Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
గిరీశం ఆవేదన
గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com
వెనకటికి ఒకాయన రేడియోలో కర్ణాటక సంగీతాన్ని
వింటూ పక్కాయన్ని అడిగాడట;
''ఏమండీ, ఆ పాడేది ఎమ్మెస్ సుబ్బులక్ష్మే కదా?'' అని. ''తమకెందుకూ అనుమానం
వచ్చింది?'' అన్నాడట పక్కాయన. ''ఏం లేదు. పాట మధ్యలో అపశ్రుతి వస్తేను''
అన్నాడట. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అయినంత మాత్రాన అపశ్రుతి రాకూడదన్న రూలు
లేదు. తప్పటడుగు మానవమాత్రులకి సహజం. మొన్న పేపరు చదువుతూ ఒకాయన గుండె
బాదుకున్నాడు. ''ఇదేమిటండీ -ఈయన -పట్టాభిరామారావు -న్యాయమూర్తి అంటున్నారు
-ఈయన కూడా లంచం...'' అంటూ బుగ్గలు నొక్కుకున్నాడు. అయ్యా, వ్యామోహం
మానవమాత్రులకి సహజం. పట్టాభిరామారావు గారు కూడా మానవ మాత్రులే. అయితే
కన్యాశుల్కంలో గిరీశం తన శిష్యుడయిన వెంకటేశానికి ఓ ఠస్సా వేశాడు. 'పెద్దవాళ్లకి
పెద్ద కాయలు, చిన్నవాళ్లకి చిన్నకాయలు' అంటూ.
ఇది అవినీతికీ వర్తిస్తుంది. పాతిక రూపాయల అవినీతి అయితే -ఆయన డవాలా
బంట్రోతు అయివుంటాడు. నాలుగు వేలయితే ఏ రెవిన్యూ గుమాస్తావో అయివుంటాడు.
పదివేలయితే ఎలక్ట్రిసిటీ ఇంజనీరు అయివుంటాడు. లక్షరూపాయలు దాటితే
సెక్రటేరియేట్ ఫైళ్లకి సెక్షను హెడ్డు అయివుంటాడు. కోటి వరకూ కేంద్రం
సెక్రటరీ అనుకోవచ్చు. లక్షకోట్లయితే ఏ ఏ రాజాగోరో అయివుంటారు. 10 కోట్లకు 'న్యాయం'
ఈ దేశంలో రాజీపడడంలో ఆశ్చర్యంలేదు. పెద్దవాళ్లకి పెద్దకాయ. కాకపోతే ఈ
పట్టాభిరామారావుగారు బొత్తిగా అనుభవంలేని అవినీతిపరుడిగా ఆయన మీద మనకి జాలి
కలుగుతుంది. ఆయన అవినీతిపరుడికి బెయిల్ ఇవ్వడంలో కక్కుర్తి పడి
వుండవచ్చుగాక కాని డబ్బుని తీసుకోవడంలో, దాన్ని సరిగ్గా దాచుకోవడంలో యింకా
కొంత అనుభవం సంపాదించాలని నా కనిపిస్తుంది.
అవినీతి గురించి తన సొంత సెల్‌ఫోనుల్లోంచే మాట్లాడడం, కాస్త ముందు
జాగ్రత్తగా భావించి తన కొడుకు సెల్‌ఫోన్‌లోంచే మాట్లాడడం -డబ్బుని తన
లాకర్లలోనే పెట్టుకుని -కొడుకు దగ్గరే లాకర్ తాళం చెవులు ఉండడం వంటివి -అతి
ప్రాథమికమైన విషయాల్లో పప్పులో కాలేసే తప్పటడుగులు. సంవత్సరం పాటు మన
రాజాగారు జైల్లో వున్నారు. ఆయన లక్షాడెబ్భై కోట్లు స్వాహా చేశారని అందరూ
గొంతులు చించుకుంటున్నారు. కాని ఏ రోజయినా ఆయన దగ్గర సాంబారు ఇడ్లీ
తినడానికి అయిదు రూపాయల నోటు దొరికిందా? సురేష్ కల్మాడీ గారి దగ్గర జేబులో
ఏనాడయినా చిల్లర డబ్బులు చూశామా? బంగారు లక్ష్మణ్‌గారు అలనాడు నోట్ల కట్టలతో
దొరికిపోయారు కానీ, వారి దగ్గర బస్సు టిక్కెట్టుకి సరిపోయే చిల్లరయినా
కనిపించిందా? డబ్బు లాకర్లలోనే ఉంటుంది. కాని తాళాలు కొడుకుల దగ్గర ఉండకూడదు.
ఇలాంటి వ్యవహారాల్లో అయిదారు సెల్‌ఫోన్‌లు ఉండాలి. చిల్లర హత్యలు చేసేవారే
నాలుగయిదు సెల్‌ఫోన్లు వాడడం మనం చూస్తున్నాం. పోలీసుల సోదాల్లో ఎప్పుడూ
సెల్‌ఫోన్లు దొరికినంత విరివిగా లాకర్ తాళాలు దొరకడం మనం వినలేదు.
తీసుకున్నది బోడి 10 కోట్లు. ఆమాత్రం డబ్బుని ఈ మధ్య సాదా సీదా రియల్
ఎస్టేటు బ్రోకర్‌లు తీసుకుంటున్నారు. మన నిమ్మగడ్డవారి నడగండి. ఎలా యివ్వాలో
వారు చక్కగా నిర్వహించగలరు. ఈ విషయాన్ని ఆయన జైల్లో పేపర్లో చదివి
నవ్వుకుంటూ ఉంటారని నా నమ్మకం. పట్టాభిరామారావు గారికి డబ్బు ఇప్పించిన సాటి
న్యాయమూర్తి చలపతిరావు గారి దగ్గర, సోమశేఖర రెడ్డిగారి దగ్గర మధ్యవర్తిగా
వున్న బాలాజీరావు (ఐటీసీ మేనేజరు గారి దగ్గరా), నాచారం యాదగిరి దగ్గరా -అందరి
దగ్గరా చిల్లర డబ్బులాగ దొరికిపోయింది -ఒకచోట కోటి, మరొకచోట కోటీ 60 లక్షలు
-యిలాగ. న్యాయమూర్తి పట్టాభిరామారావుగారిది బొత్తిగా అనుభవం చాలని అవినీతిగా
నాకు తోస్తుంది. గాలి జనార్థనరెడ్డి గారి వంటి ప్రసిద్ధులయిన మంత్రిగారు,
కోట్ల కోట్ల సొమ్మును కొల్లగొట్టడంలో అందెవేసిన చెయ్యిగా- న్యాయమూర్తికి
మరింత పకడ్బందీగా, గుంభనంగా సొమ్మును అందజేసే ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయం.
ఇందువల్ల నష్టాలు -గిరీశం పద్దు ప్రకారం -(అ) గాలి వారికి బెయిల్ దక్కలేదు.
వ్రతమూ చెడింది. ఫలమూ కలిసి రాలేదు. (ఆ) పట్టాభిరామారావుగారికి డబ్బు
మిగలలేదు. (ఇ) ఇచ్చిన డబ్బు గవర్నమెంటు ఖాతాలోకి వెళ్లిపోయింది. (ఈ) ఇంతవరకూ
దేశం ఆశలు పెట్టుకున్న న్యాయశాఖ పరువుకూడా భ్రష్టు పట్టిపోయింది.
(ఉ) ముందు ముందు న్యాయస్థానాలు తమని కాపాడుతాయన్న సామాన్య మానవుడి కల
మంటగలిసిపోయింది. ఇంతకూ ఈ కథలోని నీతి ఏమిటయ్యా అంటే -గాడిద చేసే పని గాడిదే
చేయవలెను. ఒకవేళ గుర్రము చేసినా దానికి గాడిద మద్దతు పూర్తిగా ఉండవలెను.
గుర్రములు గాడిద స్థాయికి ఎగబాకే ప్రయత్నము చేయరాదు. ఎన్నడూ గాడిదల్ని
చిన్నచూపు చూడరాదు. నీతిని పాటించవలసిన, కాపాడవలసిన న్యాయమూర్తి అవినీతికి
తలవొంచితే -దానికి చాలా కట్టుదిట్టమయిన ప్రణాళిక కావలెను. న్యాయవ్యవస్థకి
పట్టాభిరామారావు గారు ఒక గుణపాఠం. ఒక చెలియలికట్ట. వారికీ, వారి
అడుగుజాడల్లో ప్రయాణం చెయ్యాలని కలలు గంటున్నవారికీ ఒక హెచ్చరిక. బోనులో
నిలబడిన నేరస్థులందరినీ చిన్నచూపుచూడడం తగదు. వారు ఎంతో కృషి చేసి, ఎన్నో
లాకర్లు, తాళాలు, మధ్యవర్తులను సిద్ధం చేసుకుని ఆ పనులను చేసి ఉంటారని మనం
గ్రహించాలి. ఆఖరుగా గిరీశంగారి సూత్రం మరువరాదు. పెద్దవాడికి పెద్దకాయలు.
చిన్నవాడికి చిన్నకాయలు. చేసుకున్నవాడికి చేసుకున్నంత. తీసుకున్నవాడికి
తీసుకున్నంత.
జూన్ 18,2012
************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |