చెవిలో తుఫాను
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

  చాలా సంవత్సరాల తర్వాత మా మిత్రుడొకాయన నైరోబీ నుంచి వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మన దేశం సాధించిన గొప్ప అభివృద్ధి ఏమిటని అడిగాను.
తడువుకోకుండా 'సెల్‌ ఫోన్‌' అన్నాడు.
నిజమే. ఈ మధ్య పేపర్లో చదివాను. ఈ దేశంలో మరుగుదొడ్లు లేని ఇళ్లు బోలెడన్ని ఉన్నాయి. కానీ ఒక్క సెల్‌ ఫోనయినా లేని కుటుంబాలు వీటిలో లేవట. ఇంకా చెప్పాల్సి వస్తే దేశంలో ప్రతి పదిమందిలో ఒక్కరికయినా రెండేసి సెల్‌ఫోన్లు ఉన్నాయి. రోజుకి 28.65 రూపాయలు ఖర్చు చేస్తున్న వారందరూ పేదరికం పరిధిలోకి రారు అని మన ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌ మాంటేక్‌ సింగ్‌ అహ్లూవాలియా సెలవిచ్చారు. అయితే సెల్‌ఫోన్లు? వాటి అవసరం, అలవాటు దాదాపు అందని వారు లేరేమో!
వీళ్లకి ఆదాయం ఎలా? ఈ ఖర్చుని ఎలా భరిస్తారు? ఒక పేద సెల్‌ఫోన్‌దారుడు నాతో చెప్పాడు. ఎలాగో తంటాలుపడి పాత సెల్‌ఫోన్‌ కొనుక్కుంటాడు. అవసరానికి ఫోన్‌లో అందుబాటులో ఉన్న కారణానికే అతనికి పనిదొరుకుతూంటుంది. అందులో పదిరూపాయల చార్జీ వేస్తాడు. ఎవరికీ ఫోన్‌ చెయ్యడు. కావాలనుకున్నప్పుడు మిస్డ్‌ కాల్‌ ఇస్తాడు. అవతలివాడికి అర్థమౌతుంది ఫలానా వాడి ఫోనని. అతను ఫోన్‌ చేస్తాడు. వచ్చేకాల్‌కి చార్జీ లేదు. పది రూపాయలు భద్రంగా ఉంటాయి. అందరికీ అతనితో మాట్లాడే సౌకర్యం ఉంది. అతనికి ఫలానా వాడితో మాట్లాడాలని చెప్పే సౌకర్యం ఉంది. చాలు. సెల్‌ఫోన్‌ ప్రయోజనం సాధించినట్టే. నాకు తెలిసి చాలామంది డ్రైవర్లు చేసే పని ఇదే. ఈ దేశంలో ఎరువుల కుంభకోణాలున్నాయి. గడ్డి కుంభకోణాలున్నాయి. స్టాంపుల కుంభకోణాలున్నాయి. కాని వీటన్నిటినీ తలదన్నే కుంభకోణం -సెల్‌ఫోన్లకి సంబంధించింది -2జి కుంభకోణం. దేశంలో కోట్ల మంది అలవాట్లకు ప్రాణం పోసే వ్యాపారం, వ్యాసంగం.
మాట్లాడడం ఒక వ్యసనం. ఒక ఆకర్షణ. ఒక వ్యాపకం. నేను పనిచేసే సీరియల్‌ డ్రైవరు ఒకడున్నాడు. ఏ విధంగా చూసినా అందంగా ఉండడు. చదువు పెద్దగా లేదు. రోజూ కారుని ఒక కలవారి ఇంటిపక్కన ఉంచి కడుగుతూంటాడు. ఆ ఇంటి అమ్మాయి అతన్ని చూస్తూంటుంది, యధాలాపంగానే. అది ఆకర్షణ కాకపోవచ్చు. చూడడం అలవాటు. ఓ రోజు ఆమెకి తన సెల్‌ఫోన్‌ నంబరు ఇచ్చాడు యధాలాపంగానే. ఆమె ఫోన్‌ చెయ్యడం ప్రారంభించింది. ఇద్దరూ తమ అంతస్తుల్ని, మరిచిపోయి -క్రమంగా కేవలం మాట్లాడుకోవడం అనే వ్యాపకానికి అలవాటు పడ్డారు. రోజూ ఓ కుర్రాడితో కబుర్లు చెప్పడం ఒక ఊసుపోని పని ఆ అమ్మాయికి. మాట్లాడేది అమ్మాయి కావడం ఈ కుర్రాడికి ఆకర్షణ. దీనికి 'ప్రేమ' అని దొంగపేరు పెడదామా? లేదా క్రమంగా శారీరకమయిన దగ్గరితనానికి దగ్గరితోవ అందామా? ఏదయినా సాధనం -సెల్‌ ఫోన్‌. అడ్డమయిన కారణాలకి అడ్డంగా ఆకర్షణని పెంచే తాయిలం.
హైదరాబాద్‌లో ఓ రియల్‌ ఎస్టేటు వ్యాపారి ఉన్నాడు. నా అభిమాని. అప్పుడప్పుడు పార్టీలిస్తూ ఆహ్వానిస్తూంటాడు. ఓసారి ఫోన్‌ చేశాను. 'అర్జంటు పనిమీద బెంగుళూరు వచ్చాను సార్‌. ఈసారి కలుస్తాను' అన్నాడు. సరేనన్నాను. ఆ సాయంకాలం నెక్లెసు రోడ్డులో పుస్తకాల ఎగ్జిబిషన్‌ ముందు దిగాను. దూరంగా ఈ మిత్రుడు కనిపించాడు. అతను నన్ను చూస్తే తన అబద్ధం దొరికిపోయినందుకు సిగ్గుపడతాడేమోనని -అతని అబద్ధాన్ని కాపాడడానికి నేను కారెక్కి వెళ్లిపోయాను. సెల్‌ఫోన్‌ చక్కని అబద్ధాలకు దగ్గరతోవ.
సెక్స్‌ కంటే, మందు కంటే, టీవీ కంటే సెల్‌ఫోన్‌ భయంకరమైన వ్యసనం. అర్థంలేని కారణాలకు, అవసరం లేని ఆకర్షణగా -అకారణంగా దగ్గరతనాన్ని కల్పించే దుర్మార్గమయిన సాధనం సెల్‌ఫోన్‌.
సెల్‌ ఫోన్లు రహస్య వ్యాపారాలకు, రంకుకి, దౌర్జన్యకారులకీ, హత్యలకీ, రాజకీయాల లావాదేవీలకీ, ఆత్మహత్యలకీ, విడాకులకీ అన్నిటికీ సర్వరోగ నివారిణి. ఈ మధ్య హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూలువారు ఓ విచిత్రమైన పరిశోధన జరిపారు. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 1400 మంది ఉద్యోగుల్ని ఎంపిక చేశారు. వాళ్ల చేత వారానికి ఒకరోజు, సాయంత్రం ఆరు గంటల తర్వాత సెల్‌ఫోన్లు వాడకుండా చేశారు. ఇలా మూడు సంవత్సరాల పాటు ఈ ప్రయోగం జరిగింది. మూడేళ్ల తర్వాత 78 శాతం మందికి తమ పనిలో రుచి పెరిగింది. కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్లీ లేని ఊతం శరీరంలో, మనస్సులో కనిపించింది.
మొన్నటిదాకా మనం సెల్‌ఫోన్లు లేకుండా బతికాం. మన తాత, ముత్తాతలకి అవేమిటో తెలీదు. ఇప్పుడు వారానికి ఒకరోజు వాడకం మానుకొనే ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త సదుపాయాలు వ్యసనాలయి ఎలా నెత్తికి చుట్టుకుంటున్నాయో, మానవ జీవితాల్ని ముంచి ఎత్తుతున్నాయో చెప్పడానికి ఇది శాస్త్రీయమైన ప్రయోగపు నమూనా.
మా మిత్రుడు మూడు నెలల తర్వాత నైరోబీకి బయలుదేరాడు.
'ఏంటి భాయ్‌! ఈ దేశానికి పట్టిన అనర్థం' అని అడిగాను.
'సెల్‌ఫోన్‌' అంటూ కారెక్కాడు.

                                        మార్చి 26, 2012
  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage