Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here అవినీతి - ఆరోగ్యం
గొల్లపూడి మారుతీరావు . నాకేమో అవినీతికీ ఆరోగ్యానికీ దగ్గర తోవ ఉన్నదని అనిపిస్తుంది. దీనిని రుజువులతో సహా నిరూపించగలను. మనదేశంలో అవినీతిపరులంతా నిమ్మకు నీరెత్తినట్టు నిగనిగలాడుతూ, చలవచేసిన ఖద్దరు చొక్కాలతో, సూట్లతో, చిరునవ్వులతో హుషారుగా కులాసాగా ఉంటారు. కాని ఒక్కసారి వారిని నీతి, చట్టం వేలు చూపిస్తే చాలు - ఎక్కడలేని అనారోగ్యం వారిని క్రుంగదీస్తుంది. మీలాటి నాలాంటివారు అంతంత మాత్రం ఖాయిలా పడితే ఇంటి దగ్గర ఉండే చికిత్స చేయించుకుంటాం. కాని వీరి అనారోగ్యం అలాక్కాదు. నిన్నటిదాకా బాగానే ఉన్నా ఇవాళ మాత్రం - ఎవరూ పలకరించ వీలులేని, ఎవరితో మాట్లాడడానికీ వీలులేని, ఎవరూ కలుసుకోవడానికీ వీలులేని - ఆసుపత్రి ఇంటెన్సివ్ గదుల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పాపం గాంధీలాంటివారు పాతకాలం మనుషులు. గాంధీ చిత్రంలో ఓ గొప్ప ద్రుశ్యం నేనెన్ని సారులు చూసినా కంట తడిపెట్టిస్తుంది. సహాయనిరాకరణ నేరానికి తనపై జస్టిస్ బ్లూం ఫీల్డ్ జరిమానా విధిస్తే, బోనులో నిలబడిన గాంధీ మహాత్ముడు జరిమానా చెల్లించనని జైలుకి వెళ్ళడానికి సిద్దపడతాడు. ఆయన్ని జైలుకి పంపకుండా ఆపాలని న్యాయమూర్తి తాపత్రయం. తన సిద్ధాంతానికి కట్టుబడి జైలుకి వెళ్ళాలని గాంధీ పట్టుదల. ఆ రోజుల్లో జైళ్ళు నిజమైన దేవాలయాలు. గాంధీ, నెహ్రూ, తిలక్, రాజాజీ, టంగుటూరి - ఇలా ప్రతినాయకులు గర్వంగా జైళ్ళకు వెళ్ళారు. అక్కడే భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా తయారయింది. రోజూ కొత్త విషయాలు ఆకళించుకున్నారు. కొత్త భాషలు నేర్చుకున్నారు. మరింత స్ఫూర్తితో బయటకు వచ్చారు. అవి ఆనాటి రోజులు. ఇప్పుడెవరూ జైళ్ళకి వెళ్ళరు. నిజానికి జైలుకి వెళ్ళడం నామోషీ. అవినీతిపరులంతా నవనవలాడుతూ మన మధ్య కనిపించడానికి ఓ సృష్టి సహజమైన కారణం ఉంది. చక్కటి పువ్వులు, కూరగాయలు కుళ్ళి, పురుగులు పట్టిన ఎరువుల్లోంచే పెరుగుతాయి. మొక్క మొదట్లో చూస్తే దుర్వాసన ముక్కుపుటాల్ని బద్దలు కొడుతుంది. కొమ్మలకి పవిత్రమైన పువ్వులు నవ్వుతూ పలకరిస్తాయి. అందుకే రెంబ్రాంట్ అనే మహా చిత్రకారుడు ఒక మాట అన్నాడు: చిత్రాల్ని దగ్గరగా చూడకు. కంపుకొడతాయి - అని. మన నాయకుల్ని మొదళ్ళలో చూస్తే ముక్కు మూసుకోవలసినంత దుర్గంధం. కాని వారి మూర్తి - స్పుర ద్రూపం, కళ్ళు మిరుమిట్లు గొలిపేటంత ఆకర్షణీయం. మరొక విధంగా అర్ధం చేసుకోవాలంటే - నీతి కొందరి ఆరోగ్యానికి గొడ్డలి పెట్టవుతుంది. చట్టం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆసుపత్రివేపు తరుముతుంది. ఉదాహరణలు కావాలా? నిన్నటిదాకా బొద్దెంక మీసాలతో నిగనిగలాడుతూ స్నేహితుడి పెళ్ళాంతో సరసాలాడుతూ - ఒంటి మీద సగం బట్టలు లేకుండా దొరికిపోయిన సౌందర్య స్వరూపుడు - కర్నాటక మంత్రి హాలప్ప - అనవసరంగా అవినీతి పని చేశాడని చట్టం అరెస్ట్ చేసింది. అంతే. ఆయన జైలు అడ్రసు తెలుసుకునే లోపునే గుండె నొప్పి వచ్చింది. సరాసరి ఆసుపత్రికి చేరి చలవ గదిలో, ఏకాంతంగా సేద తీర్చుకుంటున్నారు. నాకేమో జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా గారికి మంచి హీరో లక్షణాలున్నాయనిపిస్తుంది. చాలా ఆరోగ్యంగా, గ్లామరస్ గా ఉంటారు. ఆయనకి నాలుగువేల కోట్ల ఆస్తులున్నాయని కిట్టనివాళ్ళు కేసులు పెట్టారు. అవినీతి శాఖవారు ఆయన్ని నిలదీయడానికి సిద్దమయారు.అప్పుడేమయింది? మనుషుల్ని చూసి గుర్తుపట్టలేనంతగా, నోటమాట రానంతగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్లు ఆయన్ని పలకరిస్తేనే ప్రాణానికి ముప్పు రావచ్చునన్నారు. (వీరంతా ఖరీదయిన డాక్టర్లు!) తీరా ఆయన ఆసుపత్రినుంచి సరాసరి తన భార్య ఎన్నికలలో పోటీ చేస్తున్న బైబాసా నియోజకవర్గానికి వెళ్ళి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఇక మన రామలింగరాజుగారిని తీసుకోండి. ఆయన చాలా గ్లామరస్ కార్పోరేట్ వ్యాపారి. క్లింటన్ దొరగారి సరసన కూర్చుని చిరునవ్వులు చిందించగల అందమైన వ్యక్తి. ఉన్నట్టుండి ఏడువేల కోట్ల కుంభకోణం బయటపడింది. పోలీసులు చుట్టుముట్టారు. ఏమయింది? ఆయన ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతింది. ఆయనకి కూడా తెలియని గుండె జబ్బులన్నీ తోసుకు వచ్చాయి. వారు ప్రస్తుతం ఎక్కువకాలం ఆసుపత్రులలో, అతి తక్కువ కాలం జైళ్ళలో గడుపుతున్నారు. మరొక గొప్ప నమూనా - పప్పు యాదవ్ అనబడే రాజేష్ రంజన్ అనే నాయకులు. ఆయన హాయిగా హత్యలు చేయించుకుంటూ, వీలయినన్ని దొమ్మీలు జరుపుతూ - 1991, 1996, 1999, 2004 లో లోక్ సభకి ఎన్నికయిన పెద్దమనిషిగా, పెద్ద శరీరంతో హాయిగా ఉన్నారు. రకరకాల కేసుల్లో ఆయన్ని ఈ మధ్య అరెస్టు చేశారు. అంతే. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సరాసరి ఆసుపత్రికి వెళ్ళక తప్పలేదు. నాకేమో ఎన్సీపీ నాయకులు పదం సింగ్ పాటిల్ గారు ఏనాటికయినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం ఉండేది. అంత అనుభవం, అంత మేధావితనం, తేజస్సు వారి ముఖంలో ద్యోతకమవుతుంది. కాని పవన్ రాజ్ నింబాల్కర్ని హత్య చేయించారని (2006లో) సిబిఐ ఈ మధ్య వారిని అరెస్టు చేసింది. వారు జైలుకి వెళ్ళారా? పొరపాటు. తిన్నగా ఆసుపత్రి చలవగదికి చేరారు. కాషాయ వస్త్రాలు ధరించి, చిరునవ్వులు ఒలకపోస్తూ దేవుడికీ మనకీ సంధాతగా నిలిచిన మహాస్వామి నిత్యానంద గారు రహస్యంగా ఎందరో అమ్మాయిలతో పడకగది ఒప్పందాలను చేసుకుని ఇహాన్నీ పరాన్నీ ఉమ్మడిగా సాధిస్తుండగా - ఎవరో కిట్టని శిష్యుడు - బహుశా ఆ సుఖంలో తనకి వాటా దక్కని కారణమో ఏమో - ఒక సినీ నటితో ఆయన రాసలీలల్ని బయటపెట్టాడు. (నిగనిగా మెరిసే మొక్కల మొదళ్ళలో మురుగు ఉంటుందని మనం మరిచిపోకూడదు.) అక్కడికీ స్వామి తన ఆరోగ్యం కాపాడుకోడానికి హిమాలయాల దాకా వెళ్ళారు. ప్రభుత్వ యంత్రాంగం కరుణించలేదు. ఆయన్ని వెదికి పట్టుకుంది. అరెస్టు చేసింది. అప్పుడేం చేశారు స్వామి? ఆయన ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళక తప్పలేదు. కనక నాదొక మనవి. ఇలాంటి నాయకుల ఆరోగ్యాన్ని కాపాడుకుని, మన పార్లమెంటు అభ్యుదయాన్ని నిలుపుకోవాలంటే - 'నీతి, చట్టం' కోరలు వీరిదాకా రాకూడదని వెంటనే చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించాలి. నాకు నోస్టర్ డామస్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికున్న దూరదృష్టి లేదుకాని ఇలాంటిదేదో లేదా దీనికి ప్రత్యామ్నాయమైన చట్టం త్వరలో రాక తప్పదని నాకు తెలుసు. అంతవరకూ నాదొక సూచన. మన పార్లమెంటులో దాదాపు 192 పై చిలుకు నాయకులపై ఇలాంటి క్రిమినల్ కేసులున్నాయట. వారి ఆరోగ్యమూ ఎప్పుడో ఒకప్పుడు ఇలా దెబ్బతినక మానదు. కనుక వీరి సౌకర్యార్ధం జైళ్ళకి వెళ్ళవలసిన నాయకులు ఉండడానికి జైళ్ళకి అనుబంధంగా అయిదు నక్షత్రాల స్థాయిలో సమస్త సౌకర్యాలతో, చలవగదులతో, అందమయిన నర్సులతో (స్వామి నిత్యానంద లాంటివారిని దృష్టిలో పెట్టుకుని) ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నా మనవి. ఇందువల్ల నీతి, చట్టం వీరి ఆరోగ్యాన్ని క్రుంగదీసినా ఆసుపత్రులు అందుబాటులోనే ఉంటాయి కనుక వారి క్షేమానికి ఢోకా ఉండదని నాకనిపిస్తుంది. కాగా, ఇలాంటి నాయకులను కాపాడుకోవడం మన కర్తవ్యం. చివరగా ఒకే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చెయ్యదలిచాను. కొందరిని అవినీతి ఆరోపణలు బాధించవు. జైలు భయపెట్టదు. వారిని ఆసుపత్రుల వేపు తరిమి కొట్టదు. అడివి అయినా, జైలు అయినా, మంచుకొండ అయినా, మహా ముఖ్య మంత్రులయినా (నా మనస్సులో ఈ మాట చెపుతున్నప్పుడు మేడం జయలలితగారున్నారు) వారిని ఏ మాత్రం చలింపజేయదు. ఆయన్ని అరెస్టు చేస్తే నెలల తరబడి జైలులోనే తన అనుష్టానాన్ని జరుపుకున్న ఒకే ఒక్క ఉదాహరణ - భారతదేశ చరిత్రలో ఉంది. వారి పేరు - 2000 సంవత్సరాల చరిత్ర గలిగిన కంచి కామకోటి పీఠాధిపతి - జయేంద్ర సరస్వతీ స్వాములవారు. మే 17, 2010 ************ ************ ************* ************* |