Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here తాళం చెవుల కథ గొల్లపూడి మారుతీరావు దేశంలో ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయిన అతి విచిత్రమైన సంకట పరిస్థితి గతవారమే తలెత్తింది. స్థూలంగా చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరో నలభై రోజుల్లో కామన్వెల్తు క్రీడలు జరగనున్నాయి. ఇందుకుగాను రకరకాలయిన కార్యక్రమాలకి 65 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో సూటిగా క్రీడల కయ్యే ఖర్చు కొంత, క్రీడలు కారణంగా రోడ్లు, నగరం, వసతుల ఏర్పాట్ల ఖర్చులు కొన్ని. క్రీడలు కారణంగా ఇవన్నీ మెరుగవుతాయి. కనుక కొంత ఖర్చు - 'వీరయ్య పెళ్ళిలో పేరయ్యకి జందెం పోచ' సామెతగా కలిసి వస్తుంది. అయితే ఈ ఖర్చుల్లో కోట్లకు కోట్లు ఘనులయిన పెద్దలు ఫలహారం చేశారని ఛానళ్ళూ, పత్రికలూ గుండెలు బాదుకుంటున్నాయి. వరసగా ఫోర్జరీలూ, తప్పుడు లెక్కలు, మోసాలూ, పద్ధతుల ఉల్లంఘన ఇలా జరగని నేరం లేదు. పార్లమెంటు గత నాలుగురోజులుగా ఈ విషయమై అట్టడుకుతోంది. పెట్టేవాడికి సంచులు నిండుతున్నాయి. తిట్టేవాడికి గొంతులు ఎండుతున్నాయి. ఈ సందర్భంలో దేశం రెండుగా చీలిపోయింది. ఈ అవినీతి అంతటికీ కారణమైన మూలపురుషుడు సురేష్ కల్మాడీని ఇప్పుడే తొలగించి కొత్త మనిషికి బాధ్యతలు అప్పగించాలా ? నలభై రోజుల్లో క్రీడలు జరగాలి కనుక ఆయన చేతే ఆ పని చేయించి ఆ తర్వాత చర్య తీసుకోవాలా? అని. ఇది నీతికీ, అవసరం తీరాల్సిన కార్యసాధనకీ మధ్య వచ్చిన వివాదం. దేశంలో ఓ ఆచారం అనాదిగా ఉంది. గొప్ప గొప్ప దొంగతనాలు చేసిన సీనియర్ దొంగల్ని జైళ్ళలో పారేసి మరిచిపోరు. అలాంటి దొంగతనాలు జరిగినప్పుడు ఆయా సీనియర్ దొంగల సలహాల్ని తీసుకుంటారు. "ఈ కన్నం ఒక్క నాంచారయ్యే వేయగలడండి. నగరిలో పట్నాయిక్ కాలనీలో ఉంటాడండి" అనో "గంటలో గల్లా పెట్టి బద్దలు కొట్టే నేర్పు ఒక్క కైలాసానికే ఉందండి. అతని గొప్ప శివభక్తుడు. శ్రీ శైలం ఫలానా సత్రంలో దొరుకుతాడండి" అని ఢంకా బజాయించి చెప్పగలడు. దొంగలకి వాళ్ళ వాళ్ళ గోత్రాలు తెలుస్తాయి. ఇలాంటి మెలుకువతోనే హాలీవుడ్ ఆ మధ్య ఓ గొప్ప చిత్రాన్ని తీసింది. దాని పేరు 'ది రాక్ '. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న ఆల్కెట్రాజ్ అనే ద్వీపం జైలులో ఉన్న ఒక ఖైదీ - దాని చరిత్రలో ఒక్కసారే తప్పించుకు బతికి బట్టకట్టాడు. ఆ వేషం శాన్ కోనరీ చేశాడు. అతన్ని నాయకుడిగా పెట్టుకుని అధికారవర్గం ఆ ద్వీపం మీద దండయాత్ర కథ. ఇది దొంగకి తాళం చెవులు ఇచ్చిన కితకితలు పెట్టే కథ. గొప్పగా రాణించింది. శాంతారాం చిత్రాలలో నన్ను మైమరిపించే చిత్రాలు రెండే రెండు. ఒకటి రంగులకల, మహా కావ్యం 'నవరంగ్ ', రెండు 'దో ఆంఖే బారాహాత్ '. ఎందుకూ పనికిరారనుకున్న ఆరుగురు హంతకుల్ని మానవులుగా మలిచిన అద్భుత కథనం. ప్రపంచ చరిత్రలో భారతీయ చిత్రానికి స్పందించి హాలీవుడ్ ఒకే ఒక చిత్రం తీసిందని చెపుతారు. అది 'డర్టీ డజన్ '. అదీ - దొంగ తాళం చెవులిచ్చిన కథ. అన్నివిధాలా అవినీతి విశ్వరూపం దాలుస్తున్న మనదేశంలో 65 వేల కోట్లు ఉన్నచోట అవినీతి ఉండదనుకోవడం బెల్లం ఉన్న చోట చీమలుండవని కళ్ళు మూసుకున్నట్టు. అయితే ఈ చీమలు బెల్లాన్నే తింటున్నాయా లేక బెల్లాన్ని పెట్టిన చేతుల్నీ కబళిస్తున్నాయా అన్నది మీ మాంస. కొందరు గుడిలో లింగాన్నే కాక గుడినీ మింగే ప్రబుద్దులుంటారు. మరిచిపోవద్దు. కొన్నివేలమంది సిబ్బందితో, దాదాపు 40 దేశాలతో చర్చలు, మంతనాలు సాగిస్తున్న కల్మాడీ అనే పెద్దమనిషి - రాజకీయవేత్త - మొన్న పత్రికా సమావేశంలో బల్లగుద్ది - లండన్ లో ఇండియా హైకమిషన్ వారి సూచన మేరకే కాంట్రాక్టులు ఇచ్చామంటూ చూపించిన కాగితాలు ఫోర్జరీలనీ, తప్పుడు సమాచారమనీ తెలియకపోవడాన్ని మనం క్షమించాలి. వారి దగ్గర ఉన్న 'నమూనా ' బెల్లం అలాంటిది. సినీమాల్లో విందుల సీన్లూ, పాటలూ తీసేటప్పుడు మా ముందు స్వీట్లూ గట్రా పెడతారు. వాటిమీద ఫినైల్ లాంటివి జల్లిన సందర్భాలు నాకు తెలుసు - ఎవరూ కక్కుర్తి పడకుండా. లేకపోతే ప్రతీ మూడు గంటలకీ స్వీట్ల పళ్ళెం ఖాళీ అయిపోతూంటూంది. అలాగే సురేష్ కల్మాడీ గారి చుట్టూ ఫినైల్ జల్లిన 'నీతి 'ని పరిచి ఉంచారు - వారి అనుయాయులు. దూరంగా వారికి తెలియని స్థాయిలో లక్షరూపాయల ట్రెడ్ మిల్ పదిలక్షలకి కొనుగోలువంటి గోల్ మాల్ లు జరుగుతున్నాయని మనం గ్రహించాలి. ఏది ఏమయినా - నాకొక మధ్యే మార్గం కనిపిస్తోంది.మడిగట్టుకుని కల్మాడీని వెంటనే తొలగించాలన్నవారికీ, ఈ క్రీడలు అయిపోయాక తొలగిద్దామన్న వారికీ నాదొక రాజీ సూచన. మన ఘనత వహించిన నిజాయితీ పరులయిన ప్రధాని మన్మోహన్ సింగ్ గారో, సోనియాగారో కల్పించుకుని సురేష్ కల్మాడీని పిలిచి "బాబూ! మీరు అవినీతిపరులో కాదో ప్రస్తుతం తేల్చుకోలేం. తేల్చుకునే వ్యవధికూడా లేదు. కాని - పొగ వచ్చింది కనుక - నిప్పున్నదని నమ్ముతున్నాం. మిమ్మల్ని పదవి నుంచి తొలగిస్తున్నాం. అయినా పని చెడకూడదు కనుక క్రీడలు ముగిసేవరకూ బాధ్యతలన్నీ మీవే. అన్నీ అయాక - అప్పుడు విచారించుకుందాం. అంతవరకూ తమరు దొంగో కాదో తేలకపోయినా తాళం చెవులు మీకే ఇస్తున్నాం" అని చెప్పాలని నా రాజీ మార్గం. ఇందువల్ల నీతిపరులకు, క్రీడలు సజావుగా జరగాలని ఆశపడే 'వాస్తవ ' వాదులకూ - ఈ నలభై రోజులూ నిద్రపడుతుంది. క్రీడలు జరుగుతాయి - సీనియర్ దొంగగారే నిర్వహిస్తున్నారు కనుక. తీరా క్రీడలు ముగిశాక ఆయన దొంగ అని తేలిందాశిక్షలు పడినా తలదాచుకోడానికి మనకి బోలెడన్ని ఆసుపత్రులున్నాయి. కాదని రుజువయిందా 'పద్మభూషణ్ ' బిరుదు ఎప్పుడూ సిద్ధంగా ఉండనే ఉంటుంది. ఆగస్టు 09, 2010 ************ ************ ************* ************* |