Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here

 

"కోమాలో" మన దేశం

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                       

   
కొన్ని రోజుల కిందట భారత పరిశ్రమ సమాఖ్య యూరోపు విభాగపు డైరెక్టర్ మోహన మూర్తి అనే ఆయన జర్మనీలో  ఒక చర్చ కార్యక్రమంలో పాల్గోన్నారట.  ఆ చర్చలో పాల్గొన్న వారంతా ఈ మూర్తి గారిని చూసి "ఏం  బాబూ! మీ దేశం కోమాలో ఉందా?  కళ్ళు తెరుస్తోందా ?" అని వెక్కిరించి ముక్కుమీద వేలేసుకున్నారట.  వాళ్లు చెప్పే వివరణలు వింటూ ఈయన తెల్ల మొహం వేసారట.  మూర్తి గారికి సరైన అనుచరులు లేరు.  నన్ను తీసుకెళ్ళి వుంటే - యూరోపు ప్రముఖుల కళ్ళు తెరిపించే లాగ - మనవాళ్ళు "కళ్ళు" తెరుచుకునే ఉన్నారని చెప్పి ఒప్పించేవాడిని.

ఇక్కడ మచ్చుకి కొన్ని సాంపిల్ ఉదాహరణాలు:
 -  2009 నవంబర్ 10 న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ఘనత వహించిన శాసన సభ్యులు టేబిళ్ళ మీద ఉన్న మైకుల్ని పెకిలించి కొట్టున్నారు.  టేబిళ్ళు ఆకాశంలోకి లేచాయి.  కారణం - మహారాష్ట్ర అసెంబ్లీ లో మరాఠి భాష రాని ఒకాయన జాతీయ భాష హిందీలో ప్రమాణస్వీకారం చేసారు.  అక్కడ నవ నిర్మాణ సమితి అల్లరి చేసింది.  అది తుంటి.  ఇక్కడ పళ్ళు రాలాయి.
-  మన దేశం లో నాయకులు గడ్డి తింటారు, ఎరువులు తింటారు.  బొగ్గు తింటారు.  ఓడిషలో (ఒరిస్సా) నగరాభివృధి మంత్రి బదరీ నారాయణ్ పాత్రా, విద్యా మంత్రి ప్రతాప్ జెనా కోట్ల బొగ్గు తిన్నారని కాంగ్రెస్ శాసన సభ్యులు అలజడి చేసి చర్చ జరగాలన్నారు.  స్పీకర్ ఒప్పుకోలేదు.  అప్పుడు కాంగ్రెస్ నాయకులు సరాసరి స్పీకర్ టేబిల్ దగ్గరికి వెళ్లి - అంతా మూక ఉమ్మడిగా స్పీకర్ టేబిల్ మీదకి ఎగబ్రాకారు.  ఈ సుందర దృశ్యాన్ని స్పీకర్ గారు, మార్షల్స్ చూస్తూ ఆనందించారు.  దేశమూ నాయకుల "ఎగబ్రాకే" ప్రతిభకు ముచ్చట పడింది.
- ఈ మధ్యనే గనుల కుంభకోణం మీద దర్యాప్తు జరగాలంటూ కర్ణాటక అసెంబ్లీ లో కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు.  స్పీకర్ సభను వాయిదా వేసారు.  కాని నిజాయితీపరులయిన  కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ లోనే కాఫీ, ఫలహారాలు, సమోసాలు తింటూ, భోజనాలు చేస్తూ వినోదంగా గడిపారు.  ఒక నాయకుడు శేషతల్పం మీద పడుకున్నట్లు అసెంబ్లీ నేల  మీదే నిద్రించాడు.  రాజకీయాలలో ఇలాంటి సుఖాలు కలసి వస్తాయని తెలియని నాలాంటి అభాగ్యుల కన్నుకుట్టేలాగా - వారంతా విలాసంగా గడిపారు.  ఈ సుందర దృశ్యాన్ని దేశమంతా చూసింది.

- నిన్నటికి నిన్న బీహార్ ప్రభుత్వం 11,412  కోట్లను అభివృద్ధి కార్యక్రమాల మిషతో మింగేసిందని నిజాయితీ పరులయిన ప్రతిపక్షాల నాయకులు - బల్లలతో కుర్చీలతో కొట్టుకున్నారు.  ఈ సభకి అధ్యక్షత వహించే స్పీకర్ గారి మీద - కెమెరాల సమక్షంలోనే ఓ నాయకుడు చెప్పులు విసిరాడు.  (అయితే బుష్షు గారి మీద బూట్లు విసిరినా సందర్భం గుర్తుంచుకోవాలని ఈ జర్మనీ పెద్ద మనుషుల్ని కోరుతున్నాను). - ఒక శాసన సభ్యురాలు మార్షల్స్ మీద తొమ్మిది పూల కుండీల్ని విసిరి వీరావేశాన్ని చూపింది.  తనని వారు చంపబోయారని ఈ "అమాయకురాలు" వాక్రుచ్చింది.  అసెంబ్లీ లోనించి వీరందిరిని మార్షల్స్ మోసుకు వస్తుండగా - వారంతా ఆనందంగా, చిరునవ్వులు ఒలికిస్తూ గంజి కావిడిలో తరలారు.

మన నాయకులు నిద్రపోతున్నారని, దేశం కోమాలో ఉన్నదనడానికి ఈ యురోపియన్ ప్రతినిధులకు ఎన్ని గుండెలు?
 - గుజరాత్ లో హోం మంత్రి గారు (అమిత్ షా గారు) టెర్రరిస్టు సలావుద్దీన్ హత్యకు స్వయంగా నడుం కట్టారు.
- గోవా లో మరో మంత్రి గారు తనే ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె చావుకు కారణమయ్యారు.
- ఈ దేశంలో జాతీయ స్థాయి హాకీ కోచ్ కౌశిక్ గారు హాకీ ఆడే అమ్మాయిల్ని పరుపు చూపించి సరసానికి దిగుదామని ఊరిస్తున్నారు.
-హైదరాబాదులో ఓ ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్ గారు 11 వ తరగతి చదువుచున్న 17 ఏళ్ల అమ్మాయిని కేవలం 20  సార్లు మాత్రమే "రేప్" చేసాడు.
- గుజరాత్ లో అక్రమంగా గనులు తవ్వే ముఠా బయట పెట్టబోయిన అమిత్ జత్వ ని ఎవరు హత్య చేసారో ఇంకా తేలలేదు.
- ఆ మధ్యనే రాగ్గింగ్ చేసి జూనియర్ కుర్రాణ్ణి  (కచ్చూ) కొట్టి చంపిన నలుగురు సీనియర్ కుర్రాళ్ళు ఇప్పుడిప్పుడే బెయిల్ మీద బయటికి వచ్చారు.
తెల్గీలు, రాజాలు, సత్యనారాయణ రాజులు, ప్రవీణ్ తోగాడియాలు, మాధురీ గుప్తాలు మాకు బోలెడంత మంది ఉన్నారు.  ఈ ఆనంద పారవశ్యంలో నిద్రపోవడానికి టైం చాలడం లేదు.  కోమాలోకి ఎలా జారుకుంటామని  - పాపం - మోహన్ మూర్తి గారికి చెప్పడం తెలియలేదు.

భారత దేశంలో అవినీతి సర్వాంతర్యామి.  అది జోకొట్టే  నిద్ర మాత్ర కాదు. నాజూకుగా కాటు వేసే కాలకూట విషం.  మన నాయకులే ఈ విషాన్ని ఉదారంగా వితరణ చేస్తున్నారు.  ఈ సమాజం నీతి వేళ్ళల్లో కుళ్ళిపోతోందని రేపు చెట్టు కూలిపోయే వరకు ఎవరు గుర్తించడం లేదు.  అప్పటికి వేళ మించి పోతుంది.

                                                         జూలై 26, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage