|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here మృత్యువు ఒక మీమాంస గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com ఒక దయనీయమైన కథ. అత్యంత హృదయ విదారకమైనది. పొలాల్లో కూలి చేసుకునే భార్యాభర్తలకి ఒక్కడే కొడుకు. విమానయాన శాస్త్రంలో పట్టభద్రుడయాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి సిద్ధపడుతూండగా ఆక్సిడెంటయింది. 15 సంవత్సరాల పాటు కేవలం అచేతనమైన స్థితిలో ఉండిపోయాడు. అయిదేళ్లు కోమాలో ఉన్నాడు. క్రమంగా తెలివొచ్చింది. కానీ మాట్లాడలేదు. కాళ్లూ చేతులూ చచ్చుబడ్డాయి. అప్పటికి కుర్రాడి వయస్సు 36 సంవత్సరాలు. ఆ దంపతులు నెలకి 500 సంపాదిస్తారు. బిడ్డని సాకలేక తండ్రి చచ్చిపోయాడు. తల్లికి 75 సంవత్సరాలు. మానవతా దృక్పథంతో కుర్రాడిని ఇంజక్షనిచ్చి అతన్ని నరకయాతన నుంచి విముక్తం చేసెయ్యమని కోర్టుకి మొరపెట్టుకుంది. తర్వాత తాను మనశ్శాంతితో పోగలనని చెప్పుకుంది. బిడ్డని సాకే స్థోమతులేదు. శక్తి చాలదు. కాని కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ తల్లి దండువారి పల్లెలో (చిత్తూరు జిల్లా) ఉంటోంది. బహుశా ఆంధ్రదేశంలో ఇలాంటి కేసు -బిడ్డ ప్రాణాలు తీయమని (మానవతా దృక్పథంతో) కోరిన కేసు ఇదేనేమో. న్యాయమూర్తి మరొకరి ప్రాణాలను ఎటువంటి పరిస్థితిలో నయినా తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ----------------------------------------- ఎప్పుడో హైస్కూలులో చదువుకునే రోజుల్లో దువ్వూరి రామిరెడ్డి 'పానశాల' చదువుకున్నాం. ఉమర్ ఖయ్యాం అంటాడు: ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్న రాకయుందును, వచ్చిన పోకయుందు వీలుపడునేని ఈ పాడు నేలయందు ఉనికి పట్టువు చావు లేకున్న మేలు. పాడు జన్మ అంటూనే చావులేని అమరత్వాన్ని కోరుకుంటాడు. అతనికి జీవించడం ఒక అవకాశం. ఆనందంగా జీవించడం వ్యసనం. జీవితాన్ని జీవనయోగ్యం చేసుకోవడం అభిరుచి. మృత్యువు అతనికి అభ్యంతరం. ఆనకట్ట. ----------------------------------------- భారతీయ కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారందరికీ -మృత్యువు జీర్ణ వస్త్రాల్ని విడిచి కొత్తవాటిని ధరించే మజిలీ. మృత్యువు ఒక శరీరం నుంచి మరొక శరీరానికి బదిలీ. బహుశా భారతీయ వ్యవస్థ మనిషిని మృత్యువుకి సిద్ధపరిచినట్టు మరే ఇతర మతం ప్రయత్నించలేదేమో. మృత్యువు మరో కొత్త పేజీని తెరవడం. ----------------------------------------- చాలామందికి మృత్యువు ఆయుధం. కొందరికి ఉద్యమం. ఎక్కువమందికి అవకాశం. తెల్లారిలేస్తే తమ స్వప్రయోజనాలకు, తాము నమ్మిన సామాజిక సిద్ధాంతాలకి, తన కోపం తీరడానికి, తన పబ్బం గడవడానికి, తన మేలుని పొందడానికి -ఎంతమంది మృత్యువుని వాడుకుంటున్నారో తెల్లారి పత్రిక తెరిస్తే కోకొల్లలు. మృత్యువు చాలా మందికి సాకు. కొందరికి సామాజిక న్యాయం. కొందరికి తప్పించుకునే దొంగదారి. ----------------------------------------- ప్రయత్నం లేకుండా, ఆలోచించకుండా, ఆశించకుండా, ఎదురుచూడకుండా మృత్యువు వాతని బడే ఎందరో దురదృష్టవంతుల కథలు మనం వింటూంటాం. వారి బ్రతకాలనే ఆశకీ, బ్రతకలేని నిస్సహాయతకీ పొంతన లేదు. జీవితం దుర్మార్గంగా వారిని ఆ అవకాశానికి దూరం చేస్తుంది. మృత్యువు కొందరికి ఎదురుచూడని అతిథి. ఆశించని అనర్థం. మీదపడే దురదృష్టం. ----------------------------------------- ఊహించని ఘోరమయిన నేరం చేసినవాడికి, భయంకరమైన తప్పిదం చేసినవాడికి వ్యవస్థ మరణ శిక్షని విధిస్తుంది. గాంధీ హంతకుడిని ఉరి తీసింది. వందలమందిని చంపిన అజ్మల్ కసబ్‌కి చావు సరైన శిక్ష అని నిర్ణయించింది. అది వ్యవస్థ నిర్ణయించే న్యాయం. ఎవరికయినా, ఏ కారణానికయినా మరొకరి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? మృత్యువు వ్యవస్థ నీతికి చెలియలికట్ట. శిష్ట సమాజం దుర్మార్గానికి నిర్ణయించిన ఆఖరి మజిలీ. ----------------------------------------- బలవంతంగా చంపినవాడిని ఉరికంబం ఎక్కించే న్యాయవ్యవస్థ -ఊహించని నేరాన్ని చేసిన నేరస్థుడిని జీవితాంతం జైలుకి పంపగలిగిన వ్యవస్థ -ఒక నిస్సహాయుడి నిరర్థక జీవితానికి ముగింపు రాయడానికి వణికిపోతుంది. అపరాధికీ, నిస్సహాయత నెత్తిన పడిన నిర్భాగ్యుడికీ మధ్య ఎక్కడో 'నీతి'కి సంబంధించిన మీమాంస చిక్కుకుని ఉంది. మానవాళి మానవత్వపు విలువల ఔన్నత్యం ఉంది. అయితే అది ఔన్నత్యమా? నిస్సహాయతా? ద్వంద్వనీతా? విచికిత్సా? ఏమో! ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థా యిప్పటికీ ఆ సాహసం చెయ్యలేకపోతోంది. మృత్యువు కొందరి నెత్తిమీద పిడుగు కొందరు నిస్సహాయుల మనుగడకి గొడుగు మనకిష్టం ఉన్నా లేకపోయినా ప్రతీ వ్యక్తీ చేసే ఆఖరి అడుగు ఏప్రిల్ 30, 2012
************ ************ ************* ************* |