Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
నీతి-
న్యాయం-
చట్టం
శబ్దార్ధ చంద్రికనీ, శబ్దరత్నాకరాన్నీ ఆశ్రయించినా- నా ఆలోచనకి సరైన న్యాయం జరగలేదు. నీతికీ, న్యాయానికీ కావలసినంత దూరం వున్నదని నా మతం. నీతి అంటేనే న్యాయమని నిఘంటుకారుడు చెప్పి చేతులు కడుగుకున్నాడు. ఇక నా తాపత్రయం నేను పడతాను. అర్ధం చెప్పడానికి- నా తెలివితేటలకి ఇంగ్లీషుని సాక్ష్యం తెచ్చుకుంటాను. నీతి అంటే moral. న్యాయం అంటే justice. చట్టం అంటే law. ఇప్పుడు నాకు సుఖంగా వుంది. నీతి నైతికమైన జీవన సరళికి ఆ సంస్కృతి ఏర్పరిచిన మర్యాద. పెద్దలకి నమస్కారం చెయ్యి.తండ్రి ముందు సిగరెట్టు కాల్చకు. పరాయి స్త్రీని తల్లిగా భావించు.- యివన్నీ నీతులు. వీటిని పాటించడం ఆ జాతి సంస్కారం. వీటిని పాటించకపోతే ఏమవుతుంది? ఎవరూ మిమ్మల్ని అరెస్టు చెయ్యరు. జైల్లో పెట్టరు. ఓ విలువ చచ్చిపోతుంది. అంతే. ఆ జాతి సంస్కారం భ్రష్టుపడుతుంది. న్యాయం సమాజపరమైనది. దీనికి రాజీలు లేవు. నాదయిన ఇంటిని నేను అనుభవిస్తాను. పరాయి ఇంటి మీద నాకు హక్కు లేదు. పరాయి ఇంటిని దోచుకున్నాను. అది అన్యాయం. నాది కాని పైకాన్ని వాడుకున్నాను. అది అన్యాయం. చట్టం ఈ అన్యాయాన్ని అరికట్టే వ్యవస్థ. అదిసమాజ పరమైనది. న్యాయ వ్యవస్థ ఆయా దేశాలలో, ఆయా సమాజాలలో, ఆయా సంస్కృతుల ననుసరించి ఏర్పాటు చేసుకున్నది. అబూదాబీలో ఒకాయన ఎందరినయినా పెళ్ళి చేసుకోవచ్చు. భారతదేశంలో బహుభార్యాత్వం నేరం.మాస్కోలో చలికాలంలో పగలు వోడ్కా తాగుతారు. తాగకపోతే చచ్చిపోతారు. వాళ్ళకి వోడ్కా అవసరం. మనదేశంలో పట్టపగలు తాగుడు వ్యసనం. నీతి విలువలకి సంబంధించినది. న్యాయం విచక్షణకి సంబంధించినది. చట్టం న్యాయాన్ని నియత్రించేది. నీతిని తప్పేవాళ్ళు ప్రతిదేశంలోనూ ఉన్నారు. ఉంటారు. వాళ్ళందరూ జైళ్ళకి వెళ్ళరు. (మనదేశంలో అయితే ఎక్కువగా పార్లమెంటుకి వెళ్తారు) కలికాలంలో మనమంతా నీతి బాహ్యులమే. పక్కవాడిని హింసించకూడదనే నీతిని తప్పి కులం, మతం పేరిట శతాబ్దాలుగా పెద్దరికాన్ని చలాయించిన పై కులాల వారిని ఏ చట్టం శిక్షించింది? కాని అన్యాయం వీధిన పడుతుంది. కాని అది చట్టానికి దొరుకుతుందా? చట్టం శిక్షిస్తుందా? అదిగో, మీ అందరి ముఖాల్లో చిన్న చిరునవ్వు కనిపిస్తోంది. అదీ మన దరిద్రం. ఇంతవరకూ చెప్పాక- అందాల తార కుష్బూ కధని కాస్సేపు ముచ్చటించుకుందాం. చాలా నెలల క్రితం- కుష్బూ ఎక్కడో మాట్లాడుతూ ఈ కాలం పిల్లల పవిత్రత అంటున్నారుగాని ఎందరో పెళ్ళికి ముందే ఎంగిలి పడుతున్నారు-అంది. నాకు గుర్తుంటే- ఎంగిలి పడడం తప్పులేదు- అనలేదు. “పడుతున్నారు” అంది. మడికట్టుకున్న పెద్దలకు కోపం వచ్చింది. అందులో నిజం గుర్తించిన చాలా మంది భుజాలు తడువుకున్నారు. తాగేవాడిని తాగుబోతు అంటే కోపం వస్తుంది. తాగని వాడికి నవ్వు వస్తుంది. “నిజం” అతని ఊతం. ఆ తప్పు తను చెయ్యలేదుకదా? మరెందుకూ కోపం? కుష్బూ మీద తమిళనాడులో ఎడాపెడా 22 కేసులు బనాయించారు. ఈ సందర్భంలో ఓ సాయంకాలం కమల్ హాసన్ యింట్లో పార్టీలో ఓ మూల కూర్చుని ఉన్నాను. కుష్బూ “గురుశిష్యులు” సినీమాలో నా కూతురుగా నటించిందనుకుంటాను. మసకవెలుగులో నా ముఖంలో ముఖం పెట్టి “నేను గుర్తున్నానా సార్?” అంది. రెండు బుగ్గలూ పట్టుకుని “ప్రస్థుతం నువ్వు దేశానికంతటికీ గుర్తున్నావు. మేమంతా నీవెనుక ఉన్నాం” అన్నాను. ఆమె మీద బనాయించిన నీతిపరులయిన 22 మంది కేసులు ప్రస్థుతం సుప్రీం కోర్టుదాకా ప్రయాణం చేశాయి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం- కుష్బూ వెలిబుచ్చిన అభిప్రాయం వ్యక్తి నీతిని గురించి. కేసులు సమాజంలో అన్యాయాన్ని గురించి. నిన్న సుప్రీ కోర్టులో న్యాయమూర్తులు ప్రకటించిన అభిప్రాయాలు ఈ దేశంలో చట్టాల గురించి. ఒక న్యాయమూర్తి అడిగారు: “కుష్బూ అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఈ సమాజానికి కాని, మీకు కాని ఏం అన్యాయం జరిగింది? ఏ ఒక్క కుటుంబమయినా ఛిద్రమయిందా?” బాబూ, అదే ఇందులో కీలకం.నీతి బాహ్యులవడం సంస్కృతీపరమైన నేరం. చట్టపరమైన నేరం కాదు. కుష్బూ సమీక్ష నీతిని గురించి. న్యాయాన్ని గురించికాదు. ప్రస్థుతం చదువుకుంటున్న చాలామంది పెళ్ళీపెటాకులూ లేకుండా బతుకుతున్నారు. అది వారి నీతికి సంబంధించిన విషయం. ఒకవేళ పక్కవాడి పెళ్ళాంతోనో, ఎదుటివ్యక్తి మొగుడితోనో బతికితే అది సామాజిక న్యాయానికి ఉల్లంఘన. అప్పుడూ చట్ట ప్రమేయం. పెళ్ళికి ముందే సుఖపడుతున్నారు. అంటే నీతిమాలినవారవుతున్నారు. అంటే సుప్రీ కోర్టు న్యాయస్థానం పరిధిలోకి ఆ చర్య రాదు. ఆ సంస్కృతి నీతి మంట గలుస్తోంది కనుక వ్యక్తి విలువలను పరిరక్షీంచే ఆ మత గురువో, కామకోటి పీఠాధిపతో, శృంగేరీస్వాములో, సంస్కృతి విశ్వాసాలో, భగవద్గీతో- మరేదో మరేదో ఊతం కావాలి. పార్కుల్లో పెళ్ళికాని ఇద్దరు నీతిమాలిన పని చేస్తున్నారు. అప్పుడు సమాజ మర్యాద దెబ్బతింటుంది. వాళ్ళు సరాసరి న్యాయస్థానం ముందు నిలుస్తారు. మరొక్కసారి- విలువల్ని పరిరక్షీంచేది నీతి. మర్యాదల్ని పరిరక్షించేది న్యాయం. న్యాయరహితుల్ని శిక్షించేది న్యాయస్థానం. న్యాయమూర్తుల మేధస్సునీ, విచక్షణనీ గౌరవిస్తూనే- రాధా కృష్ణులు కలిసి బతికేది, కుష్బూ చెప్పేది, పెళ్ళి కాని సెక్స్ కధ కాదని ఎలా విన్నవిస్తాం? రాధాకృష్ణుల సంగతి- వారు ఏ ప్లేన్ లో అనుబంధాన్ని పెంచుకున్నారో మనకి చెప్పగలిగేవారు ఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, ఏ శ్రీభాష్యం అప్పలాచార్యులవారో విశ్లేషించాలి. అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి బతుకుతున్నారు కదా? అందువల్ల మీకేం అపకారం జరిగింది? అని ఓ న్యాయమూర్తి ప్రశ్న- నీతికీ, న్యాయానికీ ఉన్న తెరని చించేసిన సందర్బం. అయ్యా, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చావగొట్టుకుని, ఉంటున్న ఇంటికి నిప్పంటిస్తే- ఆ ఇంటి యజమాని కెసు పెడితే- అప్పుడు వారి నీతికాక, వారి సామాజిక భాధ్యతారాహిత్యం శిక్షార్హమౌతుంది. మొదటి అవినీతిలో కేవలం సంస్కృతి వాటాయే వుంది. రెండో అవినీతిలో వ్యక్తి అరాచకం వుంది. అయితే చట్టాల్ని చేసే చట్ట సభలు హంతకులు, గూండాలతో నిండి ఉన్న నేపధ్యంలో, ఈ దేశపు ప్రధాన న్యాయస్థానం మీద ఉన్న గౌరవనీయమైన న్యాయమూర్తులు రాధాకృష్ణుల బాంధవ్యం ఈ సమాజంలో అవినీతికి మద్దతుగా భావించడంలో, పాపం, బొత్తిగా సినీ గ్లామర్ వున్న కుష్బూ అనే అందమయిన హీరోయిన్- అందరికీ తెలిసిన “అవినీతి’’నే బహిరంగంగా చెప్పిన కారణంగా కోర్టు పాలవడంలో- అంతటా విలువలు కలగా పులగమై, ఆత్మవంచన అద్భ్హుతంగా నిలదొక్కుకుని, వ్యవస్తలో నీతి మాలినతనానికి చక్కని ముసుగు కప్పడానికి ఆధునిక సంస్కారం పడుతున్న యావగా కనిపిస్తుంది. “సత్తలేని దినములు వచ్చెనా, కలిలోన ప్రధమ పాదములో తలిదండ్రి గురు భక్తియులేక దుష్కృత్యం బొనర్ప వలెనా”అని దాదాపు 200 ఏళ్ళ కిందటే త్యాగరాజ స్వామి వాపోయాడు. . మార్చి 29, 2010 ************ ************ ************* ************* |