఎని
వందల జీవితాల ఆక్సిజన్ ఖర్చయిపోతోంది.! మరి అంతరిక్షంలో పక్షుల్లాగ
ఎగిరే విమానాలు ఎన్ని లక్షల మందికి వినియోగపడే ఆక్సిజన్ని
మింగేస్తున్నాయి..!?
ఆరువందల యాభై వేల సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా మనిషి ఈ
ప్రకృతిని దోచుకుంటున్నాడు, భూమి ఉపరితలం వేడెక్కి మంచుకొండలు
కరుగుతున్నాయి. సముద్రమట్టం పెరుగుతోంది. అడవులు అంతరించి పోతున్నాయి.
ఈ భూమిమీద పరిశ్రమలు, బొగ్గుపులుసు వాయువు, ఇంధనాల వల్ల ఏర్పడే వేడి -
సముద్రాలను ఆర్చుకుపోవడమే కాదు, భూమిలో ఉన్న తేమనీ పీల్చేస్తుంది. భూమి
పగుళ్ళు తీస్తుంది. ఆకాశం వర్షించదు.
2070 ప్రాంతానికి ’స్నానం’ అంటే ఏమిటో - అది రెండు, మూడు
తరాల క్రిందటి ’అదృష్టం’ గా చెప్పుకునే దశవస్తుంది. తినడానికి ప్రకృతి
ఇచ్చే ఆహారం ఉండదు. రసాయనిక ఆహారం మీద ఆధారపడవలసి వస్తుంది. శరీరం
అర్థాంతరంగా వొడిలిపోతుంది. ఆయుష్షు కుంచించుకుపోతుంది. మృత్యువు
మీదపడుతున్నందుకు ఆనందించే రోజులు వస్తాయి.
మనకి అన్యాయం జరిగితే ఎదురుతిరుగుతాం, సమ్మెలు
చేస్తాం..దోచుకుంటాం..లూఠీ చేస్తాం. కానీ యివన్నీ ప్రకృతిమీద అనుక్షణం
మనిషి చేస్తున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాలుగా భూమిలో ఉన్న వనర్లని
కొన్ని దశాబ్దాలలో ఆర్చేస్తున్నాడు.
ప్రకృతికి నోరులేదు, ఎదిరించదు . విశ్వాసంగా , నమ్మకంగా
’అమ్మ’ లాగ ఆదరించే ప్రకృతి క్రమంగా ఛిద్రమయి పోతుంది. ఓపికున్నంతకాలం
- తను కాలి వెలుగునిచ్చే శక్తి ప్రకృతి. ఏదో రోజు వెలుగూ ఉండదు, ప్రకృతి
ఇచ్చే ఫలితమూ ఉండదు.
విశ్వాసఘాతకుడైన మనిషి తన ముందు తరాల దోపిడికి నిర్జీవమై, దారుణమైన
’కృతఘ్నత’ కి లోనౌతాడు.