Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
ఖరీదైన 'నిజం '
గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com

 సత్యమేవ జయతే అన్నది పాత నానుడి. సత్యం వల్ల మాత్రమే జయం లభిస్తుంది - అంటే ఈ రోజుల్లో చాలామందికి నవ్వు వస్తుంది. అయితే 'అసత్యం'తో 18 సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్న పండిత్ సుఖ్ రాం ని చూసినా, తెల్లరేషన్ కార్డులతో మద్యం వ్యాపారం చేసే బడాబాబుల కథలు చదివినా 'సత్యం' ఎంత నిస్సహాయమయిన జడపదార్ధమో అర్ధమౌతుంది. మరెందుకీ నానుడి? దీనిని 'కర్మ'అని సరిపెట్టుకున్న వేదాంతులూ, 'ఖర్మ' అని తలవంచిన వాస్తవిక వాదులూ ఎందరో ఉన్నారు.
ఈ మధ్య - అంటే మొన్న ఆదివారం ఈ సత్యం మళ్ళీ వీధిన పడింది. కారణం - ఈ సత్యానికి ఈ దేశంలో బహుళ ప్రాచుర్యాన్ని సాధించిన ఓ ప్రముఖ నటుడి దన్ను లభించింది కనుక. 'సత్యమేవజయతే' అని ఎక్కడో ఢిల్లీలో ఉన్న వెంకయ్య అన్నా, మరో చంద్రయ్య అన్నా దేశం ఇంత తుళ్ళిపడదు. కానీ ఈ మాట అన్నది అమీర్ ఖాన్. ఆయన గొంతుకి ఎంత బలం ఉందంటే - సత్యానికి కాదు - ఆయన చేపట్టిన కార్యక్రమానికి ("సత్యమేవ జయతే") 6 కోట్ల అడ్వర్టయిజు మెంట్లు వచ్చాయి. వ్యాపార సంస్థలు 90 కోట్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న గంటలో కేవలం దేశం నలుమూలలనుంచీ లక్షమంది ఫోన్లు చేశారు. ఇక ఈ మెయిళ్ళతో ఛానళ్ళ సమాచార స్రవంతి తెగిపోయింది. ఆరు దేశ భాషలలో ఈ కార్యక్రమం ప్రసారమయింది. దూరదర్శన్ ప్రసారం చేసింది. ఏ ఛానల్ చూసినా రాష్ట్రపతి ప్రసంగంలాగ అమీర్ ఖాన్ గొంతే వినిపించింది. ముఖమే కనిపించింది. కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల చేతుల్లో టర్కిష్ టవల్స్ కన్నీరుతో తడిసిపోయాయి. ప్రశ్నలడుగుతూ అమీర్ ఖాన్ ఏడ్చాడు. చెపుతూ తల్లులు ఏడ్చారు. వింటున్న ప్రేక్షకులు ఏడ్చారు. గంటన్నర సేపు దేశం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది.
ఈ కార్యక్రమం భ్రూణ హత్యల గురించి. శిశువు ఇంకా తల్లి కడుపులో ఉండగానే ఆడో మగో తెలుసుకుని ఆడపిల్ల అయితే కడుపులోనే గర్భస్రావం చేయించే గర్భస్రావాల గురించి. పల్లెటూరివారూ, చదువుకున్న పట్నాలవారూ, వ్యాపారంగా డాక్టర్లూ, ఆడపిల్లని కనడం లాభసాటి కాదని భావించే అత్తలూ, మామలూ, భర్తలూ - సంవత్సరాల తరబడి ఈ దేశంలో సాగిస్తున్న సామూహిక భ్రూణ హత్యల దారుణ మారణకాండ ఈ కార్యక్రమం ఇతివృత్తం. అయితే ఈ దారుణాన్ని తెలిసినవారు చాలామంది ఉన్నారు. ఆపలేకపోతున్నవారున్నారు. పుట్టిన ఆడపిల్లని పశువులాగ హింసించినవారున్నారు. ఇవన్నీ రాజకీయ నాయకులకి ఎంతో కొంత తెలుసు. అయినా ఈ అరాచకం చెల్లి పోతోంది. రహస్యంగా గర్భ స్రావం జరిపించి డబ్బు చేసుకునే వైద్యులున్నారు. ఇది నిశ్శబ్ధ మారణ హోమం. స్త్రీని తల్లిగా, దేవతగా, కులదైవంగా పూజించే భారతదేశంలో జరుగుతున్న దారుణం. ఈ దారుణాన్ని ఆపుతున్నామని బోరవిరుచుకునే రాజకీయ నాయకులున్నారు. తెలివైన దుర్మార్గులున్నారు. చెయ్యలేదన్న సాక్ష్యం ఉంది.
ఒక భార్యకి భర్త - ఆడపిల్లని గర్భం దాల్చిందన్న కారణానికి ఆరుసార్లు వరసగా గర్భస్రావం చేయించాడు. మరొక భర్త పుట్టిన బిడ్డని పశువులాగా హింసించాడు. ఇందులో ఎవరిది ఎంత భాధ్యత? ఇలా జరుగుతూపోతే దేశం ఏమవుతుంది? ఆయా వర్గాల వారితో సమగ్రమయిన సత్యశోధన జరిపిన కార్యక్రమమిది.
భారతదేశాన్ని ఒక్క కుదుపు పలకరించిన వందకోట్ల వ్యాపారమిది. ఇందులో ఓ సినీనటుడి నిజమైన పరివేదన ఉంది. పరిష్కరించవలసిన సమస్య ఉంది. సామాజిక స్పృహ ఉంది. తీరా ఈ కార్యక్రమం ప్రసారమయాక - మేం చర్యలు తీసుకుంటామని కెమేరాల ముందుకొచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రిగారున్నారు. సత్యం తప్పక జయిస్తుందని భావించే - ఆరోగ్యకరమైన - కానీ బలహీనమయిన మూలుగు ఉంది.
ఈ కార్యక్రమం ఓ గొప్ప సినీనటుడి వ్యపారమని (సెలబ్రిటీ ఏక్టివిజం), కేవలం సానుభూతి, పాపులారిటీ ప్రసారానికి దగ్గర తోవ అని పెదవి విరిచినవారున్నారు. టీవీ కార్యక్రమాల రేటింగు పెంచుకోడానికి, డబ్బు చేసుకోడానికీ ఈ కార్యక్రమం ఉపయోగిస్తుంది తప్ప సామాజికంగా పెద్ద ప్రయోజన ఉండదనే నిరాశావాదులున్నారు. ఇది కేవలం పరపతిని పెంచుకోవడం వంటిదని భావించిన సంజయ్ ఝూ వంటి కాలమిస్టులున్నారు. నిజాయితీగా కెమెరాముందు కూర్చుని కళ్ళు ఒత్తుకున్న అమీర్ ఖాన్ ఉన్నాడు. తల్లుల కన్నీటిలో వేదన ఉంది. కార్యక్రమంలో అంతర్లీనంగా ఒక అన్యాయానికి పర్యవసానాన్ని ప్రజల ముందు పెట్టాలన్న తపన, పెట్టిన చిత్తశుద్ది ఉంది.
ఈ దేశంలో రాముడు వారధి నిర్మిస్తూండగా ఓ ఉడత నాలుగు చుక్కల నీటిని విదిలించడం - గొప్ప నీతి కథ. 'ఉడతా భక్తి ' ఈదేశంలో గొప్ప ఆదర్శానికి సామన్యుడి చేయూతకు గొప్ప ఉదాహరణ.
వంద కోట్ల వ్యాపారాన్ని చెయ్యగల ఓ నటుడి చిత్తశుద్ది సమంజసమా? ఆక్షేపణీయమా? ఇది వ్యాపారానికి దగ్గర తోవగా సరిపెట్టుకుని మరిచిపోవాలా? ఇందులో ప్రయోజనాన్ని వడగట్టాలా? ఎంతోమంది ఉద్యమకారులు పూనుకున్నా అరికట్టలేని ఒక సామాజిక దురన్యాయాన్ని - అరికట్టడానికి ప్రజాభిప్రాయాన్నో (అన్నా హజారేలాగ), అరికట్టడానికి రాజకీయ నాయకుల్ని ఉద్యుక్తపరచలేని నేపధ్యంలో ఓ ప్రముఖ నటుడి వ్యాపారాన్ని సాధించే సామాజిక చైతన్యం ఏ విధంగా, ఏ మేరకు సమంజసం? ఏ మేరకు ఉపయోగకరం? ఏ మేరకు వాంఛనీయం?
ఇది కార్యక్రమాన్ని అమ్ముకునే వ్యాపారస్థుల గడుసుదనానికి నిదర్శనమా? సామాజిక స్పృహతో దేశానికి ఏదో సేవచేయాలని తహ తహ లాడే ఓ నటుడి ఆరోగ్యకరమైన ఆదర్శానికి మాత్రమే నిదర్శనమా?
ఇన్ని లక్షల మందిలో కలిగిన 'స్పందన ' కార్యక్రమాన్ని మాత్రమే దీవించి, వ్యాపారస్థుల జేబులు నింపి మరుగున పడిపోతుందా? చర్మ మందంగా ఉన్న వ్యవస్థనాయకులు, మంత్రులు - ఈ కార్యక్రమం గ్లామర్ ని వాడుకుని యధాప్రకారంగా సమస్యని ఓ అటకెక్కించేస్తారా?
1930 లో ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి 25 రోజులపాటు 322 కిలోమీటర్లు దండీ వరకూ లక్షలాదిమందితో నడిచాడు. అది చరిత్ర. ఈ అవకాశాన్ని తీసుకుని 322 మైళ్ళూ జంగిడీ పట్టుకుని ఉప్ప శనగలు అమ్ముకున్న ఓ వ్యాపారస్థుడి వ్యాపారదక్షత కారణంగా వందలు సంపాదించి దాన్ని వేలూ లక్షలూ చేసుకున్న ఆరో తరం ఇప్పుడు సంపన్నంగా బతుకుతూ ఉండవచ్చు. కానీ చరిత్ర దండీయాత్రది. సంపన్నుడి అవకాశానిది కాదు. (ఇది కేవలం ఉదాహరణ)
రామాయణంలో ఉడతది - ఎంత చిన్నదయినా గుర్తుంచుకునే పాత్ర. మనం ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహమనే చరిత్రకి జేజేలు చెప్తామా? ఉప్పు శనగల వ్యాపారస్థుడి వ్యాపార దక్షతకి తప్పు పడతామా?
అన్యాయంగా లక్షలాది ఆడపిల్లలు తల్లుల కడుపుల్లోనే దారుణంగాబలి అయిపోతున్నారు. చర్యలు తీసుకోవలసిన నాయకులు నిద్రపోతున్నారు. సజావుగా, నివారణోపాయాల్ని చేపట్టవలసిన రాజకీయ నాయకుల అలసత్వం కంటే, సమాజంలో ఓ స్పందనని కల్పించాలనే యావతో ఓ నటుడు పూనుకున్న ప్రయత్నం - కేవలం 'ఉడత' స్థాయిలోనిదే అయినా - కేవలం ఉప్పు శనగల వ్యాపారం కారణంగా రాళ్ళు వేయడం సమంజసం కాదేమోనని నాకనిపిస్తుంది.
నూరుకోట్ల వ్యాపారం మన ఏ.రాజాగారు బొక్కిన డబ్బుకంటే ఎక్కువకాదు. ఒక సాయంకాలం దేశాన్నంతటినీ పలకరించే స్పృహని కల్పించిన ఓ నటుడి చిత్తశుద్ది ఏ ఆరోగ్యకరమైన పరిణామాలకు దారితీయగలదో వేచి చూడాలి. తీయకపోయినా ఒక అరాచకానికి ఒక సాయంకాలం దేశమంతటా కల్పించిన స్పందన విలువ నూరుకోట్లని సరిపెట్టుకుందామా?
   

మే 14,2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage