Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
'సీత' అనే బూతు గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
దాదాపు 30 ఏళ్ళ కిందట 'ఆరాధన' అనే సినీమాకి మాటలు రాశాను. (మహ్మద్ రఫీ పాట
పాడిన సినీమా అంటే చాలా మందికి జ్నాపకం వస్తుంది - నా మది నిన్ను పిలిచింది
గానమై) ఎన్.టి.రామారావు పశువుల కాపరి. వాణిశ్రీ సంపన్నురాలయిన నర్తకి. పట్నం
తీసుకు వస్తుంది అతన్ని. గోపీ మూగవాడయాడు. ఓ దశలో రహస్యంగా తన ఊరికి
వెళ్ళిపోబోతాడు. వాణిశ్రీ అడ్డుపడి "నన్ను వదిలిపోతావా గోపీ?" అంటుంది. ఈ
ఆస్తీ అంతస్తుకి నేను సరితూగను - అని సూచిస్తాడు. వాణిశ్రీ అడవుల్లో
తిరుగుతున్న సీతారాముల బొమ్మదగ్గరికి తీసుకు వెళుతుంది. "ఈ దంపతుల్ని చూశావా
గోపి. రాముడు తండ్రి మాటకోసం అడవులకు వెళ్ళాడు. కానీ సీత భర్త నీడకోసం
అడవులకు వెళ్ళింది" అంటుంది. ఇది ముప్ఫై ఏళ్ళ కిందటి ఊకదంపుడు ఇప్పటివాళ్ళకి.
అప్పుడు ప్రజలు చూశారు. సినీమా పెద్ద హిట్.
నేటి కథ. ఓ భార్యాభర్తలు బొంబాయిలో కాపురం చేస్తున్నారు. వారికో కొడుకు.
భర్తకి అండమాన్స్ బదిలీ అయ్యింది. నేను రానంది భార్య. రాకపోతే ఎలాగ? అన్నాడు
భర్త. విడాకులు కావాలని కోర్టులో కేసు పెట్టింది భార్య. పాపం, ఆ జడ్జిగారు
30 ఏళ్ళ కిందటి ఆలోచనలున్న 'పాత'బడిన మనిషి. "అమ్మా, ఈ దేశంలో భార్య సీతలాగ
భర్తని అనుసరించాలి కదమ్మా" అన్నాడట. అంతే. మిన్ను విరిగి మీద పడింది.
ఆడదాన్ని - అందునా ఆధునిక మహిళని - ఆ పాతచింతకాయ పచ్చడి సీతలాగ భర్త వెనుక
నడవమంటారా? అని ఎదురు తిరిగారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఆ జడ్జీగారిని తప్పుపడుతూ
ఓ చర్చను జరిపింది. అందరూ - బాబూ! ఈ రోజుల్లో ఎవరూ మొగుళ్ళ వెనుక నడవడానికి
సిద్ధంగా లేరు. ఈ జడ్జిగారెవరో బొత్తిగా 'ముసలి' ఆలోచనతో ఉన్నారు - అని
వాపోయారు.
మనం గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్పడానికి రాముడిని ఉదహరిస్తాం. రాముడు మర్యాద
పురుషుడనీ, సద్గుణ సంపన్నుడనీ - దాదాపు 300 తెలుగు రామాయణాలు, మధ్యధరా
సంస్కృతికి తూర్పున ఉన్న 30 దేశాల సమాజ సంస్కృతి చెపుతుంది. 2012 లో ఎవరయినా
ఎదురు తిరిగి "హాత్తెరీ! నన్ను సగం బట్టలు కట్టుకుని లేళ్ళని వేటాడుతూ
తిరగమంటావా?" అంటేనో, "ఎవడో నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతే కోతుల్ని
వెంటబెట్టుకుని యుద్దం చెయ్యమంటావా? ఆ మాత్రం పెళ్ళాం దొరక్కపోతుందా?"
అంటేనో మనం మొహం ఎక్కడ పెట్టుకోవాలి?
ఈ మధ్య హిట్టయిన తెలుగు సినీమాలో ఓ మహానుభావుడైన కవి పాట రాశాడట. "నాకు
రాముడులాంటి మొగుడొద్దు బాబూ - ఆడుతూ పాడుతూ అమ్మాయిల వెంట తిరిగే నీలాంటి
మొగుడే కావాలి" అంటూ సగం బట్టలిప్పుకుని గెంతుతుందట. శుభం. ఆవిడకి సీత
కష్టాలు లేవు. దిక్కుమాలిన రామాయణం లేదు. కానీ తన స్వేచ్చనో, వెసులు బాటునో
కోరుకోడానికి మొన్న వ్యభిచారం కేసులో 'తార ' కాక 'సీత ' ఎందుకు
కావలసివచ్చింది ఈ మహానుభావుడికి? వ్యక్తిత్వంలో ఇంకా ఈ సమాజానికి రాముడు 'ఆదర్శం
' అన్న విషయాన్ని ఈ మహా రచయిత మరిచిపోలేదు. భారతీయ సమాజంలో కొన్ని ఎల్లల్ని
చెరిపేయడానికైనా కొన్ని గుర్తులు కావాలి. అవే రామాయణం, రాముడు, సీత.
మనకి తెలివితేటలు పెరిగాయి. స్వేచ్చ పెరిగింది. అడ్డమయిన ఆలోచనల్నీ పంచే
ఛానల్స్ విర్రవీగితనం పెరిగింది. ఏదయినా సభలో చెప్తే సవరించడానికో,
వివరించడానికో ఎవరో దొరికేవారు. ఆలోచనల్ని విశృంఖలత్వంగా భావించే 'ఆధునికత'
పైత్యం ముదిరింది. ఇంగ్లీషు ఛానల్ నిర్వహించే బర్ఖా దత్ కి గిల్లి
రెచ్చగొట్ట్టే 'అమ్ముడు పోయే' చర్చకావాలి. అందులో నోరు పారేసుకునే 'కుహనా'
మేధావులు కావాలి. పాపం, ఆ జడ్జి గారెవరో - ఈ అభ్యుదయ ఆదర్శవాదుల నోళ్ళలో బలి
అయిపోయాడు.
"నా మొగుడు అండమాన్ వెళ్తే నేనెందుకు వెళ్ళాలి? కొడుకు ఉంటే ఉండొచ్చుగాక -
మరో మొగుడిని వెదుక్కుంటాను" అంటూ స్వేచ్చని ఆశించే అపర సీతల కాలం 2012లోనే
అర్జంటుగా వచ్చేసిందని ఆ జడ్జిగారికి తెలీదు.
రాముడు తండ్రి మాటని గౌరవించి పన్నెండేళ్ళు అడవులకి వెళ్ళే తెలివితక్కువ
కథానాయకుల కథ అమెరికాకి వలస వెళ్ళి వృద్దాశ్రమాలలో తండ్రుల్ని మరిచిపోయే
నేటి తరం కుర్రాళ్ళకి విపరీతంగా ఉంటుంది. ఆ రోజుల్లో మా నాన్న ఓ పంజాబీ
అమ్మాయిని తగులుకుని తాగి మాటిచ్చాడు. నేనెందుకు ఆస్తిని వదులుకోవాలి అంటూ
తండ్రులను వెళ్ళగొట్టే రాంరావ్ ల కాలమిది.
రామాయణాన్ని ఈ తరం క్షమించాలి. నేడు అండమాన్ వెళ్ళని, విడాకులు కోరే భార్యకి
'సీత' పురషాధిక్యతకి బానిస. మరిదిని తగులుకుని మొగుళ్ళని చంపే మోడ్రన్
సీతలకి 'రామాయణం' విషవృక్షం.
ఈ మధ్య క్లాస్ రూముల్లో జొరబడి - 60ఏళ్ళ కిందటి కార్టూన్లకి కొత్త అర్ధాల్ని,
అభ్యంతరాల్నీ వెదుకుతున్నారు - ఈనాటి తెలివైన అభ్యుదయ నాయకులు. దేశంలో
తెలివితేటలు ముదిరాయి. ఎప్పుడో - రామాయణాన్ని ఉతికి ఆరెయ్యాలని ఓ మళయాళం
టీవీ ప్రోగ్రాంలో ఓ దృశ్యాన్ని చూసిన గుర్తు. ఉతికినా ఉపయోగపడని స్థాయిలో
రామాయణం ఇప్పుడు చిదికిపోయింది. చివికిపోయింది.
రామాయణం ఓ సంస్కృతికి ప్రతీక. కొన్ని ఆదర్శాలకు ఆవలిగట్టు. దేవుడూ, దేవతల్ని
పక్కన పెడితే - ఓ ఆదర్శానికి సంకేతం. 'సీత'లాగ ఉండాలంటే నార చీరెలు
కట్టుకుని, అడవులు పట్టుకు తిరగాలని కాదు. ఆదర్శం ఆవలిగట్టు ఆ పాత్ర. అదొక
ప్రతీక. ఆదర్శవంతమయిన మానవ జీవితానికి ప్రతినిధి - రాముడి పాత్ర.
ప్రతీకాత్మక మయిన ఆదర్శం - తనని అనుసరించమనదు. అనువదించుకోమంటుంది.
అన్వయించుకోమంటుంది. చేసినట్టు చెయ్యమనదు. చేసిన కారణాన్ని గ్రహించమంటుంది
ఇక్కడ ఆదర్శం అంటే అద్దం కాదు. చూసే దృష్టి. ఈ ఆదర్శం అక్కరలేకపోతే -
జడ్జీల్ని క్షమించండి. మరో మొగుడిని తెచ్చుకుని సుఖంగా బతకండి. రామాయణంలోనూ
అలాంటి పాత్రలున్నాయి.
అండమాన్ వెళ్ళడానికి ఇష్టం లేని భార్యకి 'సీత' ఉదాహరణ రుచించని ఈ సమాజం - ఈ
'కుహనా' మేధావుల పుణ్యమా అని రామాయణాన్ని బహిష్కరిస్తుందనడంలో నాకెటువంటి
అపనమ్మకం లేదు. తులసీదాసు, మొల్ల, విశ్వనాధ - అచిరకాలంలో అటకెక్కిపోతారు.
అప్పటికి నాలాంటి 'భయపడే ' నిన్నటి తరం ఉండదు. అది మా అదృష్టం.