'మతం' రేపర్లో చుట్టడం వల్ల - మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాల పరమార్ధం
మరుగున పడిపోతుంది. మతం నిజానికి రంగు కళ్ళద్దం. ఈ దేశంలో మతం అన్నమాట శతాబ్దాల
క్రితం లేదు. ఆ మాటకి వస్తే ఎక్కడా లేదు. ఏ పురాణాల్లోనూ ఈ మాట కనిపించదు. ఆ
రోజుల్లో మనకున్నది సనాతన ధర్మం. న్యాయంగా 'ధర్మం' అంటే చాలు. అది ఆనాటిది కనుక
'సనాతనం' చేర్చాం. నిజానికి ఈ ధర్మం ప్రతి మతానికీ వర్తిస్తుంది. మనిషి
చెయ్యాల్సిన విధి. ప్రవక్తల, మహానుభావుల, ప్రవచనాల, ప్రభోధాల అర్ధం ఇదే. ఈ గొడవ
ఇక్కడికి చాలు.
'మతం' రేపర్లో చుట్టకుండా రామాయాణాన్ని గొప్ప కోణంలో చూసి, చూపి విశ్లేషించారు
ప్రముఖ పరిశోధకులు, సంస్కృత పండితులు వి.రాఘవన్ గారు. (ఆయన చిత్రపఠాన్ని చెన్నై
మ్యూజిక్ అకాడమీ మినీ హాలులోకి అడుగు పెడుతూనే ఇప్పటికీ చూడవచ్చు)
సర్వకాలికమయిన విలువల్ని కలబోసిన రచన రామాయణం. అలాంటి రామాయణంలోనే ఒక లోపం
మిగిలిపోయిందట. స్వామి భక్తికి, కృతజ్ఞతకి ప్రమాణం లేకపోవడం. కొన్ని
శతాబ్దాలపాటు - కొన్ని రామాయణాల్లో ఒక పాత్రలేదు. తర్వాత దాన్ని చేర్చారట. దాని
పేరు - హనుమంతుడు. నరుడు కాదు. వానరుడు. ప్రపంచంలోకలా రెండూ గొప్ప విలువల్ని
నరుడు కాని ఒక వానరం ప్రాతినిధ్యం వహిస్తోంది. మనకి సూచిస్తోంది. ఇప్పుడు ఆయన్ని
దేవుడు చేసుకుంటే గొడవ లేదు. (ఇలా రాస్తున్నప్పుడు చాలామంది భక్తుల మనస్సులు
కలుక్కుమంటాయేమోగాని, నా పేరు 'మారుతి' అని గుర్తుంచుకుంటే కాస్త ఊరట కలగవచ్చు.)
ఏతావాతా, ఈ జాతికి కృతజ్ఞత, స్వామి భక్తి విలువకట్టలేని ఆభరణాలు. నెహ్రూగారు
పోయినప్పుడు నేను హైదరాబాదు రేడియోలో పనిచేస్తున్నాను. అప్పటి సమాచార, పౌర
సంబంధాల మంత్రి పి.వి.నరసింహారావుగారు నెహ్రూకి శ్రద్దాంజలి ఘటిస్తూ - ఈ దేశంలో
ప్రజలకి పాలించే నాయకుడే కాక, ఆరాధించే ప్రభువూ కావాలి అన్నారు. తమకి బాగా
నచ్చిన, తాము బాగా మెచ్చిన లేదా మేలు చేసే 'పెద్ద' కి జీవితంలోనే పెద్ద పీట
వేయడం ఈ జాతికి వ్యసనం.
ఒబామాకి ఎక్కడా గుడి ఉన్నట్టు మనం వినలేదు. ఘంటశాల గారికి గుడి ఉంది. ఎంజీఆర్
కి గుడి ఉంది. జయలలితకి గుడి ఉంది. ఎన్టీ ఆర్ పాదాల మీద నెలల బిడ్డని ఉంచి -
ఆయన చేత పేరు పెట్టించుకున్న సందర్భాలని నేను ఆయన పక్కన నిలబడి కళ్ళారా చూశాను.
తమ నాయకుల్ని గౌరవ స్థాయిలో ఆపడం మన జాతికి సాధ్యం కాదు. లేదా మనస్సు ఒప్పదు. ఆ
పరిధిని దాటి ఆయనని 'వేలుపు'గా, 'దేవుడు'గా నిలుపుకుంటే తప్ప ఊరట కలగదు. ఇది
జాతి బలం అందామా? బలహీనత అందామా? స్వభావం అందామా? ప్రత్యేకత అందామా? వికారం
అందామా? - స్థూలంగా వీటన్నిటికీ వర్తించే గుణమిది.
ఏకపత్ర్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, దానవుల్ని సంహరించే యోధుడు, అబద్ధం
చెప్పనివాడూ, పరిపాలనా దక్షుడూ, మనోహరుడూ, మంగళ స్వరూపుడూ - శ్రీరాముడు - మనకి
దేవుడు. ఈ గుణాలు అతన్ని దేవుడిని చేశాయా? ఆయన దేవుడు కనుక ఈ గుణాలన్నీ అబ్బాయా
అన్నది చరిత్ర. మొదటిది ఆదర్శం. రెండోది ఆరాధన. మొదటిది మార్గదర్శకం. రెండోది
పారమార్ధికం. మొదటిది విశ్లేషణాత్మకం. రెండోది విశ్వాసాత్మకం.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే అతి ప్రాధమిక స్థాయిలో - అతి మామూలు జీవితాన్ని
గడిపే ఒకాయన - తమిళనాడులో
అవనియాపురం అనే గ్రామంలో ఉన్నాడు. అతని పేరు ఉదయకుమార్. ఆయన తండ్రికి ఎంజీఆర్
దేవుడు. ఆయన్ని ఆరాధిస్తూ గడిపాడు. ఆయన కొడుకు ఉదయకుమార్, అమ్మ(జయలలిత)ని
ఆరాధిస్తూ గడిపాడు. ఆమె కోసం దేవాలయాల్లో పూజలు చేశాడు. మొక్కుకున్నాడు.
ప్రార్ధనలు చేశాడు. ప్రస్తుతం ఈయన జయలలిత మంత్రివర్గంలో సమాచార, సాంకేతిక శాఖ
మంత్రి అయాడు. (భక్తులకు దేవుడు వరాలు ఇవ్వడని ఎవరనగలరు!) ఇతనికి ఒకటే నియమం.
అమ్మ నడిచిన నేలమీద చెప్పులు వేసుకుని నడవరాదు. (అమ్మవారు - అలమేలు మంగ స్వామి
కోసం ప్రతి రాత్రీ తిరుమలకి వస్తుందని నమ్మే భక్తులు తిరుమలలో పాదరక్షలు
వేసుకోరు) ఒక దశాబ్దంగా ఆ పనే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మంత్రిగారు చెప్పులు
లేకుండానే ఆఫీసుకి వస్తున్నారు. మెరిసే బూట్లతో, పాదరక్షలతో వచ్చేవారంతా ఆయన
కాళ్ళు చూసి కంగుతిని - గుమ్మం దగ్గరికి పరిగెత్తుతున్నారట తమ పాదరక్షలు
విప్పడానికి.
"నా ఆరాధన ఎవరికీ ప్రతిబంధకం కాదు. నా విశ్వాసం నాది. ఎవరూ దీన్ని
పాటించనక్కరలేదు. ఆక్షేపించనక్కరలేదు" అంటారు ఈ అమ్మ భక్తుడు.
అయ్యా, ఎవరి భక్తివారిది. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి. పరాయి దేవుళ్ళు కారణంగా మన
కొంపల మీద బాంబులు పడితే బాధపడాలిగాని - జయలలితని కొలిచే ఈ చెప్పుల్లేని భక్తుల
వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు.
కాగా, విశ్వాసం వెర్రితలలు వేసే స్థాయికి వచ్చిన సందర్భమిది. ఆ మాట 'రాముడు '
విషయంలోనూ కొందరు అనొచ్చుకదా? అంటున్నారు కదా? 'విశ్వాసం' వింత కొలబద్ద. దాని
తూనికరాళ్ళు - శ్రీ కృష్ణ తులాభారంలో తులసి దళం. ద్రౌపది వస్త్రాపహరణంలో
స్థ్రోత్రం. కురుక్షేత్రంలో ప్రార్ధన. అవనియాపురంలో - పాదరక్ష. అలా
సరిపెట్టుకుంటే గొడవలేదు. తాటిచెట్టునీ తాతపిలకనీ ముడివేసిన సందర్భంగా ఇది
కొందరికి కనిపించవచ్చుకానీ - తీగెలాగితే డొంక కదిలే విచికిత్స ఇది.