Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
పాపం....?

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 

.
తమిళనాడు ఎన్నికలకు ముందు ఎన్ డీ టీవీ పాత్రికేయురాలు బర్ఖాదత్ కరుణానిధిగారిని చెన్నైలో ఓ ప్రశ్న వేసింది. "జయలలిత గురించి తమరు చెప్పేదేమైనా ఉన్నదా?" అని. కరుణానిధిగారు క్లుప్తంగా "పాపం" అన్నారు. బర్ఖాదత్ కిసుక్కున నవ్వుకుంది.
కరుణానిధిగారు నాస్తికులు కనుక, వారికి పాపపుణ్యాల మీద నమ్మకం ఉండదు కనుక ఈ పాపానికి అర్ధం జయలలిత మీద జాలో, రోగం కుదురుతుందన్న వ్యంగ్యమో అనుకోవాలి . ఇది జరిగి కేవలం నెలరోజులు కూడా కాలేదు.
2జి అవినీతికి ప్రపంచ చరిత్రలోనే ఓ గొప్ప స్థానం లభించింది. దిక్కుమాలిన పనులు చేసిన ప్రపంచనాయకుల జాబితాను అమెరికా టైమ్‌స్ పత్రిక జాబితా సిద్ధం చేసింది. అధికార దుర్వినియోగం చేసి, పదవిని పావుగా వాడుకున్న మహానాయకుల దరిద్రపు ఘనతకి ఈ జాబితాలో చోటుంటుంది. ఈ జాబితాలో ఏ.రాజాగారి ఘనత - 7 బిలియన్ల డాలర్లు ఫలహారం చేసిన ఘనత - రెండో స్థానంలో నిలిపింది. మరి మొదటి స్థానం? వాటర్ గేట్ కుంభకోణం కారణంగా నిక్సన్ దొరగారిది. ఇక రాజాగారు జయించిన మిగతా ఘనులు? లిబ్యా అధ్యక్షులు గద్దఫీ, ఉత్తర కొరియా నాయకులు కిం యోంగ్, ఆడపిల్లల మోజు విడని యూఢుడు, ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ.
ఏమైనా ఇది అనితర సాధ్యమైన ఘనత. ఇందులో రాజా తర్వాత లేదా రాజాతో అన్నిటినీ పంచుకున్న కరుణానిధిగారి కూతురు కనిమొళికే ఈ తాంబూలం దక్కుతుంది.
ఇలాంటి పర్యవసానం పత్రికలు, న్యాయ వ్యవస్థ సాధించిన విజయం. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, పటేల్, తిలక్, పట్టాభి సీతారామయ్య వంటి మహనీయులెందరో జైళ్ళలో ఉన్నారు. తరతరాలు గర్వపడే వైభవమది. ప్రస్తుతం ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులు - అందులో ఒక ముఖ్యమంత్రిగారి ముద్దుల కూతురు, ఎందరో కార్పొరేట్ పెద్దలు ఉన్నారు. మరో విధంగా తరతరాలు గుర్తుంచుకోవలసిన క్షణమిది.
'వాడి పాపం పండుతుంది' అనుకోవడమే కాని పండడం లేదని వాపోయే ప్రజల నిర్వేదానికి నిన్న కనిమొళి జైలుకి వెళ్ళిన దృశ్యం - చక్కని ఊరట. "మీకూ ఒక కూతురుంటే - ఆమె చెయ్యని నేరానికి జైలుకి వెళితే.." అని వక్కాణించిన ఆమె తండ్రి, మహా రచయిత, ఒకప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిగారు వాపోయారు. ఏ నేరమూ చెయ్యకపోతే కోట్ల పెట్టుబడితో తమ పేరున టీవీ ఛానల్ ఎలా వెలిసిందో తెలియని అమాయకులు వారు కారని దేశానికి తెలుసు. తమ కొడుకులూ, కూతుళ్ళూ, మేనల్లుళ్ళూ, ఇంకా కూతురి ఆత్మీయులూ కోట్ల రూపాయల్ని ఫలహారం చేస్తూంటే ఏ నల్ల కళ్ళజోడుతో వారు ఈ 'నిరపరాధుల్ని ' పరికించారో కోట్లాది ప్రజలు గమనిస్తున్నారన్నది నిన్నటి ఎన్నికలు తేల్చి చెప్పిన సత్యం. నిన్న కోర్టులో కనిమొళి ఏడ్చిందట. ఈ మెలో డ్రామాని ప్రజలు హర్షించలేదు. నేటి పత్రికలన్నీ రంగు రంగుల కనిమొళి బొమ్మలతో పండగ చేసుకున్నాయి. అందరూ జైళ్ళలో పక్కపక్కనే ఉన్నారట. కనిమొళి కళ్ళజోడు, కాగితాలు అడిగినట్టు పత్రికలు చెప్పాయి. భేష్. ప్రపంచ సాహిత్యం గుర్తుంచుకోతగ్గ రచనని ఆస్కార్ వైల్డ్ జైల్లో చేశాడు - 'ది ప్రొఫండిస్ ' (అంటే - హృదయాంతరాళాల లోంచి - అని), తిలక్ భగవద్గీతకి భాష్యాన్ని రాశారు. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు. రాజాజీ రామాయణాన్ని రాశారు. కనిమొళి ఏం రాస్తుందో చూడాలి. పక్క జైలుగదిలో ఉన్న ప్రియుడికి ప్రేమలేఖా?
ఇక్కడో నీతికథ. ఓ రాజుగారికి తన అనుచరుడి మీద ప్రేమ కలిగిందట. అతన్ని పిలిచి "నువ్వు నడిచి వెళ్ళినంత మేరా నీ సొంతం అవుతుంది. నడిచి వెళ్ళి తిరిగిరావాలి" అన్నారట. ఆ అనుచరుడు పరుగులు తీశాడు. అడుగులు దూసుకున్నంత మేరా తన సొంతం. ఆశ ఎగదన్నుతోంది. మధ్యాహ్నం దాటింది సాయంత్రమైంది ఇంకా పోతున్నాడు తిరుగు ముఖం పట్టేసరికి వేళ మించిపోయింది. రాలేక, అడుగులు పడక ప్రాణం వదిలాడు. ఆఖరికి అతనికి కావలసింది - పరుగులతో దోచుకున్న ఆస్తికాదు. ఆరడుగుల నేల.
లక్షా డెబ్బై ఆరువేల కోట్లు భుజించిన నాయకమ్మణ్యులకు ఆఖరున మిగిలింది - తీహార్ జైలులో 15x10 అడుగుల జైలు గది. గాంధీజీ ఓ మాట అన్నారు: ఈ భూమి మీద ప్రతి వ్యక్తి అవసరాలను తీర్చగలిగినన్ని వనర్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తి పేరాశను తీర్చగలిగే వసతి లేదు - అని. పది కార్లు, పది టీవీలు, వందకోట్లు, రెండుటీవీ ఛానళ్ళు, ముగ్గురు భార్యలు, ఇద్దరు భర్తలు -ఇదీ ఈనాటి పేరాశకి నిదర్శనాలు. ఏ.రాజా అనే ఓ నేలబారు రాజకీయ నాయకుడూ, ఓ మామూలు అడ్వొకేట్ ఇంటిని తమరు చూడాలి (http://mail.google.com/mail?shva=1#search/A.RAJA+HOUSE/12de6ed7adceeb7e)
కళ్ళు తిరిగి పోయే దోపిడీకి, పేరాశకీ vulgarity of money కీ చిహ్నమిది.
ఈ దేశంలో అన్నా హజారే ఉన్నారు. ఆయన ఫరీదాబాద్ లో ఒకగుడిలో 10x 12 గదిలో నివసిస్తారు. పద్మభూషణ్. ఆయన అవినీతి మీద ధ్వజమెత్తితే దేశం ఒక్కటయి ఆయన వెనుక నిలిచింది. మదర్ ధెరిస్సా ఉంది. ఆమె మతి సరిగ్గా లేని 8 మంది పసివారిని అక్కున చేర్చుకుంటే దేశం ఆమెతో కలిసి కంటతడి పెట్టుకుంది. ఇంకా మనూశర్మ ఉన్నాడు. ఏ.రాజా ఉన్నాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఆరవ నెంబరు గదిలో ఓ ముఖ్యమంత్రి కూతురు - కనిమొళి ఉంది. నిన్న దేశమంతా ఒక్కటయి పండగ చేసుకుంది.
చేసిన పాపానికి ఏడవరోజున తక్షకుడి కాటుతో ప్రాణం వదులుతాడని శాపం పొందిన పరీక్షిత్ మహారాజుకి శ్రీ శుకుడు ఏడు రోజుల పాటు పురాణాలన్నీ వివరించాడు. ఆఖరి మాటలు చెపుతూ చనిపోతానని బాధపడకు, పుట్టినవాడికి చావు తప్పదు - అంటూ ఆయన చెప్పిన హితవుని పోతన్నగారు అతి హృద్యంగా వివరించారు:
కారే రాజులు, రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే,వారేరీ, సిరి మూటగటుకుని బోవంజాళిరే, యుర్విపై పేరైనం గలదే..!!?
కరుణానిధిగారి 'పాపం' - ఇప్పుడు కొంగుబంగారంలాగ కలిసివస్తుంది - నాస్తికుడి వ్యంగ్యంగానైనా, ఆస్తికుడి 'పాపం'గా నయినా!!
 

 ***
మే 23, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage