Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
దౌర్జన్య కారులకు ఓ బహిరంగలేఖ
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
ప్రియమైన
సోదరులారా!
ఈ మధ్య కాలంలో మీ గురించి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నట్టు మా తల్లిదండ్రులు,
ఆత్మీయుల గురించి కూడా ఆలోచించడంలేదు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి.
పాకిస్థాన్ మిత్రులకి 'కాశ్మీర్' ఊతపదం. కానీ మాకు మీ దౌర్జన్యకాండలు ఊతపదం.
అయితే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మీలో చిన్న అవగాహనా లోపం ఉంది.
దాన్ని తొలగించడానికే ఈ ఉత్తరం. చిత్తగించండి.
మా దేశంలో నాయకులూ, ప్రభుత్వమూ, ప్రజలూ మీ బాంబు పేలుళ్ళకీ, ప్రాణ నష్టానికీ
చలిస్తారని మీకో దురభిప్రాయం ఉంది. కానీ వాళ్ళకి ఎంతమాత్రం లక్ష్యం లేదు.
ఎందరు పోయారో, ఎక్కడ పోయారో చూసి మరిచిపోతారు. మా దేశంలో జననష్టానికి
బొత్తిగా విలువలేదు. నేలబారు మనుషులు చచ్చిపోవడం వల్ల ఎవరికీ, ఏమీ కాదు.
నాయకులు ఇలాంటప్పుడు సాధారణంగా చెప్పే మాటలున్నాయి. "మన ప్రజలు ఇలాంటి
పిరికి దెబ్బలకు లొంగరు. మన ఆత్మస్థైర్యం గొప్పది" అంటారు. ఈ బూతు మాట వారి
ఊతపదమని తమరు గ్రహించాలి. దుండగుల్ని పట్టుకుని తీరుతామని చెపుతారు. వాళ్ళలా
చెపుతున్నప్పుడే చేసే నమ్మకం లేదని వాళ్ళ మొహాల్లో మనకు తెలుస్తూంటుంది. ఆ
మధ్య మీరు కష్టపడి కొన్ని వందల మందిని ముంబైలో చంపారు. "మా ముంబై ఇలాంటి
దాడులకు లొంగదు. నిలదొక్కుకుంటుంది. మరునాటికే మామూలు జీవనం కొనసాగిస్తుంది"
అని నాయకులు బోర విరిచారు. అంతకంటే నేలబారు మనిషికి మరోగతిలేదుకదా? వాడి
దినచర్య నడవకపోతే నోటి దగ్గర కూడు పడిపోతుంది. కనుక తప్పనిసరిగా చావును
లెక్కచెయ్యక వీధిని పడతాడు. అది ఈ ప్రజల గొప్పతనం కాదు. నిస్సహాయత. అక్కడితో
అంతా మరిచిపోతారు. కనుక మీరు చేస్తున్న పని బూడిదలో పోసిన పన్నీరవుతోందని
గమనించవలసిందిగా నా ప్రార్ధన.
కాకపోతే మీ దాడుల వల్ల ఛానళ్ళ వ్యాపారం పెరుగుతుంది. వాళ్ళ ప్రకటనలు గొప్ప
గొప్ప ధరలకి అమ్ముడుపోతాయి. గొప్ప గొప్ప నాయకులు, పోలీసు అధికారులు పదే పదే
మైకుల ముందుకు వస్తారు. వాళ్ళ గ్లామరు పెరుగుతుంది. నిముషాల్లో నిజానిజాలు
ఎలా తేల్చేస్తారో - ఎవరు ఈ దాడులు చేశారో మాకు పూస గుచ్చినట్టు చెప్ఫేస్తారు.
వీటి వల్ల మీకు ప్రచారమొస్తుందని మీరు భావిస్తే మీతో నేను ఏకీభవిస్తాను.
ఏమయినా ఘోట్కపర్, ములంద్, కొలాబా, దాదర్, వర్లీలలో చిన్న చిన్న పేలుళ్ళు
పెద్ద స్పందన కలిగిస్తాయని తమరు నమ్ముతున్నారు. కానీ మేము వాటికి అలవాటు
పడిపోయాం.
మీ సోదరులు దొరికితే మేం ఏమీ హాని చెయ్యమని మనవి చేస్తున్నాను. కోట్ల ఖర్చు
పెట్టి, పువ్వుల్లో పెట్టి కంటికి రెప్పలాగ కాపాడుకుంటాం. మాది కర్మ భూమి
అని తమరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇంకా గ్రహించకపోతే అజ్మాల్ కసబ్, అఫ్జల్
గురు సోదరులని అడిగి తెలుసుకోండి.
ఒక్కటి మాత్రం మీరు సరిగ్గా అర్ధం చేసుకున్నారు. మాకు స్వాతంత్ర్యం వచ్చాక
పోలీసుల్ని గస్తీ తిప్పే శ్రమ నుంచి మా నాయకులు తప్పించారు. కాగా రోడ్డు
మీద, మార్కెట్లలో చెత్తకుప్పల్ని పెంచే హక్కుమాకుంది. కనుక - చెత్తకుండీల్లో,
పాడయినస్కూటర్లలో, విరిగిన సైకిళ్ళలో చిన్న చిన్న బాంబులు పెట్టే సౌకర్యం
మీకు కలిసివస్తుంది. బాంబులు పేలగానే వర్షం పడగానే కలుగులోంచి బయటకు వచ్చిన
చీమల దండులాగ పోలీసులు వచ్చిపడతారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు.
ఎందుకు? ప్రత్యేక భద్రత. ఎవరికి? ప్రజలకి కాదు. ఈ వినోదం చూడడానికి వచ్చే
నాయకులకి. నాయకులు వెళ్ళిపోగానే పోలీసులూ మాయమౌతారు. ఎక్కడికి? వాళ్ళ వాళ్ళ
సౌకర్యాల మేరకి. చావు కబుర్లు చల్లగా చెప్పిన ఛానళ్ళు మళ్ళీ తమరు కొత్త
కథల్ని ఎప్పుడు సృష్టిస్తారా అని ఎదురు చూస్తుంటాయి.
మరో పొరపాటుని మీరు గమనించాలి. మొన్న ముంబైలో సీరియల్ పేలుళ్ళు జరిపారు.
వెంటనే తమరు రెండు రోజులు శలవు తీసుకున్నారు. అక్కడే మీరు పప్పులో
కాలేస్తున్నారు. వెంటనే మా నాయకులు ఆసుపత్రుల చుట్టూ మూగి విరిగిపోయిన
చెయ్యిల్నీ, పగిలిపోయిన తలల్నీ నిమురుతున్నప్పుడు తమరు దెబ్బకొట్టాలి. నేను
ఇలా చెపుతున్నప్పుడు దేశద్రోహిగా మీకు కనిపించవచ్చు. కారణం - మా నాయకులు
వారికి అన్యాయం జరిగినప్పుడే స్పందిస్తారు.
వాళ్ళమాయిలు, బంధువులు జైళ్ళకు వెళ్ళినప్పుడే వారిలో చలనం కనిపిస్తుంది. మా
కరుణానిధిగారు జీవితంలో ఏనాడయినా చెన్నైలో పుగల్ జైలుకి వెళ్ళినట్టు మనం
విన్నామా? ఈ మధ్య తీహార్ జైలుకి మీనాక్షి దేవాలయానికి వెళ్ళినంత విరివిగా,
భక్తితో వెళ్ళున్నారని తమరు గ్రహించే ఉంటారు. అల్లప్పుడు ఎప్పుడో కాశ్మీర్
హోం మంత్రి కూతుర్ని తమరు ఎత్తుకుపోయినప్పుడు కేంద్రం ఎలా స్పందించిందో తమకు
గుర్తుండే ఉంటుంది.
మామూలు మనుషులు చచ్చిపోతే, గాయపడితే నలుగురూ వింటారు, వెంటనే మరిచిపోతారు.
పండగ తర్వాత పాచి అన్నం అది. రాజీవ్ గాంధీతోపాటు చచ్చిపోయిన 18 మంది పేరుని
- నెలల కొద్దీ పరిశోధన చేసిన కార్తికేయన్ గారిని చెప్పమనండి. మూడు పేర్లు
చెపితే ఆయనకి పద్మభూషణ్ ఇవ్వవచ్చు.
పాకిస్థాన్ పేలుళ్ళలో అక్కడ మా దేశంలో లాగే ముక్కూ మొహం తెలీని మనుషులు
పోతున్నారు. అందువల్ల అక్కడి నాయకులకూ చీమకుట్టినట్టు ఉండదు. పైగా మాకూ మా
దేశంలో 'తలనొప్పి' ఉందని చెప్పుకోడానికి మీ దేశం నాయకులకి ఆ మాత్రం ప్రాణ
నష్టం ఉపయోగపడుతోంది. నిజానికి ఈ చావుల్ని అక్కడి నాయకులు కొంగు బంగారం
చేసుకుంటున్నారని ఒక అపప్రధ ఉంది. అలాగే మా దేశంలో పేలుళ్ళు పాకిస్థాన్ని
తిట్టడానికి ఉపయోగిస్తాయి.
ఒక్క విషయం మా కర్ధమౌతోంది. చచ్చిపోతే తమకు ఈ 'జిహాద్'లో వీరస్వర్గం తప్పదని
మాకు తెలుసు. బతికుంటే మా జైళ్ళలో మీరు సమస్త భోగాలూ అనుభవిస్తూ ఉండవచ్చునని
మీకు తెలుసు. ఎప్పుడయినా మీ సోదరులు కరుణిస్తే ఖాందహార్ దాకా మా మంత్రులు
మీ మనుషుల్ని తీసుకువచ్చి సమస్త రాజమర్యాదలతో అపపించే ఔదార్యం మాకుందని మీకు
తెలుసు.
కనుక కేవలం మా నాయకుల దర్శనానికీ, మా ఛానళ్ళ వ్యాపారానికీ మీ బాంబుల్ని వృధా
చేసుకోవద్దని చెప్పడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ముందు ముందు కొత్త
బాంబుల్ని తెలివిగా వినియోగించమని, నేలబారు మనుషుల మీద వృధా చెయ్యవద్దని నా
మనవి.
(ఎకనామిక్స్ టైంసులో పాత్రికేయుడు జైతీర్ధరావ్ స్ఫూర్తితో)