Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ప్రపంచ సమరం

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                       

1994 జులై 2. ప్రపంచ బంతి ఆట పోటీలలో కొలబియా ఆటగాడు ఆంద్రీ ఎస్కాబార్ తన దేశం తరపున ఆడుతూ, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసుకున్నాడు. ఆట మీద కొన్ని కోట్ల పందాలు నడిచాయి. ఊహించని నష్టాలతో లోపయకారీ వ్యాపారులంతా ఉక్కిరిబిక్కిరయారు. హాంబర్ట్ కాస్త్రో మురోజ్ అనే అభిమాని - దక్షిణ అమెరికా రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు అరిచినట్టు 'గో....ల్ అని అరుస్తూ పన్నెండు బులెట్లు ఎస్కాబార్ మీద పేల్చాడు. ప్రపంచం షాక్ అయిపోయింది. లక్షా ఇరవై వేలమంది అతని అంత్యక్రియలకి హాజరయారు. కొలంబియాలో ఎస్కాబార్ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు.

1970. ఎల్ సాల్వెడార్ లో 18 ఏళ్ళ అమ్మాయి అమేలియా బోల్నాయిస్ ప్రపంచ కప్పు బంతాట చూస్తోంది. తన దేశం మీద హోండొరాస్ ఆటగాడు రాబర్టో కార్టోనా గోల్ చేశాడు. ఆమె గుండె పగిలింది. లేచి వెళ్ళి డ్రాయర్లో తన తండ్రి పిస్తోలు తీసి తనని తానే కాల్చుకుంది. ఆమె అంత్యక్రియలకి రాజధాని నగరమంతా హాజరయింది. ఆమె శవ పేటిక వెనుక దేశపు అధ్యక్షుడు, మంత్రులు నడిచారు. వారి వెనక సాల్వెడార్ ఆటగాళ్ళందరూ తలలు వంచుకుని నడిచారు.

బంతి ఆట చాలామందికి వినోదం. కొంతమందికి ఉపాధి. ఎంతో  మందికి అది జీవిత లక్ష్యం. కాని కొన్ని దేశాలకి అది జీవన్మరణ సమస్య. వారి సంస్కృతికి ప్రతీక. కొందరికి అది మతం. జాతి బేధం, కుల బేధం వీటన్నిటికన్నా ఎక్కువ.

చాలా దేశాలు తన దేశ స్వాతంత్ర్యం కోసం యుద్ద భూముల్లో కాదు, బంతాట గ్రౌండుల్లో యుద్దాలు జరుపుతారు. బంతాట కారణంగా దేశాలు శతృత్వాన్ని పెంచుకున్న సందర్బాలున్నాయి. క్రొయేషియా, బెల్ గ్రేడ్ అభిమానులు 1990 లో బంతాట మైదానంలో ముష్టి యుద్దానికి దిగినప్పుడు - అది అక్కడితో ఆగలేదు. చినికి చినికి గాలివాన అయి క్రొయేషియా స్వాతంత్ర పోరాటంగా రూపుదిద్దుకుంది. మొన్నటికి మొన్న సంవత్సరం ప్రపంచ కప్పు పోటీల్లో పాల్గొనే అర్హత పొందడానికి జరిగిన బంతాట పోటీల్లో అల్జీరియా, ఈజిప్టు దేశాల అభిమానులు రెచ్చిపోయారు. ఎదుటి ఆటగాళ్ళ మీద విరుచుకు పడ్డారు. అంతే. ఈజిప్టు దేశాల అభిమానులు రెచ్చిపోయారు. ఎదుటి ఆటగాళ్ళ మీద విరుచుకుపడ్డారు. అంతే. ఈజిప్టు, అల్జీరియాళ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి.

ఆటని చూసేవారిలో ఆనందం కాక అర్ధ రహితమైన ఆవేశం, అల్లాకి ప్రార్ధనలు, అరుపులు, గుండెలు బాదుకోవడం, కక్షలు, తమ దేశం ఓడిపోతే ఆత్మహత్యలూ - ఇవన్నీ షార్జాలో భారత పాకిస్థాన్ క్రికెట్ పోటీల్లో   స్థాళీపులాక న్యాయంగా చూశాం. బంతాట వీటికి పరాకాష్ట.

1994 లో ఇటలీని గెలిపించి ప్రపంచానికి మకుటంగా నిలిపిన ఆటగాడు రోబర్తో బాగ్గియో - ఇటలీ తరపున ఆరు గోల్స్ చేశాడు. బ్రెజిల్ తో ఆడుతూ అయిదో పెనాల్టీకి బంతిని కొట్టాడూ. గోల్ పోస్టు అంచుకి బంతి తగిలి బయటికి ఎద్గిరిపోయింది. అంతే. అతని జీవితం అక్కడ నిలిచిపోయింది. ' క్షణంలో నా తల దిమ్మెక్కిపోయింది. నా జీవితంలో అది భయంకరమైన క్షణం. ఇప్పటికీ బంతిని కొట్టిన క్షణం కలలోకి వస్తుంది. చేతనయితే క్షణాన్ని చెరిపెయ్యాలని విలవిలలాడుతుంటానుఅన్నాడు.

బంతాట గురించి రాయడానికి ఒక కాలం చాలా కురుచ. నేను సినిమా వాడిని కనక సినిమా కథతో ముగిస్తాను. చిత్రం విజయానికి రకరకాల హంగుల్ని ఆపోశన బట్టే హాలీవుడ్ నిపుణులకి - కొత్త ఆలోచన వచ్చింది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్నీ వెర్రెక్కించేది ఏది? బంతి ఆట. శతాబ్దంలో ఎవరూ మరిచిపోలేని మారణ హోమం ఏది? రెండవ ప్రపంచ యుద్దం. నాజీల దుర్మార్గం. రెండింటినీ కలిపితే! ఎవరికో ఆలోచన వచ్చింది. దర్శకుడు - జాన్ హూస్టన్. ఇప్పుడు సినిమా కథ ఇది. రెండో  ప్రపంచ యుద్దంలో చాలా మంది మిత్ర రాజ్యాల వారు నాజీ ఖైదుల్లో ఉన్నారు. ఒక ఖైదుకి బంతి ఆటంటే పిచ్చి ఉన్న నాజీ ఆఫీసరు. మిత్ర రాజ్యాల ఖైదీలకు, జర్మన్ ఆటగాళ్ళకూ బంతాట పోటీ పెట్టాడు. అక్కడా వాళ్ళని చిత్తుగా ఓడించాలని ఆఫీసరు కోరిక. కాగా, బంతాట దురద తీరుతుంది. పకడ్బందీగా కాపలాలు పెట్టి ఆటని నిర్వహించాడు. ఆటలో మిత్ర రాజ్యాల ఖైదీలు గెలిచారు. స్టేడియం లో ఆట చూడవచ్చిన వేలాది ప్రేక్షకులు రెచ్చిపోయారు. తన్మయులయిపోయారు. పెద్ద అలజడి. దొమ్మీ. కొన్ని వేలమంది మధ్యనుంచి - పదకొండు మంది ఆటగాళ్ళూ - నాజీ ఆఫీసర్లు నిస్సహాయంగా చూస్తుండగానే తప్పించుకుపోయారు. ఇదీ కథ. సినిమా పేరు. ఎస్కేప్ టు విక్టరీ (1988)

న్యాయంగా కథగా పెద్ద విశేషం లేదు. కాని పదకొండు మంది మిత్ర రాజ్యాల ఆటగాళ్ళెవరు? 1988 లో ప్రపంచాన్ని ఊపి ఉర్రూతలూగించిన ప్రపంచ ప్రఖ్యాతి బంతి ఆట స్టార్స్ - పీలే, బాబీ మూర్, జాన్ వాస్క్, అస్వాల్డో ఆర్డైల్స్ రాబిన్ టర్నర్, గోల్ కీపర్ గా రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించిన గోర్డన్ బాంక్స్, లీ షానోవ్ - వీరంతా. ఇది ఈనాటి ఐపిఎల్ నమూనా. బుడా పెస్ట్లో బంతాట స్టేడియంలో ఆటని షూట్ చేశారు. లే షానన్ అనే మరో ప్రసిద్దుడు ఆటని నిర్దేశించాడు. వీరు కాక సిల్వెస్టర్ స్టాలోన్, మైకేల్ కెయిన్ వంటి హాలీవుడ్ నటులున్నారు. సినిమాని నిర్ఘాంతపోతూ కలకత్తా అంతర్జాతీయ చలన చిత్రీత్సవంలో చూశాను.

సినిమా చూడడానికి ఎవరూ రారు? ఇటు బంతాట ప్రియులూ, అటు సినిమా ప్రియులూ విరగబడి చూశారు. 1961 లో వచ్చిన హంగేరీ నాటకాన్ని మాతృకగా సినిమా తయారయింది. ఇటు వాస్తవాన్నీ, అటు సినీగ్లామర్ నీ కలిపి కొత్త రసాయనాన్ని తయారు చేశారు - సినిమాలో.

మనకి కొత్తగా అనిపించవచ్చుగాని - పీలే, మారడోనా, బాగ్గియో, రొనాల్డో, లియొనల్ మెస్సీ - పేర్లన్నీ బంతాట ప్రియుల్ని మత్తెక్కించే మారణాయుధాలు. నేను ఇటలీలో నేపుల్స్ కి వెళ్ళినప్పుడు - సముద్రానికి అభిముఖంగా ఉన్న మారడోనా బంగళా ముందు మా గైడ్ మమ్మల్ని నిలబెట్టి - అక్కడికి తీసుకు వచ్చినందుకే గర్వపడిపోయాడు. 'నేపుల్స్ చూశాక ప్రాణం పోయినా పరవాలేదు '  (సీ నేపుల్స్ అండ్ డై) అన్న సూక్తిని గుర్తు చేసుకుంటూ మా ఆవిడ నగర సౌందర్యాన్ని జుర్రుకుటోంది. నేను మారడోనా బంగళా కంటే దానిని చూపిన అభిమానిని అబ్బురపాటుతో చూస్తూ నిలబడ్డాను.

దక్షిణాఫ్రికాలో నెలరోజులపాటు తొమ్మిది వేర్వేరు మైదానాలలో 32 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ 'ఉన్మాదం' చూస్తూ మతులు పోగొట్టుకుంటున్నవాళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు. నాకయితే ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగే మొట్టమొదటి అంతర్జాతీయ సమ్రంభం ప్రారంభోత్సవంలో - ఆఫ్రికా తమ తొలినాటి ఆటవిక సంస్కృతినీ, తామ జానపద వైభవాన్నీ గర్వంగా ప్రదర్శించడాన్ని గర్వంగా చూశాను. ప్రారంభోత్సవంలో ఒక్క తెల్ల ముఖం లేదు. శతాబ్దాల దాస్యం తర్వాత వారు సాధించుకున్న స్వాతంత్ర్ర్యమిది. ప్రపంచ కప్పు విజయం కన్న జాతి గర్వంగా సాధించుకున్న స్వాతంత్ర్యమిది. ప్రపంచ కప్పు విజయం కన్న - జాతి గర్వంగా సాధించుకున్న తమ వ్యక్తిత్వాన్ని ప్రారంభోత్సవంలోనే చాటుకోవడం - పోటీ ప్రారంభం కాకుండానే వారు కొట్టిన పెద్ద 'గోల్ ' గా నాకు కనిపించింది     జూన్ 21, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage