Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
వయస్సుని జయించినవాళ్ళు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com 


ఉదయం పార్కులో నడిచే మిత్రులలో నోరి రామకృష్ణయ్యగారొకరు. ఆయన వయస్సు 82. ఆ మధ్య హిందీ ప్రచార సభ స్నాతకోత్సవాన్ని చూశారు. అక్కినేని ముఖ్య అతిధి. పట్టభద్రులందరికీ ముతక ఖద్దరు శాలువాలు కప్పారట. శాలువాకి నాలుగు అంచుల్లో మూడు హృదయాలు (ఆటీన్లు) ముద్రలుంటాయి. "ఏక్ రాష్ర్ట భాషా హిందీ హో, ఏక్ హృదయ్ హో భారత జననీ" (హిందీ రాష్ర్ట భాష, భారతమాత హృదయం) అని రాసి ఉంటుంది. ఆ శాలువా కొనుక్కోవాలని హిందీ ప్రచార సభకి వెళ్ళారు. అక్కడి గుమాస్తా "దీన్ని అమ్మరు. పరీక్ష రాసి సంపాదించుకోవాలి" అన్నాడట. ఈయనకి 82. ఎప్పుడో - ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో (1948లో) రాష్ర్ట భాషా విశారద పాసయారు. గుమాస్తా వెక్కిరింత తుపాకీలాగ పనిచేసింది. ప్రవీణ్ పరీక్షకి డబ్బు కట్టి పుస్తకాలు తెచ్చుకున్నారు. 63 సంవత్సరాల తర్వాత చదువు ప్రారంభించారు. రేపు ఆగస్టులో పరీక్ష రాస్తున్నారు.
నేను కడపలో పనిచేసే రోజుల్లో జోగారావుగారని విద్యుచ్చక్తి శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఉండేవారు. తరుచు కడప మున్సిపల్ కమీషనర్ వేమరాజు నరసింహారావుగారింట్లో కలిసేవాళ్ళం. నేను సినిమాల్లో పడి ఉద్యోగం మానేశాక ఆయన గురించి మరిచిపోయాను. ఆ మధ్య ఓ పెళ్ళిలో ఒకాయన కలిసి తను జోగారావుగారి అబ్బాయినని పరిచయం చేసుకున్నాడు. "నాన్నగారు బాగున్నారా?" అన్నాను. "వెళ్ళిపోయారు" అన్నాడు. ఆయన రిటైరయాక బోరుకొట్టి, ఏం చెయ్యాలో తెలీక పి.హెచ్.డి (పరిశోధన)కి దరకాస్తు పెట్టి థీసిస్ రాశారు. మౌఖిక పరిక్షలో ప్రొఫెసర్లు ప్రశ్నలు వేస్తే ఆయన నవ్వి ప్రశ్నల్ని సవరించారట. ప్రొఫెసర్లు దండం పెట్టి "బాబూ! నీ ప్రశ్నలు నువ్వే వేసుకో, నీ సమాధానాలు నువ్వే చెప్పుకో" అని ఆయనకు డాక్టరేట్ ఇచ్చేశారట.
ఎనభయ్యో పడిలో ఉన్న ఒకావిడ చెన్నైలో అయిదారు విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఆమె పేరు శ్రీమతి ఐ.జి.పార్దసారధి. ఆమె తన 70 వ పడిలో సాంఘిక సమస్య మీద డాక్టరేట్ చేసి డిగ్రీపుచ్చుకున్నారు. ఆమెని భారత ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీతో సత్కరించింది.
మిత్రుడు, సినీ నిర్మాత మురారికి 67 సంవత్సరాలు. నిన్నంటే నిన్ననే తనకి వీణ నేర్పే సంగీతం గురువుకి కొత్తబట్టలు పెట్టి నమస్కారం చేసి వచ్చాడు.
ఈ ముదిరిన వయస్సులో ఈ సాధన వల్ల ఏం ప్రయోజనం? సమాధానానికి మరో సందర్భం. నేను ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో విశ్వనాధ సత్యనారాయణగారు చిత్తూరు వచ్చారు. మాటల సందర్భంలో ఆయన ఇంగ్లీషు నవలలు - అందునా డిటెక్టివ్ నవలలు చదివే అలవాటు ప్రసక్తి వచ్చింది. ఆయన నవ్వి "ఈ జీవితానికి ఉపయోగపడకపోతే వచ్చే జన్మకి దాచుకుంటాను" అన్న గుర్తు. ఆయన పునర్జన్మ మీద "పునర్జన్మ" అనే అద్భుతమైన నవల రాశారు.
