నేను 30 ఏళ్ళుగా కాలం రాస్తున్నాను. ఆ మధ్య మిత్రులు, ప్రముఖ సినీనటులు
వంకాయల సత్యనారాయణ అమ్మాయి నా రచనల మీద పరిశోధన చేస్తానంటూ వచ్చారు. నేను నా
కాలంల మీద చెయ్యమన్నాను. తెలుగు పత్రికా ప్రపంచంలో ఎందరో మహానుభావులు కాలంస్
రాస్తూ వచ్చారు. ఆ విధంగా ఈ పరిశోధన మార్గదర్శకం కాగలదని నా ఆలోచన. నిన్ననే
డాక్టరేట్ సిద్ధాంత గ్రంధాన్ని నాకు చూపించింది చి.లావణ్య.
దినపత్రిక ఆయుష్షు తక్కువ. మహా అయితే రెండు గంటలు. ఒకప్పుడు అదీ ఎక్కువే. ఎవరూ
దినపత్రికని ఆరుగంటలు చదవరు. చాలామంది రెండోసారి చదివే ప్రసక్తే లేదు. అందరూ
అన్నీ చదవరు. కాలేజీ లెక్చెరర్ దగ్గర్నుంచి ఎక్కడో మున్నంగి రైతుదాకా ఎందరి
చేతుల్లోకో పత్రిక పోతుంది. చాలామంది చదివిన చోటే వదిలేసి పోతారు. అది దాచుకునే
వస్తువు కాదు. ఇంట్లో ఉన్నా నెలాఖరుకి చిత్తుకాగితాల షాపుకి పోతుంది. చదివి
పడేసే వస్తువు. దినపత్రిక మొదటి ప్రయోజనం - సమాచారం. కేవలం సమాచారం. ఇందులో ఒక
కాలమ్ నిడివిలో - ఆ సమాచారాన్నో, సమస్యనో, సన్నివేశాన్నో, విషయాన్నో విశ్లేషించే
చిన్న 'మెరుపు ' కాలమ్'. ఇది అటు కాలేజీ లెక్చెరర్ కీ, ఇటు రైతుకీ అందే స్థాయిలో
ఉండాలి. తీరా అందరూ చదవకపోవచ్చు. కొందరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని - ఈ కాలమ్
కోసమే పేజీలు తిప్పవచ్చు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో వ్యక్తి అభిరుచికి - కేవలం
తన అభీష్టం మేరకు - పలకరించే అతి అల్పాయుష్షు రచన కాలమ్. అలాగని - దాన్ని
చిన్నబుచ్చడం ఉద్దేశం కాదు. దాని లిమిటేషన్ ని చెప్పడం ఉద్దేశం. ఎంతోమంది నా
కాలమ్స్ ని చదువుతారు. కాని చాలామందికి ఆ కాలమ్ శీర్షిక కూడా గుర్తుండదు. "ఆ
మధ్య మీరు గోదావరి గురించి రాశారే! చాలా బాగుందండీ" అంటారు. ఏ మధ్య? ఏం రాశాను?
"ఏదోనండీ. కాని బాగుందండీ" అక్కడితో ఆగిపోతుంది దాని అప్పీలు.
కాలమ్ ని ఒకటికి రెండుసార్లు చదివి, కత్తిరించి, జాగ్రత్త చేసి గుర్తుంచుకునే
వాళ్ళూ ఉన్నారు. కాని వీరు తక్కువ. ఇదొక నిశ్శబ్ద విప్లవం. సంతలో ఎర్రపాగా.
క్రమంగా అలవాటవుతుంది - రంగువల్ల. తర్వాత గుర్తుపడతాం. తర్వాత గుర్తుపెడతాం.
తర్వాత గుర్తుంచుకుంటాం. సంవత్సరాలుగా సాగే ఉద్యమంలో గొంతు బలపడుతుంది. ఆ
కోణానికి విలువనిస్తాడు పాఠకుడు. "మారుతీరావు ఈసారి ఏమన్నాడు?" అని వెదుకుతాడు.
దినపత్రిక రెండు గంటల ఆయుష్షులో ఈ కాలమ్ ఫోకస్ - పదినిమిషాలు. ఈ వ్యవధిలో తనదైన
అభిప్రాయాన్నో, విమర్శనో, వివేచననో - సంధించే ప్రక్రియ కాలమ్. కమిట్ మెంట్ ఏ
మాత్రమూ లేని పాఠకుడికి పరిచయం కావడమా? స్నేహం చెయ్యడమా? లొంగదీసుకోవడమా?
ఆ మధ్య నా కాలమ్ ని ఎవరో మెచ్చుకుంటూంటే పక్కాయన "మీరు రాత్తారాండీ నేనెప్పుడు
సూడలేదండీ" అన్నాడు. 'చూడలేదు' గమనించండి 'చదవలేదు ' కాదు!
కాలమ్ కి ఉన్న ఈ పరిమితే దాని బలం కూడా. దాన్ని సంధించే బలం కూడా It influences
the non denominational audiences without prejudice or favour. They fell
liberated because they have their right to reject. ఈ 30 సంవత్సరాలలో నేను
స్పృశించని అంశం లేదు. - మోనికా లెవెన్ స్కీ రంకు, వైట్ హౌస్ లో అమెరికా
అధ్యక్షుడి కుక్క ప్రసవం, ఒలింపిక్స్, ఎన్నికలు, హత్యలు, వికారాలు - అన్నీ..
అన్నీ...
శనివారం ఉదయం ఈ కాలమ్ రాస్తున్నాను. మధ్యాహ్నం ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఎదురు
చూసే క్రికెట్ ప్రపంచ కప్ ఆట - ఇండియా, శ్రీలంకల మధ్య, సచిన్ కి ఆఖరి ప్రపంచ
కప్పు. ఈసారి వందో వంద చేస్తాడా? మురళీధరన్ కి ఆఖరి ప్రపంచ కప్పు. అసలు ఈసారి
ఆడగలడా? కప్పు మనం గెలుస్తామా? 1983 తర్వాత మూడుసార్లు ఆఖరిదాకా వచ్చి
దక్కించుకోలేని చరిత్ర పునరావృతమౌతుందా? లేదా 1983 తర్వాత మరి కొన్నేళ్ళు నెమరు
వేసుకునే మైలురాయిగా 2011 నిలుస్తుందా?
ఈ కాలమ్ మీరు చదివేసరికి ఈ పేరా పాచిపట్టిన పాత కథ. రాత్రి ఈ ప్రశ్నలన్నిటికీ
సమాధానాన్ని మీరు చూశారు. కాలమ్ లో విషయానికి ఇంత తక్కువ వ్యవధిలో కాలదోషం
పట్టింది!
వేదాంత ధోరణిలో ఆలోచిస్తే - నా ప్రియమిత్రుడు, మంచి నటుడు నూతన్ ప్రసాద్ మొన్న
వాస్తవం. నిన్నవార్త. నేడు జ్నాపకం. రేపు గోడమీద బొమ్మ. ఆ తర్వాత......ఆ తర్వాత....
ప్రక్రియ ఎంత పెళుసు! కాలం పరుగు ఎంత క్రూరం! ఎంత వేగం! కాలమ్ అప్పీలునీ,
పరిమితినీ, పాఠకుని అలసత్వాన్నీ, అశాశ్వతత్వాన్నీ, అతి స్వల్ప ఆయుష్షునీ -
ఇన్నిటినీ ఎరిగి 'విశ్వరూపం' దాల్చవలసిన - అతి పదునైన రచన.
విచిత్రంగా - ఇవన్నీ జీవితానికీ వర్తిస్తాయి. నిన్న ఉన్న మనిషి ఇవాళ లేడు.
నిన్న ఉన్నప్పుడు - అందరూ అతన్ని ఆదరించలేదు. కొందరే గుర్తించారు.వెళ్ళిపోయాక ఏ
కొందరో బాధపడ్డారు. ఆ తర్వాత - దినపత్రిక వస్తూనే ఉంది. కాలమ్స్ రాస్తూనే ఉంటారు.
ఎవరో - ఎక్కడో చదివి - చీమకుట్టినట్టు స్పందించి - ఆ చెట్టుకిందే పత్రికని
వదిలేసి వెళ్ళిపోతూంటారు.
కాలం - మనిషికి వేదాంతాన్ని బోధించే సందేశం. వినయాన్ని సంధించే కనువిప్పు .
కాలదోషాన్ని పరిణామ శీలంగా హెచ్చరించే గురువు
.