2001లో
నా నవల 'సాయంకాలమైంది'కి వరంగల్లు సహృదయ సాహితీ సంస్థ 'ఒద్దిరాజు స్మారక
ఉత్తమ నవలా' పురస్కారాన్ని ఇచ్చింది. ఒద్దిరాజు కవుల పేర్లు నేను అదే వినడం.
ఎవరీ ఒద్దిరాజు కవులు? వారిని ఇంతగా స్మరించుకునే కృషి ఏం చేశారు? అని
తెలుసుకోవడం ప్రారంభించాను. తెలిసిన విషయాలు విన్నకొద్దీ నిర్ఘాంతపోయాను.
నమ్మశక్యం కాలేదు. ఒక జీవితకాలంలో మానవమాత్రులకు ఇన్ని పనులు సాధ్యమా? అని
ఆశ్చర్యపోయాను. వీరు 'ఒద్దిరాజు కవులు' అన్నారు. కాని అది వారి విస్తృతమైన
కృషికి చిన్నమూస. నిజానికి వారు పరిశోధకులు, సంఘ సంస్కర్తలు, రచయితలు, కవులు,
విమర్శకులు, చిత్రకారులు, ప్రచురణ కర్తలు, ముద్రాపకులు, సంపాదకులు,
చర్మకారులు, కుట్టుపనివారు, సూట్‌కేసుల తయారీ చేసినవారు, గృహనిర్మాతలు,
వాస్తునిపుణులు, జ్యోతిష్కులు, ఆయుర్వేదం, హోమియోపతీ, అల్లోపతీలలో వైద్యులు,
నూతన ఔషదాల తయారీ చేసినవారు, ఫార్మసీలు స్థాపించినవారు, శస్త్రచికిత్స
జరిపినవారు.
బియ్యం మిల్లు, నూనె మిల్లు, పిండిమరలు స్థాపించి నడిపినవారు. సబ్బులు,
ఇంకులు, రకరకాల నూనెలు, రొట్టెలు తయారీ చేసినవారు, పుస్తకాల బైండింగులు
చేసినవారు, తాపీపని, వడ్రంగి పని చేసినవారు, పశువైద్యం తెలిసినవారు,
ఆర్కిటెక్చర్‌లో నైపుణ్యం సాధించినవారు. వీటితోపాటు పొలంలో నాగలిపట్టి
సేద్యం చేసినవారు. అన్నిటికీ మించి -మానవ కళ్యాణమే లక్ష్యం గల మానవతావాదులు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఒక జీవితకాలంలో చరిత్రను సృష్టించినవారు. ఇన్ని
రంగాలలో కృషి చేసినవారు అప్పటికీ ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు.
వరంగల్లులో మానుకొండ తాలూకాలో ఇనుగుర్తి గ్రామం వారిది. వారు
సీతారామచంద్రరావు, రాఘవరంగారావు. ఏడేళ్ల తేడాలో జన్మించి 62 సంవత్సరాలు
కలిసి జీవించారు. కథలు, నాటికలు, చారిత్రక నవలలు, కవితలు, వేదాలపై
విస్తృతమైన వివరణ గ్రంథాలు రాశారు. 'పాణియాష్టాధ్యాయి', 'సిద్ధాంత కౌముది'
వంటి గ్రంథాలకు భాష్యాలు రాశారు. ఇంగ్లీషులో కవితలు రాశారు. ప్రచురితమైన
రచనల కన్న కానివే ఎన్నో ఉన్నాయి. విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల అనే ప్రచురణ
సంస్థను ప్రారంభించి వందకుపైగా పుస్తకాలను ప్రచురించారు. ప్రచురించారనడం
తప్పు. తమ ఇంట్లోనే ముద్రణా యంత్రాన్ని ఏర్పరుచుకొని, పుస్తకాలను కంపోజ్‌చేసి,
ట్రెడిల్ స్వయంగా తొక్కుతూ తామే ముద్రించారు. 'బాల విజ్ఞాన మంజూష' అనే
పేరిట చిన్నపిల్లలకు 500 పైగా చేతి పనులు నేర్పే పుస్తకాన్ని ప్రచురించారు.
ఇనుగుర్తిలో తామే స్వయంగా ఇల్లు కట్టుకుని కాగితం మీద సీతారామచంద్రరావు అనే
అక్షరాలను చెక్కి, వాటిని బయటి గోడమీద సిమ్మెంటుతో దిద్దారు. 72 సంవత్సరాల
తర్వాత ఇప్పటికీ చెక్కుచెదరకుందా ఉంది! ఇంటి ముఖద్వారం మీద భగవద్గీత
శ్లోకాన్ని రాశారు.
ఆ రోజుల్లో హోమియోపతీ బెంగాలులో ప్రసిద్ధంగా ఉండేది. ఆ విద్య నేర్చుకోడానికి
కలకత్తా వెళ్లారు. అప్పటికే వారి మనసుల్లో ఒక పత్రికను నడపాలనే కోరిక బలంగా
ఉండేది. రోజూ 'అమృత బజార్ పత్రిక' కార్యాలయం ముందు గంటల కొద్దీ నిలబడి ఆ
సంస్థ కార్యకలాపాలను వంటబట్టించుకున్నారు. ఇంటికి వచ్చాక తెలుగులో -బహుశా
మొట్టమొదటి పత్రిక 'తెనుగు పత్రిక'ను ప్రారంభించారు. అందులో ప్రాంతీయ
వార్తలు, విదేశీవార్తలు, వ్యాసాలు, కథలు, సంపాదకీయాలు అన్నీ వారే రాసేవారు.
వారే ప్రింటు చేసేవారు. వారే పంచేవారు. నైజాము ప్రాంతంలో తొలి దినపత్రిక
అవసరాన్ని ఆ రోజుల్లోనే గుర్తించిన క్రాంత దర్శలు వారు. అది 1922 మాట. మొదట
500 కాపీలు ప్రింటు చేశారు. క్రమంగా సర్కులేషన్ రెట్టింపు అయింది. ఈ
పత్రిక 8 సంవత్సరాలు నడిచింది.
వైద్యం ప్రాక్టీసు చెయ్యడమేకాక మలేరియాకి 'తిక్త' అనే మందు, విరేచనాలకి 'మధుర',
ఇన్‌ఫ్లూయంజాకి మరో మూలికా ఔషధాన్ని కనుగొన్నారు. ఆ చుట్టుపక్కల వారందరికీ
ఉచితంగా వైద్యం చేసేవారు. వారా వృత్తిని మానుకోవడానికి ఒక మానవీయమైన కథ ఉంది.
వారి మిత్రుడు గోవిందరాజులు నాయుడు మేనల్లుడు సారంగపాణి సింగరేణిలో
ప్రాక్టీసు చేస్తున్నాడు. ఏదో కారణానికి ప్రాక్టీసు చెడింది. ఇనుగుర్తిలో
ప్రాక్టీసు పెట్టాలనుకున్నాడు. ఇక్కడ ఉచితంగా అందరికీ ఒద్దిరాజు సోదరులు
వైద్యాన్ని అందిస్తున్నారు. వారిని కలిసి ఉచితంగా వైద్యాన్ని మానుకోమని
అర్థించారు. అతని ఉపాధికోసం సోదరులు వైద్యాన్ని తమ కుటుంబానికే పరిమితం
చేసుకున్నారు! ఆ రోజుల్లో గ్రామీణులు ఏనాడూ చూడని ఎన్నో చెత్త వస్తువులను
గ్రామానికి తెచ్చారు. ధర్మోస్ ఫ్లాస్క్, టార్చిలైటు, సైకిలు, గ్రామఫోను
వంటివి వారు గ్రామానికి తెస్తే అందరూ విచిత్రంగా చూసేవారట.
వారు పది భాషల్లో నిష్ణాతులు. వాటిని నేర్చుకున్న తీరు ఇంకా అద్భుతం. ఆనాటి
ఒక ముస్లిం ఉపాధ్యాయుడు హసన్ ఖాన్ వారికి భారతం, భాగవతం నేర్పాడు.
తమిళనాడులోని ఓ ఊరిలో జంతు చర్మాలను శుభ్రంచేసే అబ్దుల్లా అనే తమిళుడి నుంచి
తమిళం నేర్చుకున్నారు. నీటిపారుదల శాఖలో పనిచేసే యూరోపియన్ జిడబ్ల్యూడి
కెంప్ అనే ఉద్యోగి ద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నారు. మధ్యలో అతనికీ బదిలీ
అయిపోతే కేసముద్రం స్టేషన్ మాస్టర్ దగ్గర కలోనియల్ ప్రొనన్సియేషన్
డిక్షనరీని తెచ్చుకుని, శంకరనారాయణ డిక్షనరీని పెట్టుకుని చదువుకొని,
రవీంద్రుడి 'నౌకా భంగము' నవలని తెలుగులోకి అనువదించారు.
ఇంకా నమ్మశక్యం కాని విజయం 1911 నాటిది. మునగాల రాజా నాయని వెంకటరంగారావు
గారు ఇనుగుర్తి వచ్చినప్పుడు సోదరుల్ని మద్రాసులో విజ్ఞాన చంద్రికా పరిషద్
పరీక్షలు రాయమని సూచించారు. ఆ రోజుల్లో నైజాం కరెన్సీ హాలీ అనేవారు.
బ్రిటిష్ ఆంధ్రా కరెన్సీ కాల్దర్. అంటే డబ్బు సింగరేణిలో పోస్టాఫీసుకి
వెళ్లి చెల్లించాలి. కట్టారు. కాని మద్రాసు నుంచి పుస్తకాలూ, హాల్
టిక్కెట్టూ ఎన్ని నెలలయినా రాలేదు. పరీక్ష 18 రోజులుందనగా వచ్చాయి. 18
వాచకాల్ని 18 రోజుల్లో చదివి పరీక్ష రాయాలి. అయినా ధైర్యంగా రైలెక్కారు.
తీరా ఆ హడావుడిలో ఇంటి దగ్గర పుస్తకాలు మరిచిపోయారు. అయినా మద్రాసు
చేరుతూనే వాషర్‌మాన్ పేటలో పుస్తకాల్ని ప్రచురించిన జయశంకర్ అండ్ కో
యజమాని వీరన్న శెట్టిని కలిశారు.
పరీక్షకు 13 రోజుల ముందు పుస్తకాలు చదవకుండా పరీక్ష రాయడానికి వచ్చిన
ఇద్దరు కుర్రాళ్లని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. నవ్వుకున్నాడు. పుస్తకాల మొదటి
ముద్రణ కాపీలు లేవు. రెండో ముద్రణ అవుతోంది. ఫారాలు ఒక పక్క ప్రింటవుతూంటే
వీరికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
తీరా పరీక్ష రాసేనాటికి సీతారామచంద్రరావుగారికి వొళ్లు కాలిపోయే జ్వరం.
పరీక్ష హాలులో పేపరు రాస్తూండగా కుడిచెయ్యి పనిచేయలేదు. కొంకర్లు పోయింది.
ఎడం చేత్తో రాయడానికి సిద్ధపడ్డారు. కాని కాగితాలలో రెండు దస్తూరీలు
ఒకరివేనని పరీక్షాధికారి నమ్మాలి కదా? పర్యవేక్షక అధికారి -ఆన్సర్ పేపరు
మీద ఆ విషయాన్ని తెలియజేస్తూ సంతకం చేశారట. ఆ పరీక్షల్లో మొదటి తరగతిలో
మొదటివారిగా నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలాంటి అనూహ్యమైన
కార్యదక్షులు, ఏకసంతాగ్రాహులు ఆ సోదరులు.
వారి గ్రామంలో త్యాగరాజ ఉత్సవాలు జరిపేవారు. స్వయంగా వీణ, వయొలిన్, వేణువు
నేర్చుకున్నారు. అది ఎవరైనా చేయగలిగిన పని. ఆయా వాద్యాల్ని వారేతయారు
చేసుకునేవారట!
ఈ కాలమ్ చదివిన ఒక తమిళుడు నిర్ఘాంతపోయి: ''అయ్యా, ఇది కేవలం పత్రికలో
చదువుకునే చరిత్ర కాదు. ప్రతీవిద్యార్థి పాఠ్యపుస్తకంలో చేర్చాల్సిన
చరిత్ర'' అన్నాడు.
భోజనానికి కూర్చుని ఔపోశన పట్టి, ఉత్తరాపోశన పట్టేలోగా 500 పద్యాల
ప్రబంధాన్ని ఆశువుగా చెప్పిన కొప్పరపు కవులు, ఒద్దిరాజు సోదరుల వంటి
చరితార్థులను కన్న దేశం మనది అని గర్వపడాలనిపిస్తుంది.
సీతారామచంద్రరావుగారు 1956 జనవరి 28న కేన్సర్‌తో కాలధర్మం చెందారు.
రాఘవరంగారావుగారు తన 79వ యేట 1973 మే 17న పరమపదించారు.