Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here భారత రత్న
గొల్లపూడి మారుతీరావు
అందరిమాటా ఏమోగానీ- నేను మాత్రం ఈ సంవత్సరం లలిత మోడీకి భారతరత్న గౌరవం లభిస్తుందని ఆశించాను. లభించనందుకు నిరుత్సాహ పడ్డాను.అడ్డమయిన వాళ్ళకీ అన్నీ పంచుతూండగా లలిత మోడీకి కనీసం పద్మవిభూషణ్ యివ్వవలసింది. ప్రపంచమంతటా యిన్ని కోట్లమంది చూసే, ప్రపంచంలో వున్న అని దేశాల గొప్ప ఆటగాళ్ళను కేంద్రీకృతం చేసి 1700 కోట్ల ఆదాయంతో- డప్పులు వాయించేవాళ్ళ దగ్గర్నుంచి, క్షవరం చేసే వాళ్ళ దగ్గర్నుంచి (ఉదా:సిమ్మండ్స్ ప్రతీ ఆటకీ నున్నటి గుండుతో కనిపిస్తాడు), వొళ్ళు అమ్ముకునేవాళ్ళదాకా (చీర్ లేడర్స్ కి నా అనువాదం తప్పయితే పాఠకులు క్షమించమనవి) అందరికీ అందులో వాటా కల్పించడం సామాన్యమయిన విషయం కాదు. ఇందులో క్రికెట్ ఉంది, వ్యాపారం వుంది, ఉపాధి ఉంది, సినీమా గ్లామర్ వుంది, సెక్స్ వుంది, కీర్తి వుంది, వినోదం వుంది, రాబడివుంది. అన్నిరకాల ఆనందానికీ ఆస్కారం వుంది. పిచ్చివాళ్ళ ఆటని నాలిక చప్పరించిన బెర్నార్డ్ షా ఇప్పుడు బతికి వస్తే ఇంతమందిని ఆకర్షించే ఈ వింత సర్కస్సుని చూసి ముక్కుమీద వేలువేసుకుంటాడు. ఇలా అందరికీ వ్యాపారవాటాల్ని పంచిన లలిత్ మోడీకి –మరొక్కసారి అంటాను- పద్మవిభూషణ్ అయినా ఇవ్వకపోవడం అన్యాయమని. నిజానికి ఇలాంటి గౌరవాలు పొందినవారు మోడీకన్న “పీకింది” ఏమీ లేదంటాను. ఇక ప్రస్థుత కుంభకోణం మాట. అవినీతి, రొచ్చు, దోపిడీ అంటూ ఈ దేశంలో నీతిపరులు జుత్తులు పీక్కొంటున్నమాట. రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ కూలిపోయినప్పుడు- ఓ పత్రికలో వ్యాసం వచ్చింది. ఒక వ్యక్తి సాధించిన లబ్దిని- వ్యవస్థలో అందరితో సమానంగా పంచుకోవాలన్న సూత్రం- మానవాతీతమైన గుణం. ఇది గొప్ప ఆదర్శం. కాని ఆచరణకు గొప్ప అవరోధం. అది వ్యవస్థలో అందరూ అన్నికాలాలలో చెయ్యడం, చెయ్యాలని ఆశించడం, చేసేటట్టు చూడడం- అసంభవం. ఇలాంటిదేదో రాసారు. ఇది ఒక వ్యక్తి సంపాదించే ఆదాయమో, ఆహారమో మరేదో మాట. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు అద్దెఇంటికోసం గగన్ మహల్ రోడ్డులో ఒక ఇంటికి వెళ్ళాను. సుందరరాజన్ అనే ఓ ముసిలి అయ్యంగార్ ఆ ఇంటి యజమాని. నా భార్య తప్ప వయస్సొచ్చిన ఏ ఆడపిల్లా- నీ చెల్లెలయినా సరే- ఒంటరిగా నీ సరసన ఉండరాదు అని షరతు పెట్టి ఇల్లిచ్చాడు. ఇది సెక్స్ మాట. పెళ్ళిళ్ళి కాకుండా,బారుల్లో రాత్రిళ్ళు మగాళ్ళతో సరదాగా జల్సా చేసే చాలామందికి- ముఖ్యంగా “వుమెన్స్ లిబ్” వారికి- ఈ అయ్యంగార్ బొత్తిగా గిరిజన సంస్కృతికి ప్రతీకగా కనిపిస్తాడు. బెల్లం వున్న చోటికి చీమలు వస్తాయి అన్నది సామెత. ఈ ఐపిఎల్ లో 1700 కోట్ల విలువైన బెల్లం వుంది. రోజూ ఆట ముగిశాక- తెల్లవారు ఝామువరకూ తాగితందనాలాడే అందాల ముద్దుగుమ్మలున్నారు. బారెల్స్ తో పారే బ్రాందీ విస్కీలున్నాయి. అన్నిటికీ మించి ఈ సర్కస్ ని ఏకఛ్ఛత్రాధిపత్యంగా నడిపే లలిత్ మోడీ వున్నారు. ఏనాడయినా పదిమందితో అవినీతి చావుతో సమానం. ఒక్కడితో అవినీతి పెళ్ళితో సమానం. ఈ మూడేళ్ళూ 5000 కోట్ల బెల్లాన్ని దేవుడి నైవేద్యంలాగ కళ్ళకద్దుకుని నోట్లో వేసుకునే భక్తులూ, పరాయి స్త్రీని సీతామహాసాధ్విలాగ భావించే రంగరాజన్ లూ ఉంటారని – యిన్ని లక్షల డాలర్లు జేబులు, దేశాలు, బాంకులూ మారుతున్నా అందరూ భావించడం- ఇంత ఆలశ్యంగా విరుచుకు పడడం విడ్డూరంగా వుంది. ఉన్నట్టుండి శిశిధరూర్ అనే గ్లామర్ మంత్రిగారు- అంతే గ్లామరస్ గర్ల్ ఫ్రేండ్ ని వెనకేసుకొచ్చినందుకు దేశమంతా తప్పుపట్టి,ఆయన్ని దుమ్మెత్తి పోయడం, ఆఖరికి ఆయన మంత్రి పదవికే ఎసరు పెట్టడం- నాకు అన్యాయంగా కనిపిస్తుంది.పాపం, లోపాయకారీమాట ఎలావున్నా- ఆయన బహిరంగంగా ఒక్క గర్ల్ ఫ్రెండునే నమ్ముకున్నాడు.ప్రతీదినం- క్రికెట్ ఆట ముగిసాక- బారుల్లో జరిగే వినోదాన్ని కోట్లు ఖర్చుచేసి, కొని మనకు పంచుతున్న ఛానల్స్ ధర్మమాంటూ- ఏ ఆడదానితో, ఏ ఆటగాడు ఏ క్షణంలొ ఎక్కడ గెంతాడో “సహారా” వారిని పోటీ పెట్టమనండి. ఒక్కడు గెలిస్తే నేను చెవికోయించుకుంటాను. ఇది అందరూ చూసి మురిపోతూండగా మన లల్లూలూ, బల్లూలూ ఏం చేస్తున్నారని. నడవడానికి కూడా ఓపికలేని కాషాయ సన్యాసి, పరమ పవిత్ర బాలా ధాకరేగారు ఏం చేస్తునారని! “ఆటని వేలంపాట’ని చేసిన లలిత్ మోడీ ని వీధిన పెట్టడానికి కంకణం కట్టుకున్న ఎందరో నీతి పరులూ, సత్యశీలురూ ఏ తాటి చెట్టుకింద పాలు తాగుతున్నారని! ఇందులో ఇంకా కేసు ఓ కొలిక్కి రాని గడ్డితిన్న లల్లూగారు కూడా వున్నారు. ఇప్పుడిప్పుడే కొందరి మంత్రుల పేర్లూ, కొందరు అల్లుళ్ళు, బావమరుదుల పేర్లూ బయటికి వస్తున్నాయి. బెల్లం తిన్న చీమల జాతకాలన్నింటినీ రాయాలంటే ఏ ఇన్కంటాక్స్ వారి తరం! తిలాపాపం తలా పిడికెడు ఎందరో దేశాల వారు పంచుకున్నారు. మంత్రుల పేర్లు వింటే ప్రతిపక్షాలకీ కితకితలు పెట్టినట్టుంటుంది. ఛానల్స్ కి కావలసినంత గడ్డి. ఆయ్యా, ఇదంతా బెల్లం మనదాకా మిగల లేదని అక్కసు. తినలేనివాడికి తిన్నవాడిని చూసి కడుపుమంట. ఈ దేశంలో నీతి మారేడుపండు. వెలక్కాయలో బ్రహ్మ పదార్ధం. దానిగురించి అందరూ మాట్లాడతారు. కాని ఎవరూ చూడలేరు. మొన్న చెన్నైలో మా సినీమా శివమణి డప్పు వాయిస్తూ చిందులు తొక్కుతూంటే ఒకాయన నా వీపు గోకి “ఈయనకి ఈ ఐపిఎల్ అంతటికీ 50 లక్షల కాంట్రాక్ట్ తెలుసా?” అన్నాడు. నేను కళ్ళెగరేశాను. మా అబ్బాయితో చెప్తే “అది చాక్లెట్ వదిలేసి చుట్టిన కాగితాన్ని నాకినట్టు” అని నాలిక చప్పరించాడు. ఏమైనా మనలాంటివారికి ఈ సర్కస్సు ఆనందోత్సాహాన్ని కలిగిస్తోంది. దొరికినవాడు బెల్లాన్ని చప్పరిస్తున్నాడు. దొరకనివాడు జుత్తు పీక్కొంటున్నాడు. ఏమీ దక్కనివారు తమకి దక్కలేదని జుత్తు పీకుతున్నారు. నన్ను జ్యోతిషం చెప్పమంటే- ముందు ముందు ఈ సర్కస్సు ఆగదు. మన ఆనందం ఏడాదికేడాదికీ ఇనుమడిస్తుంది. బెల్లం సైజు పెరుగుతుంది. తినేవాళ్ళ వాటాలు మారుతాయి. లోపాయకారీగా ఇన్ కంటాక్సువారికీ కొన్నివాటాలు వెళ్తాయి. జేబులు మారుతాయి. ఆడ్రసులు మారుతాయి. అంతే. సుఖపడడం, లబ్ది పొందడం- ఈ రెండూ పెద్ద వ్యసనాలు. ఆ వ్యసనాన్ని మంత్రుల దగ్గర్నుంచి, వాళ్ళ బావమరుదుల దగ్గర్నుంచి, వూళ్ళో టీవీలు పెట్టి తలో రూపాయి వసూలు చేసే ఆఖరి చిల్లర వ్యాపారిదాకా అందరూ వాటాలు పంచుకుంటారు. పాపం, బొత్తిగా అనుభవం లేని ఓ కుర్ర మంత్రి ఎందరో పెద్దల గోత్రాలను వీధిలో పెట్టాడు. అయినా పరవాలేదు. ఈ వ్యాపారంలోకి కొత్త వాటాదార్లు వస్తారు. ఏతావాతా, నా బాధల్లా ఒక్కటే- ఇంత పెద్ద బెల్లాన్ని సిద్ధం చెసిన మూల పురుషుడికి –లలిత మోడీకి- భారతరత్న యివ్వలేదే అని!
ఏప్రిల్ 26, 2010 ************ ************ ************* ************* |