హత్యలు చేసినందుకు, ఏసిడ్ ముఖం మీద జల్లినందుకు, ప్రజల సొమ్ము
దోచుకున్నందుకు, ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టినందుకు -అలవోకగా కీర్తి
ప్రతిష్టలు పెరిగి రోజూ పత్రికలలో దర్శనమిచ్చే ప్రాచుర్యం పెరుగుతున్న ఈ
రోజుల్లో 40 ఏళ్ల కిందట యివేవీ చెయ్యకుండానే మంచిమాటతో, పాటతో, చక్కని నటనతో
4 దశాబ్దాల పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిన ఓ సరళమయిన సినీ నటుడి కథ ఈ మధ్యనే
ముగిసింది. ఆయన రాజేష్ ఖన్నా. రాజేష్ ఖన్నా రాజ్‌కపూర్ లాగ అన్ని సినీ
విభాగాలనూ ఔపోశన పట్టిన నటుడు కాదు. దిలీప్‌కుమార్ లాగ సమగ్రమైన నటుడు కాదు.
దేవానంద్‌కి ఉన్నంత అందం, స్టైల్ ఉన్నవాడు కాదు. కాని వీరందరిలో ఉన్న
కొన్ని ప్రత్యేకతల్ని కలబోస్తే రాజేష్ ఖన్నా అవుతాడు. ఆయన కన్ను
మూసినప్పట్నుంచీ యిప్పటిదాకా ఆయన ప్రతిభను నెత్తికెత్తుకుంటున్నవారంతా
చెప్పని ఒక విషయం ఒకటుంది. అలనాడు రాజేంద్రకుమార్ అనే నటుడు పట్టుకున్నదంతా
బంగారమయినట్టు (ఆయనకు సిల్వర్ జూబ్లీ హీరో అనే పేరుండేదంటారు) ఓ దశలో హిందీ
చలన చిత్రరంగంలోని బంగారమంతా రాజేష్‌ఖన్నా చిత్రాలలోనే పెట్టుబడి జరిగింది.
ఎస్.డి.బర్మన్, సలీల్ చౌదరి, ఆర్.డి.బర్మన్, కళ్యాణ్‌జీ ఆనంద్ జీ వంటి
హేమాహేమీలు చలన చిత్రరంగంలో అజరామరం చేసిన బాణీలు, గుల్జార్, గుల్షన్
ఆనంద్ వంటి రచయితల రచనలు, ఆనంద బక్షీ, గుల్జార్, యోగేష్, ఇందీవర్ వంటి
కవుల కలాలు, ముఖేష్, కిశోర్‌కుమార్, రఫీ వంటి గళాలు, హృషీకేష్ ముఖర్జీ,
శక్తి సామంత వంటి దర్శకుల కళాత్మక కృషీ -ఇన్నింటి కలబోత రాజేష్ ఖన్నా అనే
హీరో విజయానికి దోహదకారులు. మళ్లీ హృషీకేష్ ముఖర్జీ, శక్తి సామంత యిద్దరూ
రెండు ధోరణులకు ప్రతినిధులు. ఆనాటి 'ఆనంద్', 'ఆరాధన' ఓ నటుడిని చరిత్రగా
మలిచాయి. ఆయన్ని ఆకాశంలో నిలిపాయి. 'సూపర్ స్టార్' అనేమాట ఆయన కోసమే,
ఆయనతోటే పుట్టింది. అభిమానుల ఆరాధన అంచుల్ని చూసిన, లేదా అంచుల్ని చూపిన
ఘనత రాజేష్‌ఖన్నాది. 1969 ప్రాంతాలలో ఆయన భారతదేశంలో లక్షలాది మందికి దేవుడు.
ఆయన కారు నడిచిన నేలమీది మట్టిని తలమీద పెట్టుకున్న వీరాభిమానులూ, ఆయన
పటానికి తాళికట్టించుకున్న అమ్మాయిలు, తమ రక్తంతో ప్రేమలేఖలు రాసిన పిచ్చి
ప్రేమికులూ -ఇది కనీ వినీ ఎరగని మత్తు. ఆవేశం.
తర్వాత కథలూ, పాటలూ సినిమా రాణింపుకి కారణమయిన రోజులుపోయి, పాత్రీకరణలూ,
సన్నివేశాలూ సరిపోయే (స్పాట్ ఇంట్రెస్ట్) సినిమాల రోజులు వచ్చాయి. యాంగ్రీ
యంగ్‌మాన్ కథలు (జంజీర్, దీవార్, త్రిషూల్) ట్రిక్కులూ, కిక్కులూ
చెల్లిపోయే రోజుల్లో రాజేష్ ఖన్నా శలవు తీసుకున్నాడు. పాట కథలో భాగమయిన
చిత్రంలో కథకి ప్రాణం వస్తుంది. పాట మాత్రమే అలరించే స్థాయిలో (ఐటెమ్
సాంగ్స్) సినిమాకి ఆకర్షణ వస్తుంది, డబ్బు వస్తుంది. కాని చిత్రానికి జబ్బు
వస్తుంది. ప్రసార మాధ్యమాలు పెచ్చురేగిపోయిన రోజుల్లో ఆకర్షించే చిత్రాలే
వస్తాయి. నోరున్న, డబ్బున్న నిర్మాతలూ ఆకర్షణని సొమ్ము చేసుకుంటారు. అదే
ఆనాటి సూపర్ నటులకీ, ఇప్పటికీ తేడా. ఇప్పుడు అక్కినేని, ఎన్టీఆర్, దిలీప్,
రాజ్‌కపూర్, రాజేష్‌ఖన్నాలను చూడలేము. బాక్సాఫీసులను బద్దలు కొట్టడాన్ని,
టీవీ తెరలమీద వ్యాపారాన్ని చూస్తాం. మారే కాలంతో పాటు మాధ్యమమూ మారుతుంది.
అది సహజం. రాజేష్ ఖన్నా ఆనాటి, మన్నికయిన సూపర్ హీరో. అందుకే ఒక ఎన్టీఆర్‌కీ,
ఒక శివాజీకీ, నిన్న రాజేష్‌ఖన్నాకీ అంత స్థాయిలో అభిమానులు నివాళులర్పించారు.
ముందు ముందు అలాంటి అభిమానాన్ని చూడం.
కర్ణుడిలాంటి మహావీరుడికి పదిరకాలయిన అనర్థాలు తోడయి రణరంగంలో పరాజితుడయాడు.
రాజేష్‌ఖన్నా పదిరకాలయిన ప్రతిభల సమ్మేళనానికి ప్రతీక. దాన్ని అదృష్టమని
ఒక్కమాటలో కొట్టిపారేయడానికి వీలులేదు. సునీల్‌దత్ ఆయనకంటే అందగాడు.
శతృఘ్నసిన్హా ఆయనకంటే క్షుణ్ణంగా నటనని ఎరిగినవాడు. కాని ఓ నటుడు 'సూపర్
స్టార్' అనిపించుకోడానికి ఇవి మాత్రమే చాలవు. తెలుగు సినిమాలో అందమయిన
నటుల్లో రామకృష్ణ నాకెప్పుడూ గుర్తుకొస్తాడు. కాని బహుళ ప్రాచుర్యాన్ని
సాధించడం వేరేకథ. ఆ 'కెమిస్ట్రీ' కి కేవలం అదృష్టం అని సరిపెట్టుకోవడం
దొంగదారి వెదకడం లాంటిది. రాజేష్ ఖన్నా తన కీర్తిని అతి సహజంగా
నిలుపుకున్నాడు. భేషజాలు లేకుండా గడుపుకున్నాడు. ప్రజల మధ్య క్రమంగా
గోమతేశ్వరుడిలాగ పెరిగాడు.
'ఆనంద్' చేస్తున్నప్పుడు -ఆనాటి అద్భుతమైన హిట్‌ల మధ్య హీరోయిన్ కూడా లేని,
చివరలో చచ్చిపోయే పాత్రని చేస్తున్నందుకు ఇబ్బంది పడేవాడట రాజేష్ ఖన్నా.
పది గొప్ప ఆనందాల్ని ఒకే ఒక్క విషాదం తలదన్నుతుందని ఎరిగిన ఒక గొప్ప
దర్శకుని చేతుల్లో -అయిదారు దశాబ్దాలు పైగా ప్రాణం పోసుకు బతికే గొప్ప
దృశ్య కావ్యం తయారవుతోందని ఆయనకి తెలీదు. ఆ మాటకి వస్తే హృషీకేశ్ ముఖర్జీకీ
తెలీదు. వండే పాయసంలో ప్రతీ జీడిపప్పు రుచీ ఎవరూ పసిగట్టలేరు -వండే మనిషితో
సహా. మరో గొప్ప పార్శ్వం -ఆయన కీర్తి ప్రతిష్టలనే గొప్ప పర్వతాన్ని గర్వంగా
అధిరోహించాడు. కాని కొండ దిగడానికి ఇష్టపడలేదు. అశోక్ కుమార్‌లాగనో,
అమితాబ్ బచ్చన్‌లాగనో కారెక్టర్ పాత్రలు నటించలేదు. హీరో దశ గడిచాక పక్కకి
తప్పుకున్నాడు. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో అలాంటి పని చేసిన
హీరోయిన్లు ఇద్దరే ఇద్దరు -గ్రేటా గార్బో, సాధన. రాజేష్ వృద్ధాప్యాన్ని ఈ
మధ్యనే దేశం చూసింది. ఆయన మాసిన గెడ్డాన్ని ఆ తరం ఏనాడూ చూడలేదు.
''మీరు సూపర్ స్టార్ కాదని మీకు ఎప్పుడు అర్థమయింది?'' అని ఎవరో అడిగారట.
''రోజూ నా యింటికి ట్రక్కుల్లో వచ్చే పూల గుత్తుల సంరంభం ఆగిపోయినప్పుడు''
అన్నారట రాజేష్ ఖన్నా.
'ఇక చాలు' అనడం జీవితంలో గొప్ప సంస్కారం. దాన్ని వయస్సో, అసమర్థతో,
ప్రేక్షకులో నిర్దేశిస్తారు. చివరి దశలో ఎదురయిన విషాదాన్ని -కేన్సర్‌ని -ప్రపంచం
ముందు పరచకుండానే తన పాత్ర 'ఆనంద్' అంత హుందాగా నిష్క్రమించిన మొదటి సూపర్
స్టార్ రాజేష్‌ఖన్నా.
ఆయన కన్ను మూశాక కూడా ఆయన పంచిన ఆనందాన్నే అభిమానులు గుర్తుచేసుకున్నారు.
ఆయన దయనీయమయిన దురదృష్టాన్నో, ఆఖరి రోజుల యాతననో కాదు. అది ఆయన డిగ్నిటీకి
ఉదాహరణ. మృత్యువుని కేవలం నిష్క్రమణకి సంకేతంగా మాత్రమే నిలిపిన కారణజన్ముడు
-ఆ కారణానికీ 'సూపర్ స్టార్' రాజేష్‌ఖన్నా.