Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here

 

మతం - హితం

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                       

మధ్య పూణే వెళ్ళాను. అక్కడొక వింత దృశ్యం నన్నాకర్షించింది. నిజానికి ఎవరినయినా ఆకర్షించేదృశ్యమది. స్కూటర్ల మీద తిరిగే అమ్మాయిలందరూ కళ్ళుమాత్రం కనిపించేలాగ ముఖమ్మతా గుడ్డల్ని చుట్టుకుని ఉన్నారు. సరే. ఆరోగ్య  సూత్రాల ప్రకారం బొగ్గుపులుసు వాయువుని పీలుస్తున్నారనుకుందాం. కళ్ళు మాత్రమే కనిపించే ముసుగు దేనికి? రోడ్డు మీద దుమ్ము దూసర వారు ముక్కుపుటాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తట. ఇది చాలా విడ్డూరమైన దృశ్యం. మా మిత్రుడిని అడిగాను. ఆయన  నవ్వి కొన్నాళ్ళ క్రితం ఇదే అనుమానం కొత్తగా వచ్చిన నగర కమీషనర్ సత్యపాల్ సింగ్ గారికి వచ్చిందట. ఆయన  ఏదో సభలో 'టెర్రరిస్టుల్లాగఅమ్మాయిల ముఖాలకి ముసుగులేమిటి?" అన్నారట. అంతే. ముసుగుమాట వదిలేసి  'టెర్రరిస్ట్ ' అనే మాటని ఆడపిల్లలు పట్టుకున్నారట. "మమ్మల్ని టెర్రరిస్టులంటారా? " అని రెచ్చిపోయారట. మూర్ఖత్వానికి వెక్కిరింత మంచి సాకు. కమీషనర్ గారు కంగారు పడిపోయారు. తమ మాట నెగ్గించుకోడానికి అంతవరకు కట్టుకోని వాళ్ళు కూడా గుడ్డలు బిగించారట. మీరెప్పుడయినా పూణే వెళితే మీ దృష్టిని తప్పించుకోని సుందర దృశ్యం ఇదే. స్కూటర్ల మీద వెళ్ళే అందరు ఆడపిల్లలూ ముసుగుల్లో ఉంటారు. మగాళ్ళు మొహాలు బయట పడేసుకు ఉంటారు.

ఇందువల్ల పోలీసులకు కొత్త సమస్యలు. వీరిలో మంచివాళ్ళెవరు? లోపాయకారీగా రొమాన్స్ సాగించేవాళ్ళెవరు? నేరస్తులెవరు? నిజంగానే టెర్రరిస్టులంటే! అంతా అయోమయం. అవసరానికీ అవకాశానికీ చక్కని 'లంకె ' వేసి నిజమైన నేరస్తులకి - వారు రంకు నడిపినా, కొంపలు ముంచినా కొంగుబంగారమయే అలవాటది. మంచికి కాళ్ళే ఉంటాయి. చెడుకి రెక్కలుంటాయి. మధ్య చెన్నై లో  కూడా అక్కడా అక్కడా ముసుగులు కనిపిస్తున్నాయి. అవినీతికి ఆత్మాభిమానం కలిసొచ్చిన సందర్భమిది.

9 / 11 తర్వాత ఎక్కడ ముస్లిం పేరు వినిపించినా మధ్యవారిని అనుమానంగా నిలదీస్తున్నారు - ప్రపంచమంతటా. ఇది ఒక విధంగా అన్యాయం. అయితే సంప్రదాయంలోనూ ముసుగు 'లొసుగు ' ఉంది. విదేశాలలో ముస్లిం యువతులు బుర్ఖాను బహిష్కరించింది. మొన్ననే ఫ్రాన్స్ బహిష్కరించింది.మతాతీతమైన వ్యవస్థ లక్ష్యంగా గల ఫ్రాన్స్ రాజ్యాంగంలో మనిషి దైనందిన జీవితంలో ఇలా అంతం చొచ్చుకురావడం నిషిద్దమని భావించింది.

ప్రపంచంలో మతానికయినా మూలసూత్రం మానవ హితం. దాన్ని దేవుడితో ముడిపెట్టడం బలమైన లంకె. ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏది అప్పటికి మానవ హితమో ఆయా ప్రవక్తలు నిర్ణయించారు. ఆలోచనలో ముఖ్యమైన పదం "అప్పటి" వీరశైవం అర్ధం లేకుండా విజృంభించే నాడు శ్రీరామానుజులు శ్రీ వైష్ణవానికీ, శైవానికీ చక్కటి సమన్వయాని వెంకటేశ్వరుని ద్వారా సాధించారు. స్వామి వేంకటేశ్వరుడు. ఆయనకి పత్రి పూజ ఉంది. లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకున్న గొప్ప ప్రవక్త ముందుచూపు ఇది. అలాగే సిక్కుమత స్థాపకులయిన గురు గోవింద సింగ్ ఆనాటి ఛాలెంజ్ ని ఎదుర్కోడానికి భక్తుల చేత కత్తిని పట్టించారు. చేతికి బలమైన కడియం, కత్తి, శిరోజం, నడుముకి పటకా - ఇవి ఆనాటి జాతి పరిరక్షణకు ప్రవక్త నిర్దేశం. అయితే చాలా సంవత్సరాల క్రితం సింరాజిత్ సింగ్ మాన్ అనే .పి.ఎస్ ఆఫీసరు రాజకీయనాయకుడయి, తన మతం నిర్దేశించిన కత్తి పట్టుకుని పార్లమెంటులో కూర్చునే అర్హత ఉన్నదని గొడవ చేశారు. చివరికది 'గొడవ 'గానే ముగిసింది.

ఛాందసుల ఆలోచనా సరళికి తలొంచి - ప్రపంచం వైజ్నానికంగా ముందుకు పోతున్న కాలంలో తమది కాని దేశంలో మైనారిటీలు తమ స్త్రీలు బుర్ఖా వేసుకునే హక్కున్నదని వత్తిడి చేయడం - ఎబ్బెట్టుగానూ, అసందర్భంగానూ కనిపిస్తుంది. మన దేశంలో బుర్కాని పాటిస్తే బేగం అఖ్తర్ సంగీతం, పర్వీన్ సిల్తానా గాన మాధుర్యం, మధుబాల కళా వైదుష్యం ఏమయిపోయేదనిపిస్తుంది.

సమాజ హితాన్ని మరిచి మతాన్ని 'ఇంగువ గుడ్డ ' లాగ వాడుకోవడం ఆయా సంకృతుల దురదృష్టం. కాస్త కరుకుగా చెప్పాలంటే దుర్మార్గం. అయితే గడుసయిన ఛాందసులు మొదటినుంచీ కేవలం సాకుగా జత చేసిన దేవుడిని అడ్డం పెట్టి సమాజ అభ్యుదయాన్ని గంగలో కలుపుతారు.

అలాంటిదే - భారతీయ అర్ష సంప్రదాయంలో  ఒక ఉదాహరణ. ఆది శంకరులు భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో పెద్ద విప్లవకారులు. ఆయన 'మనీషా పంచకం' జగత్ర్పిసిద్ధం. ఒకసారి నదిలో స్నానం చేసి వస్తుండగా ఒక పంచముడు ఎదురుపడ్డాడు. అతన్ని పక్కకి తప్పుకోమన్నారు శిష్యులు. 'ఎవరిని బాబూ! నన్నా? నా ఆత్మనా? ' అన్నాడట పంచముడు. శంకరులు మాటకు నిర్విణ్ణులయిపోయారు. పంచముడి ముందు సాష్టాంగపడి మనీషా పంచకాన్ని చెప్పారంటారు.

ఇది ఆనాటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా శంకరులు సమాజానికి చేసిన  అపూర్వమైన కనువిప్పు. ఒక ప్రవ క్త ఔత్యానికి ప్రతీక. అయితే మత ఛాందసులకు ఇది కాస్త పాల సముద్రంలో ఉప్పురాయిలాంటి సంఘటన. ఆది శంకరులు పంచముడికి పాదాభివందనం చెయ్యడమా? ఇందులో సందేశం ఎంత గొప్పదయినా చాలా మందికి కొరుకుడు పడని సంఘటన ఇది. మరేం చెయ్యాలి? మన మతంలోనూ మౌల్వీలు లేకపోలేదు. కథని చిన్న మలుపు తిప్పారు. పంచముడెవరు? సాక్షాత్తూ ఆదిశంకరుడే! ఇప్పుడిక గొడవలేదు. సామాజిక సహజీవనానికి ఆది శంకరులు చేసిన కనువిప్పు - పంచముడు సాక్షాత్తూ శంకరుడే కావడడంతో  చక్కని మెలో డ్రామా అయి కూర్చుంది.

ఆత్మ వంచనకి చాలా అడ్డదారులున్నాయి. అవి సరిగా చూడగలిగితే బెల్జియం, ఫ్రాన్స్ బుర్ఖాలలో, సిక్కుల కృపాణాలలో, పూణే ఆడపిల్లల మూతి గుడ్డలలో, మనీషా పంచకంలోనూ దర్శనమిస్తూంటాయి. మతం  లక్ష్యం మానవ హితం అన్న పునాది రాయిని పెకిలించిన దౌర్భాగ్యమిది.

 

జూలై 19, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage