పాకిస్తాన్ కి తనదైన గొప్ప చరిత్ర ఉంది. ఆ దేశం అవతరించినప్పటి నుంచీ ఇప్పటి
వరకూ ఎక్కువగా సైనిక నియంతల పాలనలోనే ఉంది. కాగా, ఇప్పటి ప్రజాస్వామ్యానికీ
గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో అవినీతి నేరాలకి అరెస్టయి, జైలుకి వెళ్ళి, దేశాన్ని
వదిలి పారిపోయిన ఒక నేరస్థుడు జర్దారీగారు - కేవలం బేనజీర్ భుట్టో భర్త
అయినందుకే, అదృష్టవశాత్తూ ఆమె హత్య జరిగినందుకే ఆ దేశపు అధ్యక్షుడయారు. ఇది ఆ
దేశానికి గొప్ప కిరీటం.
నిజానికి రాజకీయ దౌత్యంలో - ఒక దశలో - అద్భుతమైన అవగాహన చూపించి, ప్రపంచమంతటికీ
- ఒక్క ఇండియాకి తప్ప -స్నేహితుడయిన దేశంగా పాకిస్థాన్ ని నిలిపింది అయూబ్ ఖాన్
అని చెప్పుకుంటారు. ఆయన హయాంలో పాకిస్థాన్ - నాటోకి, సెంటోకి, సియటోకీ మిత్రదేశం.
కాని ఇండియాతో యుద్ధం - లాల్ బహదూర్ శాస్త్రితో తాష్కెంటు ఒప్పందం తెలిసిందే.సరే.
ప్రస్తుతానికి వద్దాం. ఈనాటి పాకీ ప్రభుత్వ రాజకీయాలు మంచి హాస్యనాటకాన్ని
తలపిస్తాయి. ఒకానొక రాత్రి అమెరికా తమ దేశానికి వేలమైళ్ళ దూరంలో ఉన్న దేశంలోకి
చొరబడి వారి రాడార్ లను జాం చేసి - మిలటరీ స్థావరాలకి కేవలం 500 గజాల దూరంలో
ఉన్న భవనం మీద దాడి చేసి అతి నిర్దుష్టంగా - కేవలం 40 నిమిషాలలో - ప్రపంచంలో
కల్లా భయంకరమైన తీవ్రవాదిని చంపింది. బాగా ఆలోచిస్తే అలనాడు 9 / 11 న ఒసామా బిన్
లాడెన్ పధకం ప్రకారం అయిదు విమానాలు అమెరికాలో సృష్టించిన దిగ్భ్రమకి ఇది
తీసిపోదు. చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఈ వినోదం ప్రపంచానికి తెలీదుకాని -
వేలమైళ్ళ దూరంలో శ్వేత భవనంలో పెద్దలంతా సినిమాలాగ చూశారు.
ఇందులో మూడు విషయాలు అర్ధమౌతాయి. అవసరమైతే అమెరికా తాననుకున్నది సాధించగలదని.
రెండు: పాకిస్థాన్ నోరు మూయించగలదనే విశ్వాసం అమెరికాకు బలంగా ఉన్నదని.
బిస్కత్తు అందించిన కుక్కపిల్లలాగ ఆర్ధికంగా అమెరికా దయాదాక్షిణ్యాలను
అనుభవిస్తున్న పాకిస్థాన్ కి మరో గతిలేదని. ఇవి నేలబారుగా చెప్పుకోవలసిన నిజాలు.
వీటికి 'రాజకీయపు ముసుగు' అందంగా ఉంటుంది. ప్రపంచమంతటిలాగే ఈ దాడి వార్త
పాకిస్థాన్ కి తెలిసింది. తెలియాల్సిన వారందరికీ అమెరికా ఫోన్లు చేసి చెప్పింది.
వెనకటికి ఒకావిడ మొగుడు కొట్టాడని కాక తోటికోడలు నవ్విందని ఏడ్చిందట. అమెరికా
పళ్ళూడకొట్టిందని కాక భారత సైన్యాధిపతి "మాకూ ఆ శక్తి సామర్థ్యాలున్నాయి"
అన్నందుకు జుత్తు పీక్కుంది. సల్మాన్ బషీర్ అనే విదేశీ కార్యదర్శి - ఆయనకీ
నాలాగే బుగ్గలు బూరెల్లాగ ఉంటాయి. వాటిని పూరించి "భారతదేశం ఏమైనా తొందరపడితే
కొంపముంచుతామ"ని హెచ్చరించాడు. అయితే మళ్ళీ ఇలాగే చావగొట్టే హక్కుమాకుందని
మరునాడే అమెరికా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు - నిన్నంటే నిన్ననే చావగొట్టి
చూపించింది. పాకిస్థాన్ పొలిమేరల్లో ద్రోన్ దాడులు జరిపి 12 మందిని చంపింది.
మరో సరదా ఆరోపణ. మా ఇంట్లో భద్రంగా ఓ నగని దాచిపెట్టాను. ఎవరో వచ్చి
ఎత్తుకుపోయారు. "మీరు జాగ్రత్తగా లేరు కనుక మా ఇంట్లో దొంగతనం జరిగింది" అన్నారు
పాకీప్రధాని. ఇది విచిత్రమైన తర్కం. అలనాడు - 9/11 న అమెరికా దాడులకీ, మొన్న
26/11 దాడులకీ, తమ మిలటరీ కాలనీలోనే అయిదేళ్ళు భద్రంగా వసతి కల్పించిన ఒసామా
బిన్ లాడెన్ చావుకీ - అంతర్జాతీయ పరిశోధనా యంత్రాంగం పనిచెయ్యకపోవడమే కారణమని
ఆయన ఉవాచ. "మా దేశంలో ఒసామాని దాచాం.మీరు కనుక్కోలేకపోయారు. అది మీ లోపం" అన్నది
వారి ఉద్దేశం.
అలనాడు - 9/11 దుర్ఘటన తర్వాత బుష్ దొరగారు ముష్రాఫ్ పిలక పట్టుకుని -
పాకిస్థాన్ లోనే స్థావరాలు ఏర్పరచి - ఆఫ్గనిస్థాన్ ని స్మశానం చేశారు.
పాకిస్థాన్ కి అటు పరువూ పోయింది. ఇటు మర్యాదా దక్కలేదు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి - ఒసామా బుద్ధిగా తన మూడో భార్యతో, ఎనిమిదిమంది
పిల్లలతో మిలియన్ డాలర్ల భవనంలో బుద్దిగా గడిపాడు కాని - దావూద్ ఇబ్రహీం మెమూన్,
టైగర్ మెమూన్, హఫీద్ సయీద్ వంటి పెద్దలు టెలివిజన్ కెమెరాల ముందు దర్శనమిస్తూ,
వ్యాపారాలు చేసుకుంటూ, పెళ్ళిళ్ళు జరిపించుకుంటూ జీవిస్తున్నారు. వారి అడ్రసులు
ప్రపంచమంతా తెలుసు. పాకీ ప్రభువులకి తెలీదు. ఇదే ఈ దేశంలో వింత.
డబ్బిచ్చి - చెప్పుతో కొట్టే పనిని - అమెరికా చెప్పి మరీ సాధిస్తోంది.
చెప్పకుండానే వారి దేశంలో జొరబడి ఒసామాను చంపింది. మళ్ళీ మళ్ళీ ఆ పనే చేస్తామంటూ
నిన్ననే చేసి చూపించింది.
"అయినా పాకిస్థాన్ మాకు మిత్రులు. వారు తీవ్రవాదుల్ని అణచడానికి ఎంతో కృషి
చేస్తున్నా రు" అంటోంది.
"మాకూ వారంటే గౌరవమే నిన్నటి విషయం మరిచిపోదాం" అంటున్నారు బషీర్ సాహెబ్ గారు
మింగలేక, కక్కలేక ఇండియా వేపు చూసి పళ్ళునూరుతూ.
ఏతా వాతా పాకిస్థాన్ నిజాయితీ ప్రపంచాని కంతటికీ తెలుసు. తెలుసునని అమెరికాకు
తెలుసు. అమెరికాకు తెలిసిన విషయం పాకిస్థాన్ కి తెలుసు. ఇండియా ఆ పని చెయ్యలేదని
తెలుసు. పాకిస్థాన్ కి తెలుసని మనకి తెలుసు. మధ్యలో అమెరికా పాకిస్థాన్
పళ్ళూడగొట్టిందని ప్రపంచానికంతటికీ తెలుసు. తెలిసిపోయిందని ఇప్పుడు పాకిస్థాన్
కీ తెలుసు.
ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ కి తోడికోడలు. అసలు కొట్టే మొగుడు ధైర్యంగానే
కొడుతున్నాడు. నిన్ననే రెండో దెబ్బ కొట్టాడు. ఇప్పుడు పాకిస్థాన్ బాధల్లా
తోడికోడలు నవ్విందని.