Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
బ్రహ్మ ముహూర్తం

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 

 
"చెడు స్నేహాలు అనర్ధదాయకం.." అన్నారు కరుణానిధిగారు తన పుట్టినరోజునాడు. ఇన్నాళ్ళకి - 88 వ ఏట - వారికి జ్ఞ్నానోదయమైంది. 'మంచి ' కోణం నుంచి చూడగలిగే మరో మహానుభావుడు - ఆదిశంకరులు - మంచి స్నేహాలు మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేస్తాయి - అన్నారు. సజ్జన సాంగత్యం జీవన్ముక్తి హేతువు అంటూ.
కరుణానిధిగారిది స్మశాన వైరాగ్యం. దొంగ డబ్బుని తినే వ్యాపారంలో - తన మట్టుకు 'మంచి' స్నేహం చేస్తున్నానని గర్వపడిన రాజా వంటి 'చెడు ' స్నేహం పుణ్యమాంటూ గడ్డి కరిచి - తక్కువ కరిచిన తన కూతురు జైల్లో ఉండగా ఎక్కువ కరిచినవారు ఇంకా పదవుల్లోనే ఉన్నారని వారి తాత్పర్యం. కరుణానిధిగారికి ఇది కనువిప్పు కాదు - ఫక్తు తెలుగువాడి గోడు లాంటిది.
వెనకటికి 'పక్కవాడు బాగుపడిపోతున్నాడు బాబోయ్!' అని ఓ తెలుగువాడు ఏడ్చాడట - భమిడిపాటి కామేశ్వరరావుగారు అన్నట్టు.
కరుణానిధిగారు రచ్చ గెలిచారుగాని - ప్రస్థుతం వారింటికి నిప్పంటుకుంది. దొంగ సొమ్ము 20శాతం తిన్న దయాళు అమ్మాళ్ పిల్లలు నిమ్మకు నీరెత్తినట్టు బయటే ఉన్నారని రాజాతి అమ్మాళ్ బాధ. మొదటి పెళ్ళాం పిల్లలు 60 శాతం తిని ఇంట్లో భోజనం చేస్తుండగా, 20 శాతం తిన్న తన కూతురు హైలు కూడు తినడం ఏ తల్లికయినా కడుపుమంటే.
రాబోయే పుట్టిన రోజుకయినా కరుణానిధిగారు - తన 89 వ ఏట - రెండు పెళ్ళిళ్ళ అనర్ధాన్ని గుర్తిస్తారని మనం ఆశించవచ్చు.
అక్కడ ఢిల్లీలో - మిగతా పార్టీ తోడు దొంగల పని అంత వైభోపేతంగా లేదు. ఏ మూలనుంచి ఏ సాధువో, ఏ అన్ణా హజారేవో వచ్చి - నిరాహార దీక్ష అంటారని వణికిపోతున్నారు. వారి గోత్రాలన్నీ స్విస్ బాంకుల్లో ఉన్నాయి. వారి వాటాలన్నీ మూటల్లో అడ్రసులు తెలియని చోటుల్లో ఉన్నాయి.
ఆ విషయాన్ని సూచనగా గ్రహించినవారు - వారిని వీధిని పెట్టాలని చూస్తున్నారు. నిన్నకాక మొన్ననే చార్టర్డు విమానంలో దిగిన బాబా రాందేవ్ గారు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడిలాగ దర్శనమిచ్చారు కాంగ్రెస్ నాయకులకి. ఉప ప్రధాని స్థాయిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ దగ్గర్నుంచి కేంద్ర మంత్రులు విమానాశ్రయంలోనే స్వాగతం పలికారు. అయిదు నక్షత్రాల హోటల్లో భేటీ వేశారు.
ఇటుపక్క రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో - రాంలీలా మైదానంలో - అయిదు నక్షత్రాల స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న విషయం వారికి తెలియకుండా ఉండదు. ఆ డబ్బు ఎక్కడినుంచి వస్తోందో తనకు స్పష్టంగా రుజువులతో తెలుసునని దిగ్విజయ సింగ్గారు టీవీ కెమెరాల ముందు బోరవిరిచారు. తెలిస్తే బాబాగారిని విమానాశ్రయంలోనే అరెస్టు చేయాలి కదా?
ఏతావాతా, మంత్రుల మంతనాలు ఫలించలేదు. కారణం - బాబాకి యోగా బాగా తెలుసు. కాని రాజకీయ నాయకుల పైయెత్తులు తెలీవు. బాబా 'గూండా, దుర్మార్గుడు' అంటూ దిగ్విజయ సింగు గారు మైకుల ముందు వీరంగం చేశారు. అంత తెలిస్తే గూండాలతో మంతనాలు జరపడం ఎందుకు? మంత్రుల మంతనాల్ని ఆపాలికదా? తమ మేడం ముందు ఆ గోత్రాలు విప్పాలికదా? అయ్యా, ఏ ఎకౌంట్లు, ఎవరివి, ఎక్కడ ఉన్నాయో వారందరికీ ఎరుక. బాబా కలిసొస్తే మహానుభావుడు. ఎదిరిస్తే గూండా. నిజానికి ఈ మంత్రాంగంలో బాబా వెర్రి గొర్రె. కాని వెనుక బోలెడంత మద్దతు ఉంది. మింగలేక, కక్కలేక, బాబాగారి అడుగులకి మడుగులొత్తి వారిని ఆపాలని చూశారు. ఎందుకు? కనిమొళికి పెద్ద వాటాదారులు - అక్కడ గాజు అద్దాల భవనాలలో ఉన్నారు కనుక.
తీరా మంతనాలు పొసగకపోయేసరికి - ఉన్నట్టుండి వీధిన పడ్డారు. అర్ధరాత్రి రాం లీలా మైదానంలో పోలీసు చర్యలో ప్రభుత్వ అనుచిత ప్రవర్తనకంటే - ప్రభుత్వ నిస్సహాయత, వారి మనస్సుల్లో, వెన్నెకల్లో పుట్టిన 'చలి 'కి నిదర్శనం.
ఈ ఒక్క అర్ధరాత్రి వీరంగం చాలు. బాబాగారి దీక్షకి అపురూపమయిన ఫలితం దక్కింది - దక్కించుకోవాలనుకున్నవారికి. అంతవరకు ముభావంగా ఉన్న కమ్యూనిష్టులు , మాయావతులూ, ములాయంలూ, ముస్లింలూ - అందరూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బాబాగారి ఉద్యమం అప్పుడే ప్రయోజనాన్ని సాధించేసింది. దేశంలో ప్రజాభిప్రాయం, రాజకీయ పక్షాల అభిప్రాయం ఒక్కటయింది.
అలనాడు - కరుణానిధిగారి మీద కక్ష తీర్చుకోవాలని అర్ధరాత్రి ఆయన్ని అరెస్టు చేయించాలన్న మేడం ప్రయత్నాన్ని - మురసోలి మారన్, వారి కొడుకు కళానిధి మారన్ కలిసి చక్కని కెమెరాల సాయంతో కరుణానిధిగారిని గాలిలోకి ఎత్తిన దృశ్యం, మురసోలి మారన్ గారు ఎదిరించిన దృశ్యం, దయాళు అమంఆళ్ ఏడుపు - కేవలం అడుగుల దృశ్యాన్ని ఒకే రోజు రెండు వందల సార్లు సన్ టీవీ ప్రసార్మ చేసింది. అలా చేస్తూనే ఉంది.
ఆనాడే డి.ఎం.కె పార్టీ పదవిలోకి వచ్చేసింది!
ప్రతిపక్షాలకు నిన్నటి రాంలీలా మైదానంలో పోలీసు చర్య బ్రహ్మ ముహూర్తం. అప్పుడే కాషాయ జెండా పదవిలోకి వచ్చేసింది. 2014నాటి ఎన్నికలు కేవలం పునరక్తి.
ఇప్పుడు ఆఖరున మొదటి మాట. చెడు సావాసాలు అనర్ధదాయకం. ఢిల్లీ నాయకులకి తమిళనాడు స్నేహితుల మాట - ఇప్పుడు చెప్పేది.

 ***
జూన్ 08, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage