నేను దైవ భక్తుడిని. కాని చదువుకున్న దైవభక్తుడిని. చదువుకోని దైవభక్తుడు తన
విశ్వాసానికి సమాధానం చెప్పలేడు. కాని అతను నాకంటే చాలా విధాలుగా, చాలా కారణాలకి
నాకంటే గొప్ప దైవభక్తుడు కావచ్చు. నేను కారణాలు చెప్పగలను.
మన దేశంలో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాపార కేంద్రాలు. నేను 20
సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను. కాని ఏనాడూ ఆకాశవాణి గొప్పతనాన్ని బేరీజు వేసే
ప్రయత్నం చెయ్యలేదు. పక్కన హిరణ్య కశిపుడు ఉంటేగాని ప్రహ్లాదుడి గొప్పతనం అర్ధం
కాదు. ఇన్ని ఛానళ్ళు సామూహికంగా ఆ ఉపకారం చేస్తున్నాయి. నేను ఎక్కువగా ఛానళ్ళు
చూడను. చూడకుండా జాగ్రత్త పడతాను. అది నా ఆరోగ్య రహస్యం.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రంజింప చేయాలని ప్రయత్నించరు. మీ శ్రేయస్సుకి ఏది
మంచిదో నిర్ణయిస్తారు. మీ భార్య మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించదు.
మిమ్మల్ని ఆనంద పరిచే స్థాయిలో ఆగుతుంది. 'రెచ్చగొట్టడం' వ్యభిచారి చేసే పని.
ఈనాటి ఛానల్స్ చేసే పని. అందరి మాటా కాకపోవచ్చు. కాని ఎక్కువ ఛానల్స్ కి ఇది
వర్తిస్తుంది. నిరూపిస్తాను.
ఈ మధ్య సత్యసాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉంది.
ఆ వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే కొన్ని ఛానళ్ళు చూస్తున్నాను. ఒక ఛానల్ లో
చాలా మేధావి అయిన ఏంకర్ సత్యసాయి విద్యాసంస్థలో చదువుకుని, డాక్టరయి, అక్కడ సేవ
చేస్తున్న ఒక డాక్టర్ ని ప్రశ్నిస్తున్నాడు.
"సత్యసాయి దేవుడయితే వీల్ చైర్ లో ఎందుకు కూర్చుంటాడు సార్?" అని.
ఎంత గొప్ప లాజిక్ ఇది! ఈ ఏంకర్ కూడా భారత దేశంలో పుట్టినవాడే. సంకర జాతి
వాడనుకోను. అతని మొహమూ, భాషా ఆ విషయాన్ని తెలుపుతున్నాయి. ఆ ప్రశ్న వెయ్యడంలోనే
"పిచ్చిముండా కొడకా! మీరు దేవుడని భజన చేస్తున్న మనిషి వీల్ చైర్ లోంచి
లేవలేకపోతున్నాడురా - ఇంకెక్కడ దేవుడు?" అనే వెటకారం ఉంది. టీవీ ప్రేక్షకుల్ని
కితకితలు పెట్టాలనే యావ ఉంది. ఆ డాక్టర్ పాపం, చాలా ఆవేదనతో, సంతాపంలో ఉన్న
మనిషి. సమాధానానికి తడువుకున్నాడు. దైవభక్తుల్ని ఇలాంటి ఎన్ని ప్రశ్నలయినా
వెయ్యవచ్చు. శ్రీకృష్ణుడు దేవుడయితే నెమలి ఈకలు ఎందుకు పెట్టుకున్నాడు సార్?
కోడి ఈకలు పెట్టుకోవచ్చుకదా? నీల మేఘశ్యాముడు ఎందుకు సార్? తెల్లగా ఉండవచ్చుకదా?
ఎనిమిది మంది పెళ్ళాలు ఎందుకు సార్? అతన్ని కామపిశాచి ఏమయినా ఆవహించిందా? ఇవే ఏ
ఫ్రాన్స్, ఏ జింబాబ్వే, ఏ లిబియా నుంచో వచ్చిన మనిషి అయితే మనం అతని అజ్నానాన్ని
అర్ధం చేసుకోగలం. కాని ఈ ఛానల్ మనిషికి తెలియక కాదు. కాని తనకు దేవుడిని వీధిన
పెడితే వచ్చే ఆనందం తనవంటి వారెందరికో ఆనందాన్నిస్తుందన్న వ్యాపార సూత్రం తెలుసు.
ఇది నల్లబజారులో గంజాయిని అమ్ముకోవడం లాంటిది. 'గంజాయి' వ్యాపారం లాభసాటి అవడం
ప్రారంభించి చాలా రోజులయిందికదా - ఈ దేశంలో.
మీ అమ్మని మీరు ప్రేమిస్తున్నారా? ఆమె పారపళ్లనా? బొక్కి నోటినా? మధుమేహం
కారణంగా ఒడిలి శిధిలమైన అస్థిపంజరాన్నా? ఈమెనే తమరు అమ్మ అంటున్నారా? ఇదే
బాబాగారి వీల్ చైర్ ప్రశ్న.
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పను. చెప్పడానికి ప్రయత్నించను. ఆ ఛానల్ లో నేనుంటే చాలా
గొప్ప సమాధానం చెప్పేవాడిని. వ్యాపారానికి, పక్కవాడి కోరికని రెచ్చగొట్టే
వ్యభిచారానికి ఇది నిదర్శనంగానో - అంత దూరం పోనక్కరలేదనుకుంటే - విశ్వాసమంటే
సరైన అవగాహన లేని ఓ అజ్నాని వ్యాపార లౌక్యానికి ఇది నీచమయిన ఉదాహరణగా భావిస్తాను.
మనం ఏ.రాజాలు, కరుణానిధులూ, హసీం అలీలులాగే ఇలాంటి వ్యాపారస్తుల బ్లాక్ మెయిల్
ప్రసారాలను భరిస్తూ జీవిస్తున్నామని - కుష్టు రోగుల ఆసుపత్రిలో ఉన్న కుష్టు రోగం
రాని వ్యక్తిగా సరిపెట్టుకుంటాను.
ఇలా చెప్పడానికి కారణం - ఈ భారతదేశం ఇలాంటి చాలా తెలివైన అమ్మకందార్లను,
ఛానళ్ళనూ భరిస్తోంది. జాతి విశ్వాసాలకూ, వ్యక్తి విశ్వాసాలకూ సంబంధం లేదని,
ఉండనక్కరలేదని - హేతువుతో సంబంధం లేని దాన్నే విశ్వాసం అంటామనీ ఇలాంటి వారికి
చెప్పాలని శ్రమ పడను. అది కల్లుపాకలో పాలకుండని ఉంచడంలాంటిది.
పండు ముసిలి అయి, తల ముగ్గుబుట్టయి అవసానంలో ఉన్న మూర్తిని వాటేసుకున్న ఓ
ప్రముఖ వ్యక్తి విశ్వాసానికి విలువనివ్వాలేగాని, ఆ అవ్వ అర్హతలను వెదికికాదు.
శరీరంలో రక్తాన్ని పాలుచేసి బిడ్డకి జీవలక్షణాన్ని పంచే మాతృమూర్తి మమకారానికి
ఏ హేతువు ఆంక్షని నిర్ణయిస్తుంది?
ఆయన అడిగే చాలా ప్రశ్నలకు ఈ దేశంలో చాలా మంది దగ్గర వారి వారి స్థాయిలను బట్టి
సమాధానాలున్నాయి. ఈ దేశంలో శ్రీకృష్ణుడు ఎందుకు నెమలి ఈక పెట్టుకున్నాడో,
బాబాగారు ఎందుకు వీల్ చైర్ లో ఉన్నాడో, పి.భానుమతి లేవలేని స్థితిలో ఉన్నా
తెలుగువాడిని కొన్ని దశాబ్దాలు ఆనందపరిచిన కారణానికి ఆమెను ఎందుకు ప్రేమించాలో
చెప్పగల సామర్ధ్యం, అవగాహన ఉన్నవారు - నాకంటే గొప్పవారు చాలామంది ఉన్నారు.
ఉంటారు.
కుళ్ళు కార్యక్రమాలతో ఛానల్స్ నింపే వారికి నా విన్నపం. ప్రజల విశ్వాసాలను వారి
వారి విచక్షణకి విడిచిపెట్టండి. మీరు ఛానల్ ఉన్న కారణానికీ ఈ సమాజంలో నైతిక
చైతన్యానికి (moral police) కి బద్ధ కంకణం మీకు మీరే కట్టుకోకండి. చేతనయితే
దిక్కుమాలిన కార్యక్రమాలను కట్టిబెట్టి మంచి పాటల్ని ప్రసారం చెయ్యండి. మంచి
సంగీతాన్ని పంచండి. మంచి మాటల్ని చెప్పండి. ఈ దేశానికి ఇప్పటికే చాలా దరిద్రం
పట్టింది. దానికి మీ సహాయ సహకారాలనయినా ఆపండి. గంజాయి రుచి మప్పి బొజ్జలు
పెంచుకునే వ్యభిచార స్థాయికి జాతిని ప్రభావితం చేసే అతి బలమైన, విలువైన
మాధ్యమాన్ని దిగజార్చకండి.
ఇప్పుడు ఈ కాలంకి శీర్షిక అయిన ఓ గుండయ్య కథ. ధోనీ ఈ దేశపు క్రికెట్ టీంకి
కెప్టెన్. ప్రపంచ స్థాయిలో దేశాన్ని నిలిపిన ఘనుడు. 52 మిలియన్ల మంది
ప్రపంచమంతటా చూస్తుండగా బిలియన్ల భారతీయులను ఆనందపరిచిన ఆటగాడు. ప్రపంచకప్పు
అందుకున్న కొన్ని నిముషాల్లో డ్రస్సింగ్ రూంలోనే గుండు చేయించుకుని తలనీలాలను
తిరుపతికి పంపాడట మొక్కు కారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ధోని తలనీలాల కోసం
ఎదురుచూస్తున్నాడా? పదకొండు మంది ఆటకంటే ధోని గుండు - తత్కారణంగా - పరోక్షంగా
వేంకటేశ్వర స్వామి మనకీ కప్పు తెచ్చిపెట్టాడా? శ్రీలంక వాళ్ళకి ఇలాగ గెలిపించే
దేవుళ్ళు లేరా? వాళ్ళకి గుండుకాక మరేదయినా సమర్పించుకోవాలా? ఇవన్నీ తెలివైన
ఏంకర్లు అడగ్గల - ప్రేక్షకుల్ని కితకితలు పెట్టే ప్రశ్నలు. ఒక్క విషయం చెప్పి
ముగిస్తాను.
ఈ ఏంకరు మహాశయుడికి అతి చిన్న సమాధానం.
విశ్వాసం ప్రారంభమయిన క్షణంలో హేతువు శలవు తీసుకుంటుంది. రేపు మీ అమ్మని
పలకరించినప్పుడు ఈ వాక్యాన్ని తలచుకుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి.
తెలుగువారంకదా? ఇంగ్లీషులో చెపితే ఈ తరానికి మరికాస్త సులభంగా అర్ధమౌతుంది.
Faith starts when logic ends.