Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here ఉంగరం గరంగరాలు ఈ మధ్య తమిళనాడులో అద్భుతమైన వితరణ జరుగుతోంది. నిన్నకాక మొన్ననే తమిళనాడు ఉపముఖ్య మంత్రి స్టాలిన్ గారు 3.67 లక్షల ఖర్చుతో 250 ఉంగరాలను పంచారు. ఎందుకు? తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లను పెట్టుకుంటే ఒక ఉంగరం యిస్తారు. మొదటి విడతలో తమిళరసి, తమిళరసు, తమిళ చెల్వన్, ఇళక్కియ, తెన్ మొళి, అరవిందన్, మణిమేఖలై-యిలాంటి రకరకాల పేర్లతో తమ పిల్లలకు బారసాలలు చేసి తల్లిదండ్రులు ఆనందంగా ఉంగరాలు సంపాదించుకున్నారు. ఇది చాలా విప్లవాత్మకమైన పధకం. భాషాభిమానానికీ, రాష్ట్రాభిమానానికీ చిహ్నం. అయితే యిలాంటి "సంతర్పణ’ని కరుణానిధిగారి హయాంలో ఆలోచించి వుంటే ఆయన ఒక ఉంగరం నష్టపోయేవారు. కారణం- వాళ్ళబ్బాయి పేరు స్టాలిన్ కనుక. ఇలాంటి ప్రోత్సాహం తెలుగు దేశంలోనూ జరగాలని నా కోరిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురోగతిని గుర్తించి తెలుగుదనం ఉట్టిపడే పేర్లు పెట్టుకున్నవారికి ఒక ఉంగరమో, చిన్న వెండి కడియమో, అదీ యిదీ కాకపోతే ఏడుకొండలవాడి ముద్రబిళ్ళో యివ్వాలి. తమిళనాడుకొ ఏమాత్రం తీసిపోని పేర్లు మన రాష్ట్రానికీ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరూ త్రిష, రుత్విక్, భిషక్, భుక్, తొక్ అని పేర్లు పెట్టుకుంటున్నారు. నేను తెలుగువాడిని కనుక- కొన్ని పేర్లు బొత్తిగా అర్ధం కావడం లేదు. దీని అర్ధం ఏమిటండీ అని మొన్న ఒక తండ్రిని అడిగాను. ఆయన గర్వంగా చిరునవ్వు నవ్వి- లలితా సహస్రనామంలో ఈ పేరు ఉందండీ.. అమ్మవారిని తాకే కాంతి కిరణాన్ని ఈ విధంగా పిలుస్తారు-అన్నాడు. నాకు ఆయన పాండిత్యానికి ఈర్ష్య, నా తెలివితక్కువ తనానికి బాధా కలిగింది. 48 సంవత్సరాల కిందట నేను రాసిన ’వెన్నెల కాటేసింది’ అనే నవలలో ప్రధాన పాత్ర పేరు సుబ్బులు. నేటి రచయితలయితే నికష్, వినిర్మిత్, సంగవిహీన్, పరిహ్రుత్- యిలాంటి పేర్లు పెట్టేవారేమో. నా అసమర్ధతకి ఆలశ్యంగా పాఠకుల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఏతావాతా-తెలుగు దేశంలో మన ప్రభుత్వం తెలుగు పేర్లను ప్రోత్సహిస్తే- తర్వాత బాబ్జీ, బుజ్జీ, చిట్టీ, బంటీ, గొంటీ అని పిలుచుకున్నా- పల్లెల్లోవారయితే- పుల్లయ్య, ఎర్రయ్య, వెర్రప్ప, వెంగళప్ప, తుప్పన్న, నారయ్య వంటి పేర్లు పెట్టుకోవచ్చు. కొద్దిగా చదువు వంటబట్టిన పట్నం మనుషులయితే- కాళహస్తి, తిరుపతి, అన్నవరం-అని క్షేత్రాల పేర్లతో పిలుచుకోవచ్చు. మరీ మతం మీదా, దేవుడిమీదా ముఖం మొత్తితే- విశాఖ, తుని, చంద్రగిరి వంటి పేర్లు పరవాలేదు. సాహితీపరులు పోతన్న, తిక్కన్న,ధూర్జటి, మల్లన్న వంటి పేర్లు పెట్టుకోవచ్చు మరి యిదివరకే పేర్లు పెట్టుకున్న వారి మాటేమిటి? నా పేరు మారుతి. రుష్యమూక పర్వత ప్రాంతాలలో కోతి పేరు. ఏ సింహాచలం కోతిగానో పేరు మార్చుకోవలసి వుంటుంది. తమిళనాడు ప్రభుత్వం ముందు ముందు ఆ పురోగతిని సాధిస్తుందనడంలో నాకే అపనమ్మకం లేదు. ఈ మార్పుల ప్రకారం సర్ సి.వి.రామన్ పేరు మార్చి- సర్ సి.వి.అన్బళగన్ గా మార్చవచ్చు. గణిత శాస్త్ర నిధి రామానుజం పేరు బొత్తిగా బీహార్ వాసన కొడుతోంది కనుక అ పేరు నల్ల చెళ్వమ్ గా మార్చుకోవచ్చు. చిన్నప్పుడు మా పెదనాన్న పార్వతీపురం నుంచి వచ్చేవాడు. నన్ను దగ్గర కూచోపెట్టుకుని మా నాయనమ్మని- అంటే వాళ్ళమ్మని బూతు తిడితే అణా యిచ్చేవాడు. ఇది అయనకి వినోదం. నేను పుష్కలంగా బూతులు మాట్లాడి జేబు నిండా డబ్బులు సంపాదించేవాడిని. ఆ దశలో నా స్థాయి- నా కంటే పెద్దవారి ప్రోత్సాహం. తద్వారా వచ్చే ప్రశంస. బహుమతి. ఇది పసివాడిలో కుసంస్కారానికి పెట్టుబడి. దీనికీ స్టాలిన్ గారి ఔదార్యానికీ పెద్ద తేడా లేదు. ఒక నాయకుడు- ప్రాంతీయ అభిమానానికి యిచ్చే ప్రతిఫలం- క్రింది స్థాయివాడిని అకర్షిస్తుంది. అలరిస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలను తీరుస్తుంది. ఆ పని నాయకుడే చేస్తుంటే మజాగా వుంటుంది. కాని ప్రాంతాన్ని దాటి దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడానికి నాయకత్వంలో ఔద్ధత్యం కావాలి. మహాత్ముడు కావాలి. వివేకానంద కావాలి. ఇంకా అలౌకికమైన సంస్కారానికి మనిషిని ఉత్తేజపరచడానికి రమణ మహర్షి కావాలి. కబీర్ కావాలి. తులసీదాస్ కావాలి. రాముడినీ కృష్ణుడినీ, హనుమంతుడినీ, గాంధీ, నెహ్రూలనూ యింటింటి పేర్లుగా సంస్కృతిలో భాగంగా నిలపడానికి బదులు ప్రాంతీయ తత్వానికి పాచికలుగా చేసే నాయకుల దశకి ఈ దేశం ప్రయాణం చేసింది. అచిరకాలంలో- మనుషుల, భాషల, ప్రాంతాల, కులాల, నదుల మధ్య గోడలు బలమయి, తమ హక్కులయి- గర్వపడే శక్తిగా మారి స్థిరపడతాయి. అలాంటి దయనీయమయిన దశలోనే ఒకప్పుడు బుడతకీచులు, ఈస్టిండియా కంపెనీవారూ మన దేశాన్ని కొల్లగొట్టడానికి విజయవంతంగా దిగబడ్డారు. చరిత్ర పునరావృతానికి యిప్పుడిప్పుడే వేళ్ళు నాటుతున్నాయి. ఈ నాటి ఉంగరాలు ఆ దుర్దశకి పెట్టుబడులు.
|