Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ఆడవారి మాటలకు....
గొల్లపూడి మారుతీరావు

                 gmrsivani@gmail.com                             

     

        ఈ కాలమ్ చదివాక నాకు నా యింట్లోనే తిండి దొరుకుతుందనే నమ్మకం లేదు.. ఈ కాలమ్ ని మీరు మెచ్చుకున్నా, మెచ్చుకున్నట్టు కనిపించినా మీ పరిస్థితీ అదేనని హెచ్చరిస్తున్నాను.  మందుల డబ్బాలమీద ఒక హెచ్చరిక ఉంటుంది. ఇది షెడ్యూలు L మందు. డాక్టరు చెప్పినట్టు మాత్రమే వాడాలి అని.  కనుక నాదొక హెచ్చరిక. ఈ కాలమ్ మీకు నచ్చితే- నోరుమూసుకోండి. నచ్చకపోతే నోరుమూసుకోండి. నాతో ఏకీభవిస్తే నోరుమూసుకోండి. నాతో విభేదిస్తే నోరుమూసుకోండి. ఇది  మీ శ్రేయస్సుని దృష్టిలో వుంచుకున్న ఓ హితుడి సలహాగా భావించండి.

          పార్లమెంటులో ఆడవారి ప్రాతినిధ్యానికి నాది ముందు వోటు. చేతులెత్తే ప్రక్రియే వుంటే నేను రెండు చేతులూ ఎత్తి నా సమ్మతిని ప్రకటించేవాడిని. ఇప్పుడు మన దేశంలో చరిత్రని సృష్టించిన నలుగురు నమూనా మహిళల్ని స్మరించుకుందాం.

          మొదటి మహిళ- ఇందిరా గాంధీ. ఆమె ఎన్నిక చెల్లదని భేషరతుగా న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఎమర్జన్సీని విధించి- నిద్రలో వున్న జయప్రకాష్  నారాయణ, మొరార్జీ దేశాయి వంటి పెద్దల్ని అరెస్టు చేసిన ఘనత ఆమెది.  భారతదేశంలో అంతకు ముందుకానీ, ఆ తర్వాత కానీ ఈ విజయాన్ని ఎవరూ సాధించలేకపోయారు.

          రెండవ మహిళ-సోనియాగాంధీ. పరాయిదేశపు మహిళ మన దేశ ప్రధాని కావడాన్ని నిరసిస్తూ శరద్ పవార్, సంగ్మా వంటి దేశభక్తులు పార్టీలోంచి విడిపోగా- నిస్సందేహంగా, ఏక కంఠంతో ఆమెని ప్రధాని పీఠాన్ని కూర్చోపెట్టడానికి పార్టీ సిద్ధమవగా- చివరిక్షణంలో కూర్చోడానికి తిరస్కరించిన ఏకైక మహిళ సోనియాగాంధీ. ఇది కూడా ఈ దేశంలో చరిత్ర.

          మూడవ మహిళ- జయలలిత. కొడుకు కాని కొడుకుకి కోట్ల ఖర్చుతో ప్రపంచం తెల్లబోయి చూసేలాగ వివాహాన్ని జరిపించి, ఇప్పటికీ  ఆమె ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేక న్యాయమూర్తులు కర్ణాటక జుత్తు పీక్కోవడం ఒక ఎత్తు. దాదాపు 2000 ఏళ్ళు చరిత్రగల ఓ పీఠాధిపతిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి చార్టర్డ్ విమానంలో జైలుకి తరలించిన భారతదేశంలో ఒక స్వామిని జైలుకి పంపిన తొలి భారతీయ నాయకురాలు జయలలిత. ఇదీ ఒక చరిత్రే.

          ఇక నాలుగో మహిళ- నా అభిమాన నాయకురాలు- మాయావతి. ప్రపంచ అద్భుతాలలో ఒకటైన తాజ్ మహల్ ని వ్యాపార కూడలిగా చేసే విషయంలో గబ్బుపట్టించి కోర్టుకెక్కి- అధికారానికి వచ్చి కేసుల్ని పక్కకి తోసి, కోట్లాది ఖర్చుతో తన విగ్రహాల్ని తానే ప్రతిష్టించుకుని- ఈ మధ్య జరిగిన దుర్ఘటనలో గాయపడిన 63 మందికి నష్టపరిహారం ఇవ్వడానికి తమ వద్ద డబ్బులేదంటూనే, రోజుకి కోట్ల ఖరీదయిన వెయ్యిరూపాయల దండలను ధరించే- ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏకైక నియంతగా జీవించే ఏకైక స్త్రీమూర్తి మాయాదేవి.

          వీరందరినీ తలుచుకుని ఈ దేశంలో మహిళలు ప్రతిదినం గర్వపడతారనడంలో నాకెటువంటి సందేహమూ లేదు. ఇలాంటి నమూనాలు పార్లమెటులో మనకి మూడో వంతు ప్రాతినిధ్యం వహించడం ఈ జాతి పురోగతికి నిదర్శనంగా మనమంతా గర్వించబోతున్నాం.

          ఇక ముందు సభల్లో కూడా ఈ విధంగానే మాయావతిగారికి డబ్బుల దండలు వేస్తామని బహుజన సమాజ్ వాదీ పార్టీ కార్యదర్శి నసీముద్దీన్ సిద్దికీగారు నొక్కి వక్కాణించారు. ఇది ఎంతమాత్రం అనౌచిత్యం కాదని మిగతా పార్టీలవారు తమ నాయకురాలిని చూసి కన్నుకుట్టి చస్తున్నారని  తమిళనాడులో పార్లమెటుకి 2009 లో పోటీ చేసి ఓడిపోయిన  బహుజన పార్టీ నాయకురాలు పి.శివగామి వాక్రుచ్చారు.  రేపు పార్లమెంటులో మహిళలకు మూడొంతుల ప్రాతినిధ్యం వస్తే ఈ మహిళ తప్పని సరిగా పార్లమెంటులో తమకు దర్శనమిస్తుందని నేను హామీ యిస్తున్నాను. ఇప్పటికే తమిళనాడులోఇలాంటి నమూనా దండలు సిద్ధమవుతున్నా నేను ఆశ్చర్యపడను.

          నేను చాలాకాలం కిందట దొంగగారుస్తున్నారు, స్వాగతం చెప్పండి అనే దిక్కుమాలిన నాటకాన్ని రాశాను. ఆ నాటకాన్ని ఇవాళ రాస్తే ముఖ్యమంత్రిగారొస్తున్నారు, స్వాగతం చెప్పండి అనేవాడినేమో! అందులో బంగారం గొలుసు దొంగతనం చేసిన దొంగ పట్టుబడ్డాడు. తాగుబోతులాయరు అతని తరఫున వాదిస్తూ కక్షిదారుడిని నిలదీస్తాడు: మా దొంగగారు నిజాయితీ పరుడు. తన భార్యకి అలాంటి నగ చేయించుకోవాలనే కోరికతో ఫలానా వ్యక్తిని యిబ్బంది పెట్టకుండా అర్ధరాత్రి వచ్చి  ఆమె మెడలో నమూనా చూసి వెళ్తున్నాడని నేనంటాను. కాదనగలరా? అంటాడు.

          డిఫెన్స్ లాయరు ఎదిరిస్తే, దొంగ లాయరు ప్రశ్న:

          ఆ గొలుసుని ఆ ముద్దాయి ఆ క్షణంలో చూస్తున్నాడా తీస్తున్నాడా చెప్పగలవా?

          తెల్లమొహం వేశాడు లాయరు.

          సరిగా యిదే ఇరకాటంలో పడ్డారు రాబడి పన్ను శాఖవారు. నలుగురితో చావు పెళ్ళితో సమానం. పబ్లిగ్గా లక్షలాది ముందు తమ నాయకురాలికి వేసిన వెయ్యిరూపాయల దండలో ఏ వెయ్యి ఎవరిదని ఎలా తేలుస్తారు అధికారులు? వరసగా- జనగాం, అమలాపురం, ఆముదాలవలస, ముదినేపల్లి, వీరవాసరం, ముమ్మిడివరం- యిలా ప్రతిరోజూ వచ్చి పడే కోట్లాది రూపాయల లెక్కలు ఏ అధికారి తీయగలడు? అయ్యా, ఇలాంటి పబ్లిక్ దండల ఖాతాలు కొత్త లెక్కల్లోకి వచ్చేటట్టు రేపు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టినా మెజారిటీ మహిళలదే కనుక చస్తే ఆ బిల్లు పాసుకాదు. అసలు ఇటువంటి ఆలోచనలూ, భయాలే లల్లూగారినీ, ములాయంగారినీ భయపెడుతూ ఉండాలని భావిస్తూ- నాకు పార్లమెటులో ఓటు హక్కు లేకపోయినా- వారి అసమ్మతిని అర్ధం చేసుకోగలనని సవినయంగా మనవి చేస్తున్నాను.

          మీరు అచిరకాలంలోఇలా చరిత్రలు సృష్టించే ఎందరో మహిళల్ని దర్శనం చేసుకోబోతున్నారని ఆనందించండి. పులకించండి. ఎదురుచూడండి. ఇలాంటు సాహసాలు 63 ఏళ్ళ భారత చరిత్రలో ఏ మగాడూ సాధించలేదు. సాధించలేడని నేను సాటి మగవాడిగా బల్లగుద్ది చెప్పగలను. ఇది ఇంటిగుట్టు బయటపెట్టడమని తమరు భావించినా నేను సిగ్గుపడను.

          కాలమ్ ముగించే ముందు మరొక్కసారి- సాధికారికమైన హెచ్చరిక: మీకు ఈ కాలమ్ నచ్చినా, నచ్చకపోయినా, అంగీకరించినా, విభేధించినా- నోరుమూసుకోవడం శ్రేయస్కరం. ఈ కాలమ్ ని చదివి స్పందించేవారు తమ తమ వ్యక్తిగత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకోవాలని నా మనవి. వారిని చూసి నేను జాలిపడతాను. భయపడతాను. అన్నిటికీ మించి వారి శ్రేయస్సుని తలుచుకుని సానుభూతిని తెలియజేస్తాను.

      .

           మార్చి 22, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage