Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
 డిమెన్షియా
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప కథల్లో ఒక కథ జర్మన్ రచయిత ఫ్రాన్స్ కాఫ్కా "ది మెటొమార్ఫొసిస్". ఒక రోజు కథానాయకుడు నిద్రలోంచి లేవగానే తను ఒక పెద్దు 'పురుగు' అయిపోయినట్టు భావిస్తాడు. అధివాస్తవికత, అద్భుతమైన 'సింబాలిజం'తో కథ సాగుతుంది. ఇప్పటికీ ఈ కథని ఎంతో మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నో రకాల రచనా రూపాలను ఈ కథ సంతరించుకుంది. ప్రపంచ సాహిత్యంలో ఇది చరిత్ర. ఇంతవరకూ దీని ప్రసక్తి చాలు.
ఇప్పుడింత గొప్ప కళాఖండాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం మరో గొప్ప కళాఖండం వంటి నాయకులు సురేష్ కల్మాడీగారు. వారు ఒక రోజు లేచిన వెంటనే వారికి 'మతి' మందగించి, చాలా విషయాలు మరిచిపోతున్నట్టు అనిపించింది. ఈ నిజాన్ని వారికంటే ముందు వారి న్యాయవాదులు గుర్తుపట్టారు. ఇది కాఫ్కా కథ స్థాయిలో గుర్తుంచుకోవలసిన విషయం.
వారికిప్పుడు 67 సంవత్సరాలు. అప్పుడప్పుడు తల తిరుగుతున్న మాట నిజం. ఒకొక్కప్పుడు - ముఖ్యంగా తీహార్ జైల్లో వారికి బోరింగుగా ఉంటోంది. ఆ మధ్య తన మిత్రులతో - అంటే తీహార్ లోనే ఉన్న లలిత్ భానోత్, వి.కె.వర్మ వంటివారితో కలిసి ఉంచమని జైలు అధికారులను కోరారు. అయినా వారు అంగీకరించలేదు. ఇప్పుడిప్పుడు వారికి 'మతిమరుపు' అనే రోగం మీదపడింది.
వారికి తాను సురేష్ కల్మాడీ అని గుర్తుంది. కామన్వెల్తు క్రీడలు చూచాయగా గుర్తుకు వస్తున్నాయి. గత నవంబరు 30 న ఢిల్లీలో సిబిఐ జరిపిన పదకొండు దాడులు బొత్తిగా గుర్తులేవు. స్విస్ సంస్థతో కుమ్మక్కయి ఫలహారం చేసిన 107 కోట్లు ఏదో పూర్వజన్మ స్మృతిలాగ ఉంది. టి.ఆర్.ఎస్. కాంట్రాక్టుల బాపతు 95 కోట్ల కుంభకోణం - అసలు గుర్తురావడం లేదు. మధ్య మధ్య టైంస్ నౌ వ్యాఖ్యాత ఆర్నాద్ గోస్వామి ముఖం జ్నాపకం వస్తోంది. ఎందుకు? స్పష్టంగా తెలియడం లేదు.
తీహార్ లో అప్పుడప్పుడు కనిపించే లలిత్ భానోత్, వర్మ ప్రభృతుల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఆస్ట్రేలియా దేశం - అక్కడి దొంగ కంపెనీలు - అబ్బే, అస్సలు గుర్తులేదు.
ఇది అసలు సిసలైన కాఫ్కా కథ. సందేహం లేదు. ఆ కథలో నాయకుడు గ్రిగోర్ శాంసా అచ్చం మన కల్మాడీ గారే. కవి కాలం కంటే ముందుంటాడంటారు. 2011 లో మనదేశపు రాజకీయ నాయకుడిని ఎక్కడో జర్మనీలో - 1915 లో ఒక రచయిత గుర్తుపట్టడం ఎంత విడ్డూరం! 1915లో కాఫ్కా సృష్టించిన 'పురుగు' పేరు సురేష్ కల్మాడీ!
మానవ స్వభావాల నైచ్యానికి ఎల్లలు లేవనడానికి ఇది గొప్ప ఉదాహరణ.
అయితే ఈ మతిమరుపు ప్రారంభం కావడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. కల్మాడీగారికి తాను పార్లమెంటు సభ్యుడినని గుర్తుంది. ఒకటో తారీకునుంచి పార్లమెంటు సభలు జరుగుతాయని జ్నాపకం ఉంది. అవినీతి పనులు చేసి జైలుకి వెళ్ళినా ఫలానా మధు కోడాలాగ, రాష్ర్టీయ జనతా దళ్ రాజేష్ రంజన్ లాగ రోజూ పార్లమెంటుకి వెళ్ళిరావచ్చుననే ఆలోచన ఉంది. అయితే గత 29 సంవత్సరాలలో వారు ఎన్నిసార్లు పార్లమెంటుకి వెళ్ళారు? వెళ్ళి ఏం ఉద్దరించారు? ఆ మాటే ఘనత వహించిన న్యాయమూర్తి అడిగారు. ఒక న్యాయమూర్తి ఇంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టిన సందర్భం నేనెరగను. అచ్చంగా వారి మాటలివి. "పార్లమెంటులో ప్రస్థుతం మీరు (కల్మాడీ) వెళ్ళకపోతే ప్రభుత్వం కూలిపోయేంత ముఖ్యమైన వ్యవహారం ఏమీలేదు". నమూనాకి కిందటి పార్లమెంటు సమావేశాల్లో కల్మాడీగారు ఎన్ని ప్రశ్నలు వేసి, ఏయే చర్చల్లో పాల్గొన్నారో సెలవివ్వమని అడిగారు.
ఈలోగా వారికి మతిమరుపు జబ్బు వచ్చింది.
కొందరికి 'మతి' పెట్టుబడి. మరికొందరికి సాకు. కల్మాడీ వంటివారికి అది చక్కని పలాయనం.
లలిత భానోత్ ని కలిసినప్పుడల్లా 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది' అంటున్నారట.
ఉన్నట్టుండి "అన్నట్టు క్రీడాకారుల మేజోళ్ళ కుంభకోణంలో మనకు కిట్టినదెంత?" అనడుగుతున్నారట.
"మేజోళ్ళు కావు బాస్ - ముఖం తుడుచుకునే గుడ్డలు" అని నాలిక కరుచుకుంటున్నారట భానోత్ గారు.
మధ్య మధ్య "నా పేరేమిటి?" అనడుగుతున్నారట.
ఈ విధంగా వారి 'మతి మరుపు' తీహార్ లో మూడు పువ్వులూ ఆరుకాయలుగా సాగుతోంది.
నిజానికి 'మతిమరుపు' నేరం చేసిన ప్రతివాడికీ వస్తుందని నా ఉద్దేశం. మొన్నమొన్నటిదాకా మన రాజాగారు తను నిర్దోషిననే అంటున్నారు కదా? లక్షా డెబ్బై ఆరు వేల కోట్లగురించి వారు మరిచిపోతున్నారు. మనం కళ్ళారా ముంబైలో మారణకాండను చూసినా అజ్మల్ కసాబ్ గారేమన్నారు? తను నిర్దోషిననే కదా? నేరస్థులందరికీ డిమెన్షియా ఉంటుంది. అది వారిలో సామాన్యగుణం.
ఒక్కొక్కప్పుడు ఈ జబ్బు దేశాలకీ వర్తిస్తుంది. కసాబ్ తమ దేశస్థుడన్న విషయం చాలాకాలం వరకూ పాకిస్థాన్ ప్రభుత్వం మరిచిపోయింది. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం గారి అడ్రసు ఆ ప్రభుత్వానికి గుర్తులేదు. టైగర్ మెమూన్! ఆ పేరెక్కడో విన్నట్టుందే!
మన రాజకీయ నాయకులందరికీ డిమెన్షియా ఉంటుంది. ఆ మధ్య చాలామందిని మన జాతీయ గీతం గురించి అడిగారు. కానీ చాలామంది మరిచిపోయారు. కొందరయితే రవీంద్రుడు రాశారని మరిచిపోయారు. బాబూ! ఇవి డిమెన్షియా లక్షణాలు - వాళ్ళ బుద్దిలోపం కాదని మనం గ్రహించాలి.
యెడ్యూరప్ప వంటి నాయకులు మంత్రులకి 'సిగ్గూ లజ్జా' ఉండాలని మరిచిపోయారు. చాలామందికి 'నీతి' అన్న పదానికి అర్ధం మరిచిపోయారు. ఈ దేశం జాతిపితని - మహాత్మాగాంధీని ప్రతీ సంవత్సరం 364 రోజులు మరిచిపోతోంది! వారు ఒకే ఒక రోజు గుర్తుకు వస్తారు.
అయితే నిన్ననే - కల్మాడీగారు తేరుకుని "నాకిప్పుడన్నీజ్నాపకం వస్తున్నాయి. మీరేమడిగినా చెప్పగలను. నా పేరే సురేష్ కల్మాడీ. నేను రోజూ కోల్గేటు తోటే పళ్ళు తోముకుంటాను" - ఇలా స్పష్టంగా ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఆవరణలో వాక్రుచ్చారు. అది ఈ దేశానికి శుభసూచకం.
నేరస్థుడికి తను చేసిన పని గుర్తులేకపోతే - గుర్తులేని పరిస్థితిలో అతని మనస్సు ఉంటే ఇంక ఆ నేరం చెల్లదు. ఇదీ న్యాయవాదులు ఎత్తు. పాపం. ఒక అవినీతిపరుడి 'సాకు'కి న్యాయవాదులు వెదికిన దొంగతోవ డిమెన్షియా.
కానీ ఈ దేశం యావత్తూ ఎన్నో రంగాలలో 'డిమెన్షియా'లో పడి చాలా ఏళ్ళయింది. 

 ***
ఆగస్టు 1, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage