Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

అపకీర్తి 'కీర్తి '
గొల్లపూడి మారుతీరావు

                                 gmrsivani@gmail.com
                                     

ప్రపంచంలో అపకీర్తికి దక్కే కీర్తి అనన్య సామాన్యం. అప్రతిహతం. అనితర సాధ్యం. అపూర్వం. అది కాలధర్మం. నేటి లోక ధర్మం. ప్రస్థుతం నడుస్తున్న సమాజ ధర్మం. నిజాన్ని సమర్ధించడానికి నా దగ్గర బోలెడన్ని సాక్ష్యాలున్నాయి.

కుష్బూ మధ్య సెక్స్ గురించి ఏదో అన్నది. ధర్మపరాయణులు, ఆదర్శమూర్తులు ఆమె మీద 21 కేసులు బనాయించారు. ఆమె పరపతి మిన్నుముట్టింది. జిల్లానుంచి రాష్ర్ట స్థాయికి అక్కడినుంచి సుప్రీం కోర్టుకి కేసులు ప్రయాణం చేశాయి. అన్ని కేసుల్నీ సుప్రీం కోర్టు కొట్టేసింది. అప్పుడేమయింది? ఆవిడ పరపతికి న్యాయమైన దన్ను లభించింది. అప్పుడేం జరుగుతుంది? అటువంటి కీర్తిపరులు వెంటనే రాజకీయాలలోకి వెళ్ళిపోతారు.

ఏదీ? జీవితమంతా శ్రీరాముడి గురించో, నీతి గురించో అంజలీదేవిగారిని మాట్లాడమనండి. మాట్లాడి రాజకీయాల్లోకి వచ్చి గెలవమనండి.

ఫూలన్ దేవి 23 మందిని ఊచకోత కోసింది. ఎన్నో దోపిడీలు, హత్యలూ చేసింది. ఒకనాడు ఆమెకి పశ్చాత్తాపం కలిగి ప్రజా జీవనంలోకి అడుగుపెట్టింది. అప్పుడేమయింది? ఆమె రాజకీయ ప్రవేశం చేసి, ఎన్నికలలో పోటీ చేసి పార్లమెంటు సభ్యురాలైంది. ఆమె జీవిత కథ చక్కని సినిమా అయింది. ఆమె అడుగుజాడల్లోనే నడిచి, అంతే ఘోరంగా హత్యలు చేసి, అలాగే మనసు మార్చుకుని ప్రజాజీవనంలోకి అడుగు పెట్టిన మరో 'బాండిట్ క్వీన్'  సీమా పారిహార్ అలాగే రాజకీయాల్లోకి అడుగు పెట్టి - తన కీర్తిని ఎల్లెడలా చాటుకుంది.

జస్వంత్ సింగ్ వంటి సీనియర్ నాయకులు తన ఆత్మకథలో ప్రధాని కార్యాలయంలో ఒక 'అవినీతీని' పసిగట్టారు. అక్కడ వేగులున్నారన్నారు. ఉన్నారో లేదో తేలలేదు కాని వారి ఆత్మకథ లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. అపకీర్తి 'రుచీ' అలాంటిది. అదే కోవలో ఆయన జిన్నా దేశభక్తుడంటూ ఒక జీవిత చరిత్రను రాశారు. మళ్ళీ లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. జిన్నా కథ చదవాలన్న కోరికా, ఉత్సాహం లేని నేనే ఒక కాపీ కొని తెచ్చుకున్నాను.

ఏదీ? నర్మదా బచావ్ ఆందోళన  చేపట్టిన మేధా పట్కర్ ని ఎన్నికలలో పోటీ చేయమనండి. 'రుచిక'ని మానభంగం చేసి చిరునవ్వులు కురిపించే రాధోడ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోతుంది.

అంతెందుకు? నిజాయితీకీ, మంచి తనానికీ పేరున్న మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు జీవితంలో ఒకే ఒక్కసారి ఎన్నికలలో పోటీ చేశారు. భేషరతుగా ఓడిపోయారు. (తరువాత ప్రధాని అయాక నాం కే వాస్తే ఎన్నిక మాట మనకక్కరలేదు.)

నాకు అత్యంత ప్రియమైన వీరప్పన్ కి వచ్చిన పేరు మన చిత్తూరు నాగయ్యగారికి వచ్చిందా? ఉత్తర ప్రదేశ్లో పదిమందిని పోగుచేసి రెండు పేర్లూ చెప్పమనండి. ఎంతమంది త్యాగయ్యని గుర్తుపడతారు? నా మాట నిజం కాకపోతే చెవికోసుకుంటాను. వీరప్పన్ బతికుంటే రాజకీయాలోకి వచ్చేవాడు. ఏదో పార్టీ కళ్ళకద్దుకుని ఆయని పార్టీలోకి ఆహ్వానించేది. ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకి వెళ్ళేవాడు. ఆయన పోయాక ఆయన జీవితం సినిమాగా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భార్య ఎన్నికలలో నిలబడింది!

మరో ఉదాహరణ - ఘనత వహించిన మన దర్శకులు రాంగోపాల్ వర్మగారు - వారి కుటుంబాలు వద్దు వద్దంటున్నా - పరిటాల రవిగారి జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏది? మేమంతా జేజేలు పడతాం - వావిలాల గోపాలకృష్ణయ్యగారి మీద సినిమా తీయమనండి చూద్దాం.

కిందటి శతాబ్దంలోకి హిట్లర్ కివచ్చినంత కీర్తి నెల్సన్ మండేలాకి వచ్చిందా? జాన్ ది రిప్పర్, బోస్టన్ స్ట్రాంగ్యులర్ మీద సినిమాలు వచ్చాయి.  ఏనాడయినా తల మాసినవాడయినా వినోభా భావే మీద సినిమా తీస్తాడా?

మరో రహస్యం చెపుతాను. సినీరంగంలో పాపులారిటీని సాధించి, స్థిరపడిన చాలామంది నటులు మొదట 'అవినీతి' కి కట్టుబడిన నెగిటివ్ పాత్రలతో ప్రారంభించినవారే. అలనాడు 'తేనెమనసులు'లో పాజిటివ్ పాత్రని వేసిన రామ్మోహన్ ఎక్కడ? కృష్ణ హీరోగా నిలిచారు. కృష్ణంరాజు, చిరంజీవి, శతృఘ్న సిన్హా , ఆఖరికి నేను, కోట - నెగిటివ్ పాత్రలలో నట జీవితాల్ని ప్రారంభించాం.

'నిప్పులాంటి మనిషి'  సినిమాలో విలన్ ప్రభాకర్రెడ్డి చేత ఇలాంటి డైలాగ్ చెప్పించాను: 'అవినీతిలాగే నీతి కూడా ఒక బలహీనతే. చేతనయికాదు, చేతకాకే కొందరు నీతికి తాకట్టు పడతారు. ఏదీ? గాంధీగారిని ఒక్కసారి జేబులు కొట్టమను. గుండె పగిలి చచ్చిపోతాడు.

కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు గాని - వారు నమ్మేఅధ్బుతమైన మానవతా విలువలకీ దైవత్వానికీ దగ్గర సంబంధం ఉంది. తమ ఆదాయాన్ని, అవకాశాల్నీ, అదృష్టాన్నీ - అన్నిటినీ అందరూ పంచుకోవాలనే అపూర్వమయిన ఆదర్శం తొలినాటి మహానాయకుల ఊపిరి.పి.సి.జోషి, పుచ్చలపల్లి సుందరయ్య, వారి సతీమణి లీల, శ్రీపాద అమృత డాంగే - వీరంతా దృక్పధానికీ, ఆశయానికీ నీరాజనాలెత్తినవారే. అయితే మన కథకి వస్తే సమాజంలో ప్రతీ వ్యక్తిలోనూ 'మహనీయత'ని మేలుకొలపడం  అసాధ్యం, అసాధారణం, అనూహ్యం. ఇది ఊహకందని ఉటోపియా. (దీనికే నమ్మే మరో ప్రపంచంలో 'దైవత్వం' గుర్తు.) విషయాన్ని 'ఇజమే' మన తరంలోనే కూలి నిరూపించింది.

అసలు రహస్యం ఏమీటంటే ప్రతీ వ్యక్తి మనస్సులోనూ ఒక 'కోతి' ఉంది. తీరని కోరికలుంటాయి. తీరని కలలుంటాయి. రకరకాల వికారాలుంటాయి. సంఘ భయమో,సమిష్టి ఆంక్షలో, చట్టమో, ప్రజాజీవనమో విశృంఖలత్వానికి లక్ష్మణ రేఖను గీస్తుంది. తాము చేయలేని, చేయాలనుకుని చేయలేకపోయేది, చేస్తే బాగుణ్ణనే ఆలోచన - అలా చేసే ఎదుటి వ్యకిని చూసి ముచ్చట పడుతుంది. మనస్సులో ఏకాంతంగానయినా వత్తాసు పలుకుతుంది. 'మానవత్వం' అత్యున్నతమైన మెట్టు. మనిషి బలహీనత - సగటు మానవుడి అంతర్ చేతనకి ప్రతీక. మనకి సాధ్యంకాని బలహీనతని చాలామంది ఎదుటి వ్యక్తిలో గుర్తుపట్టి ఆనందిస్తారు. కితకితలు పెట్టినట్టు పులకిస్తారు. సంస్కారమనే ఆంక్షని అధిగమించిన అరాచకం వారి మనస్సులో ఆమోదాన్ని పొందుతుంది.

సైకిలు చైనుతో తిరగబడి జరిగిన అన్యాయానికి బహిరంగంగా ఎదిరించి చావగొట్టే మనస్తత్వం - సమాజంలో సగటు మానవుడి 'కసి' కి నిలువుటద్దం. కూతురుని ఎత్తుకు పోయిన మాఫియా మీద ఎదురుతిరిగి కోట్ల ఆస్తినీ, వందలమందినీ చంపిన 'కమెండో' నాయకుడు మనిషి అంతరంతరాళాలలోని 'పైశాచిక'మైన తిరుగుబాటుకి ప్రతిరూపం.

మనిషిలో గొప్పగుణాలు పెరిగిన కొద్దీ - రూపం ఆదర్శమవుతుంది. ఆరాధ్యమవుతుంది. అందని మానిపండవుతుంది. అవతారమవుతుంది. ఆఖరికి గోడమీద దండవేసిన బొమ్మవుతుంది.

సైకిలు చైను తిప్పిన కుర్రాడు మన అంతర్లీనమయిన ప్రాధమికమయిన ఆలోచనలకి దగ్గరవుతాడు. బలహీనత అతన్ని మనకి దగ్గర చేస్తుంది. అవినీతి మనకి అర్ధమవుతుంది. ఇంకా బల్లగుద్ది చెప్పాలంటే మనల్ని ఆకర్షిస్తుంది. అవినీతి పని చేసి - చెల్లుబాటు చేసుకుని - స్థిరంగా నిలిచిన వ్యక్తి మన బలహీనతల మధ్య నుంచి 'విముక్తం' అయిన హీరో అవుతాడు. అతనే వీరప్పన్, హిట్లర్, ఫూలన్ దేవి, నేలబారు స్థాయిలో కుష్బూ.

తమకు గుర్తుందా? ప్రస్తుతం జైలులో ఉన్న - అయిదుసార్లు పార్లమెంటుకి ఎన్నికయిన హంతకుడు, గూండా - పప్పూ యాదవ్ జీవితాన్ని బచ్చూ యాదవ్ గా మార్చి మనోజ్ బాజ్ పాయ్ పాత్రగా మన నరాల్లోకి ఎక్కిస్తే శ్రీనివాస్ అనే దర్శకుడు తీసిన 'శూ ల్' చిత్రాన్ని జనం విరగబడి చూశారు.

అయ్యా, అనాదిగా అవినీతి, తద్వారా వచ్చే అపకీర్తి సర్వజనామోదకరం. ఆకర్షణకి పెట్టుబడి. బయటికి ఒప్పుకోకపోయినా ప్రతీ వ్యక్తి రహస్యంగాఓటు వేసే గుణం. మనకి ఫూలన్ దేవులూ, పప్పూ యాదవ్ లూ నిజాన్ని నిరూపిస్తున్నారు.

అందుకే అపకీర్తి 'కీర్తి' బలమైనదీ, చెల్లుబాటయేదీ - వెరసి - లాభసాటయినదీను.


                                                                     జూన్ 7, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage