Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

సద్గురువులు లేని పేదలు

గొల్లపూడి మారుతీరావు
                 gmrsivani@gmail.com                             

     

       పత్రికలో ఒక వార్త. విద్యార్ధులు తమ సమాధాన పత్రాల్లో  ఉద్యమ నినాదాలను రాస్తే తప్పుగా పరిగణిస్తామని ఇంటర్ బోర్డ్ ప్రకటించిందట. సరే. ఉపాధ్యాయులు ఈ నిబంధనకి ఎలా స్పందించాలి?

         “బాబూ!  ఉద్యమానికీ, మీ చదువుకీ, మీ ఆవేశాలకీ, మీ విజ్ణతకీ, మీ అభిప్రాయాలకీ, మీ అభినివేనికీ ఏమీ సంబంధం లేదు. చదువు వేరు. సభ్యత వేరు. చదువు వేరు. మన జీవన సరళి వేరు. చదువు వేరు. మీ విశ్వాసాలు వేరు. కనుక- పరీక్షల్లో- నినాదాలను రాయడం మీ ఆవేశానికి అక్షరరూపం అనిపించుకోదు. మీ అనౌచిత్యం అనిపించుకుంటుంది. అక్కరలేని చోట, అనవసరమైన చోట- మీ అభిప్రాయాలను ప్రకటించినట్టవుతుంది. మొదట మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుని పట్టాలు పుచ్చుకోండి. పట్టాభిషిక్తులయిన యువకులుగా జీవితాల్లో అడుగుపెట్టండి-లాంటి మాటలేవో చెప్పాలి కదా?

        పైగా ఈ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించేది ఓ ప్రొఫెసర్ గారు. మన సంస్కృతిలో అమ్మా, నాన్నా తర్వత గురువుకే అగ్రస్థానం. గురులేక యెటువంటి గుణికి తెలియకబోదు అన్నారు త్యాగరాజ స్వామి. ఇంకా విచిత్రమేమిటంటే ఇలా సమాధాన పత్రాలలో నినాదాలు రాయడం తప్పుకాదని, రాసినా తప్పుగా పరిగణించ వీలులేదని ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఈ గురువులంతా ధర్నా చేశారట.

        ఈ రెండు పేరాలలో మన సంస్కృతి ఎంత అభ్యుదయాన్ని సాధించిందో  అర్ధమౌతుంది.ఉద్యమంలో తాముగా ఏమీ సాధించలేక, సాధించే బలం లేక, ప్రజాభిమానాన్నో, ప్రజల స్పందననో సంపాదించుకోలేని నాయకత్వం- విద్యార్ధులను రెచ్చగొట్టింది. ఇప్పుడు విద్యార్ధులు ఆ అడుసులో ఇరుక్కున్నారు. నాయకులు వారిని పరామర్శించి చోద్యం చూస్తున్నారు.

        A teacher moulds the intellectual and moral personality of his offspring అన్నారు. గురువు తన బిడ్డ(విద్యార్ధి అనలేదు-గమనించాలి) వైజ్ణానిక, నైతిక వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాడట.

        ఈ తరం పిల్లల మేధస్సు- ఏ విధంగా చూసినా ముందు తరం వారికంటే ఎన్నోరెట్లు ఎక్కువ. అది వారి జీవితంలో ఎదురయ్యే బృహత్తరమయిన సవాళ్ళను ఎదుర్కోడానికి అవసరం. ఇది ప్రకృతి

చేసే సహజమయిన సవరణ. కనుకనే తమ చుట్టూ ఉన్న సమాజంలో అవినీతి, అవ్యవస్థ పట్ల over sensitivie అయే అవకాశాలూ ఎక్కువే. మనతరంలో మనకు దక్కినట్టుగా వాళ్ళ రేపుభద్రంగా, ఆనందదాయకంగా, ఆశాజనకంగా కనిపించకపోవడం వల్ల వచ్చే restlessness ఎక్కువ. ఉద్యమంలో పాల్గొనే కుర్రాళ్ళు ఏవిధంగా చూసినా 80 లక్షల విద్యార్ధులకు ప్రతినిధులు కారు. వారిలో నోరు కట్టుకుని, పైసా కూడబెట్టుకుని- ఒక్క బిడ్డ  చేతికందొస్తే- కుటుంబం బాగుపడుతుందని ఎదురుచూసే బడుగు పిల్లలున్నారు. చదువు తప్ప తమ ఉపాధికి మరో ఆస్కారం లేని మధ్యతరగతి వర్గపు పిల్లలున్నారు. ఒక్క వ్యక్తి- ఒకతరం అదృష్టాన్ని మార్చివేయగల స్థితి నాకు తెలుసు.

        పిల్లల ఆవేశాన్ని రెచ్చగొట్టి, అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలియక, అవ్యవధానంగా రాలిపోతున్న మీగడ  సాయికుమారుల్ని చూసి- అతని కుటుంబంతో పాటు ఎంతమంది వేదన అనుభవిస్తున్నారో నేనూహించగలను- నేనూ ఓ కుర్రాడిని నష్టపోయిన తండ్రిని కనుక. ఆ విషాదం నుంచి ఇంకా మా కుటుంబం తేరుకోలేదు కనుక, ఈ జీవితంలో తేరుకోగలమన్న ఆశ లేదు కనుక.

        చౌరీ చౌరా అనే గ్రామంలో (1922, ఫిబ్రవరి 5న) మహాత్ముడు ప్రకటించిన సహాయనిరాకరణ ఉద్యమం వికటించింది. 3000 మంది సత్యాగ్రహుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఆవేశంతో సత్యాగ్రహులు ఆ పోలీసుల్ని స్టేషన్ లో బంధించి నిప్పెట్టారు. ఇది వినగానే మహాత్ముడు ఉద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. దేశం ఇలాంటి అహింసాయుతమైన ఉద్యమానికి అర్హతని ఇంకా సంపాదించుకోలేదన్నారు.

        అంతా సవ్యంగా జరిగింది బాపూ..... ఒక్క చోట--- ఒకే ఒక్కచోట.. అనబోయారు నెహ్రూ.

        నీళ్ళు నిండిన కళ్ళతో ఆ మాటల్ని ఆ చచ్చిపోయిన పోలీసుల కుటుంబాలకి చెప్పి ఒప్పించండి- చూదాంఅన్నారు బాపూ.

        ఇది ఎనిమిదో తరగతి సోషల్ స్టడీస్ విద్యార్ధుల క్లాసు పుస్తకంలో పాఠం. ప్రస్థుతం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ధులూ ఈ పాఠాన్ని చదివే వుంటారు. ఏ ఉద్యమమూ వ్యక్తిహానిని క్షమించదన్న సత్యాన్ని ఆ దశనుంచే పిల్లలు తెలుసుకోవాలన్నది మన పెద్దల సదుద్దేశం.

        మహాత్ముని పేరు బూతుమాటలాగ చాలామంది నోళ్ళలో వినిపిస్తోంది. సత్యాగ్రహం అన్నమాట కూడా. ఈ ఉద్యమంలో మొదటి కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు న్యాయంగా ఈ ఉద్యమం నిలిచిపోవాలికదా?  అదే కదా మహాత్ముని సత్యానికి అర్ధం?

        శవాన్ని చూపించి కాసులు దండుకున్నట్టు పిల్లల శవాల్ని గుర్తుచేసి వ్యవస్థ తలవొంచే రాజకీయ వ్యూహంలో మహాత్ముడుఏనాడో దిక్కుమాలిన చావు చచ్చాడు. This is a mean and cruel exploitation of playing to the galleries.

            నాయకులకు సమీప భవిష్యత్తులో ప్రయోజనాల మీద దృష్టి. బిడ్డల తల్లిదండ్రులకు తమ తరం కూడూ గుడ్డా మీదా దృష్టి. పిల్లలకు రేపటి జీవితాల మీద లక్ష్యం. ఈ ఉద్యమ సాఫల్యం ఈ నాయకుల వారసుల పొట్టలు నిండుతాయి. కాని ఈ కుర్రాళ్ళ చావులు తల్లిదండ్రుల గుండెల్లో శాశ్వతంగా ఆరని చిచ్చుని పెడతాయి.

        ఈ తరం కుర్రాళ్ళు అన్ని విధాలా దురదృష్టవంతులు. మాతరం అదృష్టం వారికి లేదు. మాకు నిలువెత్తు ఆదర్శాలుగా నిలిచిన అద్భుతమైన గురువుల శ్రేణి మాకు దక్కింది. ఈ తరం గురువులు మరుగుజ్జులు. మా గురువులు- డాక్టర్ జకీర్ హుస్సేన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తాతా సుబ్బారాయ శాస్త్రి, రఘుపతి వెంకట రత్నం నాయుడు, మామిడిపూడి వెంకట రంగయ్య, రాయప్రోలు, సురవరం ప్రతాపరెడ్డి, పెద్దాడ రామస్వామి, మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రభృతులు.

        నూరేళ్ళ జీవితానికి పునాదులు వేసుకుంటున్న బంగారు దశ యువతది. అందులోంచి ఒక్క మేధావి, ఒక్క జిజ్ణాసి, ఒక్క పరిశోధకుడు, ఒక్క కవి, ఒక్క మానవతావాది వచ్చినా ఈ తరం ప్రభావితమౌతుంది. ఈ సమాజం సుసంపన్నం అవుతుంది. ఓ జాతికి మేలు జరుగుతుంది. ఒకతరానికి ఒక మగ్దుం మొహుద్దిన్, ఒక గురజాడ, ఒక శ్రీశ్రీ, ఒక మార్టిన్ లూధర్ కింగ్ చాలు.

        అర్ధం లేని ఉద్యమాలకు జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న యువతనీ- వాళ్ళ చావుల్నీ, వాళ్ళ ఆవేశాల్నీ సొమ్ము చేసుకునే కుహనాగురువుల నుంచి- చేతనయితే మా బిడ్డల్ని ఎవరయినా కాపాడండి బాబూ అన్న ఆర్తిగా  గుండె బాదుకుని తన బిడ్డని మీగడ సాయికుమార్ ని- చూసి ఏడ్చే- రెండు మాటలయినా కలిపి చెప్పలేని-తల్లి ఆక్రోశాన్ని నేను మాటల్లో తర్జుమా చేసి చెప్తున్నాను.

           మార్చి 15, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage