Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

కొత్త లెక్కలు

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                     

సరిగ్గా ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చే యేడు ఈ దేశంలో కులాలను ఉటంకించే జనాభా లెక్కలు జరగనున్నాయి. ఈ సారి ఆరువేల కులాలతో పాటు అరవై అయిదు వేల ఉపకులాలు సాధికారికంగా పరిగణనలోకి వస్తాయి.ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై మూడు  సంవత్సరాలలో కొన్ని చిన్న కులాల ఉనికి దాదాపు సన్నగిల్లిపోయింది.అవి పెద్దకులాలతోనో లేదా పూర్తిగానో మరిచిపోయారు. వారు తమ కులాల్ని గుర్తుంచుకోవడం, గుర్తించడం మానేశారు. కానీ ఈ జనాభా లెక్కల్లో అవన్నీ పైకి తవ్వుతారు. మరిచిపోయినవారికి మరోసారి గుర్తుచేసి " నీ కులం ఇది అని మరిచిపోకు బాబూ. అందువల్ల నీకే లాభం ఉంటుంది " అంటే అతనికేం పోయింది? ఇందులో విశేషమేమిటంటే 'నాది ఫలాన కులం ' అని ఓటరు చెప్పుకోవడం వినా, అవునో కాదో తేల్చుకోగలిగిన, తేల్చవలసిన, తేల్చుకోవలసిన పని ఈ జనాభా లెక్కలవారిది కాదు. రేపు 'కులా ' ల ప్రాతిపదికగా అతను రిజర్వేషన్ తన హక్కంటూ నిలదీసిన నాడు అది తేల్చుకు చావాల్సిన పని ఆ శాఖది. కాదంటే కావలసినన్ని కోర్టులున్నాయి.రేపు 71,00 0 వేల కులాల కొత్త సమస్యల కొత్త కేసులు కోర్టులకి పుష్కలంగా అందుతాయి. కనుక - ఈ కొత్త లెక్కల  నిజానిజాలని నిర్థారించుకునే  బలగం , యంత్రాంగం ముందు ముందు అనూహ్యంగా పెరగనుంది. ముందు ముందు ఇందువల్ల కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

 మరో విషయం 'పంజర ' అనే తెగ మహారాష్ట్ర లో ఓబీసీ కింద లెక్క. కర్ణాటకలో షెడ్యూలు కులం కింద లెక్క. ఆంధ్రాలో షెడ్యూలు జాతి కింద లెక్క. మీనాలు రాజస్థాన్లో గిరిజనుల కింద లెక్క. మధ్యప్రదేశ్ లో ఓబీసీ ల కింద లెక్క. అలాగే జాట్లు ఢిల్లీ , ఉత్తరప్రదేశ్, హిమాచలప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఓబీసీల కింద లెక్క. కాని కేంద్రీకృతమైన ఓబీసీ జాబితాలో వారికీ పరిగణన లేదు. నిజానికి ఏ కులానికీ సర్వజన సమ్మతమైన పరిగణన లేదు.నోరున్నవాడిదే రాజ్యం. ఆ మధ్య టికాయత్ అనే రైతువీరుడు ఆందోళన చేపట్టి దాదాపు రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వాన్ని దించినంత పనిచేయడం గుర్తుండే వుంటుంది. ముందు ముందు 71 వేల కులాల టికాయత్ లు రాబోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వేళ్ళతో కదులుతాయో వేచిచూడాలి.

ఈ ఎన్నికల జాబితాలకు తప్పుడు సమాచారం యిచ్చిన వారికి వెయ్యిరూపాయల జరిమానా. నాకు నవ్వొస్తోంది. అయితే మారుమూల కుగ్రామంలో తినడనికి తిండి లేని బడుగుకి వెయ్యి ఎక్కువే కావొచ్చు. కానీ ఈ షరతుని వెసులుబాటు చేసుకునే వారెంతమందో! ఉదాహరణకి  - 2011 లెక్కల పుణ్యమా అని వెనుకబడిన  కులాలవాడిగా తప్పుడు సమాచారం యిచ్చిన ఓ నిశానీ కొడుకు పెద్ద ఉద్యోగి అయి - కావలసినంత ఆదాయం పోగుచేసుకోగా  మరో పదేళ్ళకి చదువులేని వాళ్ళ నాన్న చచ్చిపోతే - అప్పుడీ 'లొసుగు ' బయటపడితే ఏ వెయ్యి రూపాయలు ఆ కుటుంబపు అదృష్టాన్ని బేరీజు వెయ్యగలదు?

ఇలాంటి లెక్కల్ని బహిరంగంగా చిదంబరంగారు వ్యతిరేకించారు. మన్ మోహన్ సింగ్ గారు మెల్లగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ లోగా గాంధీగారు నిర్ణయం తీసేసుకున్నారు. పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు - కేవలం ముగ్గురే ఉప్పొంగిపోయారు. ములాయం సింగ్, లల్లు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్. వారి అవసరం , ఆ మాటకు వస్తే అంతే వెనుకబాటు తోనే ఉన్న మాయావతి ప్రభుత్వానికి చాలా వుంది. అప్పుడే ఎన్నికలకు వచ్చే దమ్ము ఏ పార్టీకీ లేదని ప్రణబ్ ముఖర్జీ బుకాయించారు గాని ఈ ముగ్గురివల్లా తమ పబ్బం గడిచిందనడం నిర్వివాదాంశం. కనుక పార్టీలు, నాయకులు కలిసి రావాలంటే , అంతకు మించి పరిపాలన కొనసాగాలంటే , తామే రాజ్యమేలాలంటే బ్రిటీష్ వారి హాయాం లో అనవసరమని 16 సంవత్సరాలూ, మన హయాంలో 63 సంవత్సరాలూ మూలపడేసిన 'కులం ' ని తిరుగతోడాలి.

ఈ మధ్యనే లోక్ సభలో శరద్ యాదవ్ గారు బల్ల గుద్దారు. 20 మంత్రిత్వశాఖల్లో, 18 విభాగాల్లో ఏ గ్రూపు ఉద్యోగాల్లో ఒక్క ఓబిసి మనిషి కూడా లేడన్నారు. (రిజర్వేషన్లకీ సామర్ధ్యానికీ, కులాలకీ దక్షతకీ సంబంధం గురించి చర్చ ఈ కాలం కి సంబంధించింది కాదు.) అంతేకాదు. జనాభాలో 52 శాతం యాదవులు, కుర్మీలూ, లోధ్ లూ, కోయిరీలూ ఉండగా కనీసం 10 శాతమయినా ఐయ్యే యస్ లు లేరని కోపం తెచ్చుకున్నారు. అప్పుడే ఏమయింది? ముందుంది ముసళ్ళ పండగ. మనకి గుద్దడానికి బల్లలు సరిపోనంత మంది ఇలాంటి బొచ్చెడు అన్యాయాల్ని ఉటంకించబోతున్నారు. ఇలాంటి లెక్కల వల్ల మొదట ప్రస్తుతం ఉన్న ఓబీసీల చాపల కిందకే నీరొస్తుందని ఉదిత్ రాజ్ అనే ఒకప్పటి దళిత ఆఫీసరు, ప్రస్తుత ర్రాజకీయనాయకులు వక్కాణించారు.

రాజకీయమైన పబ్బం గడుపుకోడానికి సామాజిక శ్రేయస్సునీ, సమాజ కళ్యాణాన్నీ తాకట్టు పెట్టడం మన దేశంలో కొత్త కాదు. పదవికోసం అన్న కళ్ళు పీకించిన మొగల్ పాలకులు, పదవుల కోసం దేశాన్నే సైనిక పాలనలోకి తెచ్చిన పొరుగు దేశాల సైన్యాధికారులు చేసిన దురన్యాయం కన్నా ఇది భయంకరమైనది. ఇది ఎవరూ ఆపలేని సమాజ మూలాలను కొరికేసి, కొన్ని దశాబ్దాల తర్వాత కాని కనిపించని చీడ.

అలనాడు దేవీలాల్ ఢిల్లీలో చేయబోతున్న బలప్రదర్శనకు జవాబుగా బొత్తిగా బలం లేని - 'నీతి  ని కోటు బొత్తాంలాగ వాడుకున్న వీపి సింగ్ గారు అప్పటికే దశాబ్దం పైగా అటకెక్కిన మండల్ సిఫార్సులను బూజు దులిపి కిందకు దించారు. దాని పర్యవసానంగా  ఎందరు టికాయత్ లో, ఎన్ని శిలవిగ్రహాలో, ఎన్ని పరిణామాలో దేశం చూస్తున్నది. ఇప్పుడిది కేవలం 'మండల్ 2 ' అని రాజకీయ మేధావులు వక్కాణించారు. అమూల్య గంగూలీ అనే రాజకీయ సమీక్షకుడు ' ఇది కులాల పిచ్చాసుపత్రి ' అన్నాడు.

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సీనియర్ ఫెలో దీపాంకర్ గుప్తా మాటల్ని కేవలం తెలుగులో రాస్తున్నాను ' ప్రపంచంలో ఎవరెవరు ఏవేం చెయ్యగలిగినా, అంతకంటే ఘోరంగా తాము చెయ్యగలమని మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ౠజువుచెయ్యడానికి నడుం కట్టుకున్నది. ఈ కృషిలో వ్యక్తిగతమైన సామర్థ్యం, ఉత్సాహం( ఇనిషియేటివ్) చచ్చిపోనీ గాక, పరిణామాల స్థాయి దిగజారనీ గాక, వృత్తి పరమైన నీతీ, నిజాయితీ మంట గలవనీగాక, ఏమీ దిగులు పడనక్కరలేదు. మనమింకా చాలా అధహ్ పాతాళానికి క్రుంగిపోగలం '

'పెండోరా బాక్స్ ' కి తెలుగు అన్వయం తెలిస్తే బావుణ్ణు. తెరిస్తే మూలపడిన వెయ్యిరకాల సమస్యల పుట్టని బయటికి చిమ్మే 'అర ' అనుకోవచ్చు. ఎందరో రాజకీయ మేధావులు ఇటువంటి 'అర ' ని రాజలాంఛనాలతో, సాధికారికంగా ప్రభుత్వం తెరుస్తోందని వక్కాణించారు.

ఈ మధ్యనే ఖాప్ పంచాయితీల గురించి, తమ కులాలనూ, కులాచారాలనూ దాటి పెళ్ళి చేసుకున్నవారిని నిలదీసి , నిర్ధాక్షిణ్యంగా చంపిన కథలు చదువుకున్నాం. 22 ఏళ్ళ నిరుపమ అనే బ్రాహ్మణ అమ్మాయి, రంజన్ అనే కాయస్థుడి ప్రేమలో పడింది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి విచిత్రమైన పరిస్థితుల్లో హత్యకు గురైంది. కారణాలు వెదకడం అనవసరం.

ఆ మధ్య కర్నాల్ సెషన్స్ కోర్టు 23 ఏళ్ళ మనోజ్ ని పెళ్ళాడిన 19 ఏళ్ళ బాబ్లీని చంపినందుకు ఖాప్ పంచాయితీ నాయకుడు గంగా రాం కీ, మరో 5 గురికీ ఉరి శిక్ష విధించడం గుర్తుండే ఉంటుంది.

ఢిల్లీ విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాట్రీసియా ఊబెరాయ్ యిందుకు కారణాలను వివరించారు. ఒకప్పుడు పైస్థాయిలో ఉన్న మీది కులాల వారు - ఏయే ఆర్థిక కారణాలవల్ల నయితే నేమి - అలా ఉండలేక - ముఖ్యంగా పంజాబు , హర్యానా వంటి ప్రాంతాలవారు వ్యవసాయ కుటుంబాల శ్రీమంతులు - ఒకప్పుడు డబ్బు, అధికారం చేతుల్లో ఉండగా - వెనుకబడిన వారికీ, దళితులకీ ఈ అవకాశాలు దక్కడమనే న్యూనతా భావం - తమ పెద్దరికాన్నీ నిలుపుకోవాలనే నిస్సహాయమైన పట్టుదలా - యిలాంటి దారుణాలకి కారణం - అన్నారు. ఆ ప్రాంతం నుంచే వచ్చిన నవీన్ జిందాల్ అనే నేటితరం యువనాయకులు ఈ పంచాయితీలను సమర్థించారు. ఇది కేవలం ప్రారంభమనీ, ముందు ముందు ఇలాంటి ఖాప్ నేరాలు, ఇలాంటి నాయకులెందరో దర్శనమిస్తారనడానికి స్థాయీపుళాకన్యాయంగా ఇవి కేవలం ఉదాహరణలు.

రేపు 65 వేల కులాల నాయకులు - 'ప్రాంతీయ ' అనే మాట అచిరకాలంలో మూలనబడి, బీహార్ 'కుమ్మీ ' నాయకులు, రాజస్థాన్ 'బొమ్మీ ' నాయకులు అని పిలుచుకునే రోజులు వస్తాయి. ప్రస్తుతం నితిష్ కుమార్, లల్లూ ప్రసాద్ ల ప్రణాళికా మేధా సంపద 'చిన్న పిల్లల ' ఆటగా పరిహసించే రోజులొస్తాయి. అమూల్య గంగూలీ అంటారు ' వీరి ఆలోచన 'ప్రాంతీయ ' శ్రేయస్సుని పక్కకి పెట్టి తమ  'కుల ' శ్రేయస్సుకి మాత్రమే పరిమితమై పోతుంది.. ' 

ఈ దుర్దశకి కారణాన్ని ఒకాయన చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు. మనకు సమాజ సమగ్ర శ్రేయస్సు గురించి ఆలోచించే తిలక్ లూ, గాంధీల రోజులు పోయాయి. ప్రాంతీయాల్ని గురించి ఆలోచించే లల్లూలు, కరుణానిధులూ పోబోతున్నారు. అలనాటి నాయకుల సామాన్య గుణం సమస్త మానవాళి 'ప్రేమ ' అయితే , నేటీ అవకాశ వాదానికీ , పదవులకీ, పబ్బం గడుపుకోడానికీ , వెరసి, తమ బొజ్జ నింపుకోడానికి సామాన్య గుణం - ద్వేషం, ఆత్మ న్యూనతా భావం. నాకు సాక్షులు ఊబెరాయ్ లాంటి వారు.

ఏ సమాజాన్ని ద్వేషం ఉద్ధరించదు. మొదళ్ళను వేరుపురుగులాగ తినేసి, క్రమంగా కాండాల్లోకి వ్యాపించి, ఆకు ఎండిందని గుర్తుపట్టేలోగా ఆసాంతం కూలిపోతుంది.

అత్యంత చర్చనీయాంశమైన ఈ విషయాన్ని విశ్లేషించడంలో కేవలం వాస్తవాలనూ, ప్రముఖుల అభిప్రాయాలనీ ఉటంకించడం మాత్రమే చేశానని గమనించగలరు.

   

   మే 24, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage