Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
రెండు పుస్తకాలు- రెండు ప్రపంచాలు
అనుకోకుండా రెండు వేర్వేరు కారణాలకి రెండు విచిత్రమైన,
విభిన్నమైన పుస్తకాలను ఒకదాని వెంట మరొకటి చదివాను. ఒకటి: దలైలామా ఆత్మకథ
(మై లైఫ్ అండ్ మై పీపుల్, మెమొరీస్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా).
రెండోది: ఒక నేర పరిశోధకుడు హుస్సేన్ జైదీ రాసిన దావూద్ ఇబ్రహీం జీవిత కథ
(డోంగ్రీ టు దుబాయ్).
ఈ రెండింటిలో సామాన్య గుణాలేమిటి? ఇద్దరూ తమ మాతృదేశం నుంచి వెళ్లిపోయిన
కాందిశీకులు. దలైలామా టిబెట్ నుంచి భారతదేశం వచ్చారు. దావూద్ ఇబ్రహీం
భారతదేశం నుంచి పాకిస్థాన్ వెళ్లారు. ఒకాయన తన దేశం మీద జరిగిన దురాక్రమణ
నుంచి తలదాచుకోడానికి దేశం వదిలిపెట్టారు. మరొకాయన తన దేశంలో జరిపిన
నేరకాండ నుంచి తప్పించుకోడానికి దేశం ఎల్లలు దాటారు. ఇద్దరూ ప్రపంచ
వ్యాప్తంగా ప్రసిద్ధులు. ఫోబ్స్ పత్రిక దావూద్ ఇబ్రహీంని ప్రపంచంలోకెల్లా
అతి శక్తివంతులయిన వ్యక్తుల జాబితాలో 50వ స్థానంలో నిలిపింది. దలైలామా ఆ
జాబితాలో లేరు! చెడు విశ్వవిఖ్యాతిని సాధించింది. మంచి ఇంకా మరుగునే ఉంది!
దలైలామా సాక్షాత్తూ గౌతమ బుద్ధుని అవతారంగా ఆ దేశ ప్రజలు భావిస్తారు.
ఆరాధిస్తారు. ఇప్పటికీ ఆయన ధరమ్ శాల నుంచి తమ ప్రజల్ని పాలించే మహారాజే.
దావూద్ ఇబ్రహీం మాఫియా గాంగ్‌కి మహారాజు. దొంగరవాణాదారుడు. మాదకద్రవ్యాల
పంపిణీదారుడు. పట్టపగలే ఎన్నో హత్యలు చేయించాడు. కొన్ని చేశాడు. అతని
కార్యకలాపాలు ఎన్నో దేశాలలో నిర్విఘ్నంగా సాగుతున్నాయి. పాకిస్థాన్,
ఆఫ్ఘనిస్థాన్, ఇండోనీషియా, నేపాల్, థాయ్‌లాండ్, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్,
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్,
బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండియా. దావూద్ ఇబ్రహీం నిస్సందేహంగా
నేర చరిత్ర మూర్తీభవించిన అవతారం. దాదాపు నూరు హత్యలు చేయించిన ఘనత ఆయనది.
దలైలామా దయ, కారుణ్యం మూర్తీభవించిన వ్యక్తి. దావూద్ ఇబ్రహీం పగ, కార్పణ్యం,
అధికార వ్యామోహం మూర్తీభవించిన వ్యక్తి. దలైలామా ఓ మామూలు రైతుబిడ్డ. దావూద్
ఇబ్రహీం నిజాయితీపరుడైన ఓ పోలీసు కానిస్టేబుల్ కొడుకు. దలైలామాను పదవి,
అధికారం వరించింది. దావూద్ ఇబ్రహీం రక్తపాతంతో, దుర్మార్గంతో అధికారాన్ని
చేజిక్కించుకున్నాడు. దలైలామా చెప్పిన ఈ వాక్యం మరువరానిది. 'బాధ ఆనందాన్ని
తూకం వేసే కొలబద్ద' అని. కానీ దావూద్ ఇబ్రహీంకి 'హింస ఆనందాన్ని
చేజిక్కించుకునే మార్గదర్శి'. ఇద్దరూ కొన్నివేల మైళ్ల దూరంలో పొరుగు దేశాలలో
ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా లక్షలాది టిబెట్టన్లను చైనా
మట్టుబెట్టినా దలైలామా ఒకమాట అన్నారు: వస్తుత: చైనీయులు ఉత్తములు. కాని
పాలక యంత్రాంగంలో కొందరు వ్యక్తుల దుశ్చర్యల ఫలితం ఈ వినాశనం. ఆయన పుస్తకంలో
ఆఖరి మాటలివి: ''టిబెట్టు ప్రజల ఓర్పు సహనాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది.
మానవాళి అంతరంగాలలో నిజాయితీ, న్యాయదృష్టి మీద నా విశ్వాసం యింకా సడలిపోలేదు''.
దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర రాసిన రచయిత ఇలా అంటారు: దావూద్ ఇబ్రహీం పగని
దాటి చూడలేడు. తన చుట్టూ ఉన్నవారంతా తనకి కీడు తలపెట్టేవారేనన్న భయం కలవాడు.
వ్యక్తిగా హత్యలు చేసే ప్రవృత్తి అతనిది. వివేక రహితమైన ఆవేశం, ఆక్రోశం అతని
స్వభావం.
విచిత్రంగా ఒక్కసారి -ఒకే ఒక్కసారి -ఇద్దరి ప్రపంచాలూ ఒక సందర్భంలో
దగ్గరయాయి. ఇందులో ముఖ్య పాత్ర హిందీ సినీనటి మందాకినిది. ఆమె మీరట్
వాస్తవ్యురాలు. అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. ప్రముఖ నిర్మాత, నటుడు రాజ్‌కపూర్
తన చిత్రం ''రామ్ తెరీ గంగా మైలీ''లో నటించడానికి ఆమెని ఎంపిక చేశాడు.
తడిసిన బట్టల్లో ఆమె శరీరాన్నీ, అంగాంగాల్నీ చూసి దేశం మూర్చపోయింది. అతి
విచిత్రంగా నా సరసన 'సార్వభౌముడు' అనే బాలకృష్ణ చిత్రంలో నా ఉంపుడుకత్తెగా
నటించింది. మత్తెక్కించే అందం, కైపెక్కించే శరీరం ఆమె సొత్తు. ఒకసారి
షార్జాలో జరిగిన భారత -పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో ప్రేక్షకుల్లో
దావూద్ ఇబ్రహీం సరసన ఆమె కనిపించింది. పాత్రికేయులకు ఈ కొత్త సంబంధం -దాని
వెనక గల కథా చాలా ఆసక్తిని కలిగించింది. వివరాలను బయటికి లాగగా ఆమె పేరిట
బెంగుళూరు శివార్లలో ఓ తోట రిజిస్టర్ అయినట్టు బయటపడింది. తరువాత ముంబయి
సినీరంగం ఆమెని దూరంగా ఉంచింది. చిత్రాలు కరువయాయి. అయితే ఈ ఇద్దరి
ప్రపంచాలకూ ఈ పాత్రకీ ఏమిటి సంబంధం? చాలా సంవత్సరాల తర్వాత ఈ యాస్మిన్
జోసెఫ్ -ఊహించలేని వ్యక్తిని -దలైలామా అనుచరుడు డాక్టర్ కుగయూర్ రింపోచో
ధాకూర్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు. తనూ బౌద్ధమతాన్ని స్వీకరించింది.
తరతరాలుగా శాంతియుతంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే దేశం -టిబెట్
మీద దాడి చేసి, మత ప్రాతిపదికతో తమ మానాన తాము జీవించే ప్రజల మీద అమానుష
చర్యలను చైనా జరిపినప్పుడు, దలైలామా అన్న మాటలివి: ''హింస ఏనాటికీ ఆచరణ
యోగ్యం కాదు. అహింస ఒక్కటే నైతికమయిన ప్రత్యామ్నాయం... మమ్మల్ని
హింసించవచ్చు. తరతరాల మా వారసత్వాన్ని నాశనం చెయ్యవచ్చు. అయినా తలవొంచే మా
జాతి ధర్మాన్ని వదులుకోం''. దావూద్ సోదరుడు సబీర్‌ని శత్రువర్గం వారు
చంపినప్పుడు, ఇవీ దావూద్ కథని రాసిన రచయిత మాటలు: ''దావూద్‌లో క్షమించే
గుణం ఏకోశానికీ లేదు. తన తమ్ముడిని చంపిన ప్రతీ వ్యక్తినీ చంపి పగ
తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. దరిమిలాను అతన్ని చంపాడు. అతని శరీరం మీద
బులెట్ల వర్షం కురిపించాడు. చచ్చిన శవం మీద కాండ్రించి ఉమ్మాడు. తన సొంత
చేతుల్తో చంపే అవకాశం, చర్య దావూద్‌కి ప్రీతిపాత్రమైనది. కోపంతో అతనికి
విచక్షణా జ్ఞానం పోతుంది.''ఇటు ఓ మామూలు రైతుబిడ్డ భగవంతుడి అవతారమై
నిలిచాడు. అటు ఓ నిజాయితీపరుడి కొడుకు రాక్షసత్వానికి ప్రతిరూపమై
నిలిచాడు.మానవస్వభావం పరిపుష్టం కావడానికి పుట్టుక తప్పనిసరిగా ఏ కాస్తో
కారణమవుతుంది. కాని అంతకంటే పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వ్యక్తులూ
పూర్తిగా మన జీవికనీ, మన సంస్కారాన్నీ నిర్దేశిస్తాయి. ఇందుకు ఆదిశంకరుల
మాటే అక్షరాలా సాక్ష్యం చెప్తుంది. సత్సాంగత్యమే మనిషి ఎన్నో మెట్లు
ఎక్కించి జీవన్ముక్తిని కలిగిస్తుందన్నారు ఆదిగురువులు. ఇందుకు రెండు వైపులా
రెండు విభిన్నమైన ఎల్లలు ఈ ఇద్దరు వ్యక్తులూ, వారి జీవితాలూ. ఆగస్టు
06, 2012