ఈ మధ్య చెన్నై భారతీయ విద్యాభవన్లో సంగీత సభకి వెళ్ళినప్పుడు ఓ పదేళ్ళ కుర్రాడు ఆడుకుంటూ కనిపించాడు. సంగీత సభ మొదలయే టైముకి అతని తల్లి ఆ కుర్రాడిని మైకు దగ్గరికి పంపింది. అతని పేరు ప్రచోదన్. హైదరాబాదు నుంచి వచ్చిన తెలుగు కుర్రాడు. ప్రేక్షకులు నిశ్చేష్టులైపోయేలాగ అద్భుతంగా పాడాడు. ఆయన హైదరాబాదు సోదరులలో జ్యేష్టులు రాఘవాచారిగారి శిష్యుడు. కచ్చేరీ నుంచి బయటికి రాగానే ఫోన్ చేశాను. పదేళ్ళ వయస్సులో అయిదారేళ్ళు శైశవంలోనే పోతే ఇంత విద్వత్తుని ఎలా వొడిసి పట్టుకున్నాడు? విశ్వనాధగారన్నట్టు గత జన్మలో దాచుకున్నాడేమో!
ఇలాంటి ఆలోచనలు నమ్మని వారుంటారు. అదిన్నీ విశ్వనాధవారన్నారు కనుక ఛాందసమూ, అభూతకల్పన అని నాలిక చప్పరించేవారుంటారు. వారికి ఇంగ్లీషు ఉదాహరణ చెపితే రుచిగానూ, నమ్మకంగానూ ఉంటుంది. "మెనీ లైవ్స్ - మెనీ మాస్టర్స్" (ఎన్నో జన్మలు - ఎందరో గురువులు) అంటూ డాక్టర్ బ్రియాన్ వీస్ అనే అమెరికా శాస్త్రజ్నుడు అతి విచిత్రమైన, అనూహ్యమైన జన్మ జన్మల వివరాలతో సోదాహరణంగా తనకు తారసపడిన కేసుల గురించి రాశాడు.
మరొకాయన ఉన్నాడు. ఆయన 80 సంవత్సరాలు బతికాడు. చివరి అయిదు సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నాడు. తన అరవయ్యో ఏట చిత్రకళని అభ్యసించడం ప్రారంభించాడు. దానిని 15 సంవత్సరాలు కొనసాగించాడు. బహుశా జీవితంలో కొత్తవ్యాపకం, కొత్త లక్ష్యం ఆ దశలో కొత్త రుచిని కలిగించి ఉంటుంది. ఆయన రాసిన రెండు కవితల్ని రెండు దేశాలు తమ జాతీయ గీతాలుగా చేసుకున్నాయి - జనగణమణ, అమోర్ సోనార్ బంగ్లా. ఇప్పటికి ఆయనెవరో అర్ధమయి ఉంటుంది. ఆయనపేరు రవీంద్రనాధ్ ఠాకూర్.
కొత్త విషయాన్ని నేర్చుకోడానికీ, కొత్త లక్ష్యాన్ని ఏర్పరుచుకోడానికి (సాధించడం అనడం లేదు - ప్రయత్నించి వీగిపోయినా అందులో రుచి ఉంది) వయస్సు ఏనాడూ మించిపోదు. వయస్సుని మరిపించే గొప్ప ఆయుధం - కొత్త ఆదర్శం. జీవితాన్ని జీవనయోగ్యం చేసే రహస్యం. సాధించినవారు తమ సాధన మేరకు ఒక చెంచా జీవామృతాన్నయినా రుచి చూడగలుగుతారు. అది వారి వారి అదృష్టం.
మరొక్క ఉదాహరణ. చెప్పాలని మనస్సు పీకుతోంది. ఒకాయన తన ఎనిమిదవ ఏటే నాలుగు వేదాలనూ జీర్ణించుకున్నాడు. 16 వ ఏటికి అన్ని శాస్త్రాలనూ ఆపోశన పట్టేశాడు. మరో పదహారేళ్ళు మాత్రమే బతికాడు. ఆ పదహారేళ్ళూ కాలినడకన ఈ దేశమంతా పర్యటించి దేశంలో నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలను స్థాపించాడు. అన్ని శాస్త్రాలకూ అనితర సాధ్యంగా భాష్యాలను రాశాడు. హిందూ ధర్మానికి (మతం అనడం లేదు) సడులుతున్న పునాధుల్ని పటిష్టం చేశాడు. గుర్రాలమీదా, హెలికాప్టర్ల మీదా తప్ప వెళ్ళలేని కేదార క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడే తనువు చాలించాడు. ఆయన ఎన్ని దోసిళ్ళ జీవామృతాన్ని సేవించి ఉంటాడు? ఎన్ని తరాలు జాతికి జీవామృతాన్ని పంచాడు? దీన్ని కేవలం పూర్వజన్మ 'వాసన 'గా సరిపెట్టుకోలేము. ఇది ఒక జన్మకి కూడదీసుకోగల శక్తికాదు. అది మానవశక్తి ఊహించలేని సాధన. అలౌకికమైన ఆధ్యాత్మిక వైభవం.
ఆయన ఆదిశంకరులు. సాక్షాత్తూ శంకరుని అవతారం. అందుకు ఒక్క ఉదాహరణ కావాలా? ఒక్క సౌందర్యలహరి, ఒక్క శివానంద లహరి, ఒక్క మనీషా పంచకం, ఒక్క లక్ష్మీనృసింహ ఒక్క..ఒక్క..ఒక్క

 ***
జూన్ 13, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage