అరచేతిలో వైకుంఠం


గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

    నేను భారతీయుడినైనందుకూ అందునా ఆంధ్రుడి నయినందుకూ ఈ మధ్య మరీ గర్వంగా ఉంది. అంతా మన నాయకుల చలవ అని మరిచిపోలేకుండా ఉన్నాను. బ్రతుకు బంగారు బాటలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంది.
మొన్నటికి మొన్న కొయ్యలగూడెంలో మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు -తమ పార్టీ పదవిలోకి వస్తే ఉచితంగా బియ్యం యిస్తామని శెలవిచ్చారు. అంతేకాదు. వృద్ధులకి, వితంతువులకీ 500 రూపాయిలు, వికలాంగులకయితే వెయ్యి, నిరుద్యోగులకు వెయ్యి యిస్తారు. ఇవన్నీ యిస్తూనే పెద్దయెత్తున ఉద్యోకావకాశాలు కల్పిస్తారు. నిరుద్యోగులకు వెయ్యి రూపాయిలు దక్కుతూండగా ఉద్యోగాలు ఎవరు చేస్తారు? హాయిగా ప్రభుత్వం పేరు చెప్పుకుని కాలుమీద కాలేసుకుని బ్రతకవచ్చుకదా?
మన ముఖ్యమంత్రిగారు యిప్పటికే కిలో రూపాయికి బియ్యం యిస్తున్నారు. బడుగు వర్గాల శ్రేయస్సుకి ప్రతిరోజూ యుద్ధ ప్రాతిపదికన కోట్ల రూపాయిలను మంజూరు చేస్తున్నారు. ఈ శ్రేయస్సుని తెలుసుకుని, తలచుకుని ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఆ మధ్య చిరంజీవిగారు పోటీ చేసిన రోజుల్లో ప్రతి ఇంటికీ కావలసిన పప్పు దినుసులు వగైరాలను కూడా నూరు రూపాయలకే సమకూర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.
కొంచెం అటు జరిగి, తమిళనాడుకి వెళ్తే -అక్కడి నాయకులు మరొక అడుగు ముందుకు వేసి, అలనాడు అన్నగారు నడిచిన మార్గంలో కిలో రెండు రూపాయిలకే బియ్యాన్ని యిస్తున్నారు. కరుణానిధి గారు కలర్‌ టీవీలు యిచ్చారు. చదువుకునే వాళ్లకి సైకిళ్లు యిచ్చారు. మేడమ్‌ జయలలిత కాలేజీ కుర్రాళ్లకు లాప్‌ టాపులు యిస్తున్నారు. పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు మంగళసూత్రం యిస్తున్నారు. నాయకులు ఇంత ముమ్మరంగా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న శుభతరుణం యిదేననిపిస్తుంది.
అయితే ఈ నాయకులు బొత్తిగా భార్యల్ని పట్టించుకోవడం లేదని నా ఉద్దేశం. వారు వెంటనే భార్యల్ని సంప్రదించాలి. కుటుంబాలు కేవలం బియ్యాన్ని బొక్కుతూ గడపరని వారి వారి భార్యలు చెప్పగలరు. అయితే మన రాష్ట్ర నాయకులు ఉచితంగా బియ్యాన్ని యిస్తే కేంద్ర నాయకులు వంట గ్యాసు ధరలు పెంచుతున్నారు. పోనీ, వండుకోకుండా ఉచిత బియ్యాన్ని తింటూ గడపలేరుకదా? అందుకని మన రాష్ట్ర నాయకులు -బియ్యంతోపాటు తగు మాత్రం చింతపండు, ఉప్పు, కందిపప్పు, వేరుశనగ మాంసాహారులకయితే చిన్నసైజు కోడిపెట్ట -అటూ యిటూ కాని నాలాంటి బ్రాహ్మణ పౌరులకు కోడిగుడ్లు వంటివి ఉచితంగా ఇవ్వాలని మనవి.
తమిళనాడులో కిలో రెండు రూపాయిల బియ్యాన్ని అక్కడివారు అమ్ముకోగా -లారీల్లో మేలురకం బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతూండగా పోలీసులు పట్టుకున్నారు. ఏమిటీ విపరీతం? మేలురకం ఆహారాన్ని యిస్తే అనుభవించలేం?
ఇక్కడే ఉంది విచిత్రం. గుడిసెల్లో ఉండేవాడిని రాష్ట్రపతి భవనానికి పంపితే నిద్రపట్టదు. హఠాత్తుగా అతని ఆలోచనా ధోరణి, దృక్పథం, జీవనసరళి మారిపోదు. మార్పు లేదా 'మేలు' ఉచితంగా యిచ్చే సౌకర్యాల వల్ల జరగదు. అవసరమైన సౌకర్యాలను అమర్చుకునే వెసులుబాటు, సామర్థ్యం, అవకాశం, విజ్ఞతా ఇవన్నీ కలిసివస్తే జరుగుతుంది. అంతకంటే దీర్ఘకాలిక ప్రాతిపదికన వారి జీవన సరళిని మార్చే పథకాలు, వాటిపట్ల వారి అవగాహన కలిసిరావాలి.
తమిళనాడు ఇచ్చిన కలర్‌ టీవీలు 24 గంటలు తిరగకుండా బజారులోకొచ్చాయి. సైకిళ్లు 90 శాతం హైస్కూలు కుర్రాళ్ల యిళ్లు దాటిపోయాయి. రెండు రూపాయల బియ్యాన్ని అమ్ముకుని బెల్టుషాపులకు పరిగెత్తినవారి కథలు ఎన్నో ఉన్నాయి.
సరే. మరి ఇన్ని వనరులు -యుద్ధప్రాతిపదికన రాష్ట్రం ఏర్పరుస్తూండగా 'ప్రజాపథం' కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధుల మీద విరుచుకు పడుతున్నారేం? ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక, సముదాయించలేక ముఖం చాటుచేసుకుని పారిపోతున్నారేం? కారణం -నేలబారు కుటుంబానికి కావలసిన, తీరవలసిన సమస్యలు వేరే ఉన్నాయి. మంచినీరు, మురుగునీటి పారుదల, చెత్తకుప్పల నిర్మూలన -ఇవన్నీ వారి సుఖవంతమైన జీవనానికి అవసరం. వాటిని పట్టించుకునే నాథుడు లేడని వారు గొంతులు చించుకోవడం ఈ పథంలో మనం చూస్తున్నాం.
రాజనీతిజ్ఞుడు వచ్చేతరం గురించి ఆలోచిస్తారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. ఈనాటి పార్టీలకు వచ్చేతరం వరకు మన్నిక ఉంటుందన్న నమ్మకం లేదు. అందుకని హడావుడిగా తమ యిళ్లను చక్కబెట్టుకునే ప్రయత్నమిది. అలనాడు పండిత నెహ్రూ కన్న మూడు బంగారు కలలు -నాగార్జునసాగర్‌, హీరాకుడ్‌, భాక్రానంగల్‌ ప్రాజెక్టులు. ఈనాటి నాయకులు -కిలో బియ్యం, సైకిళ్లు, కలర్‌ టీవీలు. ఈ నాయకులు చేసే ఉపకారం తాత్కాలికంగా వారి అవసరాలను తీర్చే పనులు. ఏ భూకంపమో, వరదలో, అగ్నిప్రమాదాలో సంభవించినప్పుడు 'మాత్రమే' చేయగలిగే, చెయ్యవలసిన ఉపకారాలు. దీర్ఘకాలిక ప్రయోజనాలు మనస్సులోలేని ప్రభుత్వం కేవలం తమ వోటు కోసమే పబ్బం గడుపుకొంటోందని సామాన్య ప్రజలకీ అర్థమౌతోంది.
ఇదివరకటి కంటే కెమెరాలూ, మైకులూ నాయకుల్ని వీధిన పెడుతున్నాయని వారికి అర్థమౌతోంది. ఈ ఉపకారాలు కేవలం ఉపకారాలు కావనీ, తమ ఓట్లకి తాయిలాలని వారికి తెలుసు.
వాటి మన్నికా తెలుసు. అందుకనే ఇదివరకు నెహ్రూగారికి, పటేల్‌ గారికీ, టంగుటూరి వారికీ యిచ్చే గౌరవాన్ని ప్రజలు వీరికి ఇవ్వడం లేదు. ఊళ్లోకి వచ్చిన నాయకుల్ని నిలదీస్తున్నారు. చిన్న చిన్న సంఘాలు, కులాలు, వర్గాలు, పేటలూ, గూడాలు, మతాలవారు తమ అవసరాల కోసం నాయకుల్ని నిలదీస్తున్నారు. బేరాలు తేల్చుకుంటున్నారు. బుకాయిస్తున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. డిమాండ్‌ చేస్తున్నారు. హెచ్చరిస్తున్నారు. దుయ్యపడుతున్నారు. బొడ్డులో చెయ్యి వేసి తమ హక్కుగా ముక్కు పిండుతున్నారు.
కల్లుపాకకీ దేవాలయ ప్రాంగణానికీ చాలా దూరం ఉంది. ఎంత చెట్టుకి అంత గాలి.



                                       
ఏప్రిల్ 23, 2012  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage