'రక్షణ' నీతి సరస్వతీ నది
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

   ఈ దేశంలో ఇంకా పూర్తిగా గబ్బు పట్టని వ్యవస్థలు రెండు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ. ఒకటి వ్యక్తి నైతిక జీవనాన్ని, మరొకటి వ్యక్తి స్వాతంత్య్రాన్ని కాపాడే ఆదర్శాలు. కానీ ఈ రెండింటి మీదా ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లే చాలా దయనీయమైన పరిణామాలు ఈ మధ్య మరీ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న కె.జి.బాలకృష్ణన్‌ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన కేసు నడుస్తోంది. ఇది న్యాయవ్యవస్థకి పట్టిన గ్రహణం. ఇక సైనిక వ్యవస్థలో అడపా తడపా పునాదుల్ని కదిపే చారిత్రక కుంభకోణాలు ఎన్నో తలెత్తుతూనే ఉన్నాయి.
1948లో అంటే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇంకా సంవత్సరం దాటకుండానే భయంకరమైన అవినీతి కుంభకోణం జరిగింది. ప్రధాని నెహ్రూ హయాంలో ఆయన ప్రియతమ మిత్రులు కృష్ణమీనన్‌ ఇంగ్లండులో హైకమిషనర్‌గా ఉన్నారు. రక్షణ శాఖకు కావలసిన 2000 జీపుల కొనుగోలుకి అన్నిరకాల నియమాలనూ ఉల్లంఘించి ఆయనే స్వయంగా 80 లక్షల కాంట్రాక్టుని సాధికారికమైన నిబద్ధత లేకుండా, బొత్తిగా పేరులేని సంస్థతో ఒప్పందం చేశారు. చాలామట్టుకు డబ్బుని ముట్టచెప్పింది ప్రభుత్వం. 2000 జీపులు రాలేదు. కేవలం 155 జీపులే దిగుమతి అయ్యాయి. పార్లమెంటులో దుమారం లేచింది. అనంత శయనం అయ్యంగార్‌ పరిశీలన జరగాలన్నారు. కానీ నెహ్రూ తన మిత్రుడి మీద కేసుని అర్థంతరంగా ముగించేశారు. 'గవర్నమెంటు ఈ ఫైలుని ఇంతటితో మూసేస్తోంది. ప్రతిపక్షాలకు ఈ చర్య నచ్చకపోతే రేపు ఎన్నికలలో మామీద కత్తి కట్టవచ్చు' అన్నారు. ఇది గుండెలు తీసిన బుకాయింపు. ఆనాటి నెహ్రూ పాపులారిటీకీ, ఆయన పట్ల వ్యవస్థ ఆనాడు ఉంచిన విశ్వాసానికీ ఇది నిదర్శనం. ఈ రోజుల్లో ఈ మాటని ఏ నాయకుడికైనా అనగల దమ్ము ఉందా? ప్రజలూ, ప్రతిపక్షాలూ నోరుమూసుకున్నాయి. కాంగ్రెస్‌ని గద్దె దింపడానికి మరో 29 సంవత్సరాలు పట్టింది. అదీ చరిత్ర.
మరో 32 సంవత్సరాల తర్వాత ఈసారి నెహ్రూ మనుమడు రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో బోఫోర్స్‌ శతఘ్నులు 155 హోవిడ్జర్స్‌ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కొనుగోలుకి ముడుపులు ఖత్రోచీ, విన్‌చద్దా, రాజీవ్‌గాంధీ ప్రభృతులకి దక్కాయని, లక్షల డాలర్లు అకౌంట్లు మారాయని రుజువులతో సహా బయటపడింది. పార్లమెంటులో తుపాను చెలరేగింది. అయితే పదవిలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి అందమైన సమాధి కట్టింది. ఇది మరో చరిత్ర.
ఇప్పుడు టెట్రా వాహనాల కుంభకోణం వెలుగుచూసింది. అవి నాసిరకం వాహనాలయినా అభ్యంతరం చెప్పకుండా బేరాన్ని సాగించడానికి సరాసరి సైనిక ప్రధానాధికారి జనరల్‌ వి.కె.సింగ్‌కే మరొక సైనిక ఉద్యోగి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ తేజీందర్‌ సింగ్‌ లోపాయకారీగా 14 కోట్లు ముట్టజెప్పడానికి బేరం చేశాడట.
పుట్టినరోజు తగాదాతో గట్టి దెబ్బతిన్న వి.కె.సింగ్‌ ఎప్పుడో ఈ విషయాన్ని రక్షణమంత్రికి చెప్పారు. ప్రస్తుతం ఈ రహస్యాన్ని పత్రికలకు చెప్పారు. పార్లమెంటులో నిప్పు రగిలింది. తీరా చెప్పి, ఏ చర్యా తీసుకోనక్కరలేదన్నారట. మంత్రి ఆంటోనీ వారి మాటని ఆనాడు గౌరవించి ఊరుకున్నారు. మరి ఇప్పుడు పుట్టిన రోజు తగాదాని చినికి చినికి గాలివాన చేశారేం?!
ఆంటోనీ నీతికి ఈ దేశంలో ఘనమైన పేరుంది. 'నిజాన్ని వెలికితీస్తాం, వెదికి తీస్తాం' అని వారు పార్లమెంటులో బల్లగుద్దుతూ తగుపాళ్లలో కన్నీరు కూడా కార్చారు. కన్నీరు నిరపరాధిత్వానికి బలమైన సాక్ష్యం. అలనాడు ఇలాంటి పరిస్థితుల్లోనే కపిల్‌ దేవ్‌ కంట తడిపెడితే దేశం కరిగిపోయింది. భారతీయులది జాలి గుండె. కన్నీరు చాలా 'నిజాయితీ'లకు పెట్టుబడి.
ఇంతకీ ఎవరిది నిజాయితీ? రక్షణ శాఖలో ఇలా చాలామంది అధికారులు గడ్డికరవడం ఆనవాయితీ అని తేజీందర్‌ సింగ్‌ వక్కాణించినట్టు వి.కె.సింగ్‌ మనకి చెప్పారు. తేజీందర్‌ సింగ్‌ కోర్టుకు ఎక్కారు. మరి ఎవరిది నిజం?
ఇది విక్రమార్కుడి మార్కు ప్రశ్న. ఈ మీమాంసలన్నింటిలో ఏది నిజం? ఇద్దరు సింగ్‌లూ, ఒక ఆంటోనీ కన్నీరు మధ్య దేనికి విలువ ఎక్కువ? రక్షణ శాఖలో నీతి సరస్వతీ నదిలాంటిది. అది ఉందని అందరికీ తెలుసు. కానీ ఎక్కడ, ఎలా వుందో తెలీదు. అయినా మన విశ్వాసం సడల లేదు. త్రివేణీ సంగమంలో రెండు నదులతోపాటు కంటికి కనిపించని సరస్వతీ నదిని తలుచుకొంటూ తరతరాల విశ్వాసాన్ని నిలుపుకుంటున్న భారతీయులకి సైనిక వ్యవస్థలో ఇంకా నీతి ఉన్నదని ఆత్మవంచన చేసుకోవడం ఏమంత కష్టం కాదు.


                                       
ఏప్రిల్ 2, 2012  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage