తెలుగు తెగులు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

ఈ దేశంలో తెలుగు మీద తెగులు 120 సంవత్సరాల క్రితమే ప్రారంభమయింది. ఆ రోజు అది సరదా. ఓ ముచ్చట, గొప్ప. ఇంకా చెప్పాలంటే అభివృద్ధి. కాకపోతే ఇప్పటికీ అదే అభివృద్ధి అని భావించేవాళ్లే ఎక్కువగావున్నారు. అందులో ఈనాడు చదువుచెప్పే పాఠశాలల ప్రిన్సిపాళ్లూ ఉన్నారు. 1890 ప్రాంతంలో రాసిన కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు పాత్ర చేత కూడా అనిపించారు. అగ్నిహోత్రావధాన్లు భార్య సుబ్బమ్మ గిరీశాన్ని అడుగుతుంది: 'ఏదీ! మావాడూ' మీరూ ఇంగ్లీషులో మాట్లాడుకోండి, అని. నానా చెత్తా వాగినా, అర్థం కాకపోయినా ఆవిడ పొంగిపోతుంది. విశేషమేమంటే ఈనాడూ మన మధ్య సుబ్బమ్మలున్నారు. వారికి ఇంగ్లీషు గురించి ఏమీ తెలియకపోవచ్చు. కానీ అదే అభివృద్ధి అని నమ్ముతున్నారు మరో కారణానికి.
ఆ రోజుల్లో చదువంటే శిష్ట వ్యవహారికులకు వేదం, శాస్త్రం, ఛందస్సు, జ్యోతిషం, వ్యాకరణం వగైరా. పామరజనానికి శతకం, పాట. జానపదులకు కాచి వడపోసిన జీవన సత్యాల సామెతలు, నానుడులూ, పదాలెన్నో వీటి వేటికీ ఆదాయం లేదు. ఆనాడు అవసరమూ లేదు. నిజానికి గురువు శిష్యుడిని తన ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టి చదువు చెప్పేవాడు. ఆ కుర్రాడూ చదువుకుని పెద్దవాడయి అదేపని చేస్తాడు. ఈ చదువు వల్ల ఏతావాతా ఉపయోగం ఏమిటి? చదువు లక్ష్యం సంస్కారం, సత్ప్రవర్తన, సౌశీల్యం, ధర్మపాలన వంటివి. ఇవన్నీ ప్రస్తుతం బూతుమాటలు. చదువుతో వ్యాపారం, ఆర్జన మనకి బ్రిటిష్‌వారు పెట్టిన భిక్ష. నీకు ఎకౌంట్లు రాయడం వచ్చా? అయితే నీ జీతం ఇంత. రాదా? నేర్పే చదువులు మేం ప్రవేశపెడతాం. ఉద్యోగాల దృష్టితో కొత్త రకం చదువులు వచ్చాయి. డిగ్రీలు వచ్చాయి. కన్యాశుల్కం నాటికే ఈ భాగోతం ప్రారంభమయిపోయింది. మావాడు పట్నం చదువు చదువుకుంటే ఏనాటికైనా కానిస్టేబులు అవుతాడు. తనకి దిక్కుమాలిన చదువు చెప్తున్నాడని కరటక శాస్త్రిని -అంటే గురువుని శిష్యుడు ఆక్షేపిస్తాడు. బండి చక్రాలు తప్పడం కొత్త సంస్కారంగా మహాకవి వెక్కిరించిన తొలిరోజులవి. మనకి తెలియని, అక్కరలేని, మరెవరికో ఉపయోగపడే చాకిరీ నువ్వు చేసిపెట్టు, నీ జీతం ఇంత రేపు వయస్సు మళ్లినా నీకు పింఛను వస్తుంది నువ్వు చస్తే నీ పెళ్లానికి అందులో సగం వస్తుంది. నీ ఆలోచనతో ప్రమేయం లేకుండా నీ శక్తిని తాకట్టు పెట్టడానికి ఇది జీవితకాలమంతా ఏర్పరిచిన రుసుము. నీ స్వేచ్ఛ ఖరీదు. ఈ సర్వీసులో ఉన్నంతకాలం నువ్వు అనుమతి లేనిదే ఊరు వదిలి వెళ్లరాదు. అదనపు సంపాదన పనికిరాదు. ఆస్తులు పెంచుకోరాదు. మళ్లీ పెళ్లి చేసుకోరాదు. ప్రభుత్వం మీద నీ అభిప్రాయాలు చెప్పరాదు. ఏ పార్టీలోనూ చేరరాదు. వెరసి నువ్వు ప్రభుత్వానికి బానిసవి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ ఉంది. ఎవరో తెలివైన వ్యాపారి మరో దేశపు చాకిరీని లాభసాటి ధరకి ఒప్పుకుంటాడు. నువ్వు రాత్రి పగలుగా, పగలు రాత్రిగా పనిచేస్తావు. ఆ లాభాలతో నీకు ప్రమేయం లేదు. నీ జీతం లక్షల్లో ఉంటుంది. ఇది ప్రస్తుతకాలపు ఖరీదైన బానిసత్వం. ఇప్పటికీ పల్లెలో రచ్చబండ దగ్గర శతకం చదివేవాడికి తృప్తి ఉంది. పద్యం చదివేవాడికి ఉంది. కాని రచ్చబండ ఎక్కడిది? ఇప్పుడు చదువుకీ, డబ్బుకీ మాత్రమే లంకె. చదువు విలువకి స్కేలు -సంపాదన. తెలుగు చదువుకుంటే ఏం వచ్చి చస్తుంది? మావాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అమెరికాలో. సంవత్సరానికి 18 లక్షలు జీతం. అదీ కొలబద్ద. ఆదాయం కొద్దీ కట్నాలు. మొన్నటిదాకా డాక్టర్‌కి పదిలక్షలు. ఇంజనీరుకి ఎనిమిది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌కి గిరాకీ.
ఏం చేస్తావయ్యా? అని ఏ కుర్రాడినయినా అడగండి. 'మీకు తెలీదులెండి' అంటాడు. నిజానికి వాడికీ తెలీదు, వాడెందుకు చేస్తున్నాడో! టాటా కంపెనీకి తెలుసు. ముఖేష్‌ అంబానీకి తెలుసు. ఖోటక్‌ మహేంద్రాకి తెలుసు. గుర్రానికి పెట్టే గడ్డికీ, కుర్రాడి చదువుకు పెట్టే పెట్టుబడికీ పెద్ద తేడా లేదు. ఈ మాటే నాచేత 29 సంవత్సరాల కిందట 'మనిషికో చరిత్ర'లో చెప్పించారు. 'నీకంటే మా పెరట్లో ఉన్న గౌడు గేదె నయమయ్యా' అంటాడు అవధాని డిగ్రీ కుర్రాడితో. అయితే ఆనాడు నవ్వుకుని మరిచిపోయారు. ఈనాడూ అంతకంటే ఏమీ చెయ్యలేరు.
'కుల విద్యకు సాటిలేదు గువ్వల చెన్నా' అన్నా, స్వధర్మం గొప్పది పరధర్మం కన్నా అని గీతాకారుడిని ఉదహరించినా చాలామంది నవ్వుతారు. కొందరికి కోపమూ రావచ్చు. విద్వత్తుకీ, విద్యకీ, విజ్ఞానానికీ, సంస్కారానికీ, సంపాదనకీ ఏమీ సంబంధం లేదు. అందుకనే మన తల్లులూ, తండ్రులూ ఉగ్గుపాలతో ఇంగ్లీషునే నేర్పిస్తున్నారు. 'ఒరులేయని యొనరించిన' అనే దిక్కుమాలిన పద్యం ఎవడిక్కావాలయ్యా? మావాడు కానిస్టేబులయి మరో పది లక్షలు పెట్టుబడి పెడితే ఎక్సైజ్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం వస్తుంది, తనో సిండికేటుకి పెట్టుబడిదారుడవుతాడు అంటారు. మాతృభాషని వదిలిపెట్టే చదువుని పెంచిన ఘనత ఈ దేశంలో ఆంధ్ర దేశానిదేనని మొన్ననే అంకెలతో సహా ప్రకటించారు. తమిళ గవర్నరు వచ్చీరాని తెలుగులో మాట్లాడితే మనం ఆనందంతో చప్పట్లు కొడతాం. మన్మోహన్‌ సింగ్‌ గారు 'మీకు వందనాలు' అంటే పొంగిపోతాం. కానీ తెలుగింటి అమ్మాయి తెలుగుదేశంలో చదువునేర్పే బడిలో తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రిన్సిపాల్‌ చావగొట్టి తట్లు తేలేలాగ కొడతారు. అదీ మన ఘనత.
ఇప్పటికీ కరుణానిధిగారు ఒక్కటి ఒక్కటంటే ఒక్క ఇంగ్లీషు మాట మాట్లాడగా నేను వినలేదు. మన తెలుగు మంత్రులు ఎక్కడో ఆఫ్రికా నుంచి దిగుమతి అయినట్టు దిక్కుమాలిన తెలుగు మాట్లాడి మనల్ని రంజింపజేస్తూంటారు. అది మన నాయకత్వం చూపే మార్గదర్శకత్వం. చెట్టుకొమ్మలకి చెదపట్టింది. కానీ ఇంకా మూలాల్లో చెమ్మ ఉంది. నాయకులు, చదువుకున్న పెద్దలు ఆర్జన కోసం చదువుని అమ్ముకుంటున్నారు. కానీ నేర్పితే 'పావని' వంటి చిన్న పిల్లలు తెలుగు నేర్చుకుంటారు. విశాఖపట్నం మురళీనగర్‌లో ఎమ్‌.ఎస్‌.ఎమ్‌. పబ్లిక్‌ స్కూలు ప్రిన్సిపాల్‌ మూర్తిగారు పెద్దల తలకెక్కిన విషానికి మూర్తీభవించిన ప్రతిరూపం. పాపం. ఆయన ఒక్కడినీ ఏకాకిని చేసి నిందించడం సబబు కాదు. ఈ ముష్కరత్వంలో తలా పాపం ఉంది. ఆయన కేవలం ఈ సమాజంలో లాభసాటి చదువులు నేర్పే ప్రతినిధి.
ఈ వాతలు పావని శరీరం మీద కాదు, తెలుగు అధికార భాష కావాలంటూ తమ పిల్లలకి కాన్వెంటు చదువులు చదివించే పెద్దల ఆత్మవంచనకి కేవలం గుర్తులు. దమ్ముంటే అధికార భాష కోసం ఢిల్లీ పరుగులు మాని తెలుగుదేశంలో ప్రతీ బడిలో ఒక్కటి -కనీసం ఒక్క తెలుగు పద్యం నేర్పించే ప్రయత్నం చేయమని పెద్దల్ని ప్రార్థిద్దాం. ఐక్యరాజ్యసమితి పరిశోధనల ప్రకారం వినియోగంలేని కారణాన మాయమయే భాషల జాబితాలో తెలుగు పదకొండో స్థానంలో ఉన్నదని మనవి చేస్తున్నాను.
 

                                        మార్చి 12. 2012
  

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage