Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

పెంటపాటి బైరాగి క్రీడ
గొల్లపూడి మారుతీరావు

                 gmrsivani@gmail.com                             

                          .

           శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అవధానిని పెంటపాటి బైరాగి అన్నారు-కచ్చితంగా. ఇది వినడానికి క్రూరమయిన మాటగానే కనిపిస్తుంది. అవధానంలో బోలెడన్ని పద్యాలుంటాయి. కాని కవిత్వం ఉండదు. అవన్నీ కాగితం పువ్వులన్నారు.

        ఈమాటతో పూర్తిగా ఏకీభవించడం కష్టం. దానికి ఉదాహరణ వారే. తమ గురువులు రామకృష్ణశాస్త్రిగారు క్షేమేంద్రుడి గ్రంధానువాదంలో ఉత్పలమాలలో రెండు పంక్తులు చెప్పగా-     

        ఆరును నేడు పాదమున కక్షరముల్ గల వృత్తమందు న
        వ్వారిజ సంభవాస్యముల వాసమొనర్చెడి వాణి నిల్వగా
        నేరదు....

        అనగానే సుబ్రహ్మణ్య శాస్త్రిగారు-

        పుల్ల పంకజ వని న్విహరించెడి తేటి మల్లికా
        కోరక కోటిపై బదము గూర్పగ జాలునొకో యొకప్పుడున్

అని ఆశువుగా పూరించారు.

        భాషమీద ప్రభుత్వాన్ని క్రీడగా విహరించి, ఆనందించిన సందర్భాలు- నాకు తెలిసి- సంస్కృతం, కన్నడం, మరీ ఎక్కువగా తెలుగులో కనిపిస్తాయి. దీనిని బట్టి ఆనాటి సామాజికుల అభిరుచి, అవగాహన, విజ్ణత స్థాయి అర్ధమౌతుంది. ఈ మధ్య వెలువడిన కొప్పరపు కవుల అవధానాల ప్రచురణల్లో- ఆనాటి సామాజికులెందరో వారిని ప్రశంసిస్తూ ఆశువుగా, అలవోకగా చెప్పిన పద్యాలు చదువుతున్నప్పుడు దిగ్భ్రమ కలుగుతుంది. అవధానుల స్థాయిలో చెప్పగలిగే వారి ఉద్దతి మనల్ని ముగ్దుల్ని చేస్తుంది.

        ఏమాటకామాటే చెప్పుకోవాలి.  ఇప్పుడిప్పుడు తెలుగు భాషకే ఆదరణ,అభ్యాసం తగ్గిపోతోంది. ఇప్పటి అవధానాల రాణింపుకి ఎక్కువ కారణం- ఆ అవధానాల వాసి పట్ల అవగాహన కాక, వారి ప్రతిభ సామాజికుల్ని అబ్బురపరచడం.

        ఒకాయన కొండమీదనుంచి బంగీజంప్ చేశాడు. ఆశ్వర్యకరం. మరొకాయన 600 కిలోల బరువు ఎత్తాడు. అనూహ్యం. ఇంకొకాయన 12 సెకెన్లలో 200 మీటర్లు పరిగెత్తాడు. అద్భుతం. మరొకాయన- ఆలోచన చెప్పీ చెప్పగానే- అలవోకగా పద్యం చెప్పాడు. అది ఆ సద్యస్ఫూర్తి కలిగించే నివ్వెరపాటు. కాగా, మేధస్సుకి సంబంధించిన ఈ క్రీడ- ఎంతో కొంత మేధావులకు ఆటవిడుపు. మిగతావారికి కితకితలు పెట్టే literary exercise.

            కూర్చుని, పరిశ్రమించి, మదనపడి, మెరుగులు దిద్ది- రాసే రచన సంగతి వేరు. విశ్వనాధ రామాయణ కల్పవృక్షం వ్రాయడానికి 30 సంవత్సరాలు పట్టింది. ప్రతీక్షణం కూర్చుని రాశారని కాదు. ఆలోచననీ, మేధస్సునీ, మౌలిక ప్రతిభనీ సానబెట్టిన ప్రక్రియ అది.

        ఈ క్రీడని దృష్టిలో పెట్టుకునే మరో క్రీడకి వస్తాను. క్రికెట్. నేను 1963లో రేడియోలో చేరేనాటికి క్రికెట్ అంటే తెలీదు. కాని ఫతే మైదాన్ లో గారీ సోబర్స్ జట్టు(ఆ జట్టులో అందరిలోకీ చిన్నవాడు- ఆనాడు క్లైవ్ లాయడ్) పటౌడీ జట్టుతో ఆడుతున్నప్పుడు నేను కామెంటరీ బాక్స్ లో వున్నాను. నారాయణ స్వామి అనే ఓ పోలీసాఫీసరు కామెంటరీ చెప్పిన గుర్తు. ఏళ్ళ తర్వాత మా అబ్బాయి 11 ఏటినుంచీ చెన్నై చేపాక్ గ్రౌండుకి వెళ్ళడం ప్రారంభించాక ఆట మీద ఆసక్తి పెరిగి, పిచ్చి ముదిరింది. గవాస్క,ర్, చేతన్ చౌహాన్ లతో పార్టీలో గడిపాను. లండన్ లో వెంకటపతిరాజుకోసం హొటల్ కి మా ఆబ్బాయితో వెళ్ళిఅజయ్ జడేజాని, సంజయ్ మంజ్రేకర్ నీ కలిశాను. సౌరవ్ గంగూళీ, రాహుల్ ద్రావిడ్ ల మొదటి మాచ్ ని లండన్ లార్డ్స్ లో కూర్చొని చూశాను. రాత్రికి రాత్రి వెంకటపతిరాజుని నార్త్ వుడ్ తీసుకువచ్చి విందు చేసుకున్న సందర్భం గుర్తుంది. తర్వాత నేను హైదరాబాదులో ఉండగా మా యింటికి వచ్చాడు.

        ఈ 30 సంవత్సరాలలో వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, బ్రియాన్ లారా, మురళీధరన్, సచిన్ తెండూల్కర్ వంటి ఎందరో గొప్ప  క్రీడాకారులు తమ నైపుణ్యంతో ఈ క్రీడకి ఓ ఉద్ధతినీ, చరిత్రనీ సృష్టించడం చూశాం. అయిదు రోజుల టెస్ట్ మాచ్ వారి ఉద్దతికీ, నైపుణ్యానికీ మెరుగులు దిద్దే వేదిక. ఎన్నో మరుపురాని అనుభూతులు! ఎన్నో మరిచిపోలేని మాచ్ లు..

        తరువాత కెర్రీ పాకర్ ధర్మమాంటూ 50 ఓవర్ల కుదింపు ఆట నిలదొక్కుకుంది. ఆటలో సుఖం, చూసేవాడి ఆనందంలో క్లుప్తత పెరిగి- ప్రపంచ కప్పు స్థాయికి ఎదిగి- గొప్ప క్రీడాకారుల ఆట- ప్రతిభకి కాక, ప్రదర్శనకి పరిమితమయింది. అయితే ఇందులోనూ రాణింపు ఉంది. సామర్ధ్యం ఉంది. దక్షత ఉంది.

        ఆ మధ్య సింగపూర్ లో 20 ఓవర్ల క్రికెట్ ప్ర్రారంభమయింది. మొదట విని, చూసి మరీ కుర్ర తరహాగా, ఆకతాయితనంగా ఉన్నదనుకొని నవ్వుకున్నాను. ఇది ఆటలో అవధానం. ఇక్కడ ప్రతిభకి కాస్త స్థానమున్నా సద్యస్ఫూర్తికీ, అవధానంలాగానే reflexes కీ ప్రధమ స్థానం. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతి 22 గజాలు ప్రయాణం చేసి సెకెనులో చిన్న వ్యవధిలో బాట్ కి చేరుతుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు బారీ రిచర్డ్స్ మెదడు ఈ వ్యవధిలోనే అయిదు రకాలయిన షాట్ లను ఊహిస్తుందట!

        ఏమయినా ఆటలో నైపుణ్యానికి రెండో స్థానం దక్కి ఆడడంలో చాకచక్యానికి మొదటి స్థానందక్కేప్రదర్శనఇప్పటి ఐపిఎల్. ఇందులో సినీతారల గ్లామర్, చీర్ లీడర్స్ అనే ఆడపిల్లల అర్ధనగ్నపు గెంతులు, 1700 కోట్ల డబ్బు, కోట్ల రూపాయల జూదం, కొన్ని వందల గంటల టీవీ ప్రసారాలు- అన్నిటికీ మించి కొన్ని కోట్లమంది కోట్ల విలువైన man hoursని ఒక వినోదానికి వెచ్చించే వ్యాపారంగా స్థిరపడింది.

        నానాటికీ మోజు పెరుగుతున్న- మరో విధంగా మోజు పెంచుతున్న ఈ ఆటలో- ఈ సంవత్సరం ఐపిఎల్ నే ఉదాహరణగా తీసుకుంటే- సగం నడిచిన ఈ కసరత్తులో- ఆనాటికి అడ్డుపడి నెగ్గుకొచ్చిన సైంధవులే (మనీష్ తివారీ, సౌరభ్ తివారీ, రాబిన్ ఊతప్ప- వీళ్ళందరూ ఐసిసికి భారత్ జట్టుకి ఎంపిక కాలేదు!, డేవిడ్ వార్నర్) ఎక్కువగా కనిపిస్తున్నారు కాని-ధోని, రాహుల్ ద్రావిడ్, క్రిస్ గేల్, మాధ్యూ హేడెన్, హర్షల్ గిబ్స్, కైరాన్ పొలార్డ్ (ఈ వేలంలో అందరికంటే ఎక్కువ సొమ్ము మూటకట్టుకున్న యోధుడు), సంగక్కార, మహిలా జయవర్దనే, యువరాజ్- వీరెవరూ ఇంకా రాణించలేదు. రాణించే ఆస్కారం కేవలం వారి ప్రతిభ మీదకాక, ఆనాటి అవకాశం మీద ఆధారపడివుంది.

        వ్యాపారంలో ప్రతిభ కన్న రాణింపుకే పెద్ద పీట. నమ్మించడం కన్న అమ్మించడం ముఖ్యావసరం. ఐపిఎల్ సర్వాంగ సుందరంగా అన్ని హంగులూ కూడగట్టుకున్న సమగ్రమైన వ్యాపారం. ఇందులో డాన్ బ్రాడ్ మెన్ లూ, సచిన్ తెందూల్కర్ లూ తయారుకారు. వినియోగపడతారు. సమెధలవుతారు. బాగా డబ్బు సంపాదించుకుంటారు. సైంధవులు రాణిస్తారు. అందరూ కలిసి సమష్టిగా వ్యాపారం చేస్తారు. ప్రపంచంలో కొన్ని కోట్ల man hours మానవ శక్తి కేవలం ఆటకి ఖర్చవుతుంది.

        క్రికెట్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ రోజుల్లో దీపావళి బాణాసంచాని వెలిగించి ఆనందించినట్టుగా గాలిలోకి ఎగిరే బంతుల్ని చూసి, మురిసి చప్పట్లు కొట్టి ఆనందించడం ఈ రోజుల్లో ఫాషన్. ఇవాళయినా సిమ్మండ్స్ నాలుగు బాదులు బాదుతాడంటావా? అని మాట్లాడుకోవడం క్లబ్బు మర్యాద. వెరసి- బారులో బంతాటకి పెద్ద తెరలు వెలిశాయి. ఉత్తర హిందూదేశంలో సినీమా కాంప్లెక్సుల్లో సినీమాలు   ఆపేసి క్రికెట్ ని టిక్కెట్లు పెట్టి చూపిస్తున్నారు. వెర్రి తలకెక్కింది, ఇంక రోకలి చుట్టుకోవడమే ఆలశ్యం.

        మనకి ప్రస్థుతం రామాయణ కల్పవృక్షం అక్కరలేదు. అర్జంటు కవిత్వం చాలు. విశ్వనాధ అక్కరలేదు. పెంటపాడు బైరాగి చాలు.

        ఈ మాట అవధానం పట్లనో, క్రికెట్ ఆట పట్లనో తక్కువ చేసి మాట్లాడడం ఉద్దేశం కాదు.

       సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మాటని క్రికెట్ వ్యాపారాన్ని వివరించడానికి కేవలం ఎరువు తెచ్చుకుంటున్నాను. నిజానికి నాకెందరో సహృదయులైన అవధాన మిత్రులున్నారు. వారంతా ఈ క్రీడని సాగిస్తూనే తమ దక్షతనీ,కవితా వైభవాన్నీ చాటుతున్న సాహితీపరులు, సరస్వతీ పుత్రులు.

         ఒక పక్క అవధానాలు చేస్తూనే  చక్కటి  కావ్యాలు వ్రాస్తున్నారు. అవధాన ప్రయోజనం  సాహిత్యం మీద జన బాహుళ్యానికి అభిరుచిని కలిగించడం. ఇంకా అసలైన రుచులు కావాలంటే  కావ్యాలని చదువుకోవాలి. ప్రతి కళ లోను ఇలాంటి తాత్కాలికం, శాశ్వతం అయిన విభాగాలు ఉంటాయి. అయితే క్రికెట్ విషయంలో తాత్కాలికమే శాశ్వతమైపోయే ఛాయలు కనిపిస్తున్నాయి.

           ఏప్రిల్ 05, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage