Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
డెబ్బై
చేపల
కథ హారీ పోటర్ కథలతో పెరిగిన ఈ తరంవారికి (తండ్రుల విషయంకూడా నాకు అనుమానమే) - బహుశా వాళ్ళ తాతలు చెప్పిన 'ఏడు చేపల' కథా తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ అమ్మమ్మా ప్రతీ మనుమడికీ ఇలాంటి కథలూ, ముఖ్యంగా ఈ కథ చెప్పేది. తుంటిమీద కొడితే పళ్ళు రాళుతాయి - అన్న సామెతకి దగ్గరగా ఉన్న కథ ఏడుచేపక కథ అని ఇప్పటి వారికి అర్ధమయితే నా పబ్బం గడుస్తుంది. తెలియని వాళ్ళు బాధపడనక్కరలేదు. మన దేశంలో ప్రస్తుత తరానికి 70 చేపల కథలున్నాయి. ప్రస్తుతం ఒక్క నమూనా చేప కథ - 1984 నాటి భోపాల్ దుర్ఘటన. అంతకుముందు అమెరికా మార్కు 'చేప' కథ ఒకటి చెప్పుకుందాం. 2001 సెప్టెంబరు 11 ఉదయం నాలుగు విమానాలలో 19 మంది దౌర్జన్యకారులు అమెరికా ఆకాశం మీద స్వైరవిహారం చేశారు. నేనే స్వయంగా ఒక విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోకి దూసుకు వెళ్ళడం తెల్లబోతూ చూశాను. ఇది ప్రపంచమంతా నివ్వెరపోయి చూసిన సంఘటన. తమ రక్షణ యంత్రాంగం పకడ్బందీగా ఉన్నదని విర్రవీగే అమెరికా అహంకారానికి ఇది పెద్ద దెబ్బ. అది మొట్టమొదటి గాయం. రెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కూలాయి. వారి రక్షణ శాఖ కార్యాలయానికి (పెంటగన్) దెబ్బ తగిలింది. వారనుకున్నదంతా జరపగలిగితే వాషింగ్ టన్లో 'కాపిటల్ భవనం' కూడా కూలేది. మంచి చెడ్డలూ, నాయాన్యాయాల మాట అలా ఉంచితే - ఊహించలేనంత సమన్వయం, ప్రణాళిక, తెగింపు, ప్రాణ త్యాగం, సుశిక్షితమైనశిక్షణ అన్నిటికీ మించి కమిట్ మెంట్ - ఈ దాడి వెనక ఉంది. 70 దేశాలకు చెందిన 3000 వేలమంది చనిపోయారు. ప్రపంచం దిగ్ర్బాంతమయింది. మనస్సుల్లోనయినా కొన్ని దేశాలవారు సంతోషించారు. అమెరికా అలిగింది. ఇందుకు కారణమయిన దుర్మార్గులు ఎక్కడ ఉన్నారు? ఆఫ్గనిస్తాన్ లో. కొన్ని బిలియన్ల ఖర్చుతో అతి పకడ్బందీగా ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది. బలమయినవాడికి మద్దతుగా చాలామంది నిలుస్తారు. కొందరు నిలవకపోయినా అర్ధం చేసుకుని తల పక్కకి తిప్పుకుంటారు. వారి ఉద్దతికి భయపడి ముప్రాష్ వంటివారు తలొంచుతారు. ఏతావాతా ఆఫ్గనిస్థాన్ నడుం విరిగింది. అసలు కారణమని భావించిన ఒసామా బిన్ లాడెన్ దొరకలేదు. అతని కోసం జనమేజయుని సర్పయాగంలాగ ఇప్పటికీ పాకిస్థాన్ పొలిమేరల్లో తాలిబన్ల మీద అమెరికా విరుచుకు పడుతూనే ఉంది. (అప్పుడు తక్షకుడూ చావలేదు, ఇప్పుడు బిన్ లాడెనూ చావలేదు) విధ్వంసం తరువాత - ఇంకా ఆగలేదు కనుక - ఆఫ్గనిస్థాన్ బతికి బట్టకట్టడానికి, ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకోడానికి కనీసం 50 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మరో భారతీయ 'చేప' కథ. 1984 లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీలో రసాయనపు గ్యాస్ బయటికి చిమ్మింది. అమెరికా కంపెనీ నిర్మించిన ఈ ఫాక్టరీలో తీసుకోవలసిన ముందు జాగ్రత్తలేవీ తీసుకోలేదు - కొన్ని కోట్లు ఖర్చవుతుంది కనుక. అప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. పదిహేనువేలమంది దారుణమయిన మరణం ఫాలయారు. 'చావు' లో స్థాయిలను నిర్ణయిస్తే ఈ చావు వరల్డ్ ట్రేడ్ సెంటర్ చావుకన్న భయంకరమైనది - 26 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ దాని భయంకరమైన పరిణామాలతో ఎందరో దిక్కుమాలిన చావుకి కారణమయినదీను. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రధాని.ఘనత వహించిన అర్జున్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. కంపెనీ అధిపతి వారెన్ ఆండ్ర్సన్ ను అరెస్టు చేశారు. నాలుగో రోజున - కేవలం నాలుగో రోజున - వారిని ఓ ప్రత్యేక విమానంలో ఎక్కించి పంపించాలని రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ ఆదేశాలిచ్చింది. ఆండర్సన్ కి బెయిల్ మంజూరయి, ముఖ్యమంత్రి వెళ్ళే ప్రత్యేక విమానం (సెస్నా)లో సమస్త రాచ మర్యాదలతో కలెక్టరు మోతీసింగ్, అప్పటి పోలీసు అధికారి స్వరాజ్ పాల్ ఆయన్ని స్వయంగా విమానం ఎక్కించారు. (గమనించండి - చావుల లెక్కలో వీరి నేరం బిన్ లాడెన్ నేరానికి మూడున్నర రెట్లు). వేద్ ప్రకాశ్ గ్రోవర్ అనే పైలట్ గంటన్నరలో ఆండర్సన్ దొరగారిని ఢిల్లీలో దించారు. ఇంత పెద్ద నేరం చేసిన, అరెస్టయిన నేరస్తుడిని అంత తక్కువ వ్యవధిలో ఎలా వదిలారు? ఈ నేరానికి బెయిల్ కూడా నిషిద్దం కదా? అయ్యా, వడ్డించేవాడు మనవాడు కావాలని సామెత. కంప్లయింట్ లో బెయిల్ ఇవ్వని నేరాల్ని తప్పించారు అధికారులు! ఆ విధంగా జైలులో కనీసం జీవితాంతం ఉండాల్సిన నేరస్తుడు సమస్త రాజభోగాలతో మరునాటికి అమెరికా చేరాడు. ఇంత పెద్ద గోల్ మాల్ కేంద్రం ప్రమేయం లేకుండా జరగదని అపప్టి రాజీవ్ గాంధీ ప్రధాన కార్యదర్శి పి.సి.అలెగ్జాండర్ అనగా, కేంద్రం ప్రమేయం లేదని మరో సీనియర్ నేత ఆర్కే ధావన్ గారు అన్నారు. ఈ బురద ఇంకా లేస్తూనే ఉంది. కేసు జరుగుతోంది. ఏదో దశలో 'ఊదేశపూర్వకం' కాని హత్యానేరంగా (కల్పబుల్ హోమిసైడ్) మోపిన అభియోగం ఖేవలం 'అశ్రద్ధ'గా మార్చారు. ఎవరు? ఎవరి మద్దతుతో? మొదటి నేరానికి పదేళ్ళ శిక్ష. రెండో నేరానికి రెండేళ్ళ శిక్ష. ఇంతకీ నేరస్థుడు ఎక్కడ? ప్రస్తుతం - వారెన్ ఆండర్సన్ 92 వ ఏట అమెరికా లాంగ్ ఐలెండులో చక్కని బంగళాలో మొక్కలకి నీళ్ళు పడుతూ మనకి దర్శనమిచ్చారు. అర్జున్ సింగ్ తనంతట తానే ఢిల్లీ మద్దతు, ప్రోద్బలం, ప్రమేయం లేకుండా నేరస్థుడిని దేశం దాటించగలరా? నిన్న ఆయన్ని ఎవరో అడిగితే 'సమయం వచ్చినప్పుడు చెబుతానూ' అని వక్కాణించారు. అంటే వారు చెప్పే కథ వేరే ఉన్నదన్నమాట! ఆయన నోరిప్పితే ఎన్ని కథలు బయటికి వస్తాయో. వారి దగ్గర ఎందరి మహానుభావుల గోత్రాలున్నాయో! వారికీ ప్రస్తుతం తొంభయ్యో పడి నడుస్తోంది. ఇప్పుడు అమెరికానుంచి తీసుకొచ్చి ఆండర్సన్ ని బోనెక్కించినా, పాత గోత్రాలను తవ్వి అర్జున్ సింగ్ గారుతమ పార్టీ నిర్వాకాన్ని చదివినా - వారిద్దరినీ పీకేది ఏమీ లేదు. రాజీవ్ గాంధీగారు ఎటూ లేరు. ఇక వీరిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు గుటుక్కుమంటే - రాచకొండ విశ్వనాధ శాస్త్రి కథలో లాగ తన శత్రువు మహాశివరాత్రినాడు కన్ను మూస్తే వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడని ప్రత్యర్ధి ఏడ్చినట్టు మనం ఏడవాలి. అసలు ఘోరం అది మాత్రమే కాదు. జరిగిన నష్టానికి మూడు బిలియన్ల పరిహారాన్ని కోరుతూ భారత ప్రభుత్వం అమెరికాలో కంపెనీ మీద కేసు పెట్టింది. అమెరికాలో తమ పప్పులుడకవని ఆ కేసుని ఇండియాకి బదిలీ చేయించుకుంది అమెరికా కంపెనీ! భారతదేశం న్యాయవ్యవస్థ ఘనత ఆ కంపెనీకి తెలుసు కనక. అడిగిన నష్టపరిహారానికి రాజీగా కేవలం పదిహేను శాతం - అంటే 147 మిలియన్లు ఇచి చేతులు కడుక్కుంది. ఈ రాజీకి కారణం ఎవరు? ఏ నష్టానికి ఈ డబ్బు ఊరడింపు? ఇక్కడ మరో మెలిక. ఇంతకూ ఆ 147 మిలియన్లూ ఏమయాయి? ఎవరికిచ్చారు? ఎవరు తిన్నారు? ఏ ఖాతాల్లోకి మాయమయాయి? ఈ ప్రశ్నలు నావికావు. మాజీ ఎన్నికల కమీషనర్ జీవీజీ కృస్ష్ణమూర్తిగారు పత్రికా ముఖంగా అడిగారు. ఆండర్సన్ ని అమెరికానుంచి రప్పించే ఏర్పాట్లు చెయ్యవద్దని ఢిల్లీనుంచి తనకు ఆ రోజుల్లో వ్రాత పూర్వకమైన ఆదేశాలు వచ్చాయని సిబీఐ అధికారి లాల్ గారు బల్లగుద్దారు. ఎవరి పుణ్యమిది? ఈ భయంకరమైన గూడుపుఠాణీ వెనక డబ్బు ఉందా, బెల్లింపు ఉందా? అధికార దుర్వినియోగం ఉందా? తమ ప్రజల పట్ల నిర్లక్ష్యం ఉందా? పరిపాలనలో రాజీ ఉందా? అసమర్ధత ఉందా? స్వార్ధం ఉందా? ఈ ప్రశ్నలు 26 సంవత్సరాల పాతవి. ఇప్పటికీ ఆ భయంకరమైన గ్యాసు ప్రభావానికి దుర్మరణం పాలవుతున్న ఎందరో నిర్భాగ్యుల ఆక్రోశానివి. వీటికి ఎవరు సమాధానం చెపుతారు? అసలు నిజమైన సమాధానాలు మనం వినగలుగుతామా? 3000 వేల మంది చావుకి ఒక దేశపు ఆర్ధిక వ్యవస్థని 50 సంవత్సరాల వెనక్కి తోసేసిన దేశం - ఇంకా దొరకని బిన్ లాడెన్ కోసం ఇప్పటికీ పాకిస్థాన్ లో దాడులు జరుపుతున్న దేశం - 20 వేల మంది చావుకి కారణమయిన పెద్దమనిషిని - తమ పంచలోనే నిమ్మకు నీరెత్తినట్టూ కాపాడుతోంది. గాజులు తొడిగించుకున్న ఎన్నో ప్రభుత్వాలు అన్ని నిజాలూ ఎరిగి ఏమీ చెయ్యకుండా తమ ప్రజల్ని క్రుంగిపోనిచ్చాయి. రెండో ప్రపంచ యుద్దంలో మారణహోమానికి కారణమయిన నాజీ హంతకులు మొన్నటిదాకా అక్కడా అక్కడా బయటపడుతూనే ఉన్నారు. కాని మనదేశంలో 20 వేలమంది మారణహోమానికి కారణమయిన హంతకులు రాచమర్యాదలతో స్వదేశాలకి తరలిపోతున్నారు. వారెన్ ఆండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంలూ, మాజిద్ మెమూన్ లూ, అఫ్జల్ గురులూ - అంతా క్షేమంగా, హాయిగా ఉన్నారు. కేవలం ముస్లిం అయిన కారణానికి ఈ దేశం ప్రేమించే ఓ పాపులర్ నటుడు షారూక్ ఖాన్ ని - మొన్ననే అమెరికా విమానాశ్రయంలో నిలదీసింది. నేరస్తుడని తెలిసిన, కనిపిస్తున్న, గుర్తుపట్టిన, రుజువయిన, దారుణమయిన హంతకులని మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఎందుకని? 'ఏడు
చేపల
కథ'
తెలియని
ఈ
తరానికి - ఇది పసందయిన
డెబ్బై
చేపల
ఆధునిక
నమూనా
కథ. ************ ************ ************* ************* |