Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

మాంచి సినీమా కధ

గొల్లపూడి మారుతీరావు
                 gmrsivani@gmail.com
                                     

     

          లాభసాటి అయిన స్క్రీన్ ప్లేకి మూల సూత్రం- ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం. తలుపు తీసుకుని హీరోయిన్ వస్తుందని ఆశిస్తాడా? ఎలుగుబంటి వస్తుంది. ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందని ఊపిరి పీలుస్తాడా? ఓబులేసు వస్తాడు. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లే పడికట్టురాయి.

          ఇప్పుడు అసలు కధ. జామపండులాగ పిటపిటలాడే ఆడపిల్ల. పేరు సానియా మీర్జా. వొంట్లో అన్నిభాగాలూ ఎగిరిపడేటట్టుగా, తొడలు కనిపించే చిన్న నిక్కరుతో టెన్నిస్ ఆట ఆడే సౌందర్యరాశి. ఆమె ఆటకంటే ఆమెనే ప్రపంచం అబ్బురపాటుతో చూసి ఆనందించింది. ఇలాంటి సౌందర్యరాశులు ఎక్కువగా టెన్నిస్ లోనే కనిపిస్తారు.ఆ ఆకర్షణ పొట్టి నిక్కర్లలో, బిగించిన బ్లౌజుల్లో ఉందేమో. అలనాడు అన్నా కోర్నికోవా అనే గుంట ఇలాగే చాలామంది మతులు చెడగొట్టింది. తరవాత్తరవాత- ఆటకంటే వొళ్ళు రాణిస్తోందని కనిపెట్టి- మోడలయి వొంటినే నమ్ముకుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి- నేటి మారియా షారాపోవా –గిరీశం భాషలో చెప్పాలంటే-మన సానియా కాలిగోటికి సరిపోదు.

          ఏతావాతా, డబుల్స్ గేమ్ లో ప్రతీ బంతికీ తన సహ ఆటగాడితో భుజాలు గుద్దుకున్నప్పుడల్లా ప్రేక్షకుల గుండె ఝళ్ళుమనేది. ఆట చివర ఒకరినొకరు కరుచుకున్నప్పుడల్లా ప్రేక్షకులు తామే ఆ కౌగిట్లో ఉన్నట్లు మురిసిపోయేవారు. ప్రతీ బంతికీ అలా “కరుచుకోవచ్చు” కదా అని కొందరు మనస్సుల్లో భావించకపోలేదు.

          అలా బొత్తిగా బట్టల్లేకుండా ముస్లిం ఆడపిల్ల ఆడకూడదని ముస్లిం మతగురువులు కళ్ళురిమారు. ఏం చెయ్యాలని వారి ఉద్దేశం? ఒక నల్ల బురఖా తొడుక్కుని ఆడాలనా? అంతకంటే టీవీలకు ఒక బురఖాని తొడిగితే సరిపొతుందికదా? ఎందుకనో తర్వాత మతగురువులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. వారూ ఆ దృశ్యాల రుచి మరిగారేమో మనకు తెలియదు.

          ఇది స్క్రీన్ ప్లేలో తొలి రీళ్ళు.

          ఇప్పుడు పిల్లకి పెళ్ళీడు వచ్చింది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కధలోలాగ బుగ్గలు డోక్కుపోయి, సానియా పినతండ్రిలాగ కనిపించే మహమ్మద్ షొరాబ్ మీర్జా తో పెళ్ళి అన్నారు. సావిత్రికి ప్రియుడుగా అక్కినేని రాణిస్తాడుగాని రేలంగి రాణిస్తాడా?- (అది మాయాబజార్“ లాగ రసాబాస అయితేతప్ప? )ప్రపంచం చాలా భాధపడిపోయింది. వాళ్ళకి నిక్కా జరిగిపోయింది. ఇక సానియా ఎల్లకాలం పడకగదుల్లో కంటే టెన్నిస్ కోర్టుల్లోనే గడుపుతుందని అంతా భావించారు.

          ముందే చెప్పిన స్క్రీన్ ప్లే “మెలిక” మరిచిపోకండి.ఉన్నట్టుండి ఇద్దరూ విడిపోవడానికి అంగీకరించారన్నారు. అదేమిటి? ఒకరికొకరు జోడీ కాదని ఇద్దరూ భావించారట.మరి ముందెందుకు భావించలేదు? కధలో అదే “మెలిక”.

          ఇప్పుడు హీరో కధ. ఆయన షోయబ్ మాలిక్. భారత దేశానికి శత్రుదేశంలో పేరొందిన క్రికెట్ ఆటగాడు.ఆటలో ఓడిపోయినందుకు- ప్రపంచంలో వున్న ముస్లింమతస్థులందరికీ క్షమాపణ చెప్పిన పరమ భక్తుడు. దైవచింతనలో పండిముదిరినవాడు. ఆయన జెడ్డాలో ఇద్దరు అమ్మాయిల్ని చూశాడు. ఒకమ్మాయిపేరు మహా. మహా అందంగా వుంది. మరో అమ్మాయి పేరు ఆయేషా. మహా లావుగా వుంది. మహాని వెంటనే ప్రేమించాడు..తీరా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళాక మహాతో కంప్యూటర్ ప్రేమని కొనసాగించాడు. మహా గొంతునీ, మహా ప్రేమలేఖల్నీ, మహా ఫొటోనీ ప్రేమించాడు. కలలుగన్నాడు. తనివితీరక ఆమెని కలుసుకోవాలని హైదరాబాదు వస్తే ఆమె ఊళ్ళో లేనని చెప్పించింది. ఎందుకు? ఇదీ సినీమాలో పెద్ద మలుపు. జెడ్డాలో చూసిన “మహా” నిజానికి పరోక్షంగా అతనితో ప్రేమాయనాన్ని నిర్వహించిన ఆయేషా కావడం. ఇది ఫక్తు నా “దేవుడు చేసిన పెళ్ళి”లో మెలిక!

          సినీమాలో అటుపక్క కధనీ చూపించాలి కనుక వొళ్ళున్న ఆయేషా షోయబ్ మీద మనస్సు పారేసుకుంది. ఇప్పుడు మెలిక ఏమిటంటే షోయబ్ సాహెబ్ గారు మహాని పెళ్ళాడుతున్నాననుకుంటూ ఫోన్ లో ఆయేషాని పెళ్ళాడేశాడు. అదెలా అని ఆశ్చర్యపడనక్కరలేదు. అలాంటి పెళ్ళిళ్ళు సంప్రదాయంలో సాధ్యమట! పోస్టులో వచ్చిన ఖరారు పత్రం మీద సంతకం చేశాడట. మరి ఇద్దరూ కలిసిన ఫొటోలు? ఆమెకి కడుపయి, అబార్షన్ అయిన కధ? ఇది టెలిఫోన్ లో సాధ్యం కాదే!- ఇవన్నీ ఫ్లాష్ బాక్ లో చెప్పాల్సిన కధలు.

          ఇప్పుడు షోయబ్ మాలిక్ సానియా మీర్జా ప్రేమలో పడ్డారు. ఇది గుమ్ నామ్ సినీమా. ఇద్దరూ రెండురకాల పెళ్ళిళ్ళను దాటి వచ్చారు. రెండు గొప్ప క్రీడల ప్రతినిధులు- రెండు శత్రుదేశాల వారు.

           శివసేన ఇందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఎవరయినా ఇండియా సాయిబుగారిని పెళ్ళి చేసుకోమని హితవు చెప్పింది. అయినా సానియా వినలేదు. ఇప్పుడేం జరుగుతుంది? అసలు పెళ్ళి జరుగుతుందా లేదా? బాల ధాకరే, రాజ ధాకరేలు త్రిశూలాలు పట్టుకుని రంగంలో దిగుతారా? అంతా సస్పెన్స్. ఇంటర్వెల్ కి ఇది మంచి తరుణం.

          మరమరాలు తిని, కాఫీ తాగి మళ్ళీ మనం ధియేటర్ లోకి వచ్చి కూచున్నాక- రెండు కొత్త పాత్రలు రంగంలోకి దిగాయి. వారు ఆయేషా తల్లిదండ్రులు-మహమ్మద్ అహమ్మద్ సిద్దికీ,ఫరిస్తా సిద్ధికీ. మా అమ్మాయికి షోయబ్ తో పెళ్ళయిపోయింది బాబోయ్ అన్నారు వారు. ఆయేషా తల్లి నోరున్న మనిషి. ఆవిడ ఇద్దరితోనే మాట్లాడింది-అడిగినవాడితో, అడగనివాడితో. టీవీ ఛానళ్ళు పండగ చేసుకున్నాయి. పొరుగింటి పుల్లకూరని అమ్ముకునే చవకబారు దుకాణాలు టీవీ ఛానళ్ళు.ఈ గొడవలో ఆయేషా ఎక్కడ? ఆవిడ  ఎవరికీ కనిపించదు. ఫోనుల్లో వినిపిస్తూంటుంది. ఎందుకని? ఆవిడ లావుగా ఉన్నానని సిగ్గుట. అంత ఆత్మజ్ణానం ఉన్న మనిషి షోయబ్ ని ఎలా ప్రేమించింది? కనిపిస్తేకదా అడగడానికి? ఇంతకీ తాను పొరపాటుపడి ప్రేమించిన ఆ మహా ఎవరు? ఎలావుంటుంది? ఇప్పుడెక్కడ వుంది? ఎవరికీ తెలీదు.

          ఇంతకీ ఆయేషా తల్లిదండ్రులు కోరేదేమిటి? మాకు డబ్బొద్దు. ఈ పెళ్ళీ వద్దు.షోయబ్ మాలిక్ మా అమ్మాయిని పెళ్ళడాడని ఒప్పుకుని విడాకులిస్తే మా అమ్మాయి జీవితాంతం గౌరవంగా, మనశ్శాంతితో జీవిస్తుంది. అదేమిటి? జెడ్డాలో పరిచయం పెరిగి, టెలిఫోన్ లో పెళ్ళయి, కడుపయిన అమ్మాయి ఎంత చెడ్డా

      మాలిక్ సాహెబ్ గారి పెళ్ళామేకదా? కాపరం చెయ్యాలని ఎందుకనుకోదు? కాని ఆయేషా కనిపించేపిల్ల కాదు. వినిపించేపిల్ల.

          షోయబ్ దైవభక్తుడు. మతం అంటే క్రికెట్ అంత ప్రాణం.అబద్ధం చెప్పడు. తను ఆయేషాని చూడలేదన్నాడు. ఆవిడెవరో తనకు తెలీదన్నాడు. అది పిల్ల పేరో, పిల్లి పేరో తెలీదన్నాడు. ఇవన్నీ లోకం నమ్మింది. అందుకే సంభాషణలు చెయ్యితిరిగిన రచయితచేత రాయించుకోవాలి. అడ్డమయిన రచయితా రాస్తే షోయబ్ మాలిక్ పత్రికా సమావేశాల్లాగ వుంటాయి.

          ఆయేషా తల్లిదండ్రులు కేసులు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగారు. షోయబ్ గారి పాస్ పోర్ట్ లాక్కొన్నారు. ఏ క్షణాన్నయినా అరెస్ట్ కావచ్చునన్న కధనాలు బయలుదేరాయి. ఇప్పుడు షోయబ్ గారి బావమరిది రంగంలోకి దిగాదు. మా వాడు పెళ్ళి కాగితాలమీద సంతకం చేయడమే పీకల మీదకి వచ్చిందని పబ్లిగ్గా వాపోయాడు. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు? సంతకం పెట్టలేదని షోయబ్. పెట్టి పప్పులో కాలేశాడని బావమర్ది. ఈలోగా రెండో పెళ్ళి(?) ముహూర్తం దగ్గర పడుతోంది.

          అప్పుడు రెండు వర్గాల పెద్దలు కలిశారు.  ఇప్పుడు కధలో మరో అసలు మెలిక. తను ఆయేషాను పెళ్ళి చేసుకొన్నట్టు ఒప్పేసుకున్నాడు షోయబ్. అయ్యో మతాన్ని నమ్మిన భక్తుడా? నీకిది తగునా? ఆయేషాకు విడాకులివ్వడానికి అంగీకరించాడు. ఆయేషా తల్లి ఆనందించి, నాకూ, నా కూతురుకీ ఇప్పుడు మనశ్శాంతి దక్కిందని వెలుగురాసిన గొంతుతో చెప్పి రంగంలోంచి నిష్క్రమించింది. అయితే మొదటి మూడు రీళ్ళలో ప్రేమ, కడుపు అన్నీ నిజమేనన్నమాట! ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఈ దశలో “నిజం’కు పెద్ద విలువలేదు. పబ్బం గడవాలి. విడాకులమీద హడావుడి సంతకాలు జరిగాయి.

          ఇక్కడ మరో చిన్న యాంటీ క్లైమాక్స్. విడాకుల పత్రం చెల్లదని మత గురువులు ఘోషించారు. ఏం? షోయబ్ తండ్రి పేరు మాలిక్ ఫకీర్ హుస్సేన్ అని వుండాలి. కాని మాలిక్ సలీమ్ హుస్సేన్ అని ఉంది. ఇదేమిటి? షోయబ్ గారే తన తండ్రిపేరే అబద్దం చెప్పారా? రెండో అబద్దాన్ని ముస్లిం పెద్దలు సరిపెట్టుకుంటారు.

          ఇప్పుడు క్లైమాక్స్ మెలిక. విడాకులు, కడుపులు,అబద్ధాలు, నామ దోషాలు- అన్నీ అలావుండగా పెళ్ళికాకుండా  మాలిక్, సానియాలు కలిసి తిరగడం మత విరుద్ధమని హైదరాబాదు సున్నీ ఉలేమా బోర్డ్ ఒక ఫత్వా జారీ చేసింది. వారేయే దేశాల్లో ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికి తెలుసు?

          ఇక ఆఖరి మెలిక. ఇది సినీమా అని తమరు మరిచిపోకూడదు. ఏప్రిల్ 15 న పెళ్ళి. ఏర్పాట్లు ముమ్మరంగా జరిగిపోతున్నాయి. కాబోయే భార్యాభర్తలు షాపులకు కాకుల్లాగ తిరుగుతున్నారు. ఈలోగా ఈ ఫత్వా. ఇప్పుడేంజరుగుతుంది? అదీ సస్పెన్స్. న్యాయంగా 15న పెళ్ళి జరగాలి. కాని గప్ చుప్ గా 12 న వందమంది సమక్షంలో మూడురోజుల ముందుగా శత్రుదేశాల క్రీడాకారులిద్దరూ పెళ్ళిచేసేసుకున్నారు.

          “తాంబూలాలిచ్చేశాను. తన్నుకు చావండి” అని అగ్నిహోత్రావధాన్లు అన్నట్టు తమధోరణిలో ముల్లాలకు, యావత్ ప్రపంచానికీ  “తన్నుకుచావమని” బుద్ధి చెప్పారు.

          ఇప్పుడు- శుభం కార్డు.

           ఏప్రిల్ 19, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage