నేను చదువుకునే రోజుల్లో భాగల్పూర్ వెళ్ళి హిందీ పరీక్షలు రాసే సౌకర్యం ఉండేది.
నేను కొన్ని పరీక్షలకి చదివిన గుర్తు. దేశంలో ఇన్ని రాష్ర్టాలు, ఇన్ని జిల్లాలు
ఉండగా భాగల్పూర్ ప్రత్యేకత ఏమిటా అని ఆ రోజుల్లో నేను ఆలోచించలేదు. ఆలోచిస్తే
ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి సమాధానం దొరికేది. ఈ ప్రత్యేకత ఆ ఊరుదీ, ఆ
విశ్వవిద్యాలయానిదీ కాదు. ఆ రాష్ర్టానిది - బీహారుది. ఈ విషయం నిన్న టీవీలో
కనిపించిన ఓ సుందర దృశ్యం విశదపరచింది. ఇదీ ఆ దృశ్యం.
బీహారులో ఒక స్కూలులో - లోపల విద్యార్ధులు పరీక్షలు రాస్తూంటే - బయట గోడల దగ్గర
వారికి సహాయం చేసి, వారిని నెగ్గించాలని కంకణం కట్టుకున్న అభ్యుదయవాదులు కొందరు
తంటాలు పడుతున్నారు. ఒక రక్షక భటుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇక వాళ్ళ ఆట కట్టని
మనం భావించవచ్చు. కాని వాళ్ళని ఆపలేదు. ఆపకుండా వాళ్ళ పని వాళ్ళని
చేసుకోనివ్వడానికి 'రుసుము' అడిగాడు. ఉదారులయిన ఈ సహాయకులు రుసుముని ఆనందంగా
ఇచ్చారు. పోలీసు ఆనందంగా అక్కడనుంచి నిష్ర్కమించాడు. ఇప్పుడు సహాయకులు
ద్విగుణీకృతమైన ఉత్సాహంతో గోడలు ఎక్కడం ప్రారంభించారు. ఇప్పుడూ - నా చిన్ననాటి
భాగల్పూరు ప్రత్యేకత అర్ధమయింది.
అలనాడు - ఇలాంటి రక్షణనే కల్పించిన భటుల, సహాయకుల పుణ్యమాంటూ పరీక్షల్లో నెగ్గి,
ఉద్యోగాలు సంపాదించిన అధికారులే పెరిగి పెద్దవారయి - మనకు 2 జి స్కాముల్లో
అరెస్టయిన ఆర్.కె.చందోలియాలుగా, టెలికాం సెక్రెటరీ సిద్ధార్ధ బేహుజాలుగా
దర్శనమిచ్చారని మనం గర్వపడవచ్చు. అయితే వీరిలో కొందరు తాటిచెట్ల కింద పాలుతాగిన
పెద్దలయివుండవచ్చు. ఏమయినా 'అవినీతి'కి అందమయిన రక్షణ కల్పించే రక్షక భటులున్న
ఈ వ్యవస్థలో ఇలాంటి స్కాంల పునాదులుంటాయని, ఈ స్కాంలు చదువులకి గోతులు తవ్వే
స్థాయిలోనే ఏర్పడుతున్నాయని మనం గ్రహించాలి. డిగ్రీలని లంచాలతో దక్కించుకునే
ఆఫీసర్లు, అధికారుల నుంచి ఇంతకన్న నిర్వాకాన్ని మనం ఆశించడం అన్యాయం.
'నీతి' చాలా దుర్మార్గమయిన ముడి సరుకు. అది ప్రదర్శించే వస్తువుకాదు. రాజకీయ
నాయకుల ఉపన్యాసాల దగ్గర్నుంచి, టెలికాం మంత్రుల చీకటి గదుల భాగోతాల దగ్గర్నుంచి,
పరీక్ష హాళ్ళ గోడల పక్క ఖాకీజేబులదాకా - ఇది సర్వాంతర్యామి. కెమెరా ఉంది కనుక
మనం చూశాం కాని - దీనికి 'నీతి' బురఖా తొడగడం చాలా తేలిక. నీతి ఎవరి స్థాయిలో
వారు విశృంఖలంగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా వాడుకునే వ్యభిచారం. మొన్నటిదాకా
ఏ.రాజాగారు నీతి గురించి ఎంత హుందాగా, ఎంత నమ్మకంగా, ఎంత స్పష్టంగా, ఎంత
నిర్భయంగా మాట్లాడారు?
ఖత్రోచీ వంటి ప్రతినాయకుడు దొరికాడా? చస్తే ఆ నీతికి తిరుగులేదు. ఎంత
గడ్డితిన్నా మంత్రి పదవి దొరికిందా - ఆ 'నీతి' (అవినీతి అని చదువుకోగలరు)
జేగీయమానంగా వెలిగిపోతుంది.
నాకు నాకు చాలా ఇష్టమయిన ఓ చిన్న కథని టూకీగా చెప్పి ముగిస్తాను. ఈ కథని
చెప్పడానికి నేను ఎన్నడూ జీవితంలో అలసిపోను.
ఓ మారుమూల గ్రామంలో గాంధీగారి మిత్రుడు జబ్బుపడ్డాడు. అతన్ని చూడాలని బయలుదేరారు
బాపూ. అర్ధరాత్రి. సమీపంలోని రైలు స్టేషన్లో దిగారు - ఒంటరిగా. అక్కడనుంచి
దాదాపు పదిమైళ్ళు రోడ్డు ప్రయాణం. చీకటి. అలవాటులేని మార్గం. ఒక ఒంటెద్దు
బండివాడు బండి కడతానన్నాడు. జీవహింస బాపూకి కిట్టదు. ఎద్దుని కొట్టకుండా దాని
మానాన దాన్ని నడవనిస్తే ఎక్కుతానన్నారు. బండివాడు అంగీకరించాడు. బండి కదిలింది.
యజమాని కొరడా దెబ్బకి అలవాటుపడిన ఎద్దు మొరాయిస్తూ పెళ్ళి నడక నడుస్తోంది.
బండివాడి చేతిలో కొరడా దురద పెడుతోంది. ఒక్కటి తగిలిస్తే బండి దూకుతుందని తెలుసు.
కాని ఇచ్చిన మాట. పదిమైళ్ళు - రెండు గంటలు నడిచింది. బాపూ కునుకుతున్నారు.
దూరాన ఊరు కనిపిస్తోంది. ఇక బండివాడు ఆగలేకపోయాడు. ఎద్దు వీపు మీద కొరడా
ఛళ్ళుమంది. బండి దూకింది. బాపూ తుళ్ళిపడి లేచాడు. బండిని ఆపమన్నాడు.
"ఊరొచ్చేశాం మహరాజ్! దీనికిది మామూలే" అన్నాడు బండివాడు.
బాపూ చేసినవి రెండు నేరాలు. జీవహింసకి కారణం కావడం. అందుకు బండివాడికి
అవకాశాన్ని ఇవ్వడం. తనకి శిక్షపడాలి. బాపూ బండి దిగారు. ఎదురుగా ఊరు. తన చుట్టూ
ఎవరూ లేరు. జరిగిన అనర్ధానికి బాధపడి మరిచిపోవచ్చు. ముందుకు తరలిపోవచ్చు. ఎవరికీ
సంజాయిషీ చెప్పనక్కరలేదు. ఎవరూ ప్రశ్నించరు. కాని బాపూ తప్పు చేశాడు. తన
అంతరాత్మ ఉంది. ఆ తప్పుకి శిక్షపడాలి. తనని తాను సంస్కరించుకోవడం నీతి. నీతి
ఎదుటివాడికి మనం చేసే ప్రదర్శన కాదు. సభలో ఉపన్యాసం కాదు. కెమెరాల ముందు చేసే
బుకాయింపు కాదు. ఆత్మబలాన్నిచ్చే అంటువ్యాధి.
బాపూ - డబ్బు చెల్లించి - మూగ ప్రాణం ఎద్దుకి క్షమాపణ చెప్పి - వెనక్కి తిరిగి
పదిమైళ్ళు వెనక్కి స్టేషన్ కి నడిచి - మళ్ళీ ఊరికి నడిచి వెళ్ళారు.
ఆయన బాపూ. ఈ తరానికి మహాత్ముడు. నీతికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ - ఉంటే - అది నాకు
తెలీదు.
(ఈ కథ విన్నాక బాపూ నిరాహార దీక్షల వెనుక పరమార్ధం మనలాంటివారికి ఏలేశమయినా
అర్ధమౌతుంది. అది సమాజానికో, వ్యవస్థకో చేసే బెదిరింపు కాదు. ఆనాటి పాలక
వ్యవస్థ బెదిరింది, ఆయన బ్లాక్ మెయిల్ కి కాదు. అటువంటి మహానాయకుడు పోతే
పెల్లుబికే ప్రజల ఆగ్రహావేశాలకి. ఆయన దీక్ష - వ్యక్తి స్థాయిలో - కేవలం
ఆత్మక్షాళనికి ఆయుధం. జీవుని వేదనని సమాజ హితంతో సంధించిన గొప్ప జిజ్నాసి ఆయన.
రాజకీయ హితాన్ని ఆధ్యాత్మిక చింతనతో ముడిపెట్టి సాధించిన వీరుడు - అంతకు ముందూ,
ఆ తర్వాతా ఎవరూ లేరు. అందుకే ప్రపంచం నిశ్చేష్టమయిపోయింది. రవి అస్థమించని
బ్రిటిష్ పాలక వ్యవస్థ వేళ్ళతో కదిలింది. ఇప్పుడు ఈ మధ్య మనం వింటున్న ఆమరణ
నిరాహార దీక్షలు, రిలే దీక్షల్లో అపురూపమయిన 'హాస్యం' ఇప్పుడు అవగతమౌతుంది.)