Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
గొర్రెదాటు
గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com

    చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రదర్శనలకు వెళ్లినప్పుడు నా నాటిక ''దొంగగారొస్తున్నారు స్వాగతం చెప్పండి'' ప్రదర్శించాం. అందులో తాగుబోతు మేనమామ జే.వీ. సోమయాజులు లాయరు. మేనకోడలు తులసి. నెక్లెసు దొంగతనం జరిగింది. పడకగదిలోనే దొంగ పట్టుబడ్డాడు. ''తలుపు వేసియున్న కారణాన మీకు సహాయం చెయ్యాలన్న ఆతృతతో ఫలానా పెద్దమనిషి కిటికీలోంచి దూకి నీ వస్తువు మీకు ఇచ్చిపోదామని వచ్చివుండొచ్చుకదా?'' అంటాడు మత్తులో ఉన్న లాయరుగారు. దొంగకీ పెద్దమనిషికీ ఉన్న వ్యత్యాసాన్ని ఇంత ఉదారంగా విశ్లేషిస్తాడు. ఈ మధ్య తిరణాల లాగ -కేంద్ర మంత్రులూ (ఎ.రాజా), పార్లమెంటు సభ్యులూ (సురేష్‌ కల్మాడీ, కనిమొళి), ముఖ్యమంత్రులూ (మధుకోడా, యెడ్యూరప్ప, రాష్ట్ర మంత్రులు (మోపిదేవి), ఇక ఐయ్యేయస్‌లు సరేసరి (శ్రీలక్ష్మి, ఆచార్య, వి.డి.రాజగోపాల్‌, ప్రదీప్‌శుక్లా, గుజరాత్‌, అరవింద్‌ జోషీ టినూ జోషీ -యిలా) జైళ్లకు వెళ్లి వస్తున్నారు. అభియోగాలున్నవారూ, ఇంకా వెళ్లవలసినవారూ చాలామంది ఉన్నారని మనం వింటున్నాం. నేర పరిశోధక సంస్థ పరిశోధన జరిపి వారు నేరాలు చేశారని సాక్ష్యాలు చూపాక, న్యాయస్థానం అవి నేరాలేనని నిర్ధారణ చేసుకున్నాక అరెస్టులకు ఆమోదించాక కూడా వారు విచిత్రమైన వాదనలను వినిపిస్తున్నారు.
''నేను చేసినా పని ప్రధానికి ముందే చెప్పేశాను'' అని ఒకాయన అంటారు. అంటే ప్రధానికి చెప్పడం వల్ల అవినీతి నీతి అవుతుందా? లేక ఈ అవినీతిలో ప్రధానికి వాటా ఉందని తాత్పర్యమా? ఈ మంత్రిగారు దాదాపు పది నెలలు జైల్లో ఉండి వచ్చారు. నిరపరాధిగా కాదు, బెయిల్‌మీద. ఓ ఐయ్యేయస్‌ ఆఫీసరు నేను రాకముందే జీవోలు తయారయాయి. మంత్రిగారు సంతకాలు పెట్టమన్నారు. నేను కేవలం సంతకాలు మాత్రమే పెట్టాను -అని వాక్రుచ్చారు. మంత్రిగారు సంతకాలు పెట్టమంటే, పెట్టమన్న చోట సంతకాలు చెయ్యడానికి ఐయ్యేయస్‌లే అక్కరలేదు. ఇంటి నౌఖర్లు చాలు. (అయితే అలాంటి తెల్లరేషన్‌ కార్డుదారుల భాగోతాలూ ప్రస్తుతం మనం వింటున్నాం) ఈ దేశం గర్వించే పాలక వ్యవస్థకు దన్నుగా నిలిచి -రక్షణ, దక్షత కల్పించే ఉద్యోగ శ్రేణిగా రూపుదిద్దుకున్న సివిల్‌ సర్వీస్‌ ఆఖరికి ఈ దశకి వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ ఉద్యోగానికీ యింత రక్షణ కల్పించిన దాఖలాలు లేవు. నిజానికి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిన నాయకులకు సజావయిన పాలక యంత్రాంగపు మద్దతునిచ్చే 'పెద్దరికం' సివిల్‌ సర్వీసులది. వారి కుతంత్రాలకు తాళం వేసే భజనపరులు కాదు.
ఈ దేశంలో అవకాశ వాదం నీతిని గొయ్యి తీసి కప్పెట్టింది. ఒక లాల్‌ బహదూర్‌ శాస్త్రికీ, ఒక వావిలాలకూ, ఒక టంగుటూరికీ అర్థంకాని వ్యవస్థ ఇది. మంత్రిగారు చెప్పినట్టు సంతకాలు చేసి తలవొంచుకు జైళ్లలోకి పోయే ఈనాటి ఆఫీసర్లు -అలనాటి జె.పి.ఎల్‌.గ్విన్‌, హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌, వి.కె.రావు (యిప్పటికీ తొంభైయ్యవ పడిలో ఉన్నారు) -వంటి వారిని చూసిన ఈ తరానికి షాక్‌, బాధ కలుగుతుంది. అయితే అప్పటి నాయకుల శ్రేణులకీ ఇప్పటికీ పోలిక లేదు. ఇప్పటివారంతా సామ్యం తెస్తే మరుగుజ్జులు. న్యాయంగా ఇది అందరి గురించే అనాల్సిన మాటకాదు. ఉన్న ఆ కాస్త నీతిపరులూ తాటిచెట్టుకింద పాలు తాగుతున్నారు. అదే దురదృష్టం. ఇక మంత్రులు. ''మా నాయకుడు చెప్పారు కనుక చేశాం'' అనడం విడ్డూరంగా ఉంటుంది. అది అవినీతి పని అని తెలిసే చేశారా? అప్పుడు తమకూ ఆ కార్యక్రమంలో వాటా ఉందికదా? సమిష్టి బాధ్యత ఏమయింది? తెలియక చేశారా? అప్పుడు నాయకుల ప్రసక్తి ఎందుకు? మీరే బాధ్యులు కదా? ఒక కుంభకోణంలో మేనేజింగ్‌ డైరెక్టరూ, ఒప్పందాల మీద సంతకం చేసినవారూ అంతా జైళ్లలో ఉండాల్సిన నేరస్థులుగా కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున సంతకాలు చేసిన నాయకత్వం నిర్దోషి ఎలా అవుతుంది? చేస్తున్న పని సబబో కాదో నిర్ణయించుకునే విచక్షణ లేని స్థాయిలో బాధ్యతల్ని చేపట్టారా? నిర్ణయించగలిగితే పర్యవసానంలో కుంభకోణంలో వారికీ వాటా ఉన్నట్టే కదా? సుప్రీం కోర్టు కూడా ఎత్తిచూపిన లొసుగులున్న నాయకులు -తమ 'పెద్దల' గొడుగుకింద సాకుల్ని వెదకడం విడ్డూరం. ఈ సంవత్సరం మార్చి 21 ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కె.భాషిన్‌ ఒక తీర్పు నిచ్చారు. (చూ.హిందూ.22.3.2012. పేజీ 4) ఇది ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లకీ, మేనేజింగ్‌ డైరెక్టర్లకీ, రాష్ట్రపతులకీ, ప్రధానులకీ, ముఖ్యమంత్రులకీ, నాయకులకీ వర్తిస్తుందని చెప్పిమరీ ఈ వార్తని పత్రిక ఉటంకించింది.
తమరు చాలా బిజీగా ఉండి తమ హయాంలో వున్న పరిపాలనలో అవకతవకలూ, అక్రమాలను తెలుసుకోలేకపోతే అది సమర్థన కానేరదు. నాకు తెలియదని తప్పించుకునే వీలులేదు. నన్ను విడిచి పెట్టండి కాని నాకిందనున్న వాళ్లందరినీ ఉరితీయండి అనే ధోరణిని న్యాయమూర్తి విమర్శించారు. ఇవీ న్యాయమూర్తి మాటలు: ఒక నౌక కెప్టెన్‌గా తన హయాంలో అవినీతి జరిగినప్పుడు -ఒంటరిగా బోటు తీసుకుని నౌకలోంచి గెంతి పారిపోవడం తగదు. కెప్టెన్‌గా అతనూ నౌకలో ప్రయాణం చెయ్యాల్సిందే. లేదా సిబ్బంది అందరితోనూ కలిసి మునిగిపోవాలి''. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో నేటి 'నిజాయితీ' రూపు రేఖలు తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న మొన్నటిదాకా ఒసామా బిన్‌ లాడెన్‌ ఎక్కుడున్నారో తెలియదంటూ చెప్పింది పాకిస్తాన్‌. (ఇప్పటికీ మహమ్మద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమూన్‌ ఎక్కడున్నారో తెలీదు -అంటోంది). తీరా అమెరికా- పాకిస్తాన్‌ సైనిక స్థావరాలకు పక్కనే ఉంటూ, పెళ్లానికి మూడు పురుళ్లు పోయించిన బిన్‌ లాడెన్‌ని చంపాక- ఈ విషయాన్ని అమెరికాకు తెలిసేటట్టు చేసిన షకీల్‌ అఫ్రిదీకి 33 ఏళ్లు కఠిన శిక్షని విధించింది.
తమకి తెలిసింది అమెరికాకు తెలియజేసినందుకా? ప్రస్తుతం రుజువులు కళ్లముందు కనిపిస్తూండగా నిరపరాధులమనే మన నాయకుల నేరాలు రుజువు కావడానికి మరెవరో పూనుకోవాలి. అప్పుడు పాకిస్తాన్‌ సంప్రదాయంలో రుజువులు చూపించినవారిని జైళ్లకి పంపించే గుండె ధైర్యాన్ని కూడదీసుకుంటామేమో. అవినీతిపరుడికి ఆత్మవంచన వెన్నతో పెట్టిన విద్య. తమ ముందున్న రుజువులతో నేరం జరిగిందని నమ్మి ప్రతిరోజూ జైళ్లకు పంపించే ఆఫీసర్లు, నాయకులూ తాము నిర్దోషులమని -ఆ మంత్రులో, తమ నాయకులో, ఆనాటి ముఖ్యమంత్రో, ప్రధానో, ఆర్థిక మంత్రో మరెవరో మరెవరో చెప్పగా చేశామని, చెప్పి చేశామని, చేసి చెప్పామని, తెలిసేటట్టు చేశామని అనడం ఆశ్చర్యంగానూ, ఆత్మవంచనగానూ ఉంటుంది. నేరం అభియోగానికీ, రుజువు కావడానికీ కనీసం 18 సంవత్సరాలుంటుంది దురదృష్టవశాత్తూ ఈ దేశంలో. ఉదాహరణ: పండిత్‌ సుఖ్‌రాం. ఈ 18 సంవత్సరాలూ ఆయా ఆఫీసర్ల, నాయకుల బుకాయింపుల్ని భరిస్తూ -పదే పదే వారిని ఎన్నుకునే గొర్రెదాటు వ్యవస్థ పేరు -ప్రజాస్వామ్యం.

   

మే 28,2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage