Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
పుణ్య దొంగలు
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
దొంగలందు మంచి దొంగలు వేరయా ' అన్నారు పెద్దలు. ఒకాయనకి తరుచుగా ఫోన్
కాల్స్ వచ్చేవి. అటు పక్క పెద్దమనిషి 'నమో వెంకటేశ!' అని మొదలెట్టి "బాబూ!
తిరుమల తిరుపతి దేవస్థానం ఫోన్ నంబరు చెప్పగలరా!?" అని అడిగాడు. అటువంటి భక్తుడు
అడిగితే కాదనలేక తెలుసుకుని మరీ చెప్పాడీయన. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ భక్తుడే
ఫోన్ చేసి 'జై శ్రీరాం!' అంటూ బిర్లామందిర్ నంబరు అడిగాడు. పాత పరిచయస్థుడిలాగ
తోచింది ఈయనకి. వెతికి మరీ చెప్పాడు. మరో వారం తర్వాత పనిలో ఉండగా "జై సాయిరాం!"
అంటూ సాయిబాబా గుడి నంబరు అడిగాడు. కాస్త చికాకు కలిగినా - ఈయనా భక్తుడు కనుక -
ఆ పెద్దమనిషికి నంబరు చెప్పి "అయ్యా, మీకిలాంటి సమాచారం కావాలంటే ఫలానా నంబరుకి
చెయ్యండి" అని సలహా ఇచ్చాడు. పదిరోజుల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఆ భక్తుడి
గొంతు వినిపించగానే ఈయనకి కోపం రాబోయింది. "అయ్యా, ఈసారి నంబరు కోసం ఫోన్
చెయ్యలేదు. మీ కారణంగా దేవుళ్ళని దర్శించి తరించాను. ఈ పుణ్యంలో మీకూ వాటా ఉంది.
కృతజ్ఞతగా 'భక్తరామదాసు' సినిమాకి మీ ఇంటిల్లిపాదికీ టిక్కెట్లు మీ స్కూటర్ లో
ఉంచాను. చూసి తరించండి" అన్నాడు. ఈ పెద్దమనిషి పొంగిపోయాడు. సకుటుంబంగా సినిమాకి
వెళ్ళి తరించాడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా దోచుకున్నాడు దైవభక్తుడు.
మరొక్కసారి. "దొంగలందు పుణ్యదొంగలు వేరయా". 'పుణ్యదొంగ' అనే తెలుగు సంకరాన్ని
క్షమింతురుగాక. దొంగలగురించి రాసేటప్పుడు ఆ మాత్రం అవినీతి చెల్లుతుంది.
ఏమయినా దొంగలు తెలివిమీరిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నరు. మొన్న
బొంబాయిలో పట్టపగలే జ్యోతిర్మయిడే అనే ఒక పాత్రికేయుణ్ణి నలుగురు 9 బుల్లెట్లను
పేల్చి చంపేశారు. అది చిన్న నేరం. చంపినవారు ఏ చిన్న ఆచూకీ అయిన ఆ పోలీసుకి
దక్కనివ్వకుండా చేసి మాయమయ్యారు. వారం గడిచినా వారి అంతు చిక్కడం లేదు. నిన్న
మహారాష్ర్ట హోం మంత్రి టి.టి.పాటిల్ గారు వాపోయారు. "ఈ మధ్య దొంగలు బొత్తిగా
తెలివి మీరి పోతున్నారు. నేరాలు చేసి ఏ ఆచూకీ తెలియకుండా చేస్తున్నారు" అని.
ఇది చాలా అన్యాయమని నేను వారితో ఏకీభవిస్తాను. ఎంత గొప్ప నేరాన్ని చేసిన
నేరస్థులు ఏదో ఒక ఆచూకీని హోం మంత్రికో, పోలీసులకో తెలిసేటట్టు చెయ్యాలి. ఆ
పుణ్య దొంగలాగ చిన్న చీటీ రాసి "బాబూ! నా పేరు కామేశ్వరరావు. బుగ్గమీద
పుట్టమచ్చ ఉంటుంది. వయస్సు 32. బియ్యే తప్పాను. జింఖానా వీధిలో ఆరో నంబరు ఇంట్లో
ఉంటున్నాను. ఉదయం తొమ్మిది పన్నెండు మధ్య వస్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. మీకు
వీలులేకపోతే నా మొబైల్ కి ఫోన్ చేస్తే నేనే తమ దర్శనం చేసుకుంటాను. నా మొబైల్
నంబరు: 9988776531" అని రాస్తే మర్యాదగా ఉంటుంది. బొత్తిగా ఆచూకీ ఇవ్వని దొంగల
తెలివితేటలు ఈ సమాజానికి అనర్ధం అని పాటిల్ గారు బాధపడ్డారు.
పోలీసులను సుఖపెట్టలేని నేరస్థుల తెలివితేటలు ఈ దేశ సంక్షేమానికి గొడ్డలిపెట్టు
అని వారి ఆవేదన. ఈ మధ్య నేరస్తులలో బొత్తిగా నీతి సన్నగిల్లింది. మన పొరుగు దేశం
పాకిస్థాన్ని చూడండి. ముంబై దాడులు జరిపాక, వాళ్ళ తరపున కసాబ్ సాహెబ్ గారిని
వదిలివెళ్ళారా లేదా? వారిని మనం నవాబుల స్థాయిలో గౌరవంగా చూసుకుంటున్నామా లేదా?
అలనాడు మహాత్ముడిని కాల్చిన నాధూరాం గాడ్సే గారు ముందు బాపూజీని నమస్కారం పెట్టి
చంపిన విషయం మరిచిపోయారా? నడిరోడ్డు మీద రివాల్వర్లు పేల్చే నేరస్తులు ఈ
విషయాల్ని మనస్సులో పెట్టుకోవాలి. తమ నేరాలకి ఎంతో కొంత ఆచూకీ ఇవ్వకపోతే
పోలీసుల గతి ఏమిటని ఆలోచించాలి. హోం మంత్రులు పడే నిందల్ని దృష్టిలో
పెట్టుకోవాలి.
మీరెవరిని కాల్చాలంటే వారిని కాల్చుకోంది. మానభంగం చేయాలనుకుంటే చేసుకోండి. కానీ
చివర మీ విజిటింగ్ కార్డో, ఫోన్ నంబరో పోలీసులకి ఇచ్చి పొండి. అది కనీస మర్యాదగా
గుర్తించండి. "నేను ఫలానా రివాల్వర్ వాడాను. నా అడ్రసు 15 జంబులింగం వీధి" అని
చెప్పండి చాలు. నేరాలలోనూ ఇచ్చిపువ్వుకోడాలు ఉండాలి. నిన్న కాక మొన్నటి కుంభ
కోణంలో కేవలం 200 కోట్ల చెక్కు సొమ్ము బదిలీ అయింది. గవర్నమెంటు మిగతా లక్షా
అయిదువందల కోట్ల గురించి పళ్ళెత్తుమాట అడిగిందా? ఇందులో సబబుని అర్ధం చేసుకోండి
- అని పాటిల్ గారి ఉవాచ.
అయితే దొంగలకి దొంగల అడ్రసులు తెలియకపోవు - అని వారు భావించి ఉండవచ్చు.
ఒక్కొక్కప్పుడు ఈ దొంగలు పరాకుగా ఉంటారు. కొత్త దొంగల ఇటీవలి జాబితా వారి దగ్గర
లేకపోవచ్చు. దొంగలు ఈ బలహీనతల్ని గమనించాలి. మనుషుల్ని చంపి ఏ ఉపకారమూ పోలీసులకి
చెయ్యకుండా తప్పించుకునే తెలివి ఈ దేశానికి అరిష్టం అని సూచిస్తున్నారు పాటిల్
మంత్రివర్యులు.
తీరా ఆ మాట అన్నారో లేదో ఆయన మంత్రి పదివికి రాజీనామా చెయ్యాలని ప్రతిపక్ష
నాయకులు ఒంటికాలు మీద లేచారు. అయ్యా! రేపు మీ హయాంలోనూ ఇలాంటి దొంగల బెడద
ఉండవచ్చునని మరిచిపోకండి.
ఏతావాతా, జ్యోతిర్మయి డేగారి చావు మంత్రివర్యుల పదవికి ఎసరు పెట్టే స్థితికి
వచ్చిందని నేరస్థుల గ్రహించాలి. వారి తెలివితేటల్ని అర్ధం చేసుకునే మంత్రులుండడం
మన అదృష్టం. చాపకింద నీరులాగ కోట్లు మింగడం లాయకీ అనిపించుకోదు. చిన్న ఆచూకీ
వదలడం - ఇచ్చిపుచ్చుకోవడం అవుతుందని, అది సామాజిక బాధ్యత అని ఒక రాష్ర్టపు హోం
మంత్రిగారు వక్కాణిస్తున్నారు.
నాయకులలో ఇది అరుదయిన నీతిగా దేశం గ్రహించాలని, ముఖ్యంగా నేరస్థుల అర్ధం చేసుకు
సహకరించాలని పత్రికా ముఖంగా నేను పుణ్య దొంగలకు విన్నపం చేస్తున్నాను.